
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని మార్వాహీ రిజర్వుడ్ శాసనసభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో పోటీకి దిగుతున్న జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్(జే) అధినేత, దివంగత సీఎం అజిత్ జోగీ తనయుడు అమిత్ జోగీ నామినేషన్ శనివారం తిరస్కరణకు గురైంది. ఆయన సమర్పించిన కుల ధ్రువీకరణ పత్రం చెల్లదని రిటర్నింగ్ అధికారి స్పష్టం చేశారు. అమిత్ జోగీ గిరిజనుడు కాదని అక్టోబర్ 15న ఉన్నత స్థాయి సర్టిఫికేషన్ పరిశీలన కమిటీ తేల్చిచెప్పింది.
ఆయన కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేసింది. దీని ఆధారంగా∙అమిత్ నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. అలాగే ఇదే ఉప ఎన్నికలో బరిలోకి దిగుతున్న అమిత్ జోగీ భార్య రిచా నామినేషన్‌ను కూడా ఇదే కారణంతో తిరస్కరించారు. అజిత్ జోగీకి కంచుకోట అయిన మార్వాహీ అసెంబ్లీ స్థానంలో ఈసారి ఆయన కుటుంబ సభ్యులెవరూ పోటీపడే అవకాశం లేకుండాపోయింది. అజిత్ జోగీ మరణంతో ఖాళీ అయిన మార్వాహీ అసెంబ్లీకి స్థానానికి నవంబర్ 3న ఉపఎన్నిక జరగనుంది.