సీజేసీ అధినేత, మాజీ ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి అజిత్ జోగి (ఫైల్)
సాక్షి, రాయ్‌పూర్: లోక్‌సభ ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్ నుంచి కింగ్ మేకర్‌గా భావిస్తున్న ఛత్తీస్‌గఢ్ జనతా కాంగ్రెస్ అధినేత, మాజీ సీఎం అజిత్ జోగి సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎంపీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయబోదని.. ఆయా స్థానాలను బీఎస్పీకి వదిలేస్తున్నట్టు అజిత్ జోగి మీడియాకు తెలిపారు. సరైన వనరులు, సంసిద్ధత లేనందున తన పార్టీ ఈ లోక్‌సభ ఎన్నికల బరిలో పాల్గొనడం లేదని అజిత్ జోగి పేర్కొన్నారు. ‘నన్ను పోటీ చేయమని చాలా మంది చెప్తున్నారు. కానీ దీని గురించి నేను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నా పార్టీని బలమైన ప్రాంతీయ శక్తిగా మార్చడంపైనే పూర్తి దృష్టి కేంద్రీకరించాలని అనుకుంటున్నాను. బీఎస్పీ తరఫున రాబోయే ఎన్నికల్లో ప్రచారం చేసే విషయంపై కూడా ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేద’ని జోగి వివరించారు. 11 లోక్‌సభ స్థానాలున్న ఛత్తీస్‌గఢ్‌లో మూడు దశల్లో పోలింగ్ జరగనుంది. మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 8న, రెండో దశ ఏప్రిల్ 18న, మూడో విడత పోలింగ్ 23న జరుగనుంది.
జోగి బరిలో లేని తొలి ఎన్నికలు
అజిత్ జోగి 1986లో ఐపీఎస్‌గా ఉన్నప్పుడు అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ కోరిక మేరకు కాంగ్రెస్‌లో చేరారు. ఆయన చేరికతో ఛత్తీస్‌గఢ్ జనాభాలో 54 శాతంగా ఉన్న బీసీలకు కాంగ్రెస్ మరింత దగ్గరైంది. తుపాకీ ఒప్పందంలో అవినీతి జరిగిందంటూ వీపీ సింగ్ ప్రభుత్వంపై రాజ్యసభలో దుమారం రేగినప్పుడు అజిత్ జోగి ప్రతిపక్షాలను ఎదుర్కోవడంలో చాలా తెగువ చూపారు. అజిత్ రాజకీయ చరిత్ర చూస్తే ఆయన 2015లో కాంగ్రెస్‌ను వీడి సొంత పార్టీని స్థాపించారు. 2000లో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన అన్ని ఎన్నికల్లోనూ అజిత్ జోగి పోటీలో చేశారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆయన బరిలో నిలవని తొలి ఎన్నికలుగా ఈ లోక్‌సభ ఎన్నికలను చెప్పొచ్చు. అజిత్ జోగి అనూహ్య నిర్ణయంతో ఛత్తీస్‌గఢ్‌లో ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్.. ఆయన మద్దతిస్తున్న బీఎస్పీ మధ్య జరగనుంది.
జోగి కుటుంబానికి లోక్‌సభ ఎన్నికలు పెద్దగా కలిసిరాలేదనే చెప్పొచ్చు. 2009లో అజిత్ జోగి భార్య రేణు జోగి బిలాస్‌పూర్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసి, 2 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. స్వయంగా ఆయన పోటీపడ్డ 2014 ఎన్నికల్లో కూడా సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి చందూ లాల్ సాహూ చేతిలో 1,217 ఓట్ల స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు. 2018 ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ, కాంగ్రెస్‌లకు తాను ప్రత్యామ్నాయమని చెప్పుకున్న జోగి, మాయావతి ఆధ్వర్యంలోని బీఎస్పీతో పొత్తుపెట్టుకున్నారు. ఆ ఎన్నికల్లో బీఎస్పీ-సీజేసీ కూటమి 15 సీట్లు గెలుస్తుందని ఆయన అంచనా వేశారు. కానీ ఆ అంచనా తప్పి కూటమి 5 సీట్లకే పరిమితమవగా, ప్రత్యర్థి కాంగ్రెస్ మూడింట రెండు వంతుల మెజార్టీతో మొత్తం 90 సీట్లలో 68 చోట్ల గెలుపు ఢంకా మోగించింది. మరో ప్రధాన పార్టీ బీజేపీ 15 స్థానాలను గెలవగలిగింది.
బీఎస్పీ-సీజేసీ కూటమి నెగ్గిన ఐదు స్థానాల్లో మార్వాయి నియోజకవర్గంలో అజిత్ జోగి విజయం సాధించగా, కోట నుంచి ఆయన భార్య రేణు జోగి గెలుపు రుచి చూశారు. ఆ ఎన్నికల్లో ప్రాంతీయవాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, బీజేపీని బయటివాళ్ల పార్టీగా ప్రచారం చేయడంలో సక్సెస్ అయిన కాంగ్రెస్ ఘనవిజయాన్ని నమోదు చేసింది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు మాయావతి-జోగి కూటమి దక్కించుకోవడంలో విఫలమైంది. ప్రజలు తన కన్నా భూపేశ్ భగేల్‌ను ఎక్కువగా నమ్మారని ఆ ఎన్నికల ఫలితాల తర్వాత జోగి విచారం వ్యక్తం చేశారు. రాయ్‌పూర్‌కు చెందిన ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు అశోక్ తోమర్ విశ్లేషణ ప్రకారం 2018 అసెంబ్లీ ఎన్నికలతో అజిత్ జోగి ప్రభ తగ్గింది. ఆయన సీఎంగా ఉన్న మూడు సంవత్సరాల కాలంలో పాలన గాడి తప్పడాన్ని ప్రజలింకా మరచిపోలేదు. కానీ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కాబట్టి జోగి మళ్లీ పుంజుకునే అవకాశాలను కొట్టిపారేయలేం.
Comments
Please login to add a commentAdd a comment