♦ ఛత్తీస్‌గఢ్‌లో టేపుల దుమారం
♦ అంతాగఢ్ ఉప ఎన్నికలో సీఎం అల్లుడు, అజిత్‌లపై ఆరోపణలు
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో గతేడాది అంతాగఢ్ (ఎస్‌టీ) అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక ఫిక్స్ అయిందని.. అందులో రాష్ట్ర సీఎం రమణ్‌సింగ్ అల్లుడు పునీత్‌గుప్తా, కాంగ్రెస్ నేత అజిత్‌జోగి, ఆయన కుమారుడు అమిత్‌ల పాత్ర ఉందని తాజాగా బయటపడిన ఆడియో టేపుతో వివాదం రాజుకుంది. అందులో పునీత్, అజిత్, అమిత్‌ల టెలిఫోన్ సంభాషణలు ఉన్నాయని ఆరోపణలు గుప్పుమన్నాయి. అంతాగఢ్‌కు కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మాజీ సీఎం అజిత్‌జోగి వర్గానికి చెందిన మంతురామ్ పవార్ ఆఖరి క్షణాల్లో పోటీ నుంచి తప్పుకున్నారు. కాంగ్రెస్ ఆయన్ను అప్పుడే పార్టీ నుంచి బహిష్కరించింది.
అయితే.. పవార్ పోటీ నుంచి తప్పుకోవటంలో ఫిక్సింగ్ జరిగిందని, డబ్బులూ చేతులు మారాయని, దానికి సంబంధించి ఆయనతో పునీత్, అజిత్, అమిత్‌లతో పాటు అజిత్ అనుకూలురు పలువురు జరిపిన సంభాషణలు ఈ టేపులో ఉన్నాయని వివాదం చెలరేగింది. పీసీసీ చీఫ్ భూపేష్ బెఘేల్ అమిత్‌కు షోకాజ్ నోటీసు ఇచ్చి, వారంలో జవాబు ఇవ్వాలన్నారు. రమణ్‌సింగ్ అధికార దుర్వినియోగానికి పాల్పడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని.. ఆయనను సీఎం పదవి నుంచి తొలగించి, సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్‌తో విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఆరోపణలు నిరాధారమని, రమణ్‌సింగ్, అజిత్ అన్నారు. కాంగ్రెస్ అంతర్గత పోరుకు ఇది నిదర్శనమని బీజేపీ పేర్కొంది. టేపుల వ్యవహారంపై పార్టీ రాష్ట్ర విభాగం నుంచి నివేదిక వచ్చాక తీసుకోవాల్సిన చర్యలపై ఆలోచిస్తామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి బి.కె.హరిప్రసాద్ అన్నారు.
ఆ ఎన్నిక ‘ఫిక్స’యింది!
Published Thu, Dec 31 2015 1:35 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
Advertisement