రాజకీయాల్లో జంటిల్‌మ్యాన్ అనే ఘనత సాధించిన కొద్ది మంది నేతల్లో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ఒకరు. నెమ్మదస్తుడు, నిజాయితీపరుడు, ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉంటారు. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న రాష్ట్రంలో సవాళ్లన్నీ ఎదుర్కొంటూ నేర్పుగా పాలన చేయగలరని పేరు తెచ్చుకున్నారు. పదిహేనేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న రమణ్ సింగ్‌కు స్వయంకృషితో పాటు అదృష్టం కూడా కలిసి వస్తోంది. ఈ సారి కూడా కాంగ్రెస్‌కు గుడ్‌బై కొట్టేసి సొంత కుంపటి పెట్టుకున్న అజిత్ జోగి రూపంలో రమణ్ సింగ్‌కు కలిసివస్తుందనే అంచనాలైతే ఉన్నాయి.
మరో పక్క ప్రతిపక్ష కాంగ్రెస్‌లో రమణ్ సింగ్‌కు పోటీగా సరైన నాయకుడు కనిపించడంలేదు. ఎవర్ని సీఎం అభ్యర్ధిగా ప్రకటిస్తే ఎవరు అలుగుతారో తెలీక అసలు సీఎం అభ్యర్ధి పేరే ప్రకటించకుండానే కాంగ్రెస్ కదనంలోకి దూకింది. అంతర్గత కలహాలను కప్పిపుచ్చుతూ సీతా స్వయంవరంలాగా ఎన్నికల అనంతరం తమ పార్టీలో సీఎం అభ్యర్ధి ఎన్నిక జరుగుతుందని చత్తీస్‌గఢ్ ప్రతిపక్షనేత టీఎస్ సింగ్‌దేవ్ గంభీరంగా వ్యాఖ్యానిస్తున్నారు. పలు సర్వేల్లో రమణ్‌సింగ్‌కు పోటీగా ఎవరూ దరిదాపుల్లో కనిపించడంలేదు. దీంతో కేవలం రమణ్ సుదీర్ఘ పాలనపై అసంతృప్తే తమకు కలిసిరావచ్చని ప్రత్యర్ధి పార్టీల్లో ఆశావహులు భావిస్తున్నారు.
వ్యతిరేకతా.. క్లీన్ ఇమేజా ?
ప్రజా పంపిణీ వ్యవస్థలో సంస్కరణల ద్వారా చావల్ బాబా అన్న పేరు సంపాదించుకున్న రమణ్ సింగ్‌ను గత ఎన్నికల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే అందలం ఎక్కించాయి. కానీ ఈ సారి ఆ పరిస్థితి కాస్త తిరగబడ్డట్లుంది. అయిదేళ్లలో పట్టణ ప్రాంతాల్లో పట్టు బిగించిన రమణ్ సింగ్, గ్రామీణ ప్రాంతాలను నిర్లక్ష్యం చేశారు. చావల్ బాబాగా పేరున్న ఆయన రైతు సమస్యల్ని పట్టించుకోలేదు. దీంతో అన్నదాతలు రమణ్ సింగ్ సర్కార్‌పై ఆక్రోశంతో ఉన్నారు.
ఏ ప్రజాపంపిణీ వ్యవస్థనైతే బలోపేతం చేశారో, అదే వ్యవస్థలో మిల్లర్లతో కుమ్మక్కై నకిలీ బియ్యం పంపిణీకి పరోక్షంగా సహకరించారన్న అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీంతో ప్రత్యర్ధులందరూ ఈ వ్యతిరేకతపైనే నమ్మకంతో ఉన్నారు. ఈ దఫా ప్రభుత్వ వ్యతిరేకత పెల్లుబికి రమణ్‌ను గద్దె దింపడం ఖాయమని ఆశిస్తున్నారు. కానీ కోర్టుల్లో రమణ్ క్లీన్ ఇమేజ్ పొందారు. దీంతో జనంలో నిజాయితీపరుడని ఆయనకున్న పేరు చెక్కుచెదరినట్లు కనిపించడం లేదు. ఇప్పటికీ 41శాతం మంది ప్రజలు రమణ్ సింగే సీఎం కావాలనే కోరుకుంటున్నారని వివిధ సర్వేల్లో తేలింది. తర్వాత స్థానాల్లో అజిత్ జోగీ, సింగ్ దేవ్, భూపేష్ తదితరులున్నారు.
అజిత్ ఆశ తీరేనా?
కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా మూడేళ్ల పాటు పనిచేసిన అజిత్ జోగి ప్రజల్లో రమణ్ సింగతర్వాత అంతటి ఛరిష్మా ఉన్న నాయకుడు. ఐఏఎస్ నుంచి సీఎంగా ఎదిగిన జోగీ రాజకీయ వ్యూహరచనలో దిట్ట. రెండేళ్ల క్రితం కాంగ్రెస్‌ను వీడి జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ (జేసీసీ) పేరుతో పార్టీ పెట్టిన ఆయన వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. గిరిజనులు, సత్నామీ ఎస్సీల్లో పట్టున్న నాయకుడు. రాష్ట్ర జనాభాలో 12% ఎస్సీలైతే వారిలో సత్నామీలు 75%వరకు ఉన్నారు.
ఎస్సీ నియోజకవర్గాల్లో పట్టున్న బీఎస్పీతో జతకట్టడం, సీపీఐని కూడా తమ గూటికి లాగేసి ఒక కూటమిగా ఏర్పడడంతో కాంగ్రెస్, బీజేపీ ఓట్లను జోగి భారీగా చీలుస్తారనే అంచనాలు ఉన్నాయి. ఈ దఫా జోగి మార్వాహి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అనారోగ్య సమస్యలు వేధిస్తున్నా ఆయన తన పార్టీని ఉత్సాహంగా నడిపిస్తున్నారు. గత ఏడాదిలో బస్తర్ నుంచి సర్గూజా వరకు దాదాపు 300 బహిరంగ సభల్లో ప్రసంగించారు. బూత్ స్థాయిలో 10 లక్షల మంది కార్యకర్తల్ని నియమించారు. ఎక్కడికక్కడ రమణ్‌సింగ్ సర్కార్ వైఫల్యాలను ఎత్తిచూపిస్తున్నారు.
కాంగ్రెస్‌లో నాయకత్వ లేమి
ఛత్తీస్‌గఢ్‌లో సీఎం అభ్యర్థిని ప్రకటించే సాహసం కాంగ్రెస్ అధిష్టానం చేయలేకపోయింది. 2013లో జరిగిన మావోయిస్టు దాడిలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఎందరినో కోల్పోయింది. అనంతరం జోగి పార్టీని వీడాక కాంగ్రెస్ జాతీయ నాయకత్వమే భారం మోయాల్సి వచ్చింది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భూపేష్ భాఘేల్, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు టిఎస్ సింగ్‌దేవ్ రేసులో ఉన్నప్పటికీ వారిలో ఎవరికీ రమణ్ సింగ్‌కు ఉన్నంత జనాదరణ లేదు.
మరో ఇద్దరు సీనియర్ నేతలు చరణ్ దాస్ మహంత్, తామ్రధావజ్ సాహులు కూడా సీఎం పీఠంపై కన్నేశారు. కాంగ్రెస్ నిర్వహించిన అంతర్గత సర్వేల్లో 24% మంది సింగ్‌దేవ్ సీఎం అభ్యర్థి కావాలని కోరుకుంటే, 20% మంది భూపేష్ భాగల్ వైపు మొగ్గు చూపించారు. టీఎస్ సింగ్ దేవ్ రాష్ట్రంలో ప్రజాప్రతినిధులందరిలోకి ధనవంతుడు.
రమణ్ సింగ్ అనుకూలం
♦ పరిపాలనాదక్షత, నిజాయితీ
♦ వ్యాపారుల అండదండలు
♦ మావోయిస్టుల ప్రాబల్యం ఉన్నా ఆగని అభివృద్ధి కార్యక్రమాలు
ప్రతికూలం
♦ 15ఏళ్లుగా అధికారంలో ఉండడంతో ప్రభుత్వ వ్యతిరేకత
♦ అధికారుల చేతుల్లో కీలుబొమ్మ అన్న పేరు
♦ రైతులు, గిరిజనుల్లో అసంతృప్తి
అజిత్ ప్రమోద్ కుమార్ జోగి అనుకూలం
♦ రాష్ట్ర రాజకీయాలు, పాలనపై పూర్తి అవగాహన
♦ గిరిజనులు, సత్నామీ ఎస్సీల్లో పట్టు
♦ బీఎస్‌పీతో పొత్తు
ప్రతికూలం
♦ కుటుంబ సభ్యులు వివిధ పార్టీల్లో కొనసాగడం
♦ గత వైఫల్యాలు, కుంభకోణాల ఇమేజ్ పూర్తిగా చెరిగిపోకపోవడం
కాంగ్రెస్ అభ్యర్ధులు అనుకూలం
♦ బీఎస్‌పీ, అజిత్ పొత్తుతో బీజేపీ ఓట్‌బ్యాంక్‌కు గండిపడుతుందన్న అంచనాలు
♦ ప్రభుత్వ వ్యతిరేకత
ప్రతికూలం
♦ బలమైన ఇమేజ్ లేకపోవడం
♦ అంతర్గత కుమ్ములాటలు
అక్కడ అన్నీ సాధ్యమే!
మధ్యప్రదేశ్ అసెంబ్లీ పలు ప్రయోగాలకు వేదిక. 1998–2003లో అన్నుపూర్‌లోని సోహాగ్‌పూర్ నియోజకవర్గం నుంచి ట్రాన్స్‌జెండర్ శబ్నం మౌసీ తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. శబ్నం స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. అంతేకాదు.. దేశంలో తొలి ట్రాన్స్‌జెండర్ మేయర్ కూడా మధ్యప్రదేశ్ లోనే ఎన్నికయ్యారు. 1999లో కత్నీ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్‌గా కమలా జాన్ విజయం సాధించారు.
1977లో పార్లమెంటుకు ఓ అంధుడైన నేతను పంపించిన ఘనత కూడా మధ్యప్రదేశ్‌కే దక్కుతుంది. యమునా ప్రసాద్ శాస్త్రి రేవా నియోజవర్గం నుంచి 1977 నుంచి 1989 వరకు రెండుసార్లు ఎంపీగా ఉన్నారు. 1955లో గోవా ముక్తి పోరాటంలో పోర్చుగీసు పోలీసుల చిత్రహింసలతో ఆయన తన రెండుకళ్లూ పోయాయి. ఈ దఫా అదృష్టాన్ని పరీక్షించుకోవాలని బధిర అభ్యర్థి సుదీప్ శుక్లా భావిస్తున్నారు.
మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేల్లో 70% కోటీశ్వరులే!
ప్రస్తుతం మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేల్లో 70% మంది కోటీశ్వరులే. 2008 ఎన్నికల అప్పుడు 40% మాత్రమే ఉన్న ధనిక ఎంఎల్‌ఏల సంఖ్య ఐదేళ్లలోనే మరింత పెరిగింది. 2013లో ఎన్నికల సంఘానికి నివేదించిన అఫిడవిట్ ప్రకారం మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేల సగటు ఆస్తులు రూ.5.24కోట్లు. మొత్తం 230 మంది ఎమ్మెల్యేల్లో 161 మంది కోటీశ్వరులు. ఈ జాబితాలోనూ బీజేపీ ఎమ్మెల్యేలే ఎక్కువగా ఉన్నారు.
ఎమ్మెల్యే సంజయ్ పాఠక్ ఈ జాబితాలో తొలిస్థానంలో ఉన్నారు. ఎన్నికల సంఘానికి పేర్కొన్న లెక్కల ప్రకారం ఆయన ఆస్తులు రూ.121 కోట్లు. 2012–13 ఆర్థిక సంవత్సరంలో ఆయన ఆస్తులు రూ.8.94 కోట్లు మాత్రమే. మరో బీజేపీ ఎమ్మెల్యే చేతన్ కశ్యప్‌కు రూ.120.39 కోట్లు, సంజయ్ శర్మ అనే మరో కమలం పార్టీ ఎంపీకి రూ.65.42 కోట్ల ఆస్తులున్నాయి. మొత్తం 161 మందిలో 118 మంది బీజేపీ ఎమ్మేల్యేలు ఉన్నారు. 2013 ఎన్నికలకు ముందు ఈ జాబితాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 69%, బీఎస్పీ శాసనసభ్యులు 25% ఉన్నారు.
14 ముస్లిం స్థానాలపై కాంగ్రెస్ దృష్టి
రాజస్తాన్‌లో 2013 అసెంబ్లీ ఎన్నికలో చావుదెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీ.. ఈసారి ఏ అవకాశాన్నీ వదులుకోకుండా అనేక ప్రయత్నాలూ చేస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తీవ్రంగా నష్టం చేసిన 14 ముస్లిం ప్రభావిత నియోజకవర్గాల్లో ఈసారి ఓట్లు చీలకుండా జాగ్రత్తపడుతోంది. గత ఎన్నికల్లో చిన్నాచితకా ముస్లిం పార్టీల కారణంగా ఓట్లు చీలడంతో.. ఈసారి ఆ ప్రమాదం జరగకుండా జాగ్రత్తపడుతోంది.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ రెబల్స్, ముస్లిం సంఘాల నేతలకు బీజేపీ అన్నివిధాలుగా సహాయపడిందని.. అందుకే ఈ స్థానాల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని ప్రచారం చేస్తోంది. డిసెంబర్ 7న జరిగే ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ముందుగానే కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించి అసమ్మతినేతలను బుజ్జగించే పనిలో ఉంది. ఎలాగైనా 14 స్థానాల్లో గెలుపొందాలని గట్టి యత్నాలు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment