కాంగ్రెస్ నుంచి అమిత్ జోగి బహిష్కరణ
న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత, ఛత్తీస్ గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ సింగ్ కుమారుడు అమిత్ జోగిపై బహిష్కరణ వేటు పడింది. ఎలక్షన్ టేప్ కాంట్రవర్సీ వ్యవహారంపై ఆయనను పార్టీ నుంచి ఆరేళ్లపాటు బహిష్కరిస్తూ కాంగ్రెస్ అధిష్టానం బుధవారం ఆదేశాలు జారీ చేసింది. అమిత్ జోగి మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి కుమారుడు. కాగా 2014 సెప్టెంబర్ 13న అంటాగర్ అసెంబ్లీ స్ధానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ జత కట్టాయన్న వార్తల నేపథ్యంలో ఆయనకు కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ షోకాజ్ నోటీసు ఇచ్చింది.
అమిత్ జోగి.. ప్రస్తుత ముఖ్యమంత్రి రమణ్ సింగ్తో భేటీ అయిన ఆడియో టేపులు విడుదల కావటంతో రాజకీయంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగిన మంటూరామ్ పవార్ పోటీ నుంచి తప్పుకోవటంతో కాంగ్రెస్ అధిష్టానం చర్యలకు దిగింది. కాంగ్రెస్ పోటీ నుంచి తప్పుకోవటానికి బేరసారాలు జరిగినట్లు ఆడియో టేపుల్లో స్పష్టమైంది. ఆ ఆడియో టేపులను ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రిక బయట పెట్టింది. దీంతో.. ఈ వ్యవహారం ఇప్పుడు ఛత్తీస్గఢ్లో సంచలనం సృష్టిస్తోంది.