సాక్షి నెట్‌వర్క్: ఎన్నికలు వచ్చాయంటే నేతల మాటలు కోటలు దాటుతాయి. ప్రజల ముందుకు వచ్చి అడక్కుండానే వాగ్దానాలు చేసేస్తుంటారు.. హామీల వర్షం కురిపిస్తారు. ‘సారూ.. వర్షం వచ్చిందంటే మా వీధి మొత్తం నీట మునిగిపోతుంది.. నాలా విస్తరణ చేయించండి’ అంటే ‘అదెంత పని.. చేసేద్దాం’ అంటారు. గెలిచాక అటువైపు చూడనే చూడరు. ఏ ఎన్నికలు వచ్చినా ప్రచారానికి వచ్చే అభ్యర్థులకు ప్రజల విన్నపాలు మామూలే. గెలిచిన నేతల నిర్లక్ష్యం కూడా అంతే. కానీ ఈసారి గ్రేటర్ ఓటర్లు నాయకుల ముందుకు కొన్ని డిమాండ్లు తెస్తున్నారు. అవి పరిష్కరించే వారికే తమ ఓటంటున్నారు. ఎల్‌బీనగర్ పరిధిలోని లోతట్టు ప్రాంతాలు చినుకు పడితే ఉలిక్కిపడే పరిస్థితి.
దీన్ని శాశ్వతంగా పరిష్కరించే రావాలంటున్నారు. కూకట్‌పల్లిలో ట్రాఫిక్ కష్టాలు తీరేందుకు రోడ్లు విస్తరణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గత తొమ్మిదేళ్లుగా ఆధునికీకరణకు నోచుకోని బేగంబజార్ మచ్చి మార్కెట్‌ను సరిచేయమంటున్నారు. శేరిలింగంపల్లిలోని ఐటీ కారిడార్‌లో వాహన విస్పోటం.. ఫలితంగా ఎదురవుతున్న ట్రాఫిక్ కష్టాలు తొలగించాలంటున్నారు. కంటోన్మెంట్‌లో భవన నిర్మాణ అనుమతులను సరళతరం చేసి ప్రజలకు ఊరట కల్పించమని విజ్ఞప్తి చేస్తున్నారు. పాతబస్తీలోని చారిత్రక ప్రదేశాల్లో సందర్శకులకు పార్కింగ్ సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ సరైన ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకా నగరంలోని పలు నియోజకవర్గాల్లోని సమస్యలపై ‘ప్రజల మేనిఫెస్టో’ఎలా ఉందో తెలియాలంటే
చార్మినార్:పార్కింగ్ పరేషాన్..
చార్మినార్, మక్కామసీదు, సాలార్జంగ్ మ్యూజియం, చౌమహల్లా ప్యాలెస్‌లను సందర్శించడానికి వచ్చే పర్యాటకులతో పాటు చిరు వ్యాపారాల నుంచి హోల్‌సేల్ మార్కెట్లకు వచ్చే వినియోగదారుల సౌకర్యార్థం సరైన పార్కింగ్ సౌకర్యం లేకపోవడంతో వాహనదారులు, స్థానికులు పలు ఇబ్బందులకు గురవుతున్నారు. చార్మినార్ సమీపంలో జీహెచ్‌ఎంసీ మల్టీలెవల్ పార్కింగ్‌ను నిర్మించాలి. ఆటస్థలాలను అందుబాటులోకి తేవాలి.
మల్టీలెవల్ పార్కింగ్ ఏర్పాటు చేయాలి..
ప్రపంచ పర్యాటక ప్రాంతమైన చార్మినార్‌లో జీహెచ్‌ఎంసీ మల్టీ లెవల్ పార్కింగ్‌ను నిర్మించాలి. వ్యాపారస్తుల వాహనాలతో పాటు వినియోగదారుల వాహనాల పార్కింగ్ కోసం మల్టీ లెవల్ పార్కింగ్ ఎంతో అవసరం. – షేక్ ముస్తాక్, శాలిబండ
ఆట స్థలాలు కావాలి..
పాతబస్తీలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు ఆట స్థలాలు అందుబాటులో లేవు. క్రీడా మైదానాలు లేకపోవడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్ సైతం చేయలేక
పోతున్నాం. – షేక్ నహీం, సయ్యద్ అలీ ఛబుత్రా
కంటోన్మెంట్: ఇళ్లను క్రమబద్ధీకరించాలి
కంటోన్మెంట్‌లో కఠినమైన భవన నిర్మాణ నిబంధనల సాకుతో 90శాతం ఇళ్లు అక్రమ నిర్మాణాల జాబితాలో ఉన్నాయి. వీటిని క్రమబద్ధీకరించాలని కొన్నేళ్లుగా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాల్లో వెలసిన బస్తీలు, నివాసాల్లోని వారికి బోర్డు ఎన్నికల్లో ఓటుహక్కు తొలగించారు. ఈ మేరకు ఓటుహక్కు కోల్పోయిన 28,123 మంది భూ బదలాయింపు ద్వారా తమ నివాస స్థలాలకు పట్టాల కోసం నేతల్ని అభ్యర్థిస్తున్నారు.
పరిమితిని పెంచాలి..
భవన నిర్మాణాలకు సంబంధించి ప్రస్తుతమున్న 1.5 ఎఫ్‌ఎస్‌ఐ పరిమితిని పెంచడంతో పాటు, అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించాలి. తద్వారా 90 శాతం కంటోన్మెంట్ వాసులకు ఉపశమనం కలుగుతుంది.– సతీష్ గుప్తా, వాసవీ కాలనీ అధ్యక్షుడు
భూ బదలాయింపు చేపట్టాలి..
కేంద్ర ప్రభుత్వ స్థలాల్లో ఉంటున్నామన్న నెపంతో పలు బస్తీలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు. మడ్‌ఫోర్ట్ అంబేద్కర్ హట్స్‌లో నేటికీ విద్యుత్ సదుపాయం లేదు. భూబదలాయింపు చేపడితేనే మాలాంటి వారికి పట్టాలు దక్కుతాయి.– అశోక్, అంబేడ్కర్ హట్స్ వాసి
ఎల్‌బీనగర్: ముంపు ముప్పు
ఎల్‌బీనగర్ పరిధిలోని పలు డివిజన్లలో లోతట్టు వాసులు చినుకు పడితే ఉలిక్కిపడే పరిస్థితి నెలకొంది. ముంపు సమస్య ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రస్తుతం ఎన్నికల వేళ ఎల్‌బీనగర్ నియోజకవర్గంలో ప్రధా ఎజండా ముంపు సమస్యే. గత ఎన్నికల్లో పార్టీల ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలన్నీ నీటిమీద రాతల్లాగానే మిగిలాయి. ఇప్పటికీ ముంపు సమస్య శాశ్వత పరిష్కారానికి నోచుకోవడంలేదు.
వరద కాల్వల ఆక్రమణలతోనే..
వర్షం నీరు చెరువులోకి తెచ్చే కాల్వలన్నీ ఆక్రమణలకు గురి కావడంతో వరద నీరు ఇళ్లలోకి వస్తోంది. దీంతో సాహెబ్‌నగర్‌లోని, కప్పల చెరువు, బతుకమ్మ కుంటల నుంచి వచ్చే వర్షం నీరు ఆంధ్రకేసరి నగర్, శారదానగర్, కమలానగర్, రాఘవేంద్ర కాలనీ, పద్మావతి కాలనీల్లోని ఇళ్లలోకి, బస్‌డిపో, కోర్టు ఆవరణలోకి వస్తోంది. – దాసరమోని శ్రీనివాస్, హయత్‌నగర్
కూకట్‌పల్లి: ట్రాఫిక్ కష్టాలు..
కూకట్‌పల్లిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చేపట్టిన ప్లైఓవర్‌లు పూర్తి కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. జేఎన్టీయూ నుంచి మలేసియాటౌన్‌షిప్ వరకు నిర్మించే ప్లైఓవర్ తుది దశలో ఉంది. బాలానగర్ ప్లైఓవర్ బ్రిడ్జి ప్రారంభ దశలో ఉంది. మూసాపేట చౌరస్తా నుంచి ఆంజనేయనగర్‌వరకు రోడ్డు పూర్తిస్థాయిలో విస్తరణ కాలేదు. కొన్నేళ్లుగా దీని పనులు కొనసాగుతునే ఉన్నాయి. హైటెక్ సిటీకి వెళ్లే ఐటీ ఉద్యోగులు, వాహనదారులు ట్రాఫిక్‌తో ఇబ్బందుల పాలవుతున్నారు.
ఏళ్ల తరబడిగా ఇబ్బందులు..
మూసాపేట చౌరస్తా నుంచి ఆంజనేయనగర్‌కాలనీ చౌరస్తా వరకు రోడ్డు వెడల్పు పనులు కొన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతునే ఉన్నాయి. కూకట్‌పల్లిలో ట్రాఫిక్ ఉండటంతో హైటెక్ సిటీకి వెళ్లే ఐటీ ఉద్యోగులు మూసాపేట చౌరస్తా నుంచి వెళ్తుంటారు. సంవత్సరాల తరబడి పనులు కొనసాగుతునే ఉన్నాయి. – సంతోష్, భరత్‌నగర్‌కాలనీ
రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలి..
బోరబండ నుంచి పర్వత్‌నగర్ చౌరస్తా వరకూ ఇరుకు రోడ్డుతో తరచూ ట్రాఫిక్ సమస్యతో పాటు నిత్యం గంటల తరబడి ట్రాఫిక్ చక్రబంధంలో ఇరుక్కు పోవాల్సిన పరిస్ధితి నెలకొంది. రహదారి విస్తరణ పనులకు మోక్షం కలగడంలేదు. – సీహెచ్. వంశీప్రసాద్, పర్వత్‌నగర్
చాంద్రాయణగుట్ట:పూర్తికాని ఆర్‌యూబీ
ఉప్పుగూడ రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులు ఏళ్లు గడుస్తున్నా పూర్తి కావడం లేదు. బార్కాస్‌లో నిర్మిస్తున్న ఈ– లైబ్రరీ నిర్మాణం కూడా ఏడేళ్లుగా సాగుతూనే ఉంది. రాజన్నబావి, ఛత్రినాక ప్రాంతాల్లో వరదముంపు తీవ్ర స్థాయిలో ఉంది.
శేరిలింగంపల్లి: ఐటీకారిడార్‌లో నిత్య నరకం..
ఐటీ కారిడార్‌ను ట్రాఫిక్ సమస్య పట్టిపీడిస్తోంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రధాన రహదారులు ట్రాఫిక్ దిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. వాహనదారులు కిలో మీటరు ప్రయాణం చేయాలన్నా విసిగివేసారుతున్నారు.
పరిష్కారం చూపించాలి..
ఐటీ కారిడార్‌లో కిలో మీటర్ ప్రయాణించాలంటే పది నిమిషాల సమయం పడుతోంది. ఉదయం, సాయంత్రం సమయాల్లో రాకపోకలు సాగించే ఐటీ ఉద్యోగులు నిత్యం నరకం అనుభవిస్తున్నారు.
– కె. శ్రీనివాస్‌రెడ్డి, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్
మల్కాజిగిరి: కొలిక్కిరాని ఆర్‌యూబీ
ఈస్ట్ ఆనంద్‌బాగ్ ఆర్‌యూబీ నిర్మాణం కొలిక్కి రావడంలేదు. ఇది ఇప్పటికీ పూర్తికాలేదు. రామకృష్ణాపురం, సఫిల్‌గూడ చెరువు, బండచెరువు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. సఫిల్‌గూడ చెరువు వద్ద ఉన్న ఎస్టీపీ సామర్థ్యాన్ని పెంచాలి. మల్కాజిగిరిలో ప్రభుత్వ ఆస్పత్రిని ఏర్పాటు చేసినా అందులో పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందడంలేదు.
గోషామహల్: శిలాఫలకానికే పరిమితం
బేగంబజార్ మచ్చి మార్కెట్ ఆధునికీకరణకు నోచుకోవడంలేదు. 9 ఏళ్లుగా ఈ సమస్యకు పరిష్కారం లభించడం లేదు. రామ్‌మనోహర్ లోహియా కమ్యూనిటీ హాల్ ఆధునికీకరణ కోసం హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్, కార్పొరేటర్ ముఖేశ్‌సింగ్‌లు శిలాఫలకం వేసి ఏడాది గడిచినా దీని పనులు పెండింగ్‌లోనే ఉన్నాయి.
మహేశ్వరం: తాగునీటి కటకట..
♦ గ్రామీణ ప్రాంతాల్లో అధ్వానంగా మారిన రహదారులు
♦ మీర్‌పేట్, జిల్లెలగూడలలో కాలుష్య కాసారాలుగా చెరువులు
♦ డ్రైనేజీ వ్యవస్థ కొరవడి రోడ్లపై పారుతున్న మురుగునీరు
♦ మీర్‌పేట్, బడంగ్‌పేట్, జల్‌పల్లి, మహేశ్వరం, కందుకూరులలో తాగునీటి సమస్యలు
♦ చిన్నపాటి వర్షాలకే ముంపునకు గురవుతున్న కాలనీలు
మలక్‌పేట్: మురుగుతో సతమతం..
♦ ట్రాఫిక్‌జాంతో వాహనదారుల సతమతం
♦ డబుల్ బెడ్‌రూం ఇళ్ల కోసం స్థానికుల ఎదురుచూపులు
♦ కాలనీలలో రోడ్లపై మురుగు ప్రవాహం..
♦ విస్తరణకు నోచుకోని ప్రధాన రహదారులు..
Comments
Please login to add a commentAdd a comment