యూపీలో బీజేపీకి షాక్‌ | BJP loses Gorakhpur, Phulpur bypolls; leaders say SP-BSP factor underestimated | Sakshi
Sakshi News home page

యూపీలో బీజేపీకి షాక్‌

Published Thu, Mar 15 2018 2:14 AM | Last Updated on Fri, Mar 29 2019 9:14 PM

BJP loses Gorakhpur, Phulpur bypolls; leaders say SP-BSP factor underestimated - Sakshi

ఉప ఎన్నికల్లో గెలుపుతో అలహాబాద్‌లో సమాజ్‌వాదీ కార్యకర్తల సంబరాలు

గోరఖ్‌పూర్‌/ఫుల్పూర్‌/పట్నా:  ఉత్తరప్రదేశ్‌లోని అధికార బీజేపీకి ఉప ఎన్నికల్లో ఊహించని పరాజయం ఎదురైంది. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు యూపీలో రిహార్సల్‌గా భావించిన ఎన్నికల్లో కమలదళానికి కోలుకోలేని దెబ్బతగిలింది. 30 ఏళ్లుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న గోరఖ్‌పూర్‌ పార్లమెంటు స్థానంతోపాటు, ఫుల్పూర్‌ ఎంపీ సీటుకు జరిగిన ఎన్నికల్లో ఎస్పీ–బీఎస్పీ కూటమి అఖండ విజయం సాధించింది. 20 ఏళ్లుగా ఉప్పు–నిప్పుగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), బహుజన సమాజ్‌ పార్టీ (బీఎస్పీ)లు చివరి నిమిషంలో కుదుర్చుకున్న వ్యూహాత్మక ఒప్పందం బీజేపీని దారుణంగా ఓడించింది.

గోరఖ్‌పూర్‌.. ప్రస్తుత యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కంచుకోట కావటం గమనార్హం. కాగా, ఈ రెండు స్థానాల్లో కాంగ్రెస్‌ డిపాజిట్లు కోల్పోయింది. దీంతో లక్నోలో ‘భువా (అత్త), భతీజా (అల్లుడు) జిందాబాద్‌’ నినాదాలు మార్మోగాయి. అటు బిహార్‌లో ఒక లోక్‌సభ, రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఆర్జేడీ, బీజేపీలు తమ స్థానాలను నిలబెట్టుకున్నాయి. గోరఖ్‌పూర్‌లో బీజేపీ అభ్యర్థి ఉపేంద్రదత్‌ శుక్లాను ఎస్పీ అభ్యర్థి ప్రవీణ్‌ కుమార్‌ నిషాద్‌ 21వేల ఓట్లతో ఓడించారు. అటు ఫుల్పూర్‌లో ఎస్పీ అభ్యర్థి నాగేంద్ర ప్రతాప్‌ సింగ్‌ పటేల్‌ తొలి రౌండ్‌ నుంచే బీజేపీ అభ్యర్థి కుశలేంద్రసింగ్‌పై ఆధిక్యాన్ని ప్రదర్శించారు. 59,613 ఓట్ల తేడాతో నాగేంద్ర ప్రతాప్‌ విజయం సాధించారు.

మఠానికి ఎదురుదెబ్బ!
లోక్‌సభ ఎన్నికల అనంతరం.. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీకి యూపీ ప్రజలు పట్టంగట్టారు. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల్లో పార్టీ విజయం నల్లేరుపై నడకే అవుతుందని భావించినా.. అది బెడిసి కొట్టింది. 1989 నుంచి గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్‌ మఠం ప్రధాన పూజారులే ఈ ఎంపీ స్థానాన్ని గెలుస్తూ వస్తున్నారు. అలాంటిది.. ఈ మఠం ప్రధాన పూజారిగా ఉన్న యోగి.. ప్రస్తుతం సీఎంగా ఉండగానే రికార్డు బద్దలై ఓటమిపాలవటం వ్యక్తిగతంగా ముఖ్యమంత్రికి ఇబ్బందికరమేనని రాజకీయ విశ్లేషకులంటున్నారు.

ఉప ఎన్నికల ప్రచారాన్ని యోగి అంతా తానై నడిపించారు. కేంద్రం నుంచి స్టార్‌ క్యాంపేనర్లు రాకుండానే బీజేపీ ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ప్రధాని మోదీ, పార్టీ చీఫ్‌ అమిత్‌ షాతో సహా కేంద్ర మంత్రులెవరూ ఈ రెండు స్థానాల్లో ప్రచారానికి వెళ్లలేదు. అటు, ఫుల్పూర్‌ స్థానం మొదటినుంచీ బీజేపీకి పెద్దగా పట్టులేని నియోజకవర్గమే. గతేడాది కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య గెలిచినప్పటికీ.. మొదట్నుంచీ ఇక్కడ ఎస్పీ, బీఎస్పీలే గెలుస్తూ వస్తున్నాయి.

కౌంటింగ్‌పై ఆందోళన
కౌంటింగ్‌ ప్రారంభం నుంచే తీవ్రమైన ఉత్కంఠతోపాటు గందరగోళం నెలకొంది. కౌంటింగ్‌ ప్రాంతానికి 15 అడుగుల దూరంలోనే మీడియాను ఆపేశారు. అంతటితో ఆగకుండా పరదాలు వేసి కౌంటింగ్‌ మీడియాకు కనబడకుండా చేశారు. అయితే ఈ విషయంపై పార్లమెంటుతోపాటు యూపీ అసెంబ్లీలో విపక్షాలు నిరసన చేపట్టడంతో ప్రభుత్వం, అధికారులు దిగొచ్చి మీడియాను లోపలకు అనుమతించారు.  

షాక్‌కు గురయ్యాం: బీజేపీ నేతలు
తాజా ఫలితాలపై యూపీ బీజేపీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘గోరఖ్‌పూర్‌ మొదట్నుంచీ మా కంచుకోట. యోగి ఆదిత్యనాథ్‌ వరుసగా నాలుగుసార్లు ఇక్కడినుంచి విజయం సాధించారు. ఎస్పీ ఓడిపోయేదే.. కానీ బీఎస్పీతో దోస్తీ వారికి కలిసొచ్చింది. మేం ఎక్కడ విఫలమయ్యామో సమీక్షించుకుంటాం. మేం సంతృప్తి చెందాల్సిన ఫలితాలు కావివి. మేం కొత్త వ్యూహాలను అనుసరించాల్సిన అవసరముంది’ అని యూపీ డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య పేర్కొన్నారు.  

బిహార్‌లో ఆర్జేడీ, బీజేపీ విజయం: బిహార్‌లోని జెహనాబాద్, భబువా అసెంబ్లీ స్థానాలకు, అరారియా లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆర్జేడీ, బీజేపీలు తమ స్థానాలను నిలబెట్టుకున్నాయి. జెహనాబాద్‌లో ఆర్జేడీ అభ్యర్థి ఉదయ్‌ యాదవ్‌.. జేడీయూ అభ్యర్థిపై 35వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. భబువాలో బీజేపీ అభ్యర్థి రింకీరాణి పాండే గెలిచారు. ఇటీవలే జేడీయూ నుంచి ఆర్జేడీలో చేరిన సర్ఫరాజ్‌ ఆలం.. బీజేపీ అభ్యర్థిపై 61,988 ఓట్ల తేడాతో గెలిచారు.

తప్పుగా అంచనావేశాం: యోగి
ఎస్పీ–బీఎస్పీ కూటమిని తక్కువగా అంచనా వేయటం వల్లే ఓటమిపాలయ్యామని యూపీ సీఎం యోగి పేర్కొన్నారు. ఈ ఓటమి బీజేపీకి ఓ గుణపాఠమన్నారు. ‘గోరఖ్‌పూర్, ఫుల్పూర్‌ల్లో ప్రజాతీర్పును గౌరవిస్తున్నాం. మితిమీరిన విశ్వాసం, ఎస్పీ–బీఎస్పీ కూటమి ప్రభావాన్ని అంచనావేయలేకపోవటమే మా ఓటమికి కారణం. విజేతలకు శుభాకాంక్షలు. బీఎస్పీ ఓటు.. ఎస్పీకి బదిలీ అవుతుందని అసలు ఊహించలేకపోయాం. వచ్చే ఎన్నికల్లో ఎస్పీ–బీఎస్పీ–కాంగ్రెస్‌ కూటములు కలిసి పోటీచేస్తే.. పరిస్థితి ఎలా ఉంటుందనే విషయాన్నీ సమీక్షించుకుంటాం.2019లో మళ్లీ మెజారిటీ సీట్లు గెలిచేందుకు ప్రత్యేక వ్యూహాలు రూపొందించుకుంటాం’ అని యోగి వెల్లడించారు.  

బీజేపీ అహంకార ఫలితమిది: అఖిలేశ్‌
యూపీలోని రెండు పెద్ద లోక్‌సభ సీట్లను గెలుచుకోవటంపై ఎస్పీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల ఫలితాలు బీజేపీ అహంకారపూరిత ప్రవర్తన, పరిపాలనపై అలక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ‘సీఎం, డిప్యూటీ సీఎం నియోజకవర్గాల్లోనే ప్రజాగ్రహం ఇలా ఉందంటే.. రాష్ట్రవ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా పరిస్థితి ఏంటనేది ఊహించుకోవచ్చు’ అని అఖిలేశ్‌ పేర్కొన్నారు. సంపూర్ణంగా మద్దతిచ్చిన మాయావతి ఆంటీకి కృతజ్ఞతలు అని చెప్పారు.

ఎస్పీ–బీఎస్పీ అనూహ్య నిర్ణయంతో..
గత పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాజయం పాలైన ఎస్పీ, బీఎస్పీలకు ఈ ఉప ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి. వీటిలో గెలవని పక్షంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ తమ ప్రభావం పెద్దగా ఉండబోదనే నిర్ణయానికి వచ్చాయి. అందుకే ఎలాగైనా బీజేపీని దెబ్బకొట్టేందుకు ఈ రెండు పార్టీలు ఏకమయ్యాయి. బీఎస్పీ పార్టీ తరపున అభ్యర్థులెవరూ బరిలో దిగకుండా.. ఎస్పీ అభ్యర్థికి మద్దతివ్వాలని నిర్ణయించాయి.

దీనికి ప్రతిగా వచ్చేనెల్లో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థులకు ఎస్పీ మద్దతివ్వాలనే ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందుకు తగ్గట్లుగానే ఇరుపార్టీలో క్షేత్రస్థాయిలో కలిసి ముందుకెళ్లి ఘన విజయం సాధించాయి. ఎన్నికల ప్రచారంలో ఆదిత్యనాథ్‌ ఎస్పీ, బీఎస్పీల దోస్తీని పాము, ముంగీస బంధంతో పోల్చారు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పడదని.. అయినా కలసి పోటీ చేయటం విడ్డూరమని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.  

2019లోనూ ‘పొత్తు’ పొడుస్తుందా?
యూపీ ఉప ఎన్నికల నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో కొత్త పొత్తులకు తెరలేవనుంది. బీజేపీని ఓడించేందుకు.. 20 ఏళ్లుగా బద్ధ శత్రువులైన ఎస్పీ, బీఎస్పీలు ఏకమవటం 2019 ఎన్నికల్లో జాతీయ రాజకీయ ఎన్నికల ముఖచిత్రంలో మార్పులను సూచిస్తోంది. మొదట ఈ ఎన్నికల వరకే సహకరించుకోవాలని అఖిలేశ్, మాయావతిలు నిర్ణయించుకున్నారు. అయితే తాజా ఫలితాలు, ఇలాంటి కూటమి అవసరంపై దేశవ్యాప్త చర్చ నేపథ్యంలో ఇరువురు నేతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేదానిపై ఆసక్తి నెలకొంది. అయితే.. రెండు బలమైన ప్రత్యర్థి ప్రాంతీయ పార్టీలు ఎంతకాలం ఒకే ఒరలో కొనసాగగలవనేదే ప్రశ్నార్థకం.

2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఈ పొత్తులు కొనసాగటం సాధ్యం కాకపోవచ్చు.. కానీ బీజేపీ జోరును అడ్డుకునేందుకు లోక్‌సభ ఎన్నికల వరకైనా కలిసే ముందుకెళ్లే అవకాశాలున్నాయి. బుధవారం రాత్రి మాయావతిని ఆమె నివాసంలో కలిసి అభినందించిన అఖిలేశ్‌.. దాదాపు 20 నిమిషాలసేపు వ్యక్తిగతంగా సమావేశమయ్యారు. కూటమి కొనసాగింపుపై ఈ భేటీలో చర్చ జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఢిల్లీలో సోనియాగాంధీ ఇచ్చిన విందుకూ ఇరుపార్టీల ప్రతినిధులూ హాజరయ్యారు. ఇది కూడా కాంగ్రెస్‌ నాయకత్వంలో బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటును బలపరిచే దిశగా ముందడుగేనని భావన వ్యక్తమవుతోంది.

‘వెయిట్‌ అండ్‌ సీ’
అయితే, కూటమిపై బయట చర్చ జరుగుతుండగానే అఖిలేశ్‌ సన్నిహితుడు, ఎస్పీ ఎంపీ రాంగోపాల్‌ యాదవ్‌ ‘పొత్తుపై వేచి చూడండి’ అని చెప్పటం 2019లో కలిసి పోటీచేసేందుకే మొగ్గు చూపుతున్నట్లు అర్థమవుతోంది. ఈ ఫలితాలు విపక్షాలన్నీ ఏకమైతే బీజేపీకి చిక్కులు తప్పవనే సంకేతాలను ఇస్తున్నాయి.

కమలంలో అంతర్మథనం
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: యూపీ ఉప ఎన్నికల్లో ఓటమిని  బీజేపీ అధిష్టానం జీర్ణించుకోలేపోతోంది. గత పార్లమెంటు ఎన్నికల్లో యూపీలోనే ఎక్కువ స్థానాలను గెలుపొంది కేంద్రంలో సొంతంగా మెజారిటీని సాధించిన బీజేపీ.. ఇప్పుడు ఆ యూపీలోనే ఓడిపోవటంతో ఆత్మరక్షణలో పడింది. యూపీలో ఎంపీ స్థానాలు, తర్వాత అసెంబ్లీకి, స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లోనూ బీజేపీ ఏకపక్షంగా దూసుకుపోయింది. అలాంటిది.. సీఎం, డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహించిన స్థానాల్లో ఇప్పుడు ఓడిపోవటం ఆ పార్టీని కలవరానికి గురిచేసింది. ఈ ఫలితాలు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో ప్రభావం చూపించవచ్చని, దీంతోపాటుగా మోదీ, అమిత్‌షాల నాయకత్వానికి సవాల్‌ విసిరే అవకాశముందన్న రాజకీయ విశ్లేషణలూ బీజేపీలో అంతర్మథనానికి కారణమయ్యాయి. ‘ఫలితాలను ఊహించలేదు. ఆత్మపరిశీలన చేసుకుంటాం’ అని బీజేపీ ముఖ్యనేత ఒకరు తెలిపారు.  

జిల్లా నేతల్లో విభేదాలు
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఎన్నికల ఫలితాలు రాగానే అమిత్‌ షా హుటాహుటిన ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటుచేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభ సభ్యుడు ఓపీ మాథుర్‌ను యూపీ ఎన్నికల ఇంచార్జ్‌ బాధ్యతల నుంచి తప్పించినట్లు తెలిసింది. యూపీలోని చాలా జిల్లాల్లో నేతల మధ్య విభేదాలు తారస్థాయిలో ఉన్నట్లు అధిష్టానం గుర్తించింది. వారంతా ఈ ఫలితాలపై సంతృప్తితో ఉన్నట్లు ఢిల్లీకి సమాచారం వచ్చింది. ఇది బీజేపీ అధిష్టానానికి, యూపీ సీఎం ఆదిత్యనాథ్‌కు పెద్ద సవాల్‌గా మారనుంది. వచ్చే ఎన్నికల్లో సామాజిక సమీకరణ వ్యూహాన్ని మార్చి.. జాటవేతరులు, యాదవేతర ఓబీసీలను ప్రోత్సహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఎస్పీ, బీఎస్పీ జతకట్టడం.. కాంగ్రెస్‌ కూడా లోపాయికారిగా వీరికి సహకరించటం ద్వారా బీజేపీ ఓడిందనే విషయాన్ని పక్కన పెడితే.. ప్రాంతీయ పార్టీలతో నేరుగా తలపడిన ప్రతిసారీ బీజేపీ ఓడిపోయిన విషయాన్ని మరవొద్దని.. విపక్షాలు చీలినప్పుడే బీజేపీ గెలిచిందని ఎస్పీ ఎంపీ ఒకరు తెలిపారు.  అసలేం జరిగుంటుందనే దానిపై ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో మేధోమథనం జరుగుతోంది. యూపీలో ఎవరు అధికారంలోకి రావాలన్నా కుల సమీకరణాలు చాలా కీలకం. అలాంటిది.. ఈ ఎన్నికల్లో బీజేపీ కుల సమీకరణాలను సరిగ్గా పట్టించుకోకపోవటమూ ఓటమికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అటు, రాష్ట్ర నాయకత్వం మితిమీరిన విశ్వాసం కారణంగా క్షేత్రస్థాయిలో కార్యకర్తల నుంచి సహకారం లోపించిందని బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం.

ఈ ఫలితాలు పునరావృతమైతే..
ఒకవేళ యూపీలో గతంలోలాగా ఎక్కువసీట్లు గెలవలేని పక్షంలో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రావటం కష్టమే. అలాంటప్పుడు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలూ లేకపోలేదు. తెరపైకి మూడోఫ్రంట్‌ రావొచ్చనే చర్చా జరుగుతోంది. ఇదంతా ప్రస్తుత పరిస్థితిపై విశ్లేషకుల అభిప్రాయం మాత్రమే. ఎన్నికల నాటికి పరిస్థితుల్లో మార్పు ఉండొచ్చు. గుజరాత్‌ ఎన్నికల తర్వాత విపక్షాలను ఒక్కటొక్కటిగా కూడగడుతున్న కాంగ్రెస్‌.. తాజా ఫలితాలతో మరింత దూసుకుపోయే అవకాశాలున్నాయి. యూపీలో ఎస్పీ, బీఎస్పీలతో కలసి కాంగ్రెస్‌ కూటమిగా ముందుకెళ్లాలని భావిస్తోంది.

                              గోరఖ్‌పూర్‌లో ఎస్పీ అభ్యర్థి ప్రవీణ్‌ కుమార్‌ నిషాద్‌,  ఫుల్పూర్‌లో ఎస్పీ అభ్యర్థి నాగేంద్ర ప్రతాప్‌ సింగ్‌ పటేల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement