Chhattisgarh Election 2018
-
నా వల్లే బీజేపీ చిత్తుచిత్తుగా ఓడింది!
సాక్షి, విశాఖపట్నం: ‘నా వల్లే ఆ మూడు రాష్ట్రాల్లో(రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్) బీజేపీ చిత్తుచిత్తుగా ఓడింది. ఆ మూడు చోట్ల కాంగ్రెస్ విజయం వెనుక తెలుగుదేశం పార్టీ కృషి ఎంతో ఉంది..’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. బీజేపీని ఇంటికి పంపేవరకూ నిద్రపోనని చెప్పారు. గురువారం విశాఖ పర్యటనలో భాగంగా కాపులుప్పాడ వద్ద ఏర్పాటు చేయనున్న ఐ–హబ్‌తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేశారు. సాయంత్రం తగరపువలస జూట్‌మిల్ గ్రౌండ్స్‌లో జరిగిన సభలో సీఎం ప్రసంగించారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారన్నారు. వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టించారని.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. మోదీ నుంచి దేశాన్ని కాపాడాలన్న సంకల్పంతోనే బీజేపీయేతర పార్టీలను ఏకం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. పార్టీని బతికించుకునేందుకు కాంగ్రెస్‌తో ముందుకెళ్తే తప్పా! తెలంగాణ ఎన్నికల్లో నా వల్లే ఏదో జరిగిపోయిందంటూ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. తెలంగాణలోనే తెలుగుదేశం పార్టీ పుట్టిందన్నారు. అక్కడ పార్టీ కోసం 35 ఏళ్ల పాటు పోరాడిన కాంగ్రెస్‌తో కలిసి ముందుకెళ్లామని.. అందులో తప్పేముందని ప్రశ్నించారు. ‘టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా టీడీపీ నుంచే రాజకీయాల్లోకి వచ్చారు. మీరు కూడా మోదీపై పోరాడుతున్నారు. ఇద్దరూ కలిసి ముందుకెళ్దామంటే ఆయన ఒప్పుకోలేదు. పార్టీని బతికించుకునేందుకు కాంగ్రెస్‌తో కూడా వెళ్లడానికి వీల్లేదని అడ్డుజెప్పారు. నేను అక్కడ పని చేయడం తప్పయినట్టు.. నాకేదో రిటర్న్ గిఫ్ట్ తిరిగి ఇస్తానంటున్నాడు. ఇది న్యాయమా?..’ అని చంద్రబాబు ప్రశ్నించారు. తానెవరికీ భయపడనన్నారు. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసి రాష్ట్రానికి కేంద్రం రూ.75 వేల కోట్లివ్వాలన్న పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని విమర్శించారు. మోదీని ఎలా బతిమిలాడానో అందరూ చూశారు.. మోదీ కంటే తనకు ఎంతో అనుభవముందని.. కానీ ఆయన అమరావతి శంకుస్థాపనకు వచ్చినప్పుడు ‘సార్.. సార్..’ అంటూ ఎలా బతిమలాడానో అందరూ చూశారని చంద్రబాబు గుర్తుచేశారు. అయినా రాజధానికి నిధులు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదని మండిపడ్డారు. ‘మెడ్‌టెక్’తో విశాఖకు విశ్వఖ్యాతి సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్(ఏఎంటీజెడ్) ఏర్పాటుతో విశాఖపట్నానికి ప్రపంచ ఖ్యాతి లభిస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలోని పెదగంట్యాడ వద్ద ఏర్పాటైన ఏపీ మెడ్‌టెక్ జోన్‌ను గురువారం ఆయన జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన నాలుగో గ్లోబల్ ఫోరం సదస్సులో ఆయన మాట్లాడారు. వైద్య పరికరాల తయారీలో అగ్రదేశాలతో సమాన స్థాయికి ఆంధ్రప్రదేశ్ చేరిందన్నారు. దేశంలోనే తొలి వైద్య పరికరాల తయారీ కేంద్రం ఇదేనన్నారు. ప్రపంచవ్యాప్తంగా 240 కంపెనీలు ఇక్కడ తమ ఉత్పత్తులను తయారు చేస్తాయన్నారు. -
రాహుల్‌పై ఛత్తీస్ సీఎం ఎంపిక బాధ్యత
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌కు కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేసే బాధ్యతను ఆ పార్టీ ఎమ్మెల్యేలు తమ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి అప్పగించారు. బుధవారం కాంగ్రెస్ కేంద్ర కమిటీ పరిశీలకుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో జరిగిన సీఎల్పీ భేటీలో ఈ మేరకు ఏకగ్రీవంగా ఎమ్మెల్యేలు నిర్ణయం తీసుకున్నారు. తమ పార్టీలో ఉన్న అంతర్గత ప్రజాస్వామ్యానికి విలువనిచ్చి ప్రతీ ఎమ్మెల్యే అభిప్రాయాన్నీ సేకరిస్తున్నామని ఖర్గే చెప్పారు. అయితే సీఎం ఎంపిక బాధ్యతను ఎమ్మెల్యేలు రాహుల్‌కే అప్పగించినందున ఆయనే తుది నిర్ణయం తీసుకుంటారన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ 15 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ చీఫ్ భూపేశ్ భాఘేల్తోపాటు మరో సీనియర్ నేత టీఎస్ సింగ్ దేవ్‌లు సీఎం రేసులో ముందున్నారు. ఛత్తీస్‌లో 90 సీట్లకుగాను కాంగ్రెస్ 68, బీజేపీ 15, జేసీసీ 5, బీఎస్పీ 2 స్థానాలు గెలిచాయి. -
సీఎం ఎవరు?
ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ 15 ఏళ్ల తరువాత అధికారం దక్కించుకోవడంతో ఇప్పుడు అందరి దృష్టి సీఎం అభ్యర్థి ఎవరనే దానిపైనే ఉంది. ఛత్తీస్‌గఢ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భూపేశ్ బాగెల్ సీఎం అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మరో ముగ్గురు కూడా పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. పటన్ స్థానం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికైన భూపేష్ బాగెల్.. 1980లలో యువజన కాంగ్రెస్ సభ్యునిగా రాజకీయాల్లోకి వచ్చారు. దిగ్విజయ్ సింగ్ ప్రభుత్వం (ఉమ్మడి మధ్యప్రదేశ్)లో మంత్రిగా పనిచేశారు. ఎంపీ నుంచి ఛత్తీస్‌గఢ్ విడిపోయిన తర్వాత ఏర్పడిన అజిత్ జోగి ప్రభుత్వంలో మంత్రిగా విధులు నిర్వర్తించారు. 2013లో మహేంద్రకర్మ అనే మాజీ మంత్రిని హత్య చేసేందుకు మావోయిస్టులు జరిపిన దాడిలో (ఇందులో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది) ప్రాణాలతో బయటపడిన భూపేశ్.. ఆ తరువాత పార్టీ నిర్మాణంలో తనదైన పాత్ర పోషించడం ద్వారా మంచి పేరు సంపాదించుకున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షనేతగా పనిచేసిన టీఎస్ సింగ్‌దేవ్ కూడా సీఎం రేసులో ఉన్నారు. ఈయన కాంగ్రెస్ పార్టీ ధనిక అభ్యర్థుల్లో ఒకరు. సీతాస్వయంవరం తరహాలో సీఎం ఎంపిక జరగాలనేది ఈయన అభిప్రాయం. ఆ స్వయంవరంలో పాల్గొని పదవిని వరించాలని తహతహలాడుతున్నారు. లౌక్యమున్న నేతగా పేరున్న సింగ్‌దేవ్ అంబికాపూర్ నుంచి గెలుపొందారు. ఓబీసీ నేత తమ్రద్వాజ్ సాహూ కూడా బాగెల్, సింగ్‌దేవ్‌లకు పోటీనిస్తున్నారు. కుల సమీకరణల నేపథ్యంలో.. సాహూకు అవకాశం వస్తే రావచ్చు. ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రయోజనం పొందవచ్చేనేది కాంగ్రెస్ ఆలోచన. సీఎం రేసులో ఉన్న నాలుగో వ్యక్తి శక్తి నియోజకవర్గం నుంచి గెలుపొందిన చరణ్ దాస్ మహంత్. ఈయన దిగ్విజయ్ సింగ్ మంత్రివర్గంలో మంత్రిగా, కేంద్రంలో మన్మోహన్ సింగ్ కేబినెట్లో సహాయ మంత్రిగా పని చేశారు. -
‘సెమీఫైనల్స్’ హీరో ఎవరు?
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సెమీఫైనల్స్ ముగిశాయి. అసలు ఫలితాలు 11వ తేదీన వెల్లడి కానున్నాయి. అయితే, శుక్రవారం తెలంగాణ, రాజస్తాన్‌ల్లో పోలింగ్ ముగియగానే.. అన్ని వార్తాచానెళ్లలో ఐదు రాష్ట్రాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ సందడి మొదలైంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్తాన్, చత్తీస్‌గఢ్, మిజోరంలలో అధికార పీఠాన్ని అధిరోహించేదెవరో అంచనా వేస్తూ ఫలితాలను పలు చానెళ్లు ప్రకటించేశాయి. ఇప్పటివరకు ఆ 5 రాష్ట్రాల్లో మూడు రాష్ట్రాల్లో (రాజస్తాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్) బీజేపీ అధికారంలో ఉండగా, తెలంగాణలో ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్, మిజోరంలో కాంగ్రెస్ పవర్లో ఉన్నాయి. తాజా ఎన్నికల్లో బీజేపీ నుంచి రాజస్తాన్ కాంగ్రెస్ చేతికి రానుందని, అలాగే, మిజోరం కాంగ్రెస్ చేజారనుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్కే తెలంగాణ ప్రజలు పట్టం కట్టనున్నారని పేర్కొన్నాయి. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌ల్లో మాత్రం పోటా పోటీ పోరు నెలకొందని, బీజేపీ, కాంగ్రెస్‌లు అటూ ఇటుగా దాదాపు సమ స్థానాలు గెలుచుకోవచ్చని మెజారిటీ సర్వేలు తేల్చాయి. కొన్ని మాత్రం మళ్లీ అధికారం బీజేపీదేనన్నాయి. మధ్యప్రదేశ్‌లో శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీకి మెజారిటీ స్థానాలు వస్తాయని టైమ్స్‌నౌ– సీఎన్ఎక్స్ పేర్కొంది. మొత్తం 230 స్థానాల్లో బీజేపీకి 126 సీట్లు, కాంగ్రెస్‌కు 89 సీట్లు వస్తాయని అంచనా వేసింది. మిగతావి ఇతరుల ఖాతాల్లోకి వెళ్తాయంది. ఏబీపీ న్యూస్ ఎగ్జిట్ పోల్ మాత్రం మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు 126, బీజేపీకి 94 సీట్లు వస్తాయంది. 90 సీట్లున్న ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీలో రమణ్ సింగ్ నేతృత్వంలోని బీజేపీకి 46 స్థానాల సింపుల్ మెజారిటీ వస్తుందని టైమ్స్ నౌ– సీఎన్ఎక్స్ తేల్చగా, కాంగ్రెస్ 55–65 సీట్లు గెలుస్తుందని ఇండియాటుడే– యాక్సిస్ అంచనా వేసింది. బీజేపీ 35–43 సీట్లు వస్తాయని మరో సంస్థ రిపబ్లిక్ – సీఓటర్ తేల్చింది. ఈ రాష్ట్రంలో ప్రధాన పక్షాలైన కాంగ్రెస్, బీజేపీలు దాదాపు సమ సంఖ్యలో సీట్లు గెలుచుకోవచ్చని, ఏ పార్టీకీ మెజారిటీ రాని పక్షంలో అజిత్‌జోగి నేతృత్వంలోని జనతా కాంగ్రెస్ ఛత్తీస్ గఢ్(జోగి)– మాయావతి పార్టీ బీఎస్పీల కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించే అవకాశముందని మెజారిటీ సర్వేలు పేర్కొన్నాయి. రాజస్తాన్‌లో కాంగ్రెస్‌దే సునాయాస విజయమని మెజారిటీ సర్వేలు తేల్చాయి. 199 స్థానాల్లో కాంగ్రెస్‌కు 119–141 వస్తా యని ఇండియాటుడే– యా క్సిస్ అంచనా. ఎడారి రాష్ట్రం ‘హస్త’గతం దాదాపు అందరూ అనుకున్నట్లుగానే రాజస్తాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని ఎగ్జిట్‌పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. అసెంబ్లీలో 200 స్థానాలుండగా ప్రభుత్వం ఏర్పాటుకు 100 మంది బలం అవసరం. ఎన్నికలు జరిగిన 199 స్థానాల్లో కాంగ్రెస్‌కు 100 సీట్లకుపైగానే వస్తాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత కాంగ్రెస్‌కు లాభదాయకమవుతుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యమంత్రి వసుంధర ప్రజా యాత్రలు, ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్‌షాల పర్యటనలు ఓటర్లపై అంతగా ప్రభావం చూపలేదని విశ్లేషకులు అంటున్నారు. అభ్యర్థుల ఎంపికలో అమిత్‌షా, వసుంధరల మధ్య విభేదాలు, ఎన్నికల తరుణంలో బీజేపీ నేతలు పలువురు ఆ పార్టీని వదిలి రావడం వంటికి కాంగ్రెస్‌కు లాభించే అంశాలని చెబుతున్నారు. ముఖ్యంగా ‘రాజమాత’ వసుంధర, ఆమె మంత్రులు తమకు అందుబాటులో లేరన్న భావం ఓటర్లలో బలంగా నాటుకుందని, అందుకే ఇష్టం లేకున్నా కాంగ్రెస్‌కు పట్టం కట్టడానికి సిద్ధపడ్డారని ఎన్నికల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇండియా టుడే– యాక్సిస్ మై ఇండియా, టైమ్స్ నౌ– సీఎన్ఎక్స్, సీ ఓటర్–రిపబ్లిక్ టీవీ, ఇండియా టీవీ, న్యూస్ నేషన్, న్యూస్24–పేస్ మీడియా, న్యూస్ ఎక్స్ నేత ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్‌దే అధికారమని తేల్చి చెప్పగా... రిపబ్లిక్ టీవీ–జన్ కీ బాత్ సర్వే మాత్రం బీజేపీ, కాంగ్రెస్ దాదాపు సమానంగా సీట్లు సాధిస్తాయని తెలిపింది. వసుంధర రాజే, సచిన్ పైలట్ ‘మధ్యప్రదేశ్’ హోరాహోరీ రైతు సమస్యలే ప్రధాన అజెండాగా ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్‌లో అధికార మార్పిడి జరిగేనా? 15 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతున్న బీజేపీ తన హవాను కొనసాగించేనా? ముగ్గురు రథసారథుల నేతృత్వంలోని కాంగ్రెస్ ఎట్టకేలకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేనా? లాంటి ప్రశ్నలకు ఎగ్జిట్ పోల్స్ కూడా స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయాయి. ఉత్తరాదిలోని పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన మధ్యప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ తప్పదని చెప్పాయి. కౌంటింగ్ పూర్తయ్యే వరకు తుది ఫలితం ఊహించడం కష్టమని మెజారిటీ సర్వేలు పేర్కొనగా, కొన్ని మాత్రం మొగ్గు బీజేపీ వైపే ఉందని తెలిపాయి. ఇప్పటికే మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన శివరాజ్‌సింగ్ చౌహాన్‌పై ప్రజల్లో అంతగా వ్యతిరేకత పెరగలేదని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కూడా ప్రజలు సంతృప్తిగానే ఉన్నట్లు వెల్లడించాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దేవాలయాల సందర్శన పెద్దగా ఓట్లు రాల్చకపోవచ్చని తెలిపాయి. పంట దిగుబడుల ధరలు గతంలో లేనంతగా దారుణంగా పడిపోవడం శివరాజ్ సర్కారుకు మరణశాసనం అవుతుందని వేసిన అంచనాలు వంద శాతం నిజం కాకపోవచ్చని తేల్చిచెప్పాయి. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థులుగా భావిస్తున్న కమల్‌నాథ్, జ్యోతిరాదిత్య సింధియా, దిగ్విజయ్ సింగ్‌ల మధ్య అంతర్గత పోరు ఆ పార్టీని దెబ్బతీసే అవకాశాలున్నట్లు తెలిపాయి. రాష్ట్రంలోని మొత్తం అసెంబ్లీ సీట్లు 230 కాగా, అధికారం చేపట్టాలంటే కావల్సిన మెజారిటీ 116 సీట్లు. ఏ పార్టీకి సాధారణ మెజారిటీ రాని పక్షంలో ప్రభుత్వ ఏర్పాటులో ఇతరులు, స్వతంత్రులు కీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయి. రిపబ్లిక్ టీవీ–జన్ కీ బాత్ సర్వేలో బీజేపీకి 108–128, కాంగ్రెస్‌కు 95–115 సీట్లు వచ్చే అవకాశాలున్నట్లు తేలింది. 126 సీట్లతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని, కాంగ్రెస్ 89 సీట్లకు పరిమితమవుతుందని టైమ్స్ నౌ–సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. మరోవైపు, కాంగ్రెస్ 104–122 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించడం లేదా ప్రభుత్వ ఏర్పాటుకు కావల్సిన మెజారిటీని సాధిస్తుందని ఇండియా టుడే–యాక్సిస్ అంచనా వేసింది. బీజేపీ 102–120 సీట్లు గెలుచుకుంటుందని తెలిపింది. ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న మధ్యప్రదేశ్‌లో ప్రజా తీర్పును తెలుసుకో వాలంటే ఈ నెల 11 వరకు ఎదురుచూడక తప్పదు! ‘పీపుల్స్ పల్స్’ కాంగ్రెస్‌కే.. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థ పీపుల్స్ పల్స్..15 ఏళ్ల తరువాత కాంగ్రెస్ మధ్యప్రదేశ్‌లో అధికారంలోకి రాబోతోం దని జోస్యం చెప్పింది. కాంగ్రెస్‌కు 116–120, బీజేపీకి 98–102 సీట్లు రావచ్చని సర్వేలో తెలిపింది. ప్రాంతాల వారీగా అంచనా.. ► గ్వాలియర్: కాంగ్రెస్ పాపులారిటీ పెరిగింది ► బుందేల్‌ఖండ్: కాంగ్రెస్‌దే ఆధిపత్యం ► బాగేల్‌ఖండ్: కాంగ్రెస్‌దే ఆధిపత్యం ► మహాకోశల్: బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ ► మాల్వా: కాంగ్రెస్‌కు మొగ్గు ► భోపాల్: బీజేపీకి స్వల్ప మొగ్గు శివరాజ్ సింగ్ చౌహాన్, జ్యోతిరాదిత్య మిజోరం ‘చే’జారుతుందా? ఈశాన్య భారత్‌లో అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం మిజోరంలో కాంగ్రెస్‌కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. పదేళ్లుగా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న లాల్ తాన్హావ్లా పాలనపై విసుగు చెందిన ప్రజలు ప్రాంతీయ పార్టీ మిజో నేషనల్ ఫ్రంట్(ఎమ్ఎన్ఎఫ్) వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలిపాయి. అసెంబ్లీలోని మొత్తం 40 సీట్లకు గాను అధికారం చేపట్టాలంటే 21 స్థానాల్లో గెలుపొందాల్సి ఉంది. 18 సీట్లతో ఎమ్ఎన్ఎఫ్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని, 16 సీట్లతో కాంగ్రెస్ రెండో స్థానంలో నిలుస్తుందని, ఫలితంగా హంగ్ అసెంబ్లీ ఏర్పడటానికి ఎక్కువ అవకాశాలున్నట్లు టైమ్స్ నౌ–సీఎన్ఎక్స్ అంచనా వేసింది. త్రిపుర తరువాత మరో ఈశాన్య రాష్ట్రంలో పాగా వేయాలని ఎదురుచూస్తున్న బీజేపీకి నిరాశ తప్పేలా లేదు. 39 స్థానాల్లో పోటీచేసిన ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కే అవకాశం లేదని సర్వేలు వెల్లడించాయి. మిజోరంలో పదేళ్లకోసారి అధికార మార్పిడి జరగడం సంప్రదాయంగా వస్తోంది. అయితే ఆ రాష్ట్రంలో ఎప్పుడూ హంగ్ అసెంబ్లీ ఏర్పడలేదు. ఎంఎన్ఎఫ్, కాంగ్రెస్‌ల మాదిరిగా సంపూర్ణ మద్య నిషేధంపై స్పష్టమైన వైఖరి ప్రకటించకపోవడం బీజేపీని దెబ్బ తీస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. హిందూత్వ పార్టీ అన్న ముద్రను తొలగించుకోవడంలోనూ ఆ పార్టీ విఫలమైందని అభిప్రాయపడుతున్నారు. పదేళ్లుగా అధికారంలో ఉండటమే కాంగ్రెస్‌పై వ్యతిరేకత పెరగడానికి ప్రధాన కారణమని భావిస్తున్నారు. దొడ్డిదారిన అధికారంలోకి రావడానికి ఎంఎన్ఎఫ్తో బీజేపీతో అంటకాగుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఒకవేళ కాషాయ పార్టీకి ఒకటీ అర సీట్లొచ్చి, ఎంఎన్ఎఫ్ సాధారణ మెజారిటీకి కొద్ది దూరంలో నిలిస్తే ఆ రెండు పార్టీలు చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మిజోరంలో ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ రాదని, హంగ్ తప్పదని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది. ఎంఎన్ఎఫ్కు 15–19 సీట్లు, కాంగ్రెస్‌కు 14–19 స్థానాలు రావొచ్చని తెలిపింది. జోరమ్ పీపుల్స్ మూవ్మెంట్ 2–4, బీజేపీ 0–2 సీట్లుకు పరిమితం కావొచ్చని వెల్లడించింది. ఛత్తీస్‌గఢ్‌లో హంగేనా? బీజేపీ అధికారంలో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో ఈసారి ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత స్పష్టమైన మెజారిటీ రాదని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. అసెంబ్లీలో ఉన్న 90 సీట్లలో బీజేపీ 40, కాంగ్రెస్ 43 సీట్లు దక్కించుకోవచ్చని, ఐదు సీట్లు బీఎస్పీ కూటమికి రావచ్చని చెబుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటుకు కనీసం 45 మంది బలం అవసరమవుతుంది. ఏ ఎగ్జిట్‌పోల్‌లోనూ కూడా ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ వస్తుందని స్పష్టం కాలేదు. అయితే, అజిత్‌జోగి నాయకత్వంలో బరిలో దిగిన బీఎస్పీ కూటమి ఐదారు స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని, అదే జరిగితే ప్రభుత్వం ఏర్పాటులో ఆ కూటమి కీలక పాత్ర పోషిస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు బీఎస్పీ, అజిత్ జోగికి చెందిన కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్(జే), ఆమ్ఆద్మీ పార్టీ తమ అభ్యర్థులను కొన్ని చోట్ల పోటీలో ఉంచాయి. ఈ ఎన్నికల్లో మావోయిస్టు సమస్యను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రచారాంశంగా చేసుకున్నాయి. బీజేపీ తరఫున ప్రధానమంత్రి మోదీ, సీఎం రమణ్‌సింగ్‌తోపాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసిన పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సీఎం రమణ్‌సింగ్ అవినీతిని వివిధ సందర్భాల్లో ఎండగట్టారు. ఎన్నికల బహిష్కరణకు మావోయిస్టులు పిలుపు ఇచ్చారు కూడా. అయినప్పటికీ, పటిష్ట బందోబస్తు మధ్య మొదటి విడతలో నవంబర్ 12వ తేదీన మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో, నవంబర్ 20వ తేదీన రెండో విడత ఇక్కడ ఎన్నికలు జరిగాయి. ఈ పోలింగ్‌లో 76.35 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2013లో రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 77.40 శాతం పోలింగ్ నమోదైంది. ఛత్తీస్‌లో నువ్వా–నేనా ఛత్తీస్‌గఢ్‌లో గత 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీతో కాంగ్రెస్ పార్టీ నువ్వానేనా అన్న రీతిలో తలపడుతోంది. హైదరాబాద్‌కు చెందిన ‘పీపుల్స్ పల్స్’ సంస్థ ఇక్కడ నిర్వహించిన సర్వేలో ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌కు ప్రజాదరణ ఉన్నప్పటికీ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోయారన్న అపప్రథ ఉంది. అజిత్ జోగి, మాయావతి కూటమి కారణంగా కాంగ్రెస్‌కు నష్టం ఉంటుందని చాలా మంది భావించినప్పటికీ, వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉన్నట్లు తేలింది. బీజేపీ విజయావకాశాలను అంతర్గత విభేదాలు కొంతమేర దెబ్బతీయనున్నాయి. అజిత్ జోగి నిష్క్రమణ అనంతరం కాంగ్రెస్ పార్టీలో మిగిలిన నేతలు భూపేశ్ బాఘెల్, తామ్రధ్వజ్ సాహు వంటి వారు ఎన్నికల్లో తమ గత విభేదాలను పక్కనబెట్టి, పార్టీకి నష్టం కలుగని రీతిలో వ్యవహరించారు. తెలంగాణలో 115 కోట్లు.. రాజస్తాన్‌లో 12 కోట్లు.. సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో పారిన నగదు ప్రవాహానికి సంబంధించి ఒక ఆసక్తికర చర్చ దేశ రాజధానిలో నడుస్తోంది. రాజస్తాన్, తెలంగాణల్లో ఒకేరోజు ఎన్నికలు జరిగాయి. రాజస్తాన్‌లోని మొత్తం నియోజకవర్గాలు 200. ఇప్పుడు ఎన్నికలు జరిగింది 199 స్థానాలకు. తెలంగాణలో ఉన్నవి 119. కానీ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో స్వాధీనం చేసుకున్న నగదు రాజస్తాన్‌లో స్వాధీనం చేసుకున్న దానికన్నా దాదాపు పదింతలు ఎక్కువ. తెలంగాణలో రూ. 115.19 కోట్ల నగదు, రూ. 12.26 కోట్ల విలువైన 5.45 లక్షల లీటర్ల మద్యం పట్టుకున్నారు. 4,451.59 కిలోల మాదక ద్రవ్యాలు, రూ. 6.79 కోట్ల విలువైన నగలు, రూ. 1.83 కోట్ల విలువైన ఇతర కానుకలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం స్వాధీనం చేసుకున్న నగదు, వస్తువుల విలువ రూ. 136.89 కోట్లు. కానీ రాజస్తాన్‌లో దొరికిన నగదు కేవలం రూ. 12.85 కోట్లు మాత్రమే. అయితే మద్యం విలువ చాలా ఎక్కువ. 6.04 లక్షల లీటర్ల మద్యం పట్టుకోగా దాని విలువ రూ. 39.49 కోట్లుగా చూపారు. అంటే తెలంగాణతో పోల్చితే ఇది ఖరీదైన మద్యమై ఉండాలి. మాదక ద్రవ్యాలు భారీగా దొరికాయి.రూ. 14.58 కోట్ల విలువైన 38,572 కిలోల మాదకద్రవ్యాలు దొరికాయి. రాజస్తాన్‌లో స్వాధీనం చేసుకున్న నగల విలువ రూ. 26.89 కోట్లు. ఇందులో రూ. 16.84 కోట్ల విలువైన బంగారం. 601 కిలోల వెండి ఉంది. ఇతర కానుకల విలువ రూ. 12.65 కోట్లు. మొత్తంగా స్వాధీనం చేసుకున్న వాటి విలువ రూ. 86.42 కోట్లు. -
చత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌దే హవా!
సాక్షి, న్యూఢిల్లీ : చత్తీస్‌గఢ్‌లో వరి కోతల సీజన్ అయిపోయింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కూడా పూర్తయ్యాయి. అయినా దాదాపు యాభై శాతం రైతులు వరి కోతల జోలికి వెళ్లడం లేదు. ఎందుకని చంద్రకురి గ్రామంలోని మహేశ్ చంద్రేకర్ అనే రైతును ప్రశ్నించగా ఎన్నికల ఫలితాల కోసం నిరీక్షిస్తున్నామని అన్నారు. ఎన్నికల ఫలితాలకు, వరి కోతలకు సంబంధం ఏమిటని ప్రశ్నించగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సరైన గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పిందని, అందుకని, తాను వరి కోతలు జరపక పోవడమే కాకుండా జరపకూడదని తోటి రైతులకు సలహా కూడా ఇచ్చానని ఆయన చెప్పారు. అప్పటి వరకు పంటను తరలించకపోతే నష్టం వాటిల్లా అది ప్రశ్నిస్తే, డిసెంబర్ 11న ఎన్నికల ఫలితాలు వెలువడుతాయని, అప్పటి వరకు భూమిలో తేమ ఉంటుంది కనుక నష్టం వాటిల్లదని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే అప్పటికైనా పాత రేటుకు అమ్ముకోవాల్సిందేనని ఆయన తెలిపారు. ఈసారి కోతల సీజన్ ప్రారంభమైన నవంబర్ ఒకటవ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు రాష్ట్రంలో వడ్ల సేకరణ 4,67,438 మెట్రిక్ టన్నులకు చేరుకుంది. గతేడాది ఇదే కాలానికి సేకరించిన వడ్లతో పోలిస్తే ఇది సగానికిపైగా పడిపోయింది. గతేడాది ఇదే కాలానికి 10,47,454 మెట్రిక్ టన్నులు సేకరించినట్లు అధికారిక మార్కెట్ లెక్కలు తెలియజేస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచార సభతో రైతుల్లో ఈ మార్పు వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. నవంబర్ 13న మహాసముంద్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పది రోజుల్లో రైతుల రుణాలను మాఫీ చేస్తామని, వరి పంట కనీస మద్దతు ధరను 2500 రూపాయలను చేస్తామని చెప్పారు. గత బీజేపీ ప్రభుత్వం వరి మద్దతు ధరను 2100 రూపాయలను ప్రకటించినప్పటికీ 1750 రూపాయలనే చెల్లించిందని ఆయన విమర్శించారు. దేశంలో కేవలం 15 మందికి చెందిన మూడున్నర లక్షల కోట్ల రూపాయలను మాఫీ చేసిన ప్రధాని నరేంద్ర మోదీ రైతుల రుణాలను మాఫీ చేయలేక పోతున్నారని విమర్శించారు. చత్తీస్‌గఢ్ జనాభాలో 70 శాతం మంది వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నారు. వారిలో 46 శాతం మంది చిన్నకారు, సన్నకారు రైతులే. 2015 నుంచి 2017 మధ్య వ్యవసాయ సంక్షోభం వల్ల రాష్ట్రంలో 1,344 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. రాహుల్ మాటలను పూర్తిగా విశ్వసించిన రైతులు రాష్ట్రంలో ఈసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని నమ్ముతున్నారు. 15 ఏళ్ల రమణ్ సింగ్ ప్రభుత్వం పట్ల తాము పూర్తిగా విశ్వాసం కోల్పోయామని రైతులు చెబుతున్నారు. 2022 సంవత్సరం నాటికల్లా దేశలోని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్న ప్రధాని మోదీ మాటలను గుర్తు చేయగా, ఈ నాలుగేళ్ల కాలంలో రైతుల ఆదాయం ఏమాత్రం పెరగక పోగా వ్యవసాయం సంక్షోభంలో పడిందని, అలాంటప్పుడు ఆయన మాటలు ఎలా నిజం అవుతాయని రైతులు అంటున్నారు. ప్రధాని పేదలు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చారని, గ్యాస్ ఫిల్లింగ్‌కు 900 రూపాయలు ఎక్కడి నుంచి తేవాలని, ఉచితంగా బ్యాంక్ ఖాతాలు ఇప్పించారని, అది మురిగిపోకుండా ఉండాలంటే వెయ్యి రూపాయలు డిపాజిట్ చేయాలంటా, ఎక్కడి నుంచి తేవాలని రైతులు ఎదురు ప్రశ్నిస్తున్నారు. వారి విశ్వాసం చూస్తుంటే రాష్ట్రంలో కాంగ్రెస్‌దే హవా! అనిపిస్తోంది. -
వైరల్.. ఈవీఎం మిషన్కి పూజలు చేసిన ఎమ్మెల్యే
రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్ బీజేపీ ఎమ్మెల్యే ఒకరికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. పోలింగ్ కేంద్రంలో పూజలు నిర్వహించడంమే ఇందుకు కారణం. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన నవగఢ్‌లో చోటు చేసుకుంది. ఈ నెల 20న ఛత్తీస్‌గఢ్‌లో చివరి దశ పోలీంగ్ ముగిసిన సంగతి తెలిసిందే. పోలింగ్ రోజున నవగఢ్ ఎమ్మెల్యే, రాష్ట్ర పర్యాటక మంత్రి దయాల్‌దాస్ బాఘెల్ ఓ పోలింగ్ కేంద్రంలోని ఈవీఎంకి పూజలు చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్‌గా మారింది. బేమెతర జిల్లాలోని నవగఢ్ నియోజకవర్గంలో గత మంగళవారం పోలింగ్ ప్రారంభమవడానికి ముందు దయాల్‌దాస్ స్థానిక పోలింగ్ కేంద్రంలో పూజలు చేశారు. ఈవీఎం మిషన్‌కు దండం పెట్టి కొబ్బరికాయ కొట్టి, అగరుబత్తీలు కూడా ముట్టించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల కావడంతో స్పందించిన రిటర్నింగ్ అధికారి దయాల్దాస్కు నోటీసులు జారీ చేశారు. 24గంటల్లోగా వీడియోపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. అయితే ఈ సంఘటనపై కాంగ్రెస్ పార్టీ విమర్శల వర్షం కురిపిస్తోంది. ప్రజాస్వామ్యంలో నేతలు సామాన్యులను పూజించాలి గానీ ఈవీఎంలను కాదని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. గత 15ఏళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న భాజపా.. ప్రజల కోసం పనిచేయకుండా ఇప్పుడు ఈవీఎంలకు పూజలు చేస్తే ఏం లాభమని ఎద్దేవా చేసింది. కాగా ఈ వార్తలపై దయాల్‌దాస్ ఇంతవరకూ స్పందించలేదు. -
రమణ్‌కు ఎదురెవరు?
రాజకీయాల్లో జంటిల్‌మ్యాన్ అనే ఘనత సాధించిన కొద్ది మంది నేతల్లో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ ఒకరు. నెమ్మదస్తుడు, నిజాయితీపరుడు, ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉంటారు. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న రాష్ట్రంలో సవాళ్లన్నీ ఎదుర్కొంటూ నేర్పుగా పాలన చేయగలరని పేరు తెచ్చుకున్నారు. పదిహేనేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న రమణ్ సింగ్‌కు స్వయంకృషితో పాటు అదృష్టం కూడా కలిసి వస్తోంది. ఈ సారి కూడా కాంగ్రెస్‌కు గుడ్‌బై కొట్టేసి సొంత కుంపటి పెట్టుకున్న అజిత్ జోగి రూపంలో రమణ్ సింగ్‌కు కలిసివస్తుందనే అంచనాలైతే ఉన్నాయి. మరో పక్క ప్రతిపక్ష కాంగ్రెస్‌లో రమణ్ సింగ్‌కు పోటీగా సరైన నాయకుడు కనిపించడంలేదు. ఎవర్ని సీఎం అభ్యర్ధిగా ప్రకటిస్తే ఎవరు అలుగుతారో తెలీక అసలు సీఎం అభ్యర్ధి పేరే ప్రకటించకుండానే కాంగ్రెస్ కదనంలోకి దూకింది. అంతర్గత కలహాలను కప్పిపుచ్చుతూ సీతా స్వయంవరంలాగా ఎన్నికల అనంతరం తమ పార్టీలో సీఎం అభ్యర్ధి ఎన్నిక జరుగుతుందని చత్తీస్‌గఢ్ ప్రతిపక్షనేత టీఎస్ సింగ్‌దేవ్ గంభీరంగా వ్యాఖ్యానిస్తున్నారు. పలు సర్వేల్లో రమణ్‌సింగ్‌కు పోటీగా ఎవరూ దరిదాపుల్లో కనిపించడంలేదు. దీంతో కేవలం రమణ్ సుదీర్ఘ పాలనపై అసంతృప్తే తమకు కలిసిరావచ్చని ప్రత్యర్ధి పార్టీల్లో ఆశావహులు భావిస్తున్నారు. వ్యతిరేకతా.. క్లీన్ ఇమేజా ? ప్రజా పంపిణీ వ్యవస్థలో సంస్కరణల ద్వారా చావల్ బాబా అన్న పేరు సంపాదించుకున్న రమణ్ సింగ్‌ను గత ఎన్నికల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే అందలం ఎక్కించాయి. కానీ ఈ సారి ఆ పరిస్థితి కాస్త తిరగబడ్డట్లుంది. అయిదేళ్లలో పట్టణ ప్రాంతాల్లో పట్టు బిగించిన రమణ్ సింగ్, గ్రామీణ ప్రాంతాలను నిర్లక్ష్యం చేశారు. చావల్ బాబాగా పేరున్న ఆయన రైతు సమస్యల్ని పట్టించుకోలేదు. దీంతో అన్నదాతలు రమణ్ సింగ్ సర్కార్‌పై ఆక్రోశంతో ఉన్నారు. ఏ ప్రజాపంపిణీ వ్యవస్థనైతే బలోపేతం చేశారో, అదే వ్యవస్థలో మిల్లర్లతో కుమ్మక్కై నకిలీ బియ్యం పంపిణీకి పరోక్షంగా సహకరించారన్న అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీంతో ప్రత్యర్ధులందరూ ఈ వ్యతిరేకతపైనే నమ్మకంతో ఉన్నారు. ఈ దఫా ప్రభుత్వ వ్యతిరేకత పెల్లుబికి రమణ్‌ను గద్దె దింపడం ఖాయమని ఆశిస్తున్నారు. కానీ కోర్టుల్లో రమణ్ క్లీన్ ఇమేజ్ పొందారు. దీంతో జనంలో నిజాయితీపరుడని ఆయనకున్న పేరు చెక్కుచెదరినట్లు కనిపించడం లేదు. ఇప్పటికీ 41శాతం మంది ప్రజలు రమణ్ సింగే సీఎం కావాలనే కోరుకుంటున్నారని వివిధ సర్వేల్లో తేలింది. తర్వాత స్థానాల్లో అజిత్ జోగీ, సింగ్ దేవ్, భూపేష్ తదితరులున్నారు. అజిత్ ఆశ తీరేనా? కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా మూడేళ్ల పాటు పనిచేసిన అజిత్ జోగి ప్రజల్లో రమణ్ సింగతర్వాత అంతటి ఛరిష్మా ఉన్న నాయకుడు. ఐఏఎస్ నుంచి సీఎంగా ఎదిగిన జోగీ రాజకీయ వ్యూహరచనలో దిట్ట. రెండేళ్ల క్రితం కాంగ్రెస్‌ను వీడి జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ (జేసీసీ) పేరుతో పార్టీ పెట్టిన ఆయన వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు. గిరిజనులు, సత్నామీ ఎస్సీల్లో పట్టున్న నాయకుడు. రాష్ట్ర జనాభాలో 12% ఎస్సీలైతే వారిలో సత్నామీలు 75%వరకు ఉన్నారు. ఎస్సీ నియోజకవర్గాల్లో పట్టున్న బీఎస్పీతో జతకట్టడం, సీపీఐని కూడా తమ గూటికి లాగేసి ఒక కూటమిగా ఏర్పడడంతో కాంగ్రెస్, బీజేపీ ఓట్లను జోగి భారీగా చీలుస్తారనే అంచనాలు ఉన్నాయి. ఈ దఫా జోగి మార్వాహి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అనారోగ్య సమస్యలు వేధిస్తున్నా ఆయన తన పార్టీని ఉత్సాహంగా నడిపిస్తున్నారు. గత ఏడాదిలో బస్తర్ నుంచి సర్గూజా వరకు దాదాపు 300 బహిరంగ సభల్లో ప్రసంగించారు. బూత్ స్థాయిలో 10 లక్షల మంది కార్యకర్తల్ని నియమించారు. ఎక్కడికక్కడ రమణ్‌సింగ్ సర్కార్ వైఫల్యాలను ఎత్తిచూపిస్తున్నారు. కాంగ్రెస్‌లో నాయకత్వ లేమి ఛత్తీస్‌గఢ్‌లో సీఎం అభ్యర్థిని ప్రకటించే సాహసం కాంగ్రెస్ అధిష్టానం చేయలేకపోయింది. 2013లో జరిగిన మావోయిస్టు దాడిలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు ఎందరినో కోల్పోయింది. అనంతరం జోగి పార్టీని వీడాక కాంగ్రెస్ జాతీయ నాయకత్వమే భారం మోయాల్సి వచ్చింది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భూపేష్ భాఘేల్, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు టిఎస్ సింగ్‌దేవ్ రేసులో ఉన్నప్పటికీ వారిలో ఎవరికీ రమణ్ సింగ్‌కు ఉన్నంత జనాదరణ లేదు. మరో ఇద్దరు సీనియర్ నేతలు చరణ్ దాస్ మహంత్, తామ్రధావజ్ సాహులు కూడా సీఎం పీఠంపై కన్నేశారు. కాంగ్రెస్ నిర్వహించిన అంతర్గత సర్వేల్లో 24% మంది సింగ్‌దేవ్ సీఎం అభ్యర్థి కావాలని కోరుకుంటే, 20% మంది భూపేష్ భాగల్ వైపు మొగ్గు చూపించారు. టీఎస్ సింగ్ దేవ్ రాష్ట్రంలో ప్రజాప్రతినిధులందరిలోకి ధనవంతుడు. రమణ్ సింగ్ అనుకూలం ♦ పరిపాలనాదక్షత, నిజాయితీ ♦ వ్యాపారుల అండదండలు ♦ మావోయిస్టుల ప్రాబల్యం ఉన్నా ఆగని అభివృద్ధి కార్యక్రమాలు ప్రతికూలం ♦ 15ఏళ్లుగా అధికారంలో ఉండడంతో ప్రభుత్వ వ్యతిరేకత ♦ అధికారుల చేతుల్లో కీలుబొమ్మ అన్న పేరు ♦ రైతులు, గిరిజనుల్లో అసంతృప్తి అజిత్ ప్రమోద్ కుమార్ జోగి అనుకూలం ♦ రాష్ట్ర రాజకీయాలు, పాలనపై పూర్తి అవగాహన ♦ గిరిజనులు, సత్నామీ ఎస్సీల్లో పట్టు ♦ బీఎస్పీతో పొత్తు ప్రతికూలం ♦ కుటుంబ సభ్యులు వివిధ పార్టీల్లో కొనసాగడం ♦ గత వైఫల్యాలు, కుంభకోణాల ఇమేజ్ పూర్తిగా చెరిగిపోకపోవడం కాంగ్రెస్ అభ్యర్ధులు అనుకూలం ♦ బీఎస్పీ, అజిత్ పొత్తుతో బీజేపీ ఓట్బ్యాంక్కు గండిపడుతుందన్న అంచనాలు ♦ ప్రభుత్వ వ్యతిరేకత ప్రతికూలం ♦ బలమైన ఇమేజ్ లేకపోవడం ♦ అంతర్గత కుమ్ములాటలు అక్కడ అన్నీ సాధ్యమే! మధ్యప్రదేశ్ అసెంబ్లీ పలు ప్రయోగాలకు వేదిక. 1998–2003లో అన్నుపూర్లోని సోహాగ్పూర్ నియోజకవర్గం నుంచి ట్రాన్స్‌జెండర్ శబ్నం మౌసీ తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. శబ్నం స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. అంతేకాదు.. దేశంలో తొలి ట్రాన్స్‌జెండర్ మేయర్ కూడా మధ్యప్రదేశ్ లోనే ఎన్నికయ్యారు. 1999లో కత్నీ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్‌గా కమలా జాన్ విజయం సాధించారు. 1977లో పార్లమెంటుకు ఓ అంధుడైన నేతను పంపించిన ఘనత కూడా మధ్యప్రదేశ్‌కే దక్కుతుంది. యమునా ప్రసాద్ శాస్త్రి రేవా నియోజవర్గం నుంచి 1977 నుంచి 1989 వరకు రెండుసార్లు ఎంపీగా ఉన్నారు. 1955లో గోవా ముక్తి పోరాటంలో పోర్చుగీసు పోలీసుల చిత్రహింసలతో ఆయన తన రెండుకళ్లూ పోయాయి. ఈ దఫా అదృష్టాన్ని పరీక్షించుకోవాలని బధిర అభ్యర్థి సుదీప్ శుక్లా భావిస్తున్నారు. మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేల్లో 70% కోటీశ్వరులే! ప్రస్తుతం మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేల్లో 70% మంది కోటీశ్వరులే. 2008 ఎన్నికల అప్పుడు 40% మాత్రమే ఉన్న ధనిక ఎంఎల్ఏల సంఖ్య ఐదేళ్లలోనే మరింత పెరిగింది. 2013లో ఎన్నికల సంఘానికి నివేదించిన అఫిడవిట్ ప్రకారం మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేల సగటు ఆస్తులు రూ.5.24కోట్లు. మొత్తం 230 మంది ఎమ్మెల్యేల్లో 161 మంది కోటీశ్వరులు. ఈ జాబితాలోనూ బీజేపీ ఎమ్మెల్యేలే ఎక్కువగా ఉన్నారు. ఎమ్మెల్యే సంజయ్ పాఠక్ ఈ జాబితాలో తొలిస్థానంలో ఉన్నారు. ఎన్నికల సంఘానికి పేర్కొన్న లెక్కల ప్రకారం ఆయన ఆస్తులు రూ.121 కోట్లు. 2012–13 ఆర్థిక సంవత్సరంలో ఆయన ఆస్తులు రూ.8.94 కోట్లు మాత్రమే. మరో బీజేపీ ఎమ్మెల్యే చేతన్ కశ్యప్‌కు రూ.120.39 కోట్లు, సంజయ్ శర్మ అనే మరో కమలం పార్టీ ఎంపీకి రూ.65.42 కోట్ల ఆస్తులున్నాయి. మొత్తం 161 మందిలో 118 మంది బీజేపీ ఎమ్మేల్యేలు ఉన్నారు. 2013 ఎన్నికలకు ముందు ఈ జాబితాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 69%, బీఎస్పీ శాసనసభ్యులు 25% ఉన్నారు. 14 ముస్లిం స్థానాలపై కాంగ్రెస్ దృష్టి రాజస్తాన్‌లో 2013 అసెంబ్లీ ఎన్నికలో చావుదెబ్బ తిన్న కాంగ్రెస్ పార్టీ.. ఈసారి ఏ అవకాశాన్నీ వదులుకోకుండా అనేక ప్రయత్నాలూ చేస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తీవ్రంగా నష్టం చేసిన 14 ముస్లిం ప్రభావిత నియోజకవర్గాల్లో ఈసారి ఓట్లు చీలకుండా జాగ్రత్తపడుతోంది. గత ఎన్నికల్లో చిన్నాచితకా ముస్లిం పార్టీల కారణంగా ఓట్లు చీలడంతో.. ఈసారి ఆ ప్రమాదం జరగకుండా జాగ్రత్తపడుతోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ రెబల్స్, ముస్లిం సంఘాల నేతలకు బీజేపీ అన్నివిధాలుగా సహాయపడిందని.. అందుకే ఈ స్థానాల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని ప్రచారం చేస్తోంది. డిసెంబర్ 7న జరిగే ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ముందుగానే కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించి అసమ్మతినేతలను బుజ్జగించే పనిలో ఉంది. ఎలాగైనా 14 స్థానాల్లో గెలుపొందాలని గట్టి యత్నాలు చేస్తోంది.