సాక్షి,సిటీబ్యూరో: నగరంలో ప్రధాన పార్టీల టికెట్ల పందేరం దాదాపు ముగిసింది. ఆదివారం ముషీరాబాద్‌కు తమ అభ్యర్థిగా ముఠా గోపాల్‌ను ప్రకటించి టీఆర్‌ఎస్ టికెట్ల పంపిణీకి తెర దించింది. సికింద్రాబాద్ సీటును కాంగ్రెస్ కాసాని జ్ఞానేశ్వర్‌కు కేటాయించడంతో ఆ పార్టీ అన్ని సీట్లు భర్తీ చేసినట్టయింది. అంబర్‌పేటకు టీజేఎస్ అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. టీఆర్‌ఎస్ బీసీలు, ఓసీలకు సమ ప్రాధాన్యం ఇస్తే, కాంగ్రెస్ ఈ మారు ముస్లిం మైనారిటీలకు అధిక సీట్లు కేటాయించింది. టీఆర్‌ఎస్ రాజేంద్రనగర్, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్, సికింద్రాబాద్, నాంపల్లి స్థానాలను గౌడ సామాజిక వర్గానికి, సనత్‌నగర్, మలక్‌పేట యాదవులకు, మహేశ్వరం, మేడ్చల్, ఉప్పల్, యాకుత్‌పురా, చాంద్రాయణగుట్టలను రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించింది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి రెడ్ల స్థానాలను తగ్గించారు. కూకట్‌పల్లి, మల్కాజిగిరిని వెలమ, జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి కమ్మ, బహూదూర్‌పురా, చార్మినార్‌ను ముస్లింలకు కేటాయించారు. ఖైరతాబాద్‌ను మున్నూరుకాపు, అంబర్‌పేట వంజరి, ముషీరాబాద్ బెస్త, గోషామహల్, కార్వాన్‌ను ఉత్తరాదికి చెందిన మార్వాడి, ఠాకూర్‌లకు కేటాయించారు.
కూటమిలో మైనారిటీలకు..
కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రజా కూటమిలో ఆరు స్థానాలకు మైనారిటీలకు, ఉప్పల్, కుత్బుల్లాపూర్, గోషామహల్‌ను గౌడ్‌లకు, ఎల్బీనగర్, మహేశ్వరం, జూబ్లీహిల్స్, మేడ్చల్ స్థానాలకు రెడ్లకు, ముషీరాబాద్ యాదవులకు, ఖైరతాబాద్ కంసాలి, యాకుత్‌పురా మేరు, రాజేంద్రనగర్‌ను వైశ్యులకు, మల్కాజిగిరిని బ్రాహ్మణులకు కేటాయించారు. సికింద్రాబాద్‌లో కూడా బీసీ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. బీజేపీ సైతం చంద్రాయణగుట్ట, బహదూర్‌పురాలో మైనార్టీలు, అంబర్‌పేట, ఖైరతాబాద్, రాజేంద్రనగర్, మేడ్చల్‌లో రెడ్లు, మలక్‌పేటలో పద్మశాలి, ముషీరాబాద్‌లో మున్నూరు, నాంపల్లిలో యాదవ, శేరిలింగంపల్లిలో వైశ్య, కూకట్‌పల్లిలో వెలమ, మల్కాజిగిరి, ఉప్పల్‌లో బ్రాహ్మణ, చార్మినార్ ఎస్సీలకు కేటాయించి సామాజిక సమతూకం చేసే ప్రయత్నం చేసింది. ఇదిలా ఉంటే సోమవారం నామినేషన్లకు చివరి తేదీ కావడంతో అభ్యర్థులంతా ఇక ప్రచారాన్ని హోరెత్తించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment