తొలుత నవంబరు తొలివారంలో అభ్యర్థులను ప్రకటిస్తామని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా ప్రకటించారు. ఆ లోపు మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటు ప్రక్రియను పూర్తిచేస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు భక్తచరణ్‌దాస్ నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థుల తుది జాబితాను రూపొందిస్తుందన్నారు. దీనికి అనుగుణంగా దాస్‌తో కూడిన త్రిసభ్య బృందం నియోజకవర్గాల వారీగా ఏకాభిప్రాయం ఉన్న అభ్యర్థులతో కూడిన జాబితాను తయారు చేసినట్లు ప్రచారం జరిగింది.
ఇందులో మన జిల్లాకు సంబంధించి నాలుగు స్థానాలున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి నవంబర్ 1న జాబితా ప్రకటిస్తామని మొదట చెప్పినా.. ఆ రోజు కూడా జాబితా విడుదలయ్యే అవకాశం కనిపించడం లేదు. ఇంకోవైపు ఆశావహుల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న నియోజకవర్గాలను పక్కనపెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. ముందుగానే ప్రకటిస్తే టికెట్ రాని నేతలు ఇతర పార్టీలకు జంప్ చేస్తారని భయపడుతోంది. ఈ నేపథ్యంలో చివరి క్షణం వరకు వేచి చూడడమే బెటరని అనుకుంటోంది. టీడీపీది కూడా దాదాపుగా ఇదే పరిస్థితి. కాంగ్రెస్ ఖాతాలోకి సీట్లు వెళతాయా? టీడీపీకి ఏవీ కేటాయిస్తారో తెలియక తలపట్టుకున్నారు. మహాకూటమి, బీజేపీల వెయిటింగ్ లిస్ట్ ఆయా పార్టీల ఆశావహులను ఆందోళనకు గురిచేస్తోంది.
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అభ్యర్థుల జాబితాపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కసరత్తు కొలిక్కివచ్చినట్లు ప్రచారం సాగుతున్నా జాబితా ప్రకటనపై మహాకూటమి, బీజేపీలు సస్పెన్స్ కొనసాగిస్తుండడం ఆశావహులను ఆందోళనకు గురిచేస్తోంది. అధికార పార్టీ గెలుపు గుర్రాలను ప్రకటించి ప్రచారపర్వంలో దూసుకెళుతుండగా.. కాంగ్రెస్ మాత్రం అభ్యర్థుల కూర్పును సాగదీస్తోంది. ఇప్పటివరకు తొలి జాబితాను కూడా ప్రకటించకుండా వేచిచూసే ధోరణి అవలంభిస్తోంది. మరోవైపు ఇప్పటికే ముగ్గురు అభ్యర్థులతో మొదటి జాబితాను వెల్లడించిన బీజేపీ.. మలి జాబితా విడుదలకు సమయం తీసుకుంటోంది. మహాకూటమి సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం కుదరక.. పొత్తు విచ్ఛిన్నమైతే ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని బీజేపీ భావిస్తోంది.
టికెట్ ఆశించి భంగపడ్డవారిని అక్కున చేర్చుకోవాలని అనుకుంటోంది. ఈ క్రమంలోనే చివరి నిమిషం వరకు వేచి చూడాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో షాద్‌నగర్, కల్వకుర్తి, తాండూరు, మల్కాజిగిరి, మేడ్చల్, ఉప్పల్, ఎల్‌బీనగర్ నియోజకవర్గాల అభ్యర్థులను మాత్రమే ఖరారు చేసిన కమల నాయకత్వం మిగతా సెగ్మెంట్ల విషయంలో మాత్రం అచితూచి అడుగేయాలని నిర్ణయించింది. కాంగ్రెస్–టీడీపీల మధ్య శివారు నియోజకవర్గాలపై పేచీ నెలకొంది.
శేరిలింగంపల్లి, ఎల్‌బీనగర్, కూకట్‌పల్లి, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం, ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి సెగ్మెంట్లపై ఇరుపార్టీలు పట్టుబడుతున్నాయి. దీంతో ఒకరికి సీటు కేటాయిస్తే మరొకరు తిరుగుబాటు జెండా ఎగురవేసే వాతావరణం ఉంది. ఈ నేపథ్యంలో సీట్ల ఖరారుపై ముందడుగు వేయని పరిస్థితి నెలకొంది. ఈ పరిణామాలను అంతర్గతంగా విశ్లేషించుకున్న కాంగ్రెస్, టీడీపీ అధినాయకత్వాలు సీట్ల సర్దుబాటును అధికారికంగా ప్రకటించడం లేదు. అంతేగాకుండా మిత్రపక్షమైన టీజేఎస్, సీపీఐలతో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో కూడా జాబితా ప్రకటన వాయిదా పడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment