ఛత్తీస్గఢ్ శాసనసభకు నేడు జరుగుతున్న రెండవ లేక తుది దశ పోలింగ్లో ఈ రోజు మధ్యాహ్నం వరకు నాలుగు మిలియన్ల మందికిపైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఓటర్లు పోలింగ్ బూత్ల వద్ద బారులు తీరారగా, మరికొన్ని చోట్ల చాలా అత్యల్పంగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి కుమారుడు అమిత్ జోగి బరిలో నిలిచిన మర్వాహి నియోజకవర్గంలో దాదాపు 40 శాతం మందికి పైగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అలాగే మహాసంముంద్ జిల్లాలోని సరైపల్లి నియోజకవర్గంలో ఓట్లర్లు అత్యల్పంగా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. రాష్ట్రంలో బిలాస్పూర్ నగరంలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ మినహా రాష్ట్రంలో ఎక్కడ ఎటువంటి చెదురుమదురు ఘటనలు చోటు చేసుకోలేదు. మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉన్న ఛత్తీస్గఢ్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ఎన్నికల సంఘం పటిష్టమైన చర్యలు చేపట్టింది. అందులోభాగంగా దాదాపు 3 వేల పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. అలాగే ఎక్కడికక్కడ భద్రత దళాలను మోహరించింది.
ఛత్తీస్గఢ్లో నగర, గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లు మధ్యాహ్నం నాటికి 13.9 మిలియన్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వారిలో 6.83 మంది మహిళలు ఉన్నారు. నేడు జరుగుతున్న రెండవ దశలో 72 శాసనసభ నియోజకవర్గాల్లో 843 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. అయితే నవంబర్ 11న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరిగిన మొదటి దశ ఎన్నికలను ఎన్నికల సంఘం నిర్వహించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 8వ తేదీన అభ్యర్థులు భవితవ్యం తెలనుంది.