సాక్షి, న్యూఢిల్లీ : రానున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదంటూ బహుజన సమాజ్ వాది పార్టీ చీఫ్ మాయావతి బుధవారం నాడు స్పష్టం చేయడం ద్వారా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పాలకపక్ష బీజేపీకి వ్యతిరేకంగా మహా కూటమిని ఏర్పాటు చేయాలనుకున్న కాంగ్రెస్ పార్టీ ఆశలపై నీళ్లు చల్లారు. 543 లోక్‌సభ స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే 80 సీట్లు ఉన్నందున మాయావతి, కాంగ్రెస్ కలిస్తే మహా కూటమికే విజయావకాశాలు ఎక్కువని కాంగ్రెస్ సీనియర్ నేతలు భావిస్తూ వచ్చారు. ఇలా జరుగుతుందని వారు ఊహించలేక పోయారు.
పైగా మాయావతి, కాంగ్రెస్ పార్టీకి తల బిరుసుతనం ఎక్కువైందని, బీజేపీని ఓడించడంకంటే భాగస్వామ్య పక్షాలను ఓడించడం కోసమే పనిచేస్తోందని ఆరోపించారు. మాయావతి తీసుకున్న నిర్ణయం కారణంగా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కలిగే నష్టాలను పక్కన పెడితే మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గణనీయమైన నష్టం కలిగించే అవకాశం ఉంది. ఆ రాష్ట్రంలోని 52 జిల్లాలకుగాను 14 జిల్లాల్లో బీఎస్పీకి ఎక్కువ ప్రాబల్యం ఉంది. ముఖ్యంగా బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే దళితులు ఇప్పటికీ మాయావతితోనే ఉన్నారు. 2013లో జరిగిన ఎన్నికల్లోనే కాంగ్రెస్, బీఎస్పీ పార్టీలు కలసి ఉన్నట్లయితే బీజేపీకి గట్టి పోటీ ఇచ్చేవారు.
నాటి ఎన్నికల్లో మాయావతి పార్టీ నాలుగు సీట్లను గెలుచుకుంది. పది సీట్లలో రెండో స్థానంలో నిలిచింది. 17 సీట్లలో 20 వేలకుపైగా ఓట్లు, 62 సీట్లలో పదివేల ఓట్లకుపైగా సాధించింది. 6.42 శాతం మొత్తం ఓట్లలో మూడో స్థానంలో నిలిచింది. నాటి ఎన్నికల్లో పాలకపక్ష బీజేపీకి 44 శాతం ఓట్లురాగా, కాంగ్రెస్ పార్టీకి 36.79 శాతం ఓట్లు వచ్చాయి. వరుసగా 15 సంవత్సరాల పాటు అధికారంలో ఉండడం వల్ల ఈసారి రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ప్రజల నుంచి వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది.
మధ్యప్రదేశ్‌తోపాటు రాజస్థాన్‌లో కూడా మాయావతి ఎక్కువ సీట్లను డిమాండ్ చేయడం వల్ల ఇరు పార్టీల మధ్య పొత్తు కుదరలేదని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని కాంగ్రెస్ నాయకుడొకరు తెలిపారు. చౌహాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారని, ఈ దశలో మాయావతికి ఎక్కువ సీట్లు ఇచ్చిట్లయితే పాలకపక్షాన్ని ఓడించే అవకాశం జారిపోయే ప్రమాదం కూడా ఉంటుందని ఆయన అన్నారు. రాజస్థాన్ విషయంలో మాయావతి వైఖరి మరీ దారుణంగా ఉందని, గత ఎన్నికల్లో 200 సీట్లకుగాను కేవలం మూడు సీట్లను మాత్రమే గెలుచుకున్న ఆమె పార్టీ రాజస్థాన్‌లో కూడా ఎక్కువ సీట్లను అడగడం అర్థరహితమని ఆ నాయకుడు వ్యాఖ్యానించారు.
ఈ రాష్ట్రాలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న చత్తీస్‌గఢ్‌లో మాయావతి పార్టీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రెబెల్ అజిత్ జోగి పార్టీతోని ఎన్నికల పొత్తు పెట్టుకున్నారు. అక్కడ మాయా కూటమి వల్ల బీజేపీకే ప్రయోజనం కలుగుతుందని రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే చెప్పారు. కాంగ్రెస్–బీఎస్‌పీ కూటమి బలంగా ఉండాలని గాంధీలు కోరుకున్నారని, కొంత మంది సీనియర్ నాయకులు తమ పొత్తును దెబ్బకొట్టారని పరోక్షంగా దిగ్విజయ్ సింగ్‌ను ఉద్దేశించి మాయావతి వ్యాఖ్యానించారు. అంటే, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతోని పొత్తుకు అవకాశాలను అలా సజీవంగా ఉంచుకోవడానికే మాయావతి ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.
ఒక్క పార్టీతోనే ఎన్నికల పొత్తు పెట్టుకోవడంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం విఫలం అయినప్పుడు 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మహా కూటమిని ఎలా ఏర్పాటు చేయగలదని రాజకీయ పండితులు శంకిస్తున్నారు. ఏదేమైనా మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల పొత్తు చర్చల్లో మాయావతిని ఉద్దేశించి మాయా మర్మం లేనేలేదంటూ ఏం మాయ చేశావే! అంటూ కాంగ్రెస్ అధిష్టానంలోని నాయకులు కాస్త ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment