నేర రాజకీయాల పర్యవసానం! | Shekhar Gupta Guest Column On Political Leaders | Sakshi
Sakshi News home page

నేర రాజకీయాల పర్యవసానం!

Published Sat, Aug 3 2019 12:42 AM | Last Updated on Sat, Aug 3 2019 12:42 AM

Shekhar Gupta Guest Column On Political Leaders - Sakshi

హిందీ ప్రాబల్యప్రాంతంలో ముగ్గురు ప్రత్యేక నేతలు కులదీప్‌ సింగ్‌ సెంగార్, సంజయ్‌ సింహ్, సాక్షి మహరాజ్‌ సింగ్‌. వక్రమార్గం పట్టిన భారత రాజకీయాలకు వీరు సమకాలీన ప్రతీకలు. రాజకీయ ఫిరాయింపులు, నేరమయ రాజకీయాలు, అవినీతి, హత్యలు, అత్యాచారాలు, దోపిడి, వంచన వంటి సమస్త అనైతిక చర్యల కలబోత వీరు. ఈ లక్షణాలను కలిగి ఉంటూనే గత మూడు దశాబ్దాలుగా వారు ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో వెలుగొందుతున్నారు. భారత రాజకీయాల గురించి వీరు మనకు చెబుతున్నదేమిటి? మొదటిది ఏమిటంటే గెలుపుతత్వం ఒక్కటే రాజకీయ నీతిగా మారి పార్టీలు దాన్ని మాత్రమే చూస్తున్నాయి. నేరతత్వం, లెక్కలేనన్ని అత్యాచారాలకు పాల్పడటం అనేవి ఎవరూ లెక్కించలేదు.

హిందీ ప్రాబల్య ప్రాంతంలో గెలుపుతత్వానికి సంబంధించిన లక్షణాలు... కులం, స్థానిక ఓటు.. ఇవి ఉంటే ఏమైనా చేయవచ్చు. కులదీప్‌ సింగ్‌ సెంగార్, సంజయ్‌ సింహ్, సాక్షి మహరాజ్‌ సింగ్‌ అనే ఈ ముగ్గురి బాగోతాలను కాస్త పరిశీలించండి. వర్తమాన రాజకీయాలు, పోలీసింగ్, న్యాయవ్యవస్థ, బీజేపీ తీరుతెన్నులను అచ్చుగుద్దినట్లు వెల్లడించే గాథలు వీరి సొంతం మరి. ఈ ముగ్గురు ఫిరాయింపుదార్లే ఇవాళ మన రాజకీయసంబంధిత ప్రధాన శీర్షికలలో వెలిగిపోతున్నారు. వీరిలో మొదటివారు, అపఖ్యాతిని మూట గట్టుకున్నవారు అయిన కులదీప్‌ సింగ్‌ సెంగార్‌ ఉన్నావ్‌ అత్యాచార–హత్యా కేసుల్లో మునిగితేలుతున్నారు. ఇక రెండోవారు అమేథీ మాజీ రాజా, ఎంపీ, మాజీ మంత్రి సంజయ్‌ సింహ్‌. మునిగిపోతున్న కాంగ్రెస్‌ నావ నుంచి ఫిరాయించి బీజేపీలోకి గెంతేశారు. మూడవవారు సాక్షి మహరాజ్‌. పార్లమెంటరీ ఎన్నికలల్లో ఉన్నావ్‌ నియోజకవర్గ ఎంపీగా గెలిచారు. ఈయన రాజీకయంగాను, నేరపూరితంగానూ ఇటీవలి కాలంలో పెద్దగా తప్పు చేసిందేమీ లేదు. అడపాదడపా చేసే కువ్యాఖ్యలు, అప్రతిష్టాకరమైన మాటలకు మాత్రమే తనది బాధ్యత. లోక్‌సభ ఎన్నికల్లో తనకు పూర్తి మద్దతునిచ్చినందుకుగానూ జైలుకెళ్లి మరీ సెంగార్‌కి కృతజ్ఞతలు చెప్పివచ్చిన పెద్దమనిషి ఇతడు. 

 ముగ్గురు నేతలూ తమ బాధ్యతలను పూర్తిగా విస్మరించారనే చెప్పాలి. వీరిపై పూర్తిగా లేక పాక్షికంగా పరిష్కృతం కాని హత్యానేరాలు ఆరు ఉన్నాయి. లేక హత్యా నేరారోపణల్లో వీరికి పాత్ర ఉంది. వీరు చేసిన హత్యల్లాగే మరో మూడు అత్యాచార కేసులు కూడా ఇంకా కొలిక్కి రాలేదు. పైగా ఈ ముగ్గురికీ ఇప్పటికీ మంచి డిమాండ్‌ ఉంటోంది. తమ సొంత కులానికి చెందిన ఓట్లు వీరు గుప్పిట్లోనే ఉంటున్నాయి. పైగా డబ్బు ఆశ చూపి ఓట్లు రాబట్టడం కూడా తెలుసు. చట్టాన్ని ఎలా ఎదుర్కోవాలో వారికి కొట్టినపిండి. అన్ని రాజకీయ పార్టీలు తమనే కోరుకునే ప్రత్యేక గుణాలు వీరి సొంతం. యోగ్యత, నిజాయతీ, నైతికత ఇవి లేకున్నా గెలుపు సాధించడం కూడా వీరికి తెలిసిన విద్యే. ఎట్టకేలకు ఈ ముగ్గురూ బీజేపీలో కలిసిపోయారు. 48 గంటలకు ముందుగా సెంగార్‌పై బీజేపీ బహిష్కరణ వేటు వేసింది. నేరస్తుడిగా, డాన్‌గా లేక బాహుబలిగా (హిందీ ప్రాబల్య ప్రాంతంలో ఇతడిని ఇదే పేరుతో పిలుస్తారు) ఇతడి జీవితం నేరపూరితమైందని మనకు స్థిరమైన అభిప్రాయం ఉంది.

అందుకనే  వైవిధ్యపూరితమైన, వర్ణరంజితంతో కూడిన అతడి జనరంజక ప్రజా జీవితం గురించి, మనం నిర్లక్ష్యం వహిస్తున్నాం. 2002లో స్థానిక దాదాగా ఉన్న ఇతడు తొలిసారిగా బీఎస్పీ తరపున నిలిచి ఉన్నావ్‌ నుంచి గెలుపొందారు. అతడు మొదట్లో సమాజ్‌వాదీ పార్టీలోకి ఫిరాయించాడు. 2007, 2012లో బంగేర్‌మావు, భాగవత్‌ నగర్‌ నియోజకవర్గాలనుంచి గెలుపొందారు. ఉత్తరప్రదేశ్‌లో ప్రత్యేకించి యాదవులు, రాజపుత్రులకు చెందిన మాఫియా నేరస్తులను సమాజ్‌వాది పార్టీ పెంచి పోషించేదని అందరూ అంగీకరిస్తారు. అయితే 2017లో మారుతున్న పరిణామాలను గమనించి బీజేపీలోకి చెక్కేసి అక్కడా ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదే సంవత్సరం అంటే బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన మూడునెలలకు ఆ దురదృష్టపు అమ్మాయి ఉద్యోగం కోసం సహాయం చేయమంటూ అతడి వద్దకు వచ్చినప్పుడు అతడు తనపై అత్యాచారం సల్పాడని ఆరోపిం చింది. ఆ తర్వాత తన కన్నీళ్లు తుడిచి, సహాయం చేస్తానని, ఉద్యోగం వెదికి పెడతానని మాట ఇచ్చాడని పేర్కొంది. 

ఇక సంజయ్‌ సింగ్‌ విషయానికి వస్తే చాలా పార్టీలు మారాడు. బాగా పేరొందిన ఒక హత్య కేసులో అతడికి సంబంధముందని ఆరోపణలు వచ్చాయి. తర్వాత అవి వీగిపోయాయనుకోండి. జాతీయ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ సయ్యద్‌ మోదీని 1988 జూలై 28న సుఫారీ ఇచ్చి మరీ చంపించిన ఘటనలో సంజయ్‌ ప్రధాన అనుమానితుడు. అయితే దీనికి సాక్ష్యాధారాలు కనుగొనడంలో యూపీ పోలీసు శాఖ, సీబీఐ రెండూ విఫలమైనందున కేసు వీగిపోయింది. నేరం రుజువయ్యేం తవరకు  నిందితుడు అమాయకుడేనని మనం అంగీకరిస్తాం కదా. తుపాకులతో కాల్చడం వాస్తవం, హత్య జరగడం వాస్తవం కానీ ఎవరు ఆ పనికి ప్రేరేపించారో తెలీదు. కనుగొనలేదు. ఆ కేసులో ఒక హంతకుడికి శిక్షపడింది. మరొకరు విచారణ సమయంలోనే చనిపోయాడు. 

హత్య జరిగిన కొంతకాలానికే సయ్యద్‌ మోదీ భార్య అమీతా మోదీని సంజయ్‌ సింగ్‌ పెళ్లాడాడు. ఈ హత్యకేసు విచారణను సీబీఐకి అప్పగించిన సమయంలోనే వీపీసింగ్‌ కాంగ్రెస్‌కి ఎదురుతిరిగి తానే ప్రధానమంత్రి అయ్యారు. సంజయ్‌ సింగ్‌కు వీపీసింగ్‌ దూరపు బంధువు కావడంతో సంజయ్‌ కూడా కాంగ్రెస్‌ నుంచి బయటకొచ్చి తన మామయ్య చెంత చేరాడు. సరిగ్గా దశాబ్దం తర్వాత ఇతడు బీజేపీలోకి మారాడు. 1988లో అమేధీనుంచి గెలిచి కాంగ్రెస్‌ నేత సతీష్‌ శర్మను ఓడించాడు. కానీ వాజ్‌పేయి ప్రభుత్వం లోక్‌సభలో ఒక ఓటు తేడాతో ప్రభుత్వాన్ని కోల్పోయింది. తర్వాత 1999 ఎన్నికల్లో సంజయ్‌ సింగ్‌ ఒకప్పటి తన స్నేహితుడు, బోధకుడు అయిన రాజీవ్‌ గాంధీ సతీమణి సోనియాపైనే రాయ్‌బరేలీలో బీజేపీ తరపున పోటీ చేశాడు.

ఎందుకైనా మంచిదని సోనియా దక్షిణాదిలో బళ్లారి నుంచి కూడా పోటీకి తలపడ్డారు. ఆ నేపథ్యంలో సంజయ్‌ సింగ్‌ను చూసి భీతిల్లిన సోనియా బళ్లారికి పారిపోయిందంటూ నినాదం పుట్టుకొచ్చింది. కానీ సోనియా రెండు చోట్లా గెలిచారు. అయితే గాలి మళ్లీ కాంగ్రెస్‌ వైపు తిరుగుతుందని గ్రహించగానే సంజయ్‌ సింగ్‌ 2003లో మళ్లీ కాంగ్రెస్‌లోకి దూకాడు. 2009లో రాయ్‌ బరేలీ, అమేధీ పక్కన ఉండే  సుల్తాన్‌పూర్‌ నుంచి కాంగ్రెస్‌ తరపున పోటీ చేసి గెలిచాడు. అయిదేళ్లు గడిచాక 2014లో యూపీలో కాంగ్రెస్‌ ఊచకోతకు గురయ్యాక అసోం నుంచి కాంగ్రెస్‌ తరపున రాజ్యసభ  సభ నామినేషన్‌ గెల్చుకున్నాడు. ఇక 2019లో ఈ టర్మ్‌ కూడా ముగిశాక, గాంధీ కుటుంబం పని పూర్తయ్యాక, మళ్లీ బీజేపీలో కొత్త మామయ్యలను వెదికి పట్టి దూరిపోయాడు. 

ఇక సాక్షి మహరాజ్‌. బీజేపీ మాజీ సీఎం కల్యాణ్‌ సింగ్‌ కులానికి చెందిన వెనుకబడిన లోధ్‌ కమ్యూనిటీలో స్టార్‌లాగా ఎదిగివచ్చాడు. 1991, 96 లోక్‌ సభ ఎన్నికల్లో బీజేపీ  తరపున గెలిచాడు. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో నిందితుడైన సాక్షి మహరాజ్‌ సైద్ధాంతిక పవిత్రత ఉన్నవాడిగా కనిపిస్తాడు. కానీ అతని నిబద్ధత బీజేపీనుంచి మళ్లీ  టికెట్‌ సాధించలేకపోయింది. తనకు టికెట్‌ ఇవ్వలేదు కాబట్టి బీజేపీ పేదల వ్యతిరేక పార్టీగా మారిపోయిందని ఆరోపిస్తూ సమాజ్‌వాదీ పార్టీలోకి చెక్కేశాడు. అసలు కారణం  ఏమిటంటే నాటి ప్రధాని వాజ్‌పేయి సన్నిహితుడైన బ్రహ్మదత్‌ ద్వివేదీ హత్య కేసులో సాక్షి ఒక నిందితుడు. 2000 సంవత్సరంలో ములాయం సింగ్‌ యాదవ్‌ అతడిని రాజ్యసభకు పంపారు.

ఈ క్రమంలో తనపై పాత హత్యా కేసు వీగిపోయింది. అయితే తర్వాత కూడా అలాంటి నేర  చర్యలనుంచి పక్కకు తప్పుకోలేదు. తన తోటి మేనల్లుళ్లతో కలిసి ఒక కాలేజీ ప్రిన్సిపాల్‌పై సామూహిక అత్యాచారం జరిపిన కేసులో బుక్కయ్యాడు. 2002 నాటికి సమాజ్‌ వాదీ పార్టీ రంగు వెలిసిపోతోందని గ్రహించాక ములాయంపైనే బోలెడు ఆరోపణలు గుప్పించి బీజేపీ తిరుగుబాటు నేత కల్యాణ్‌ సింగ్‌ స్థాపిం చిన రాష్ట్రీయ  క్రాంతి పార్టీలో చేరిపోయాడు. ఇది లోధీల పార్టీ అని చెప్పనక్కరలేదు. తర్వాత కూడా సాక్షి హవా కొనసాగింది. ఒక నకిలీ ఎన్జీవో సంస్థను స్థాపించి అక్రమంగా రూ.25 లక్షలను వసూలు చేసిన కేసులో నాటి ప్రభుత్వం సాక్షిపై ఆరోపణలు చేసింది. ఇతడితోబాటు తన అనుయాయి అయిన సుజాత వర్మను కూడా ఈ కేసులో నిందితులుగా ఆరోపించారు.  2012లో సాక్షి మహారాజ్‌ మళ్లీ బీజేపీలో చేరాడు. కొద్దికాలం లోపే సుజాత వర్మ హత్యకు గురయ్యారు. సాక్షి అనుయాయులే హంతకులుగా ఆరోపణలకు గురయ్యారు. 

ఈ కేసులో సాక్షి మహరాజ్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. తర్వాత లొంగిపోయి బెయిల్‌పై బయటకు వచ్చాడు. తనపై ఎఫ్‌ఐఆర్‌ని కొట్టివేయాలని అలహాబాద్‌ హైకోర్టులో ఇతడు  వేసిన పిటిషన్‌ని కోర్టు కొట్టివేసింది. ఆ తర్వాతి సంవత్సరం బీజేపీ నుంచి లోక్‌సభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశాడు. అలా అతడి గౌరవాన్ని మళ్లీ నిలబెట్టారు. ఇంతటి  నేరమయ కెరీర్‌ కలిగిన సాక్షి మహరాజ్‌ని సీతాపూర్‌ జైలుకెళ్లి తన గెలుపుకు దోహదం చేసిన కులదీప్‌ సింగ్‌ సెంగార్‌కు ధన్యవాదాలు చెప్పాడంటూ మనం అమాయకంగా ఆరోపిస్తున్నాం మరి. భారత రాజకీయాల గురించి వీరు మనకు చెబుతున్నదేమిటి? గెలుపుతత్వం ఒక్కటే రాజ కీయ నీతిగా మారి పార్టీలు దాన్ని మాత్రమే చూస్తున్నాయి. నేరతత్వం, లెక్కలేనన్ని అత్యాచారాలకు పాల్పడటం అనేవి ఎవరూ లెక్కించలేదు.

హిందీ ప్రాబల్య ప్రాంతంలో గెలుపుతత్వానికి సంబంధించిన లక్షణాలు ఏమిటి? స్థానిక వోటు బ్యాంకును నిర్మించుకోవడం. దానికి కులం, మాఫియా ప్రాతిపదిక కావటం. రెండూ కలిసివుంటే మరీ మంచిది. అప్పుడే మీరు గెలిచే వ్యక్తి కాగలరు. లేదా ఇతరుల గెలుపుకు, ఓటమికి ముఖ్య పాత్ర కాగలరు. అప్పుడు అన్ని పార్టీలు మీకోసం క్యూ కడతాయి. వాటిలో గెలిచే పక్షమేదో మీరు సంతోషంగా ఎంచుకోవచ్చు. ఈ క్రమంలో మీరు ఏమైనా చేయవచ్చు. హత్య, అత్యాచారం, దోపిడీ, దొమ్మీ, మోసం, దురాక్రమణ దేనికైనా మీరు పాల్పడవచ్చు. చిన్నస్థాయినుంచి వచ్చిన ఒక టీనేజ్‌ బాలిక వెంటిలేటర్‌ గుండా శ్వాస పీల్చుకుంటున్న స్థితిలో, ఆమె తండ్రితోపాటు కుటుంబంలోని చాలామంది హత్యకు గురైన స్థితిలో మీ ప్రాభవం మొత్తం క్షణాల్లో కరిగిపోవచ్చు. ఉన్నావ్‌ ఘటన రగిలించిన న్యాయం ఇదే మరి.


వ్యాసకర్త :శేఖర్‌ గుప్తా,ద ప్రింట్‌ చైర్మన్, ఎడిటర్‌–ఇన్‌–చీఫ్‌, twitter@shekargupta


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement