సల్లగసూడు తల్లీ!
రాజధానితోపాటు భివండీ ప్రాంతాల్లో ఉంటున్న తెలంగాణ ప్రజలు ఆదివారం బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పోచమ్మకు బోనాలు, జంతుబలులతో మొక్కులు తీర్చుకున్నారు.
సాక్షి, ముంబై: తెలంగాణ ప్రజల పర్వదినాల్లో ముఖ్యమైన బోనాల ఉత్సవాల్లో భాగంగా ముంబై, ఇతర ప్రాంతాల్లోని తెలంగాణ ప్రజలు పోచమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఏటా ఆశాఢమాస పౌర్ణమి మరుసటి రోజు నుంచి దాదాపు 15 రోజుల వరకు పోచమ్మకు బోనాలు, జంతుబలులతో తెలంగాణవాసులు మొక్కులు తీర్చుకుంటా రు. కామాటిపుర, వర్లీ, దాదర్, పరేల్ తదితర ప్రాం తాలకు చెందిన అనేక మంది వేడుకలకు వచ్చారు.
వందలాది మంది మహిళలు నెత్తిన బోనాలు పెట్టుకుని బ్యాండుమేళాలతో ఊరేగింపుగా మందిరాలకు వెళ్లారు. అనంతరం అక్కడ ప్రత్యేకంగా చేసిన బోనాలతోపాటు నైవేద్యం సమర్పించి పూజలు చేసి కోళ్లు, మేకలను బలిచ్చారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజ లు పోచమ్మ బోనాలను జరుపుకుంటున్నారు. ఈయేడు తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పాటు కావడంతో వీరిలో కొత్త ఉత్సాహం కనిపించింది.
బోయివాడలో...
పరేల్ బోయివాడలో ‘టర్నర్ సానెటోరియం తెలు గు సంఘం’ ఆధ్వర్యంలో ఆదివారం పోచమ్మ బోనాల పండుగ ఘనంగా జరిగింది. నల్గొండ జిల్లా కు చెందిన ప్రజలు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉన్నారు. వీరంతా సుమారు 50 ఏళ్ల కిందటే సం ఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి నుంచి బోయివాడ అవరణలో శ్రీ పోచమ్మ దేవిని కొలుస్తున్నారు. ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఆషాఢమాసంలో ప్రత్యేకంగా పోచమ్మ బోనాల ఉత్సవాలు నిర్వహించినట్టు సంఘం ప్రధాన కార్యదర్శి కొండ సత్యనారాయణ తెలిపారు.
పోచమ్మ పండుగను పురస్కరించుకుని పిల్లపాపలతోపాటు కుటుంసభ్యులంతా పోచమ్మకు ప్రార్థనలు చేశారు. ప్రతి ఒక్కరూ సంప్రదాయ దుస్తుల్లో కనిపించడంతో తెలంగాణలో ఉన్న అనుభూతి కలిగింది. ఇక్కడి పోచమ్మ తల్లిని స్థానిక భక్తులే కాకుండా ముంబైలోని ఇతర ప్రాంతాల్లోని తెలుగు ప్రజలు దర్శించుకుంటారు. ఈ ఉత్సవాలకు సంఘం అధ్యక్షుడు తీరందాస్ సత్యనారాయణ, కార్యదర్శులు శ్రీపతి సహదేవ్, ఆడెపు దయానంద్, కోశాధికారి సంగిశెట్టి ధనంజయ్ ఏర్పాట్లు చేశారు.
భివండీలో..
పట్టణంలోని తెలుగు ప్రజలు పోచమ్మ పండుగను ఆదివారం వైభంగా నిర్వహించారు. పద్మనగర్‌లో ఉంటున్న తెలుగు ప్రజలు వరాలదేవి మందిరం వద్ద అమ్మవారి దర్శనం కోసం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బారులు తీరారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా స్థానిక తెలుగు కార్పొరేటర్ మురళి మచ్చ, లక్ష్మీ అశోక్ పాటిల్ వరాలదేవి మందిరం వద్ద భక్తులు ఇబ్బం దులు పడకుండా తగు చర్యలు చేపట్టారు.
భివండీచుట్టు పక్కల ప్రాంతాలు కామత్‌ఘర్, బండారి కంపౌండ్, పద్మనగర్, కన్నేరి వంటి దూర ప్రాం తాల నుంచి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు వర్షంలో తడవకుండా మందిర ప్రాంగణంలో మండపాలు వేసి మంచినీటి సదుపాయాలు కల్పించారు. భివండీ తెలుగు సమాజ్ (బీటీఎస్) కార్యవర్గ సభ్యులు..భక్తులు దొంగలబారిన పడకుండా నిరోధించడానికి ప్రత్యేకంగా వాలంటీర్లను నియమించారు. పారిశుద్ధ్యానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు.