మాయావతికి షాకిచ్చిన ఎమ్మెల్యేలు! | Rajasthan BSP All 6 MLAs In Join Congress Party | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ పార్టీలో చేరిన బీఎస్పీ ఎమ్మెల్యేలు

Published Tue, Sep 17 2019 9:27 AM | Last Updated on Tue, Sep 17 2019 4:10 PM

Rajasthan BSP All 6 MLAs In Join Congress Party - Sakshi

జైపూర్‌ : బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతికి సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఝలక్‌ ఇచ్చారు. రాజస్తాన్‌లో ఆ పార్టీకి ఉన్న ఆరుగురు ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌తో సంప్రదింపులు జరిపిన తర్వాత తాము అధికార పార్టీలో చేరుతున్నట్లు రాజేంద్ర గడ్‌, జోగేంద్ర సింగ్‌ అవానా, వాజిబ్‌ అలీ, లఖన్‌ సింగ్‌ మీనా, సందీప్‌ యాదవ్‌, దీప్‌చంద్‌ ఖేరియా....శాసనసభ స్పీకర్‌ సీపీ జోషికి లేఖ రాశారు. ఈ సందర్భంగా రాజేంద్ర గడ్‌ మాట్లాడుతూ...‘మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నాం. రాష్ట్రంలో ప్రభుత్వం సుస్థిరంగా ఉండటంలో... రాష్ట్రాభివృద్ధిలో మా వంతు పాత్ర పోషించడానికి సిద్ధమవుతున్నాం. అశోక్‌ జీ అత్యుత్తమ ముఖ్యమంత్రి. రాజస్తాన్‌ను ఆయన కంటే గొప్పగా పాలించే సీఎం మరెవరూ లేరు. బయటి నుంచి ప్రభుత్వానికి మద్దతు తెలిపే బదులు పూర్తి స్థాయిలో సేవలు అందించేందుకు కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నాం అని పేర్కొన్నారు.(చదవండి : కశ్మీర్‌ పర్యటన; కాంగ్రెస్‌పై మాయావతి ఫైర్‌!)

కాగా రాజస్తాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీతో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్‌ పార్టీ 100 స్థానాలు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆరుగురు బీఎస్పీ, స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక గతేడాది మార్చిలో 12 మంది ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ కండువా కప్పుకోగా.. తాజాగా బీఎస్పీ ఎమ్మెల్యేలు కూడా అదే బాటలో నడవడంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం మరింత బలపడింది. కాగా జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు, రాష్ట్ర విభజనను సమర్థిస్తూ నరేంద్ర మోదీ సర్కారు తెచ్చిన బిల్లును మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ సమర్థించిన విషయం విదితమే. అదే విధంగా కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ ఆధ్వర్యంలో విపక్షాల బృందం కశ్మీర్‌ పర్యటనకు వెళ్లడాన్ని మాయావతి తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో బీఎస్పీ నేతలు కాంగ్రెస్‌ పార్టీలో చేరి ఆమెకు షాకిచ్చారు.

కాగా ఈ అనూహ్య పరిమాణంపై మాయావతి ట్విటర్‌లో స్పందిస్తూ.. మా పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్‌ మరోసారి విశ్వాసఘాతక పార్టీగా నిరూపించుకుందని మండిపడ్డారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి బేషరతుగా మద్దతు తెలిపిన మా పార్టీని కాంగ్రెస్‌ మోసం చేసిందని ఆరోపించారు. ప్రత్యర్థి పార్టీలపై గెలిచేందుకు సమర్థంగా పనిచేయాల్సింది పోయి.. మద్దతిచ్చిన వారికి హాని కలిగించడంపైనే కాంగ్రెస్‌ దృష్టి కేంద్రీకరించిందని తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement