Ajit Jogi
-
అమిత్ జోగీ నామినేషన్ తిరస్కరణ
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని మార్వాహీ రిజర్వుడ్ శాసనసభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో పోటీకి దిగుతున్న జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్(జే) అధినేత, దివంగత సీఎం అజిత్ జోగీ తనయుడు అమిత్ జోగీ నామినేషన్ శనివారం తిరస్కరణకు గురైంది. ఆయన సమర్పించిన కుల ధ్రువీకరణ పత్రం చెల్లదని రిటర్నింగ్ అధికారి స్పష్టం చేశారు. అమిత్ జోగీ గిరిజనుడు కాదని అక్టోబర్ 15న ఉన్నత స్థాయి సర్టిఫికేషన్ పరిశీలన కమిటీ తేల్చిచెప్పింది. ఆయన కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేసింది. దీని ఆధారంగా∙అమిత్ నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. అలాగే ఇదే ఉప ఎన్నికలో బరిలోకి దిగుతున్న అమిత్ జోగీ భార్య రిచా నామినేషన్‌ను కూడా ఇదే కారణంతో తిరస్కరించారు. అజిత్ జోగీకి కంచుకోట అయిన మార్వాహీ అసెంబ్లీ స్థానంలో ఈసారి ఆయన కుటుంబ సభ్యులెవరూ పోటీపడే అవకాశం లేకుండాపోయింది. అజిత్ జోగీ మరణంతో ఖాళీ అయిన మార్వాహీ అసెంబ్లీకి స్థానానికి నవంబర్ 3న ఉపఎన్నిక జరగనుంది. -
మాజీ సీఎం అజిత్ జోగి కన్నుమూత
రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి (74) కన్నుమూశారు. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాయ్‌పూర్‌లో శుక్రవారం తుదిశ్వాస విడిశారు. అజిత్ జోగి మృతిని ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పడ్డాక ఆయన మొదటి ముఖ్యమంత్రి (2000 నుంచి 2003 వరకు)గా పనిచేశారు. 2016లో కాంగ్రెస్ నుంచి బయటికొచ్చి జేసీసీ(జే) అనే పార్టీని సొంతంగా ఏర్పాటుచేశారు. కాగా 1946లో జన్మించిన అజిత్ జోగి భోపాల్‌లోని మౌలానా ఆజాద్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ నుంచి 1968లో మెకానికల్ ఇంజనీరింగ్‌లో పట్టా పుచ్చుకున్నారు. గోల్డ్ మెడలిస్ట్ అయిన ఆయన.. కొన్నాళ్లపాటు రాయ్‌పూర్ నిట్‌లో లెక్చరర్‌గా పనిచేశారు. అనంతరం సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసి ఐఏఎస్ సాధించారు. ఆ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించి.. ఛత్తీస్‌గఢ్ తొలి ముఖ్యమంత్రిగా అజిత్ జోగి చరిత్రలో నిలిచారు. గతంలో జరిగిన ఓరోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడటంతో చక్రాల కుర్చీ నుంచే రాజకీయాలను నడిపారు. 1986-1998 మధ్యకాలంలో అజిత్ రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1998 లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌గఢ్ నియోజకవర్గం నుంచి, 2004లో మహసముండ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అలాగే 1998 నుంచి 2004 మధ్య కాలంలో ఏఐసీసీ అధికార ప్రతినిధిగా కొనసాగారు. 2008లో మర్వాహి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీతో విభేదించి.. 2016 జూన్ 23న కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ (జే) పార్టీని స్థాపించారు. జోగి మృతిపట్ల కుటుంబ సభ్యులు, రాజకీయ నాయకులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. . -
కోమాలోకి అజిత్ జోగి
రాయ్‌పూర్: తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం అజిత్ జోగి (79) ఆదివారం కోమాలోకి వెళ్లారు. శనివారం ఉదయం గుండెపోటుతో ఇక్కడి ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందని, వెంటిలేటర్‌పై ఉన్నారని వైద్యులు తెలిపారు. గుండె పనితీరు బాగానే ఉందని, బీపీ కూడా అదుపులోకి వచ్చిందని చెప్పారు. అయితే శ్వాసకోస వ్యవస్థ పనిచేయకపోవడంతో మెదడు స్పందించడం లేదని, వైద్య పరిభాషలో దీన్ని హైపాక్సియా అంటారని తెలిపారు. ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగానే ఉందని చెప్పారు. రానున్న 48 గంటలు కీలకమని తెలిపారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పడ్డాక ఆయన మొదటి ముఖ్యమంత్రి (2000 నుంచి 2003 వరకు)గా పనిచేశారు. 2016లో కాంగ్రెస్ నుంచి బయటికొచ్చి జేసీసీ(జే) అనే పార్టీని సొంతంగా ఏర్పాటుచేశారు. -
విషమం.. కోమాలోకి మాజీ సీఎం
రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి ఆరోగ్యం పూర్తిగా విషమించింది. ప్రస్తుతం ఆయన కోమాలోకి వెళ్లారని వైద్యులు తెలిపారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. 48 గంటలు గడిస్తేగానీ ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత వచ్చే అవకాశముందని ఆయనకు వైద్యం అందిస్తున్న డాక్టర్ సునిల్ ఖేమా తెలిపారు. కాగా శనివారం ఉదయం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక శ్రీ నారాయణ ఆస్పత్రికి తరలించారు. ఛత్తీస్‌గఢ్ తొలి ముఖ్యమంత్రిగా అజిత్‌జోగి ఎన్నికైన విషయం తెలిసిందే. 74 ఏళ్ల అజిత్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీచేసి గెలుపొందారు. (మాజీ సీఎం అజిత్ జోగికి గుండెపోటు) -
మాజీ సీఎంకు గుండెపోటు.. పరిస్థితి విషమం
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగికి గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను స్థానిక శ్రీ నారాయణ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అజిత్ జోగి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని.. వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. కాగా 1946లో జన్మించిన అజిత్ జోగి భోపాల్‌లోని మౌలానా ఆజాద్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ నుంచి 1968లో మెకానికల్ ఇంజనీరింగ్‌లో పట్టా పుచ్చుకున్నారు. గోల్డ్ మెడలిస్ట్ అయిన ఆయన.. కొన్నాళ్లపాటు రాయ్‌పూర్ నిట్‌లో లెక్చరర్‌గా పనిచేశారు. అనంతరం సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసి ఐఏఎస్ సాధించారు. ఆ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించి.. ఛత్తీస్‌గఢ్ తొలి ముఖ్యమంత్రిగా అజిత్ జోగి చరిత్రలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తనను బహిష్కరించడంతో 2016లో జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ పార్టీని స్థాపించారు. ఇక అజిత్ జోగి తర్వాత బీజేపీ నేత రమణ్ సింగ్ ప్రభుత్వ పగ్గాలు చేపట్టి.. 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ క్రమంలో సుదీర్ఘ నిరీక్షణ అనంతరం 2018లో మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకుంది. -
లోక్‌సభ ఎన్నికలకు అజిత్ జోగి దూరం!
సాక్షి, రాయ్‌పూర్: లోక్‌సభ ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్ నుంచి కింగ్ మేకర్‌గా భావిస్తున్న ఛత్తీస్‌గఢ్ జనతా కాంగ్రెస్ అధినేత, మాజీ సీఎం అజిత్ జోగి సంచలన నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎంపీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయబోదని.. ఆయా స్థానాలను బీఎస్పీకి వదిలేస్తున్నట్టు అజిత్ జోగి మీడియాకు తెలిపారు. సరైన వనరులు, సంసిద్ధత లేనందున తన పార్టీ ఈ లోక్‌సభ ఎన్నికల బరిలో పాల్గొనడం లేదని అజిత్ జోగి పేర్కొన్నారు. ‘నన్ను పోటీ చేయమని చాలా మంది చెప్తున్నారు. కానీ దీని గురించి నేను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నా పార్టీని బలమైన ప్రాంతీయ శక్తిగా మార్చడంపైనే పూర్తి దృష్టి కేంద్రీకరించాలని అనుకుంటున్నాను. బీఎస్పీ తరఫున రాబోయే ఎన్నికల్లో ప్రచారం చేసే విషయంపై కూడా ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేద’ని జోగి వివరించారు. 11 లోక్‌సభ స్థానాలున్న ఛత్తీస్‌గఢ్‌లో మూడు దశల్లో పోలింగ్ జరగనుంది. మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 8న, రెండో దశ ఏప్రిల్ 18న, మూడో విడత పోలింగ్ 23న జరుగనుంది. జోగి బరిలో లేని తొలి ఎన్నికలు అజిత్ జోగి 1986లో ఐపీఎస్‌గా ఉన్నప్పుడు అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ కోరిక మేరకు కాంగ్రెస్‌లో చేరారు. ఆయన చేరికతో ఛత్తీస్‌గఢ్ జనాభాలో 54 శాతంగా ఉన్న బీసీలకు కాంగ్రెస్ మరింత దగ్గరైంది. తుపాకీ ఒప్పందంలో అవినీతి జరిగిందంటూ వీపీ సింగ్ ప్రభుత్వంపై రాజ్యసభలో దుమారం రేగినప్పుడు అజిత్ జోగి ప్రతిపక్షాలను ఎదుర్కోవడంలో చాలా తెగువ చూపారు. అజిత్ రాజకీయ చరిత్ర చూస్తే ఆయన 2015లో కాంగ్రెస్‌ను వీడి సొంత పార్టీని స్థాపించారు. 2000లో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన అన్ని ఎన్నికల్లోనూ అజిత్ జోగి పోటీలో చేశారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆయన బరిలో నిలవని తొలి ఎన్నికలుగా ఈ లోక్‌సభ ఎన్నికలను చెప్పొచ్చు. అజిత్ జోగి అనూహ్య నిర్ణయంతో ఛత్తీస్‌గఢ్‌లో ప్రధాన పోటీ బీజేపీ, కాంగ్రెస్.. ఆయన మద్దతిస్తున్న బీఎస్పీ మధ్య జరగనుంది. జోగి కుటుంబానికి లోక్‌సభ ఎన్నికలు పెద్దగా కలిసిరాలేదనే చెప్పొచ్చు. 2009లో అజిత్ జోగి భార్య రేణు జోగి బిలాస్పూర్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసి, 2 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. స్వయంగా ఆయన పోటీపడ్డ 2014 ఎన్నికల్లో కూడా సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి చందూ లాల్ సాహూ చేతిలో 1,217 ఓట్ల స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు. 2018 ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ, కాంగ్రెస్‌లకు తాను ప్రత్యామ్నాయమని చెప్పుకున్న జోగి, మాయావతి ఆధ్వర్యంలోని బీఎస్పీతో పొత్తుపెట్టుకున్నారు. ఆ ఎన్నికల్లో బీఎస్పీ-సీజేసీ కూటమి 15 సీట్లు గెలుస్తుందని ఆయన అంచనా వేశారు. కానీ ఆ అంచనా తప్పి కూటమి 5 సీట్లకే పరిమితమవగా, ప్రత్యర్థి కాంగ్రెస్ మూడింట రెండు వంతుల మెజార్టీతో మొత్తం 90 సీట్లలో 68 చోట్ల గెలుపు ఢంకా మోగించింది. మరో ప్రధాన పార్టీ బీజేపీ 15 స్థానాలను గెలవగలిగింది. బీఎస్పీ-సీజేసీ కూటమి నెగ్గిన ఐదు స్థానాల్లో మార్వాయి నియోజకవర్గంలో అజిత్ జోగి విజయం సాధించగా, కోట నుంచి ఆయన భార్య రేణు జోగి గెలుపు రుచి చూశారు. ఆ ఎన్నికల్లో ప్రాంతీయవాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, బీజేపీని బయటివాళ్ల పార్టీగా ప్రచారం చేయడంలో సక్సెస్ అయిన కాంగ్రెస్ ఘనవిజయాన్ని నమోదు చేసింది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు మాయావతి-జోగి కూటమి దక్కించుకోవడంలో విఫలమైంది. ప్రజలు తన కన్నా భూపేశ్ భగేల్‌ను ఎక్కువగా నమ్మారని ఆ ఎన్నికల ఫలితాల తర్వాత జోగి విచారం వ్యక్తం చేశారు. రాయ్‌పూర్‌కు చెందిన ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు అశోక్ తోమర్ విశ్లేషణ ప్రకారం 2018 అసెంబ్లీ ఎన్నికలతో అజిత్ జోగి ప్రభ తగ్గింది. ఆయన సీఎంగా ఉన్న మూడు సంవత్సరాల కాలంలో పాలన గాడి తప్పడాన్ని ప్రజలింకా మరచిపోలేదు. కానీ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కాబట్టి జోగి మళ్లీ పుంజుకునే అవకాశాలను కొట్టిపారేయలేం. -
అజిత్ జోగి కోడలి విజయం ఖాయం
సాక్షి, న్యూఢిల్లీ : చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి కోడలు రిచా జోగి విజయం సాధించడం నల్లేరు మీద నడకేనని అకల్తారా అసెంబ్లీ నియోజక వర్గం ప్రజలు భావిస్తున్నారు. అజిత్ జోగి కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి జనతా కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే. ఆయన ఈసారి ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీతో ఎన్నికల పొత్తు పెట్టుకున్నారు. ఈ కారణంగా ఆయన తన కోడలును బీఎస్పీ తరఫున ఈ నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ నియోజక వర్గంలో 45 శాతం మంది దళితులు, ఆదివాసీలు ఉండడమే కాకుండా బీఎస్పీకీ మంచి ప్రాబల్యం ఉండడమే అందుకు కారణం కావచ్చు. జాంజ్‌గిర్–చంపా జిల్లాలోని అకల్తారా నియోజక వర్గంలో 35 దళిత, ఆదివాసీ గ్రామాలు ఉన్నాయి. వారంత ఈసారి అజిత్ జోగికే ఓటు వేయాలని ప్రతిజ్ఞ కూడా చేశారట. ఆ గ్రామాల గ్రామాల ప్రజలు రిచా జోగి ప్రత్యర్థులెవరిని తమ గ్రామాల్లో ప్రచారానికి అనుమతించడం లేదు. ఐదేళ్ల క్రితం ఎన్నికల్లో గెలిచిన ప్రస్తుత కాంగ్రెస్ శాసన సభ్యుడు చున్నీలాల్ సాహు ఐదేళ్ల నుంచి తమ గ్రామాలకే రావడం లేదని, అక్కడక్కడ ఆయన పోస్టర్లు తప్ప ఆయన జాడ కనిపించడం లేదని ప్రజలు అంటున్నారు. అకల్తార పట్టణంలో ప్రజల సౌకర్యార్థం ఓ టాయ్‌లెట్ నిర్మంచమంటే కూడా ఆయన నిర్మించలేక పోయారని, అలాంటి వ్యక్తికి ఈసారి ఓటు ఎలా వేయగలమని చెబుతున్నారు. నియోజకవర్గంలోని ముర్లిది గ్రామంలో 1800 మంది ఓటర్ల ఉండగా 1600 మంది ఓటర్లు రిచా జోగికే ఓటు వేస్తున్నట్లు చెప్పారు. మిగతా 200 మంది ఓటర్లు బీజేపీ తరఫున పోటీ చేస్తున్న సౌరభ్ సింగ్‌కు ఓటు వేస్తున్నట్లు చెప్పారు. ఈసారి ఈ నియోజకవర్గంలో బీజేపీ, బీఎస్పీకి మధ్యనే పోటీ ఉంటుందని, అయితే రిచా జోగిదే విజయమని చెబుతున్నారు. అకల్తారాలో మెజారిటీ ఇళ్లపై బీఎస్పీ జెండాలే కనిపిస్తోంది. ఆఖరికి చున్నీలాల్ సాహుకు మద్దతిస్తున్న కాంగ్రెస్ కౌన్సిలర్ పుణేశ్వర్ కుమార్ ఆనంద్ ఇంటిపై కూడా బీఎస్పీ జెండా ఎగరడం అందుకు నిదర్శనం. ఈ విషయమై ఆయన్నే ప్రశ్నించగా తన 10, 12 ఏళ్ల కొడుకులు తెలియక ఆ జెండాను ఎగరేశారని చెప్పుకున్నారు. -
స్టాంపు పేపర్‌పై మేనిఫెస్టో
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ (జేసీసీ) పార్టీ అధినేత అజిత్ జోగీ ఎన్నికల మేనిఫెస్టోను వినూత్నరీతిలో తెచ్చారు. రూ.100 స్టాంపు పేపర్‌పై పార్టీ హామీలను ముద్రించారు. ఇది తన ప్రమాణ పత్రమనీ, గెలిస్తే ఈ హామీలన్నీ నెరవేరుస్తాననీ, ఓడితే జైలుకైనా వెళ్తానని జోగీ చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్‌ల మేనిఫెస్టోలకు చట్టబద్ధత లేదనీ, ఆ పార్టీల మేనిఫెస్టోలు చిత్తు కాగితాలన్నారు. బాండు పేపర్‌పై మొత్తం 14 హామీలను జోగీ ముద్రించారు. రాష్ట్రంలో జన్మించే ప్రతీ ఆడబిడ్డ పేరిట లక్ష రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేయడం, ఇళ్లు, స్థలాల అసలైన హక్కుదారులకు పట్టాలు ఇవ్వడం, జీఎస్టీతోపాటు ఇంధనంపై పన్నులనూ సగానికి తగ్గించడం, ఒక్కొక్కరికి రూ.7 లక్షల రూపాయల విలువైన ఆరోగ్య బీమా, రిజర్వేషన్లను ప్రభుత్వ రంగంలో వంద శాతానికి, ప్రయివేటు రంగంలో 90 శాతానికి పెంపు తదితర హామీలు వాటిలో ఉన్నాయి. -
దళితులే నిర్ణయాత్మకం!
ఛత్తీస్‌గఢ్ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్దీ ఆ రాష్ట్ర రాజకీయం వేడెక్కుతోంది. అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ మధ్యే హోరాహోరీ పోరు ఉంటుందని భావించినప్పటికీ.. ఛత్తీస్‌గఢ్ జనతా కాంగ్రెస్ అధినేత అజిత్ జోగి బీఎస్పీతో జతకట్టడంతో రాజకీయ ముఖచిత్రం మారింది. ఛత్తీస్‌గఢ్‌లో దళితుల ఓట్లు రానున్న ప్రభుత్వాన్ని నిర్దేశించనున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 90 నియోజకవర్గాల్లో 10 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలుండగా.. మరో 40 చోట్ల దళితులు నిర్ణాయాత్మక ఓటుగా ఉన్నారు. జోగి, మాయావతిల కూటమిలో సీపీఎం కూడా చేరింది. ఇన్నాళ్లూ రాష్ట్రంలో ఉన్న 12% దళితుల ఓట్లను బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీలు పంచుకుంటూ ఉండేవి. ఇందులో బీఎస్పీ వాటా ఎక్కువగా ఉండేది. అయితే బీఎస్పీతో జతకట్టడంతో ఈ ఓటుబ్యాంకును పూర్తిగా తమ కూటమికి అనుకూలంగా మార్చుకోవాలని జోగి వ్యూహం. కనీసం 13 స్థానాల్లో.. జోగీ, మాయావతి కూటమి ఈ ఎన్నికల్లో కనీసం 13 స్థానాల్లో విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. దళితుల ప్రభావం ఎక్కువగా ఉండే.. జాంగీర్ చంపా, బిలాస్పూర్ ఎంపీ నియోజవర్గాల పరిధిలో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలవాలనేది వీరి వ్యూహం. బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం రాజకీయ జీవితం (1984లో జంగీర్ చంపా నుంచే గెలిచారు) ప్రారంభించింది కూడా ఈ ప్రాంతంలోనే కావడంతో.. మాయావతి భారీ అంచనాలు పెట్టుకున్నారు. 2013లో బీఎస్పీ 8 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేసి ఒక్కచోట కూడా గెలుపొందలేదు. రెండు స్థానాల్లో సెకండ్ ప్లేస్‌తో సరిపెట్టుకుంది. మరోవైపు, ఈసారి అకల్తారా ప్రాంతం నుంచి అజిత్ జోగి కోడలు రీచా జోగి బీఎస్పీ టికెట్‌పై పోటీచేస్తున్నారు. ‘మా హృదయాలు ఒక్కటవ్వాలంటే నేను బీఎస్పీ టికెట్‌పై పోటీచేయడమే సరైన నిర్ణయం. అలాగైతేనే దళిత ఓట్లు సంపూర్ణంగా బదిలీ అవుతాయి’ అని రీచా భర్త అమిత్ జోగి పేర్కొన్నారు. బీఎస్పీ బలమేంటి? యూపీలో జాటవ్స్ లాగే ఛత్తీస్‌గఢ్‌లో సత్నామీలు బీఎస్పీకి అత్యంత నమ్మకంగా ఉంటారు. అయితే రాష్ట్రంలో బీఎస్పీ అభ్యర్థులు బలంగా లేనందున.. ఈ వర్గం మొదట్నుంచీ కాంగ్రెస్‌కు ఓటుబ్యాంకుగా మారింది. గత ఎన్నికల్లో బీజేపీ వ్యూహాత్మకంగా.. సత్నామీల గురువు బాల్ దాస్‌తో ‘సత్నామీ సేన’ పార్టీని పెట్టించి ఈ వర్గం ఓట్లును భారీగా చీల్చి 10 రిజర్వ్డ్ స్థానాల్లో తొమ్మిదింటిని కైవసం చేసుకుంది. ఇప్పుడు నేరుగా మాయావతే రంగంలోకి దిగడంతో ఈ స్థానాల్లో బీఎస్పీ పట్టు సంపాదించవచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. దీనికితోడు ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో బీజేపీపై వ్యతిరేకత పెరిగింది. అయితే ఈ వ్యతిరేక ఓట్లు కూటమిలోని మిగిలిన పార్టీలకు బదిలీ అవుతాయా? లేదా? అన్నదే ఆసక్తికరం. బీజేపీపై వ్యతిరేకత తమకే లాభిస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. దళిత ఓట్లు చీలితే మళ్లీ బీజేపీయే గెలుస్తుంది కాబట్టి.. వారంతా తమవెంటే ఉంటారని ప్రచారం చేసుకుంటోంది. బీజేపీ, కాంగ్రెస్ ఓట్ల శాతంలో ఉండే స్వల్ప మార్పును జోగి, మాయావతి కూటమి తీవ్రంగా ప్రభావితం చేయనుందనేది సుస్పష్టం. -
రమణ్‌కు ఎదురెవరు?
రాజకీయాల్లో జంటిల్‌మ్యాన్ అనే ఘనత సాధించిన కొద్ది మంది నేతల్లో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ఒకరు. నెమ్మదస్తుడు, నిజాయితీపరుడు, ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉంటారు. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న రాష్ట్రంలో సవాళ్లన్నీ ఎదుర్కొంటూ నేర్పుగా పాలన చేయగలరని పేరు తెచ్చుకున్నారు. పదిహేనేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న రమణ్ సింగ్‌కు స్వయంకృషితో పాటు అదృష్టం కూడా కలిసి వస్తోంది. ఈ సారి కూడా కాంగ్రెస్‌కు గుడ్‌బై కొట్టేసి సొంత కుంపటి పెట్టుకున్న అజిత్ జోగి రూపంలో రమణ్ సింగ్‌కు కలిసివస్తుందనే అంచనాలైతే ఉన్నాయి. మరో పక్క ప్రతిపక్ష కాంగ్రెస్‌లో రమణ్ సింగ్‌కు పోటీగా సరైన నాయకుడు కనిపించడంలేదు. ఎవర్ని సీఎం అభ్యర్ధిగా ప్రకటిస్తే ఎవరు అలుగుతారో తెలీక అసలు సీఎం అభ్యర్ధి పేరే ప్రకటించకుండానే కాంగ్రెస్ కదనంలోకి దూకింది. అంతర్గత కలహాలను కప్పిపుచ్చుతూ సీతా స్వయంవరంలాగా ఎన్నికల అనంతరం తమ పార్టీలో సీఎం అభ్యర్ధి ఎన్నిక జరుగుతుందని చత్తీస్‌గఢ్ ప్రతిపక్షనేత టీఎస్ సింగ్‌దేవ్ గంభీరంగా వ్యాఖ్యానిస్తున్నారు. పలు సర్వేల్లో రమణ్‌సింగ్‌కు పోటీగా ఎవరూ దరిదాపుల్లో కనిపించడంలేదు. దీంతో కేవలం రమణ్ సుదీర్ఘ పాలనపై అసంతృప్తే తమకు కలిసిరావచ్చని ప్రత్యర్ధి పార్టీల్లో ఆశావహులు భావిస్తున్నారు. వ్యతిరేకతా.. క్లీన్ ఇమేజా ? ప్రజా పంపిణీ వ్యవస్థలో సంస్కరణల ద్వారా చావల్ బాబా అన్న పేరు సంపాదించుకున్న రమణ్ సింగ్‌ను గత ఎన్నికల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే అందలం ఎక్కించాయి. కానీ ఈ సారి ఆ పరిస్థితి కాస్త తిరగబడ్డట్లుంది. అయిదేళ్లలో పట్టణ ప్రాంతాల్లో పట్టు బిగించిన రమణ్ సింగ్, గ్రామీణ ప్రాంతాలను నిర్లక్ష్యం చేశారు. చావల్ బాబాగా పేరున్న ఆయన రైతు సమస్యల్ని పట్టించుకోలేదు. దీంతో అన్నదాతలు రమణ్ సింగ్ సర్కార్‌పై ఆక్రోశంతో ఉన్నారు. ఏ ప్రజాపంపిణీ వ్యవస్థనైతే బలోపేతం చేశారో, అదే వ్యవస్థలో మిల్లర్లతో కుమ్మక్కై నకిలీ బియ్యం పంపిణీకి పరోక్షంగా సహకరించారన్న అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీంతో ప్రత్యర్ధులందరూ ఈ వ్యతిరేకతపైనే నమ్మకంతో ఉన్నారు. ఈ దఫా ప్రభుత్వ వ్యతిరేకత పెల్లుబికి రమణ్‌ను గద్దె దింపడం ఖాయమని ఆశిస్తున్నారు. కానీ కోర్టుల్లో రమణ్ క్లీన్ ఇమేజ్ పొందారు. దీంతో జనంలో నిజాయితీపరుడని ఆయనకున్న పేరు చెక్కుచెదరినట్లు కనిపించడం లేదు. ఇప్పటికీ 41శాతం మంది ప్రజలు రమణ్ సింగే సీఎం కావాలనే కోరుకుంటున్నారని వివిధ సర్వేల్లో తేలింది. తర్వాత స్థానాల్లో అజిత్ జోగీ, సింగ్ దేవ్, భూపేష్ తదితరులున్నారు. అజిత్ ఆశ తీరేనా? కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా మూడేళ్ల పాటు పనిచేసిన అజిత్ జోగి ప్రజల్లో రమణ్ సింగతర్వాత అంతటి ఛరిష్మా ఉన్న నాయకుడు. ఐఏఎస్ నుంచి సీఎంగా ఎదిగిన జోగీ రాజకీయ వ్యూహరచనలో దిట్ట. రెండేళ్ల క్రితం కాంగ్రెస్‌ను వీడి జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ (జేసీసీ) పేరుతో పార్టీ పెట్టిన ఆయన వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. గిరిజనులు, సత్నామీ ఎస్సీల్లో పట్టున్న నాయకుడు. రాష్ట్ర జనాభాలో 12% ఎస్సీలైతే వారిలో సత్నామీలు 75%వరకు ఉన్నారు. ఎస్సీ నియోజకవర్గాల్లో పట్టున్న బీఎస్పీతో జతకట్టడం, సీపీఐని కూడా తమ గూటికి లాగేసి ఒక కూటమిగా ఏర్పడడంతో కాంగ్రెస్, బీజేపీ ఓట్లను జోగి భారీగా చీలుస్తారనే అంచనాలు ఉన్నాయి. ఈ దఫా జోగి మార్వాహి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అనారోగ్య సమస్యలు వేధిస్తున్నా ఆయన తన పార్టీని ఉత్సాహంగా నడిపిస్తున్నారు. గత ఏడాదిలో బస్తర్ నుంచి సర్గూజా వరకు దాదాపు 300 బహిరంగ సభల్లో ప్రసంగించారు. బూత్ స్థాయిలో 10 లక్షల మంది కార్యకర్తల్ని నియమించారు. ఎక్కడికక్కడ రమణ్‌సింగ్ సర్కార్ వైఫల్యాలను ఎత్తిచూపిస్తున్నారు. కాంగ్రెస్‌లో నాయకత్వ లేమి ఛత్తీస్‌గఢ్‌లో సీఎం అభ్యర్థిని ప్రకటించే సాహసం కాంగ్రెస్ అధిష్టానం చేయలేకపోయింది. 2013లో జరిగిన మావోయిస్టు దాడిలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఎందరినో కోల్పోయింది. అనంతరం జోగి పార్టీని వీడాక కాంగ్రెస్ జాతీయ నాయకత్వమే భారం మోయాల్సి వచ్చింది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భూపేష్ భాఘేల్, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు టిఎస్ సింగ్‌దేవ్ రేసులో ఉన్నప్పటికీ వారిలో ఎవరికీ రమణ్ సింగ్‌కు ఉన్నంత జనాదరణ లేదు. మరో ఇద్దరు సీనియర్ నేతలు చరణ్ దాస్ మహంత్, తామ్రధావజ్ సాహులు కూడా సీఎం పీఠంపై కన్నేశారు. కాంగ్రెస్ నిర్వహించిన అంతర్గత సర్వేల్లో 24% మంది సింగ్‌దేవ్ సీఎం అభ్యర్థి కావాలని కోరుకుంటే, 20% మంది భూపేష్ భాగల్ వైపు మొగ్గు చూపించారు. టీఎస్ సింగ్ దేవ్ రాష్ట్రంలో ప్రజాప్రతినిధులందరిలోకి ధనవంతుడు. రమణ్ సింగ్ అనుకూలం ♦ పరిపాలనాదక్షత, నిజాయితీ ♦ వ్యాపారుల అండదండలు ♦ మావోయిస్టుల ప్రాబల్యం ఉన్నా ఆగని అభివృద్ధి కార్యక్రమాలు ప్రతికూలం ♦ 15ఏళ్లుగా అధికారంలో ఉండడంతో ప్రభుత్వ వ్యతిరేకత ♦ అధికారుల చేతుల్లో కీలుబొమ్మ అన్న పేరు ♦ రైతులు, గిరిజనుల్లో అసంతృప్తి అజిత్ ప్రమోద్ కుమార్ జోగి అనుకూలం ♦ రాష్ట్ర రాజకీయాలు, పాలనపై పూర్తి అవగాహన ♦ గిరిజనులు, సత్నామీ ఎస్సీల్లో పట్టు ♦ బీఎస్పీతో పొత్తు ప్రతికూలం ♦ కుటుంబ సభ్యులు వివిధ పార్టీల్లో కొనసాగడం ♦ గత వైఫల్యాలు, కుంభకోణాల ఇమేజ్ పూర్తిగా చెరిగిపోకపోవడం కాంగ్రెస్ అభ్యర్ధులు అనుకూలం ♦ బీఎస్పీ, అజిత్ పొత్తుతో బీజేపీ ఓట్బ్యాంక్కు గండిపడుతుందన్న అంచనాలు ♦ ప్రభుత్వ వ్యతిరేకత ప్రతికూలం ♦ బలమైన ఇమేజ్ లేకపోవడం ♦ అంతర్గత కుమ్ములాటలు అక్కడ అన్నీ సాధ్యమే! మధ్యప్రదేశ్ అసెంబ్లీ పలు ప్రయోగాలకు వేదిక. 1998–2003లో అన్నుపూర్లోని సోహాగ్పూర్ నియోజకవర్గం నుంచి ట్రాన్స్‌జెండర్ శబ్నం మౌసీ తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. శబ్నం స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. అంతేకాదు.. దేశంలో తొలి ట్రాన్స్‌జెండర్ మేయర్ కూడా మధ్యప్రదేశ్ లోనే ఎన్నికయ్యారు. 1999లో కత్నీ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్‌గా కమలా జాన్ విజయం సాధించారు. 1977లో పార్లమెంటుకు ఓ అంధుడైన నేతను పంపించిన ఘనత కూడా మధ్యప్రదేశ్‌కే దక్కుతుంది. యమునా ప్రసాద్ శాస్త్రి రేవా నియోజవర్గం నుంచి 1977 నుంచి 1989 వరకు రెండుసార్లు ఎంపీగా ఉన్నారు. 1955లో గోవా ముక్తి పోరాటంలో పోర్చుగీసు పోలీసుల చిత్రహింసలతో ఆయన తన రెండుకళ్లూ పోయాయి. ఈ దఫా అదృష్టాన్ని పరీక్షించుకోవాలని బధిర అభ్యర్థి సుదీప్ శుక్లా భావిస్తున్నారు. మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేల్లో 70% కోటీశ్వరులే! ప్రస్తుతం మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేల్లో 70% మంది కోటీశ్వరులే. 2008 ఎన్నికల అప్పుడు 40% మాత్రమే ఉన్న ధనిక ఎంఎల్ఏల సంఖ్య ఐదేళ్లలోనే మరింత పెరిగింది. 2013లో ఎన్నికల సంఘానికి నివేదించిన అఫిడవిట్ ప్రకారం మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేల సగటు ఆస్తులు రూ.5.24కోట్లు. మొత్తం 230 మంది ఎమ్మెల్యేల్లో 161 మంది కోటీశ్వరులు. ఈ జాబితాలోనూ బీజేపీ ఎమ్మెల్యేలే ఎక్కువగా ఉన్నారు. ఎమ్మెల్యే సంజయ్ పాఠక్ ఈ జాబితాలో తొలిస్థానంలో ఉన్నారు. ఎన్నికల సంఘానికి పేర్కొన్న లెక్కల ప్రకారం ఆయన ఆస్తులు రూ.121 కోట్లు. 2012–13 ఆర్థిక సంవత్సరంలో ఆయన ఆస్తులు రూ.8.94 కోట్లు మాత్రమే. మరో బీజేపీ ఎమ్మెల్యే చేతన్ కశ్యప్‌కు రూ.120.39 కోట్లు, సంజయ్ శర్మ అనే మరో కమలం పార్టీ ఎంపీకి రూ.65.42 కోట్ల ఆస్తులున్నాయి. మొత్తం 161 మందిలో 118 మంది బీజేపీ ఎమ్మేల్యేలు ఉన్నారు. 2013 ఎన్నికలకు ముందు ఈ జాబితాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 69%, బీఎస్పీ శాసనసభ్యులు 25% ఉన్నారు. 14 ముస్లిం స్థానాలపై కాంగ్రెస్ దృష్టి రాజస్తాన్‌లో 2013 అసెంబ్లీ ఎన్నికలో చావుదెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీ.. ఈసారి ఏ అవకాశాన్నీ వదులుకోకుండా అనేక ప్రయత్నాలూ చేస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తీవ్రంగా నష్టం చేసిన 14 ముస్లిం ప్రభావిత నియోజకవర్గాల్లో ఈసారి ఓట్లు చీలకుండా జాగ్రత్తపడుతోంది. గత ఎన్నికల్లో చిన్నాచితకా ముస్లిం పార్టీల కారణంగా ఓట్లు చీలడంతో.. ఈసారి ఆ ప్రమాదం జరగకుండా జాగ్రత్తపడుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ రెబల్స్, ముస్లిం సంఘాల నేతలకు బీజేపీ అన్నివిధాలుగా సహాయపడిందని.. అందుకే ఈ స్థానాల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని ప్రచారం చేస్తోంది. డిసెంబర్ 7న జరిగే ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ముందుగానే కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించి అసమ్మతినేతలను బుజ్జగించే పనిలో ఉంది. ఎలాగైనా 14 స్థానాల్లో గెలుపొందాలని గట్టి యత్నాలు చేస్తోంది. -
‘మా నాన్న ఎన్నికల్లో పోటీ చేయరు’
రాయ్‌పూర్: మాజీ ముఖ్యమంత్రి, ఛత్తీస్‌గఢ్ జనతా కాంగ్రెస్ (జేసీసీ) నాయకుడు అజిత్ జోగి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఈ విషయాన్ని ఆయన తనయుడు అమిత్ జోగి వెల్లడించారు. మహాకూటమి అభ్యర్థుల ప్రచారంపైనే ఆయన దృష్టి కేంద్రీకరిస్తారని తెలిపారు. బహుజన సమాజ్‌వాదీ పార్టీ, సీపీఐతో కలిసి జేసీసీ మహాకూటమి ఏర్పాటు చేసిందన్నారు. ‘ఆయన (అజిత్ జోగి) రాష్ట్రమంతా ప్రచారం చేయడంపైనే దృష్టి పెడతారు. మహాకూటమి అభ్యర్థులందరి తరపున ప్రచారం సాగిస్తారు. ఎన్నికల్లో ఆయన పోటీ చేయరు. పార్టీ ప్రచారాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే మా లక్ష్యమ’ని అమిత్ జోగి చెప్పారు. (చదవండి: మాయావతి నిర్ణయం రాహుల్‌కు దెబ్బే!) జేసీసీతో కలిసి పోటీ చేయనున్నట్టు సెప్టెంబర్ 20న బహుజన సమాజ్‌వాదీ పార్టీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. మొత్తం 90 స్థానాల్లో జేసీసీ 55, బీఎస్పీ 35 చోట్ల పోటీ చేస్తాయని మాయావతి తెలిపారు. జేసీసీ 45 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేయాల్సివుంది. గత ఆదివారం సీపీఐ కూడా చేరడంతో కొంతా, దంతెవాడ స్థానాలను ఆ పార్టీకి ఇవ్వనున్నట్టు అజిత్ జోగి ప్రకటించారు. బస్తర్ ప్రాంతంలో ఈ నెల 20 నుంచి 24 వరకు ఆయన ఎన్నికల ప్రచారం సాగించనున్నారు. -
ఏం ‘మాయ’ చేశావే!
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదంటూ బహుజన సమాజ్ వాది పార్టీ చీఫ్ మాయావతి బుధవారం నాడు స్పష్టం చేయడం ద్వారా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పాలకపక్ష బీజేపీకి వ్యతిరేకంగా మహా కూటమిని ఏర్పాటు చేయాలనుకున్న కాంగ్రెస్ పార్టీ ఆశలపై నీళ్లు చల్లారు. 543 లోక్‌సభ స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే 80 సీట్లు ఉన్నందున మాయావతి, కాంగ్రెస్ కలిస్తే మహా కూటమికే విజయావకాశాలు ఎక్కువని కాంగ్రెస్ సీనియర్ నేతలు భావిస్తూ వచ్చారు. ఇలా జరుగుతుందని వారు ఊహించలేక పోయారు. పైగా మాయావతి, కాంగ్రెస్ పార్టీకి తల బిరుసుతనం ఎక్కువైందని, బీజేపీని ఓడించడంకంటే భాగస్వామ్య పక్షాలను ఓడించడం కోసమే పనిచేస్తోందని ఆరోపించారు. మాయావతి తీసుకున్న నిర్ణయం కారణంగా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కలిగే నష్టాలను పక్కన పెడితే మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గణనీయమైన నష్టం కలిగించే అవకాశం ఉంది. ఆ రాష్ట్రంలోని 52 జిల్లాలకుగాను 14 జిల్లాల్లో బీఎస్పీకి ఎక్కువ ప్రాబల్యం ఉంది. ముఖ్యంగా బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే దళితులు ఇప్పటికీ మాయావతితోనే ఉన్నారు. 2013లో జరిగిన ఎన్నికల్లోనే కాంగ్రెస్, బీఎస్పీ పార్టీలు కలసి ఉన్నట్లయితే బీజేపీకి గట్టి పోటీ ఇచ్చేవారు. నాటి ఎన్నికల్లో మాయావతి పార్టీ నాలుగు సీట్లను గెలుచుకుంది. పది సీట్లలో రెండో స్థానంలో నిలిచింది. 17 సీట్లలో 20 వేలకుపైగా ఓట్లు, 62 సీట్లలో పదివేల ఓట్లకుపైగా సాధించింది. 6.42 శాతం మొత్తం ఓట్లలో మూడో స్థానంలో నిలిచింది. నాటి ఎన్నికల్లో పాలకపక్ష బీజేపీకి 44 శాతం ఓట్లురాగా, కాంగ్రెస్ పార్టీకి 36.79 శాతం ఓట్లు వచ్చాయి. వరుసగా 15 సంవత్సరాల పాటు అధికారంలో ఉండడం వల్ల ఈసారి రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ప్రజల నుంచి వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది. మధ్యప్రదేశ్‌తోపాటు రాజస్థాన్‌లో కూడా మాయావతి ఎక్కువ సీట్లను డిమాండ్ చేయడం వల్ల ఇరు పార్టీల మధ్య పొత్తు కుదరలేదని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని కాంగ్రెస్ నాయకుడొకరు తెలిపారు. చౌహాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని, ఈ దశలో మాయావతికి ఎక్కువ సీట్లు ఇచ్చిట్లయితే పాలకపక్షాన్ని ఓడించే అవకాశం జారిపోయే ప్రమాదం కూడా ఉంటుందని ఆయన అన్నారు. రాజస్థాన్ విషయంలో మాయావతి వైఖరి మరీ దారుణంగా ఉందని, గత ఎన్నికల్లో 200 సీట్లకుగాను కేవలం మూడు సీట్లను మాత్రమే గెలుచుకున్న ఆమె పార్టీ రాజస్థాన్‌లో కూడా ఎక్కువ సీట్లను అడగడం అర్థరహితమని ఆ నాయకుడు వ్యాఖ్యానించారు. ఈ రాష్ట్రాలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న చత్తీస్‌గఢ్‌లో మాయావతి పార్టీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రెబెల్ అజిత్ జోగి పార్టీతోని ఎన్నికల పొత్తు పెట్టుకున్నారు. అక్కడ మాయా కూటమి వల్ల బీజేపీకే ప్రయోజనం కలుగుతుందని రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే చెప్పారు. కాంగ్రెస్–బీఎస్పీ కూటమి బలంగా ఉండాలని గాంధీలు కోరుకున్నారని, కొంత మంది సీనియర్ నాయకులు తమ పొత్తును దెబ్బకొట్టారని పరోక్షంగా దిగ్విజయ్ సింగ్‌ను ఉద్దేశించి మాయావతి వ్యాఖ్యానించారు. అంటే, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతోని పొత్తుకు అవకాశాలను అలా సజీవంగా ఉంచుకోవడానికే మాయావతి ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. ఒక్క పార్టీతోనే ఎన్నికల పొత్తు పెట్టుకోవడంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం విఫలం అయినప్పుడు 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మహా కూటమిని ఎలా ఏర్పాటు చేయగలదని రాజకీయ పండితులు శంకిస్తున్నారు. ఏదేమైనా మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల పొత్తు చర్చల్లో మాయావతిని ఉద్దేశించి మాయా మర్మం లేనేలేదంటూ ఏం మాయ చేశావే! అంటూ కాంగ్రెస్ అధిష్టానంలోని నాయకులు కాస్త ఆందోళన చెందుతున్నారు. -
మాయావతి నిర్ణయం రాహుల్‌కు దెబ్బే!
సాక్షి, న్యూఢిల్లీ : 2019లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పాలకపక్ష భారతీయ జనతా పార్టీని ఓడించేందుకు వివిధ ప్రాంతీయ పార్టీలతో కలసి మహా ప్రతిపక్ష కూటమిని ఏర్పాటు చేయాలనే కాంగ్రెస్ పార్టీ వ్యూహానికి ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. చత్తీస్‌గఢ్‌లో అజిత్ జోగి నాయకత్వంలోని చత్తీస్‌గఢ్ జనతా కాంగ్రెస్ పార్టీతోని ఎన్నికల పొత్తు పెట్టుకున్నామంటూప బీఎస్పీ నాయకురాలు మాయావతి ప్రకటించడమే కాకుండా మధ్యప్రదేశ్ అసెంబ్లీకి 22 మంది పార్టీ సభ్యుల జాబితాను కూడా విడుదల చేయడం అనూహ్య పరిణామం. ఓ పక్క మధ్యప్రదేశ్‌లో సీట్ల పంపకాలపై ఇరు పార్టీల మధ్య చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం శోచనీయమే. 2016లో కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కృతుడై చత్తీస్‌గఢ్ జనతాపార్టీని ఏర్పాటు చేసిన అజిత్ జోగితో తన పార్టీ పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని మాయావతి ఎప్పటి నుంచో చెబుతున్నారు. అందుకని అది అంత ఆశ్చర్యకరమైన విషయం కాకపోవచ్చు. కానీ మధ్యప్రదేశ్‌లో సీట్ల పంపకాలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కమల్‌నాథ్‌తో ఓ పక్క చర్చలు కొనసాగుతుండగానే 22 మంది పార్టీ సభ్యుల పేర్లను ప్రకటించడం తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మాయావతి తన పార్టీ కోసం 50 సీట్లను డిమాండ్ చేస్తుండగా కాంగ్రెస్ పార్టీ 30 సీట్లకు మించి ఇవ్వనని చెబుతోంది. ఈ నేపథ్యంలోనే మాయావతి జాబితాను విడుదల చేయడం చర్చనీయాంశం అయింది. రానున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చత్తీస్‌గఢ్‌లో మాయావతిని జట్టులో నుంచి పోనీయకుండా చూడాల్సిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పార్టీ అధ్యక్షురాలిగా సోనియా గాంధీ ఉండి ఉంటే అలా జరగనిచ్చే వారు కాదని, ఆమె కుమారుడైన రాహుల్ గాంధీకి అంత రాజకీయ పరిణతి లేకపోవడం వల్ల అలా జరిగిందని రాజకీయ విమర్శకులు చెబుతున్నారు. దీని ప్రభావం మధ్యప్రదేశ్ ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపదని, ఇరు పార్టీల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని, కచ్చితంగా ఆ రాష్ట్రంలో పొత్తు కుదురుతుందని కమల్‌నాథ్ లాంటి సీనియర్ నాయకులే విశ్వసిస్తున్నారు. అది నిజమే కావచ్చుకానీ వివిధ సామాజిక వర్గాల మద్దతును కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం పలు ప్రాంతీయ పార్టీల బలాలపై ఆధారపడాల్సిన అవసరం ఉంది. వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతోని కాంగ్రెస్ పార్టీకి పొత్తు కుదరకుండా ఆయా పార్టీలపై పాలకపక్ష బీజేపీ అన్ని రకాలుగా ఒత్తిళ్లు తెస్తున్న నేపథ్యంలో చత్తీస్‌గఢ్ పరిణామం కాంగ్రెస్‌కు ప్రతికూలమే. పాలకపక్ష బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకి ఒక్క శాతం మాత్రమే ఓట్లు తేడా ఉన్న చత్తీస్‌గఢ్‌లో తృతీయ ఫ్రంట్ రావడం అంటే పాలకపక్షం బీజేపీకీ మేలు చేయడమే. మూడవ పర్యాయం ముఖ్యమంత్రి రామన్ సింగ్‌కు మళ్లీ పట్టం కట్టడమే! -
మరో కొత్తపార్టీ వచ్చింది..
రాయపూర్: చత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ మాజీ నేత అజిత్ జోగి కొత్త పార్టీని ప్రకటించారు. దీనికి ‘చత్తీస్‌గఢ్ జనతా కాంగ్రెస్’గా నామకరణం చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఇటీవల రాజీనామా చేసిన అజిత్ జోగి కొత్త పార్టీని స్థాపించనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. పార్టీకి పేరు పెట్టడానికి అజిత్ జోగి మద్దతుదారుల నుంచి పలు పేర్లు ప్రతిపాదనకు వచ్చాయి. వీటిని పరిశీలించిన అనంతరం చత్తీస్‌గఢ్ జనతా కాంగ్రెస్ పేరును ఖరారు చేశారు. అజిత్ జోగి భార్య రేణు, ఆయన కొడుకు అమిత్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వీరితో పాటు మరో ఎమ్మెల్యే, మరికొందరు కాంగ్రెస్ నేతలు అజిత్ జోగికి మద్దతుగా నిలిచారు. -
'కొత్త పార్టీ పెడుతున్నా, పేరు సూచించండి'
రాయపూర్: ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి.. కాంగ్రెస్ పార్టీకి ఝలక్ ఇచ్చారు. హస్తం పార్టీతో తెగతెంపులు చేసుకుంటున్నట్టు అధికారికంగా వెల్లడించారు. తాను కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు ప్రకటించారు. తన పార్టీకి పేరు సూచించాలని ప్రజలను కోరారు. బిలాస్ పూర్ జిల్లా మార్వాహిలో సోమవారం ఆయన తన మద్దతుదారులతో బహిరంగ సభ నిర్వహించారు. వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. వారి సూచనల మేరకు కొత్త పార్టీ పెడుతున్నట్టు వెల్లడించారు. మార్వాహి బహిరంగ సభకు హాజరైతే క్రమశిక్షణ చర్యలు తప్పవని అజిత్ జోగి మద్దతుదారులను కాంగ్రెస్ హైకమాండ్ హెచ్చరించింది. రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అజిత్ జోగి వెళ్లిపోవడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, అజిత్ జోగి కొత్తపార్టీ పెట్టినా పెద్దగా ప్రయోజనం ఉండదని బీజేపీ వ్యాఖ్యానించింది. కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిందని, తమపై ఎటువంటి ప్రభావం పడదని ఛత్తీస్ గఢ్ సీఎం రమణ్ సింగ్ అన్నారు. -
కాంగ్రెస్ నుంచి అమిత్ జోగి బహిష్కరణ
న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత, ఛత్తీస్ గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ సింగ్ కుమారుడు అమిత్ జోగిపై బహిష్కరణ వేటు పడింది. ఎలక్షన్ టేప్ కాంట్రవర్సీ వ్యవహారంపై ఆయనను పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరిస్తూ కాంగ్రెస్ అధిష్టానం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. అమిత్ జోగి మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి కుమారుడు. కాగా 2014 సెప్టెంబర్ 13న అంటాగర్ అసెంబ్లీ స్ధానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ జత కట్టాయన్న వార్తల నేపథ్యంలో ఆయనకు కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ షోకాజ్ నోటీసు ఇచ్చింది. అమిత్ జోగి.. ప్రస్తుత ముఖ్యమంత్రి రమణ్ సింగ్‌తో భేటీ అయిన ఆడియో టేపులు విడుదల కావటంతో రాజకీయంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగిన మంటూరామ్ పవార్ పోటీ నుంచి తప్పుకోవటంతో కాంగ్రెస్ అధిష్టానం చర్యలకు దిగింది. కాంగ్రెస్ పోటీ నుంచి తప్పుకోవటానికి బేరసారాలు జరిగినట్లు ఆడియో టేపుల్లో స్పష్టమైంది. ఆ ఆడియో టేపులను ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రిక బయట పెట్టింది. దీంతో.. ఈ వ్యవహారం ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌లో సంచలనం సృష్టిస్తోంది. -
ఆ ఎన్నిక ‘ఫిక్స’యింది!
♦ ఛత్తీస్‌గఢ్‌లో టేపుల దుమారం ♦ అంతాగఢ్ ఉప ఎన్నికలో సీఎం అల్లుడు, అజిత్‌లపై ఆరోపణలు రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో గతేడాది అంతాగఢ్ (ఎస్టీ) అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక ఫిక్స్ అయిందని.. అందులో రాష్ట్ర సీఎం రమణ్‌సింగ్ అల్లుడు పునీత్‌గుప్తా, కాంగ్రెస్ నేత అజిత్‌జోగి, ఆయన కుమారుడు అమిత్‌ల పాత్ర ఉందని తాజాగా బయటపడిన ఆడియో టేపుతో వివాదం రాజుకుంది. అందులో పునీత్, అజిత్, అమిత్‌ల టెలిఫోన్ సంభాషణలు ఉన్నాయని ఆరోపణలు గుప్పుమన్నాయి. అంతాగఢ్‌కు కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మాజీ సీఎం అజిత్‌జోగి వర్గానికి చెందిన మంతురామ్ పవార్ ఆఖరి క్షణాల్లో పోటీ నుంచి తప్పుకున్నారు. కాంగ్రెస్ ఆయన్ను అప్పుడే పార్టీ నుంచి బహిష్కరించింది. అయితే.. పవార్ పోటీ నుంచి తప్పుకోవటంలో ఫిక్సింగ్ జరిగిందని, డబ్బులూ చేతులు మారాయని, దానికి సంబంధించి ఆయనతో పునీత్, అజిత్, అమిత్‌లతో పాటు అజిత్ అనుకూలురు పలువురు జరిపిన సంభాషణలు ఈ టేపులో ఉన్నాయని వివాదం చెలరేగింది. పీసీసీ చీఫ్ భూపేష్ బెఘేల్ అమిత్‌కు షోకాజ్ నోటీసు ఇచ్చి, వారంలో జవాబు ఇవ్వాలన్నారు. రమణ్‌సింగ్ అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని.. ఆయనను సీఎం పదవి నుంచి తొలగించి, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్‌తో విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఆరోపణలు నిరాధారమని, రమణ్‌సింగ్, అజిత్ అన్నారు. కాంగ్రెస్ అంతర్గత పోరుకు ఇది నిదర్శనమని బీజేపీ పేర్కొంది. టేపుల వ్యవహారంపై పార్టీ రాష్ట్ర విభాగం నుంచి నివేదిక వచ్చాక తీసుకోవాల్సిన చర్యలపై ఆలోచిస్తామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి బి.కె.హరిప్రసాద్ అన్నారు. -
ఆ తప్పు ఎందుకు చేశానని బాధపడుతున్న అజిత్ జోగీ
తను తీసుకున్న గోతిలో తానే పడటం అంటే ఏమిటో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం అజిత్ జోగీని చూస్తే తెలుస్తుంది. జోగీ బ్రహ్మాండమైన వ్యూహకర్త. ఊహకందని వ్యూహాలు వేయడం ఆయనకే చెల్లుతుంది. కానీ ఇప్పుడు అతి వ్యూహమే ఆయన ఎన్నకల వోటమికి కారణమైంది. ఛత్తీస్ గఢ్ మహాసముంద్ నుంచి పోటీచేసిన జోగీ, తన ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టేందుకు, ఆయన ఓట్లు చెల్లాచెదరు కావడానికి తన ప్రత్యర్థి పేరే ఉన్న పదిమందిని బరిలోకి దింపారు. బిజెపి అభ్యర్థి చందురామ్ సాహుకి పోటీగా పది మంది చందూరామ్ సాహూలను రంగంమీదకి రప్పించారు. దీనిపై బిజెపి ఫిర్యాదు కూడా దాఖలు చేసింది. అయితే ఈ ఎన్నికల్లో ఇంత చేసినా వెయ్యి ఓట్లతో జోగీ ఓడిపోయారు. ఇప్పుడు పది మంది చందూరామ్ ల ఓట్లు కూడా బిజెపి చందూరామ్ ఖాతాలో పడ్డాయన్నదే జోగీ గారికి అనుమానం. ఎన్నికల అధికారులు డమ్మీల ఓట్లన్నిటినీ బిజెపి చందూరామ్ లెక్కల్లో వేసేశారని ఆయన ఒక ఫిర్యాదు కూడా దాఖలు చేశారు. 'నేను రోజురోజంతా లీడింగ్ లో ఉన్నా, రాత్రయ్యే సరికి నేను వెయ్యి ఓట్లతో ఎలా ఓడిపోయాను' అని ఆయన ప్రశ్నించారు. ఆయన ఆరోపణల్లో నిజమెంతో తెలియదు కానీ 'ఇంతమంది సాహూలను దింపినందుకు కొంప మునిగింది' అని ఇప్పుడు జోగీ గారు బాధపడుతున్నారు. -
నేములోనేముంది?
జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలుతుంది. కానీ ఛత్తీస్ గఢ్ నేత అజిత్ జోగి తలచుకుంటే ఒకే పేరున్న క్యాండిడేట్ల వర్షం కురుస్తుంది. ఛత్తీస్ గఢ్ లోని మహాసముంద్ నుంచి లోకసభ ఎన్నికల బరిలో ఉన్న అజిత్ జోగి తన బిజెపి ప్రత్యర్థి చందూలాల్ సాహూని ఓడించేందుకు ఒకటి కాదు, ఇద్దరు కాదు ఏకంగా పది మంది సాహూలతో నామినేషన్ వేయించారు. వీరందరి పేరూ బిజెపి అభ్యర్థి పేరే! వీరిలో ఆరుగురు చందులాల్ సాహూలు. ఒకరు చందూరామ్ సాహూ.మిగతా వారందరి పేరులోనూ సాహూ ఉంది. కాబట్టి బిజెపి ఓటర్లు కన్ ఫ్యూజ్ అయిపోయి ఒక చందూరామ్ కి వేయాల్సిన ఓటు ఇంకో చందూరామ్ కి వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలాగోలా మహాసముంద్ ఎన్నికల సముద్రం ఈదేయచ్చునన్నదే జోగి గారి ప్లాన్. ఈ సాహూలందరినీ విత్ డ్రాచేయించాలని బిజెపి ఎంతో ప్రయత్నించింది. కానీ అందరూ అజ్ఞాతంలోకి వెళ్లడమే కాదు, వాళ్ల ఫోన్లు కూడా స్విచాఫ్ అయిపోయాయట. ఇప్పుడు మహాసముంద్ లో బిజెపి అభ్యర్థి బుర్ర స్విచాఫ్ అయిపోయింది. జోగితో పోరాడాలా లేక సాహూలతో పోరాడాలా అన్నది పాపం ఒరిజినల్ చందూలాల్ సాహూకి అర్థం కావడం లేదట. -
ఛత్తీస్‌గఢ్‌లో మందకొడిగా పోలింగ్
ఛత్తీస్‌గఢ్ శాసనసభకు నేడు జరుగుతున్న రెండవ లేక తుది దశ పోలింగ్‌లో ఈ రోజు మధ్యాహ్నం వరకు నాలుగు మిలియన్ల మందికిపైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఓటర్లు పోలింగ్ బూత్‌ల వద్ద బారులు తీరారగా, మరికొన్ని చోట్ల చాలా అత్యల్పంగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి కుమారుడు అమిత్ జోగి బరిలో నిలిచిన మర్వాహి నియోజకవర్గంలో దాదాపు 40 శాతం మందికి పైగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే మహాసంముంద్ జిల్లాలోని సరైపల్లి నియోజకవర్గంలో ఓట్లర్లు అత్యల్పంగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. రాష్ట్రంలో బిలాస్పూర్ నగరంలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ మినహా రాష్ట్రంలో ఎక్కడ ఎటువంటి చెదురుమదురు ఘటనలు చోటు చేసుకోలేదు. మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ఎన్నికల సంఘం పటిష్టమైన చర్యలు చేపట్టింది. అందులోభాగంగా దాదాపు 3 వేల పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. అలాగే ఎక్కడికక్కడ భద్రత దళాలను మోహరించింది. ఛత్తీస్‌గఢ్‌లో నగర, గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లు మధ్యాహ్నం నాటికి 13.9 మిలియన్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వారిలో 6.83 మంది మహిళలు ఉన్నారు. నేడు జరుగుతున్న రెండవ దశలో 72 శాసనసభ నియోజకవర్గాల్లో 843 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. అయితే నవంబర్ 11న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జరిగిన మొదటి దశ ఎన్నికలను ఎన్నికల సంఘం నిర్వహించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 8వ తేదీన అభ్యర్థులు భవితవ్యం తెలనుంది. -
ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌దే విజయం: అమిత్ జోగి
ఛత్తీస్‌గఢ్ : ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యమని కోట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న అమిత్ జోగి ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ 55-60 సీట్లు కైవసం చేసుకుంటుందని ఆయన జోస్యం చెప్పారు. పదేళ్ల బీజేపీ దుష్ప్రరిపాలనకు ఛత్తీస్‌గఢ్ ఓటర్లు ముగింపు పలుకుతారని కాంగ్రెస్ నేత ఛత్తీస్‌గఢ్ తొలి ముఖ్యమంత్రి అజిత్ జోగి ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ఛత్తీస్‌గఢ్‌లో రెండు, చివరి దశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎన్నికలు జరుగుతున్న 72 నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద సందడి వాతావరణం కనిపిస్తోంది. ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో మహిళలు, యువకులు క్యూ లైన్లలో కనిపిస్తున్నారు. ఇక అజిత్ జోగి, అమిత్ జోగి, ఆయన భార్య... కోటలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
మధ్యప్రదేశ్, ఛత్తీస్లలో బీజేపీకే పట్టం!
భోపాల్/ఛత్తీస్‌గఢ్: మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ మరింత బలపడింది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉన్న బీజేపీ, త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ తిరిగి అధికారంలోకి రాగలదని, ఈసారి మరిన్ని స్థానాలను అదనంగా చేజిక్కించుకోగలదని సీఎన్ఎన్-ఐబీఎన్, ది వీక్ సర్వే వెల్లడించింది. అక్టోబర్ 13-20 తేదీల్లో నిర్వహించిన ఈ సర్వేలో తిరిగి బీజేపీకే పట్టం కట్టాలనుకుంటున్నట్లు రెండు రాష్ట్రాల ఓటర్లూ చెప్పారు. రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌కు శృంగభంగం తప్పదని, ఈ ఎన్నికల్లో ఆ పార్టీ మరింత బలహీనపడుతుందని సీఎన్ఎన్-ఐబీఎన్, ది వీక్ సర్వే ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు ప్రస్తుతం బీజేపీకి 50 స్థానాలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకి 61-71 స్థానాలు లభించే అవకాశాలు ఉండగా, 38 స్థానాలున్న కాంగ్రెస్, ఈసారి 16-24 స్థానాలతోనే సరిపుచ్చుకోవాల్సి వస్తుందని ఈ సర్వే తేల్చి చెబుతోంది. ఓటర్లలో ప్రభుత్వ సానుకూలత మధ్యప్రదేశ్, ఛత్తీస్ ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, రమణ్ సింగ్‌లకు ఈ ఎన్నికల్లో కలసి వచ్చే అంశం. ఛత్తీస్‌గఢ్ ఓటర్లలో 47 శాతం మంది ప్రభుత్వానికి మరో అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. రమణ్‌సింగ్ మళ్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని 69 శాతం ఓటర్లు కోరుకుంటున్నారు. ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ నేత అజిత్ జోగీకి కేవలం 18 శాతం ఓటర్లు మాత్రమే మద్దతు పలుకుతున్నారు. ఒకవైపు ఓటర్లలో ప్రజాదరణ లేకపోగా, మరోవైపు పార్టీలోని ముఠా కుమ్ములాటలు కాంగ్రెస్‌కు సమస్యగా మారాయి. అవినీతి విషయంలో కాంగ్రెస్, బీజేపీలు దొందూ దొందేనని ఓటర్లు అభిప్రాయపడుతున్నా, రెండు రాష్ట్రాల్లోనూ నక్సల్స్ సమస్యను ఎదుర్కోవడంలో బీజేపీ మెరుగ్గా ఉందని చెబుతున్నారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ఆహార భద్రత చట్టం ఫలితంగా రాష్ట్రంలోని మొత్తం జనాభాలో 80 శాతం మంది, బీపీఎల్ వర్గాల్లో 93 శాతం మంది లబ్ధి పొందుతున్నట్లు చెబుతున్నారు. మధ్యప్రదేశ్‌లో సైతం గడచిన ఐదేళ్లలో బీజేపీ మరింతగా బలం పుంజుకుంది. రాష్ట్రంలోని 230 స్థానాల్లో బీజేపీకి 148-160 స్థానాలు లభించే అవకాశాలు ఉండ గా, కాంగ్రెస్‌కు 52-62 స్థానాలు మాత్రమే దక్కే అవకాశాలు ఉన్నాయి. శివరాజ్‌సింగ్ చౌహాన్ పనితీరుపై 78 శాతం మంది ఓటర్లు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.