షాద్‌నగర్ ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్, వేదికపై నాయకులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా, షాద్‌నగర్ రూరల్: ‘ఎన్నికలు వస్తుంటాయ్ పోతుంటాయ్.. అభ్యర్థులూ చాలా మంది పోటీలో నిలుస్తారు. ఏ పార్టీ చెప్పినా వినండి. ఇంటికెళ్లి చర్చించి.. ఆలోచించి ఓటు వేయండి’ అని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను కోరారు. మన ప్రజాస్వామ్యంలో ఇప్పటికీ పరిణతి రాలేదని, ఇది దురదృష్టకరమన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం షాద్‌నగర్, ఇబ్రహీంపట్నంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ మాట్లాడారు. ఎన్నికల్లో గెలవాల్సింది నాయకులు, పార్టీలు కాదని, ప్రజల ఆకాంక్ష గెలవాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా ప్రజా అజెండా అమలవుతుందని, అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి సాధిస్తారని తెలిపారు. గోల్‌మాల్ చేసి గెలిస్తే.. ఐదేళ్ల పాలనలోనూ అదే ఉంటుందన్నారు.
అభివృద్ధి మా మాట..
అభివృద్ధి టీఆర్‌ఎస్ నినాదం.. అడ్డుకోవడమే టీడీపీ, కాంగ్రెస్ నైజం. అభివృద్ధి చేసే వారికి పట్టం కడతారో.. పథకాలను అడ్డుకునే నేతలకు ఓటేస్తారో ప్రజలే తేల్చుకోవాలని కేసీఆర్ కోరారు. బీడుగా మారిన భూములను సస్యశ్యామలం చేసేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టిందని, అయితే ప్రాజెక్టులను అడ్డుకునేందకు టీడీపీ, కాంగ్రెస్ నేతలు కుట్రలు పన్నుతున్నారని అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కోర్టుకెక్కింది కాంగ్రెస్, టీడీపీ నేతలు కాదా అని ప్రశ్నించారు. కోర్టుల్లో కేసులు వేసి ప్రాజెక్టుల నిర్మాణం జరగకుండా, పొలాలకు నీరు పారకుండా చంద్రబాబునాయుడు అడ్డుకుంటున్నారని అన్నారు. అలాంటి నేతతో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ జత కట్టిందని విమర్శించారు. తెలంగాణ ప్రజల అభివృద్ధే ధ్యేయంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక వైపు... అభివృద్ధి పనులను అడ్డుకుంటున్న మహాకూటమి ఒక వైపు ఉన్నాయని, ఈ రెండింటిలో ఏది కావాలో ప్రజలే తెల్చుకొని ఎన్నికల్లో ఓటు వేయాలన్నారు.
బాబు మేధావితనం ఎక్కడపోయింది
58 ఏళ్ల కాంగ్రెస్, టీడీపీ పాలనలో ఏనాడైనా నిరంతర విద్యుత్ ఉందా అని ప్రజలను అడిగారు. కాంగ్రెస్, టీడీపీల్లో చాలా మేధావులు ఉన్నారని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌ని ప్రపంచ పటంలో పెట్టిన బాబూ.. కరెంటు ఇవ్వడంలో నీ మేధావితనం ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు.
మైనార్టీల సంక్షేమానికి పెద్ద పీఠ
మైనార్టీల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. ఇప్పటికే అనేక పథకాలను రూపొందించి అమలు చేశామన్నారు. షాదీముబారక్, మైనార్టీ గురుకుల పాఠశాలల ఏర్పాటు, మైనార్టీ కార్పొరేషన్ ద్వారా రుణాల అందజేత వంటి పథకాలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరితోనే రాష్ట్రంలో మైనార్టీల రిజర్వేషన్లు పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోతున్నామని అన్నారు. రాబోయే రోజుల్లో మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్ సాధించి తీరుతామని కేసీఆర్ స్పష్టం చేశారు. అదేవిధంగా మైనార్టీల సంక్షేమానికి మరిన్ని కొత్త పథకాలను రూపొందించి అమలు చేస్తామన్నారు.
పట్నంపై హామీల జల్లు
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంపై ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ హామీల వర్షం కురిపించారు. వచ్చే ఒకటిన్నర రెండేళ్లలో పాలమూరు–డిండి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. 365 రోజులపాటు ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో నీళ్లు ఉండేలా చేసే బాధ్యత తనదేనన్నారు. రెండేళ్లలో ఈ నియోజకవర్గంలో 1.50 లక్షల ఎకరాలకు సాగు నీరందిస్తామని పేర్కొన్నారు. మంచిరెడ్డిని లక్ష మెజారిటీతో గెలుపించాలని ప్రజలను కోరారు. ‘ఇబ్రహీంపట్నం చెరువు కళకళలాడినప్పుడూ.. ఎండినప్పుడు నేను చూసిన. ఇది ఇప్పుడు నీళ్లతో నిండాలి. ఇది సాధ్యం కావాలంటే పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకం పూర్తికావాలి. దీనిపైనా కాంగ్రెస్ నాయకులు కేసులు వేశారు’ అని కేసీఆర్ మండిపడ్డారు.
కారెక్కిన క్యామ.. సముచిత స్థానానికి హామీ
డీసీసీ అధ్యక్ష పదవి నుంచి కాంగ్రెస్ అధిష్టానం తొలగించడంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన క్యామ మల్లేష్ టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇదే వేదికపై మల్లేష్‌కు కండువా కప్పి పార్టీలోకి కేసీఆర్ ఆహ్వానించారు. క్యామ కూడా మంచి క్రియాశీల నాయకుడని కేసీఆర్ పొగిడారు. బలహీన వర్గానికి చెందిన ఆయనకు తగిన స్థాయి కల్పిస్తామని హామీ ఇచ్చారు. క్యామతోపాటు మరో 20 మంది వరకు నాయకులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
లక్ష మెజారిటీ రావాలి..
సీనియర్ నాయకుడు క్యామ టీఆర్‌ఎస్‌లో చేరడంతో.. మంచిరెడ్డి కిషన్‌రెడ్డి బంపర్ మెజారిటీతో గెలుస్తామనడంలో ఎటువంటి సందేహమూ లేదని కేసీఆర్ అన్నారు. శక్తిమంతులైన వీరిద్దరూ ప్రజలకు మంచి చేసి చూపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఒకవైపు మంచిరెడ్డి.. మరోవైపు చెడ్డరెడ్డి ఉన్నారని బీఎస్పీ అభ్యర్థి మల్‌రెడ్డి రంగారెడ్డిని ఉద్దేశించి అన్నారు. ఎవరు కావాలో ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. మంచిరెడ్డి గెలిస్తే రక్షణ ఉంటుందన్నారు.
అదృష్టవంతులు..
ఇబ్రహీంపట్నం ప్రాంత వాసులను అదృష్టవంతులుగా కేసీఆర్ అభివర్ణించారు. ‘ఇక్కడి వాళ్లు సిటీ సంకన ఉన్నారు. కొంగరలో కలెక్టరేట్ కడుతున్నాం. పోలీస్ హెడ్‌క్వార్టర్స్ నిర్మిస్తున్నాం. భూముల ధరలు బాగా పెరుగుతాయి. ఫార్మాసిటీ వస్తోంది. ఐటీ హబ్ కూడా ఇబ్రహీంపట్నం దిశగా రావాలని ఐటీ శాఖ మంత్రికి చెప్పాను. ఇంకోటి ఉప్పల్ వైపు వెళ్లాలి. నాలుగు మూలలా విస్తరించాలి. అనేక క్లస్టర్లు వచ్చే అవకాశం ఉంది అని అన్నారు. సభలో మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్యగౌడ్, జిల్లా రైతు సమన్వయ సమితి కన్వీనర్ వంగేటి లక్ష్మారెడ్డి, ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
లక్ష్మిదేవునిపల్లి ప్రాజెక్టును ప్రారంభిస్తాం
రాష్ట్రంలోనే అత్యంత ఎత్తయిన ప్రాంతం షాద్‌నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలంలోని లక్ష్మిదేవునిపల్లి గ్రామం అని, పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా లక్ష్మిదేవునిపల్లి ప్రాజెక్టును అక్కడ నిర్మిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. ఈ ప్రాజెక్టు పనులను వచ్చే ఏడాది టీఆర్‌ఎస్ ప్రభుత్వమే ప్రారంభిస్తుందని చెప్పారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందన్నారు. ఏడాది పొడవునా పొలాలకు ఈ ప్రాజెక్టు ద్వారా నీరు పారుతుందని, దీంతో షాద్‌నగర్ ప్రాంతం పచ్చని పంట పొలాలతో కళకళలాడుతుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment