'కొత్త పార్టీ పెడుతున్నా, పేరు సూచించండి'
రాయపూర్: ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి.. కాంగ్రెస్ పార్టీకి ఝలక్ ఇచ్చారు. హస్తం పార్టీతో తెగతెంపులు చేసుకుంటున్నట్టు అధికారికంగా వెల్లడించారు. తాను కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు ప్రకటించారు. తన పార్టీకి పేరు సూచించాలని ప్రజలను కోరారు. బిలాస్ పూర్ జిల్లా మార్వాహిలో సోమవారం ఆయన తన మద్దతుదారులతో బహిరంగ సభ నిర్వహించారు. వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. వారి సూచనల మేరకు కొత్త పార్టీ పెడుతున్నట్టు వెల్లడించారు.
మార్వాహి బహిరంగ సభకు హాజరైతే క్రమశిక్షణ చర్యలు తప్పవని అజిత్ జోగి మద్దతుదారులను కాంగ్రెస్ హైకమాండ్ హెచ్చరించింది. రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అజిత్ జోగి వెళ్లిపోవడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, అజిత్ జోగి కొత్తపార్టీ పెట్టినా పెద్దగా ప్రయోజనం ఉండదని బీజేపీ వ్యాఖ్యానించింది. కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిందని, తమపై ఎటువంటి ప్రభావం పడదని ఛత్తీస్ గఢ్ సీఎం రమణ్ సింగ్ అన్నారు.