బిహార్‌లోని రాంనగర్‌లో ప్రచారవేదికపై మోదీ, నితీశ్, రాంవిలాస్ పాశ్వాన్
బస్తి, ప్రతాప్‌గఢ్ (యూపీ)/వాల్మీకినగర్ (బిహార్): క్లీన్‌బౌల్డ్ అయ్యాక అంపైర్‌ను నిందించే బ్యాట్స్‌మన్‌లా, పరీక్షల్లో ఫెయిలై కుంటిసాకులు చెప్పే విద్యార్థిలా విపక్షాలు వ్యవహరిస్తున్నాయని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. అధికారం కోసం ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌లు విలువలకు తిలోదకాలిస్తున్నాయన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని బస్తి, ప్రతాప్‌గఢ్, బిహార్‌లోని వాల్మీకినగర్‌లో శనివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎనిమిది సీట్లకు పోటీ చేస్తున్నవారు కూడా ప్రధానిగా ప్రమాణం చేసేందుకు సిద్ధమవుతున్నారని మోదీ వ్యంగ్యంగా అన్నారు.
బీజేపీకి వ్యతిరేకంగా సమష్టి పోరాటం చేస్తున్న మహాకల్తీ కూటమి బంధం ఎంతోకాలం సాగదని మోదీ ఈ సందర్భంగా జోస్యం చెప్పారు. మహా కూటమి మహా అవినీతిని పెంచి పోషిస్తుందని అన్నారు. కాంగ్రెస్ ‘ఓటు కాట్వా’(ఓట్ల కోత) స్థాయికి దిగజారిపోయిందని, త్వరలోనే అది తన పతనాన్ని చూస్తుందని అన్నారు. ఒకపక్క కాంగ్రెస్‌తో ఎస్పీ మెతగ్గా వ్యవహరిస్తుంటే మరోపక్క బీఎస్పీ అధినేత్రి మాయావతి కాంగ్రెస్‌పై దాడి చేయడం గమనార్హమన్నారు. రఫేల్ విషయంలో తనను అపఖ్యాతి పాలుచేసేందుకు రాహుల్ ప్రయత్నించారంటూ.. ఆయన తండ్రి, మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీపై మోదీ విమర్శలు చేశారు.
రాజీవ్ గాంధీ మిస్టర్ క్లీన్ ఇమేజ్ చివరకు అవినీతి నంబర్ వన్ గా ముగిసిందని ఆరోపించారు. ఎస్పీ, బీఎస్పీల అవినీతిపై మోదీ ధ్వజమెత్తారు. ఎన్‌ఆర్‌హెచ్ కుంభకోణం, ఇసుక అక్రమ తవ్వకాలు, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేసిన తర్వాత కొన్ని వస్తువులు మాయం కావడం వంటివి ఆయన ప్రస్తావించారు. మహా కల్తీ కూటమితో పోల్చుకుంటే ఎన్డీయే పనితీరు విభిన్నమైనదని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు పాక్ చర్యలపై గగ్గోలు పెడుతుండేవని, శత్రు దేశం కంటే తమ ఓటు బ్యాంకే ప్రధానంగా భావించేవని విమర్శించారు.
కాంగ్రెస్ హయాంలో ఏర్పడిన తెలుగు రాష్ట్రాల్లో ఘర్షణ వాతావరణం
కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల మధ్య వైరుధ్యాన్ని మోదీ ప్రస్తావిస్తూ.. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఏర్పడిన కొత్త రాష్ట్రాలు ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లు తమ మాతృ రాష్ట్రాలతో ఎంతోబాగా మంచి సంబంధాలు కొనసాగిస్తున్నాయని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వేరుపడిందంటూ.. ఈ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఘర్షణ పూరిత వాతావరణం నెలకొందని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment