సాక్షి, అమరావతి: రాజకీయాల్లో మరెవరికో కొమ్ముకాయడానికి జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ తనను నమ్ముకున్న సామాజిక వర్గాన్ని నట్టేట ముంచేశారని బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. శుక్రవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో పవన్ సామాజికవర్గం వారు కూడా సీఎం కావాలనే ఉద్దేశంతో బీజేపీ 2014 సెప్టెంబరులో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ను తమ పార్టీతో కలిసిపోవాలని కోరిందని వీర్రాజు చెప్పారు. అప్పుడే గనుక పవన్‌కల్యాణ్ బీజేపీ ప్రతిపాదనకు అంగీకరించి ఉంటే ఇప్పుడు ఆ సామాజిక వర్గం కూడా సీఎం పదవి రేసులో ఉండేదని చెప్పారు.
రాజకీయాల్లో దార్శనికత గురించి చెప్పే పవన్‌కల్యాణ్ డబుల్ గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు. 2014లో పవన్‌క ల్యాణ్‌ను తానే నరేంద్రమోదీ వద్దకు తీసుకెళ్లానని, అప్పటి ఎన్నికల్లో బీజేపీ– జనసేన కలిసి పోటీ చేద్దామని ప్రతిపాదిస్తే.. పవన్‌కల్యాణ్ టీడీపీతో కలిసి మూడు పార్టీలు పోటీ చేయాలని సూచించారన్నారు. ఏడాది క్రితం జనసేన అవిర్భావ సభలోనూ తనను అభిమానించే సామాజికవర్గం చంద్రబాబుకు పూర్తి వ్యతిరేకంగా ఉందని గ్రహించి టీడీపీపై పవన్‌కల్యాణ్ విమర్శలు చేశారని.. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో టీడీపీకి లబ్ధి కలిగించేలా.. ఓట్లను చీల్చడానికే బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు.
కేంద్రం ఏపీ అభివృద్ధికి రూ. 6 లక్షల కోట్లు ఇస్తే ఆ నిధులన్నీ మింగేశారని.. రాజధానిలో ఇప్పటి వరకు ఒక్క శాశ్వత భవనం నిర్మించలేదని విమర్శించారు. ప్రత్యేక హోదాకు బదులుగా రూ. 17,500 కోట్ల ప్యాకేజిగా చంద్రబాబే విలువ కట్టారని.. కేంద్రం ఆరు లక్షల కోట్లు ఇచ్చిన తరువాత ప్రత్యేకహోదా డిమాండ్‌లో అర్ధం ఏముందని ప్రశ్నించారు. చంద్రబాబును కేంద్రం లక్ష్యంగా చేసుకోవాలనుకుంటే ఓటుకు నోటు కేసునే ఉపయోగించుకునేదని విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు బదులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment