సాక్షి, విశాఖపట్నం: ‘నా వల్లే ఆ మూడు రాష్ట్రాల్లో(రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్) బీజేపీ చిత్తుచిత్తుగా ఓడింది. ఆ మూడు చోట్ల కాంగ్రెస్ విజయం వెనుక తెలుగుదేశం పార్టీ కృషి ఎంతో ఉంది..’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. బీజేపీని ఇంటికి పంపేవరకూ నిద్రపోనని చెప్పారు. గురువారం విశాఖ పర్యటనలో భాగంగా కాపులుప్పాడ వద్ద ఏర్పాటు చేయనున్న ఐ–హబ్‌తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేశారు. సాయంత్రం తగరపువలస జూట్‌మిల్ గ్రౌండ్స్‌లో జరిగిన సభలో సీఎం ప్రసంగించారు. ప్రధాని మోదీ రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారన్నారు. వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టించారని.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. మోదీ నుంచి దేశాన్ని కాపాడాలన్న సంకల్పంతోనే బీజేపీయేతర పార్టీలను ఏకం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
పార్టీని బతికించుకునేందుకు కాంగ్రెస్‌తో ముందుకెళ్తే తప్పా!
తెలంగాణ ఎన్నికల్లో నా వల్లే ఏదో జరిగిపోయిందంటూ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. తెలంగాణలోనే తెలుగుదేశం పార్టీ పుట్టిందన్నారు. అక్కడ పార్టీ కోసం 35 ఏళ్ల పాటు పోరాడిన కాంగ్రెస్‌తో కలిసి ముందుకెళ్లామని.. అందులో తప్పేముందని ప్రశ్నించారు. ‘టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కూడా టీడీపీ నుంచే రాజకీయాల్లోకి వచ్చారు. మీరు కూడా మోదీపై పోరాడుతున్నారు. ఇద్దరూ కలిసి ముందుకెళ్దామంటే ఆయన ఒప్పుకోలేదు. పార్టీని బతికించుకునేందుకు కాంగ్రెస్‌తో కూడా వెళ్లడానికి వీల్లేదని అడ్డుజెప్పారు. నేను అక్కడ పని చేయడం తప్పయినట్టు.. నాకేదో రిటర్న్ గిఫ్ట్ తిరిగి ఇస్తానంటున్నాడు. ఇది న్యాయమా?..’ అని చంద్రబాబు ప్రశ్నించారు. తానెవరికీ భయపడనన్నారు. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసి రాష్ట్రానికి కేంద్రం రూ.75 వేల కోట్లివ్వాలన్న పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని విమర్శించారు.
మోదీని ఎలా బతిమిలాడానో అందరూ చూశారు..
మోదీ కంటే తనకు ఎంతో అనుభవముందని.. కానీ ఆయన అమరావతి శంకుస్థాపనకు వచ్చినప్పుడు ‘సార్.. సార్..’ అంటూ ఎలా బతిమలాడానో అందరూ చూశారని చంద్రబాబు గుర్తుచేశారు. అయినా రాజధానికి నిధులు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదని మండిపడ్డారు.
‘మెడ్‌టెక్’తో విశాఖకు విశ్వఖ్యాతి
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్(ఏఎంటీజెడ్) ఏర్పాటుతో విశాఖపట్నానికి ప్రపంచ ఖ్యాతి లభిస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖలోని పెదగంట్యాడ వద్ద ఏర్పాటైన ఏపీ మెడ్‌టెక్ జోన్‌ను గురువారం ఆయన జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించిన నాలుగో గ్లోబల్ ఫోరం సదస్సులో ఆయన మాట్లాడారు. వైద్య పరికరాల తయారీలో అగ్రదేశాలతో సమాన స్థాయికి ఆంధ్రప్రదేశ్ చేరిందన్నారు. దేశంలోనే తొలి వైద్య పరికరాల తయారీ కేంద్రం ఇదేనన్నారు. ప్రపంచవ్యాప్తంగా 240 కంపెనీలు ఇక్కడ తమ ఉత్పత్తులను తయారు చేస్తాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment