భోపాల్/ఛత్తీస్‌గఢ్: మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ మరింత బలపడింది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉన్న బీజేపీ, త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ తిరిగి అధికారంలోకి రాగలదని, ఈసారి మరిన్ని స్థానాలను అదనంగా చేజిక్కించుకోగలదని సీఎన్‌ఎన్-ఐబీఎన్, ది వీక్ సర్వే వెల్లడించింది. అక్టోబర్ 13-20 తేదీల్లో నిర్వహించిన ఈ సర్వేలో తిరిగి బీజేపీకే పట్టం కట్టాలనుకుంటున్నట్లు రెండు రాష్ట్రాల ఓటర్లూ చెప్పారు. రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌కు శృంగభంగం తప్పదని, ఈ ఎన్నికల్లో ఆ పార్టీ మరింత బలహీనపడుతుందని సీఎన్‌ఎన్-ఐబీఎన్, ది వీక్ సర్వే ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.
ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు ప్రస్తుతం బీజేపీకి 50 స్థానాలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకి 61-71 స్థానాలు లభించే అవకాశాలు ఉండగా, 38 స్థానాలున్న కాంగ్రెస్, ఈసారి 16-24 స్థానాలతోనే సరిపుచ్చుకోవాల్సి వస్తుందని ఈ సర్వే తేల్చి చెబుతోంది. ఓటర్లలో ప్రభుత్వ సానుకూలత మధ్యప్రదేశ్, ఛత్తీస్ ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, రమణ్ సింగ్‌లకు ఈ ఎన్నికల్లో కలసి వచ్చే అంశం. ఛత్తీస్‌గఢ్ ఓటర్లలో 47 శాతం మంది ప్రభుత్వానికి మరో అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. రమణ్‌సింగ్ మళ్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టాలని 69 శాతం ఓటర్లు కోరుకుంటున్నారు. ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ నేత అజిత్ జోగీకి కేవలం 18 శాతం ఓటర్లు మాత్రమే మద్దతు పలుకుతున్నారు. ఒకవైపు ఓటర్లలో ప్రజాదరణ లేకపోగా, మరోవైపు పార్టీలోని ముఠా కుమ్ములాటలు కాంగ్రెస్‌కు సమస్యగా మారాయి.
అవినీతి విషయంలో కాంగ్రెస్, బీజేపీలు దొందూ దొందేనని ఓటర్లు అభిప్రాయపడుతున్నా, రెండు రాష్ట్రాల్లోనూ నక్సల్స్ సమస్యను ఎదుర్కోవడంలో బీజేపీ మెరుగ్గా ఉందని చెబుతున్నారు. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం అమలులోకి తెచ్చిన ఆహార భద్రత చట్టం ఫలితంగా రాష్ట్రంలోని మొత్తం జనాభాలో 80 శాతం మంది, బీపీఎల్ వర్గాల్లో 93 శాతం మంది లబ్ధి పొందుతున్నట్లు చెబుతున్నారు. మధ్యప్రదేశ్‌లో సైతం గడచిన ఐదేళ్లలో బీజేపీ మరింతగా బలం పుంజుకుంది. రాష్ట్రంలోని 230 స్థానాల్లో బీజేపీకి 148-160 స్థానాలు లభించే అవకాశాలు ఉండ గా, కాంగ్రెస్‌కు 52-62 స్థానాలు మాత్రమే దక్కే అవకాశాలు ఉన్నాయి. శివరాజ్‌సింగ్ చౌహాన్ పనితీరుపై 78 శాతం మంది ఓటర్లు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌లలో బీజేపీకే పట్టం!
Published Tue, Oct 29 2013 5:01 AM | Last Updated on Sat, Sep 2 2017 12:04 AM
Advertisement