ఆ తప్పు ఎందుకు చేశానని బాధపడుతున్న అజిత్ జోగీ
తను తీసుకున్న గోతిలో తానే పడటం అంటే ఏమిటో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం అజిత్ జోగీని చూస్తే తెలుస్తుంది. జోగీ బ్రహ్మాండమైన వ్యూహకర్త. ఊహకందని వ్యూహాలు వేయడం ఆయనకే చెల్లుతుంది. కానీ ఇప్పుడు అతి వ్యూహమే ఆయన ఎన్నకల వోటమికి కారణమైంది.
ఛత్తీస్ గఢ్ మహాసముంద్ నుంచి పోటీచేసిన జోగీ, తన ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టేందుకు, ఆయన ఓట్లు చెల్లాచెదరు కావడానికి తన ప్రత్యర్థి పేరే ఉన్న పదిమందిని బరిలోకి దింపారు. బిజెపి అభ్యర్థి చందురామ్ సాహుకి పోటీగా పది మంది చందూరామ్ సాహూలను రంగంమీదకి రప్పించారు. దీనిపై బిజెపి ఫిర్యాదు కూడా దాఖలు చేసింది. అయితే ఈ ఎన్నికల్లో ఇంత చేసినా వెయ్యి ఓట్లతో జోగీ ఓడిపోయారు.
ఇప్పుడు పది మంది చందూరామ్ ల ఓట్లు కూడా బిజెపి చందూరామ్ ఖాతాలో పడ్డాయన్నదే జోగీ గారికి అనుమానం. ఎన్నికల అధికారులు డమ్మీల ఓట్లన్నిటినీ బిజెపి చందూరామ్ లెక్కల్లో వేసేశారని ఆయన ఒక ఫిర్యాదు కూడా దాఖలు చేశారు. 'నేను రోజురోజంతా లీడింగ్ లో ఉన్నా, రాత్రయ్యే సరికి నేను వెయ్యి ఓట్లతో ఎలా ఓడిపోయాను' అని ఆయన ప్రశ్నించారు.
ఆయన ఆరోపణల్లో నిజమెంతో తెలియదు కానీ 'ఇంతమంది సాహూలను దింపినందుకు కొంప మునిగింది' అని ఇప్పుడు జోగీ గారు బాధపడుతున్నారు.