బోనమెత్తిన నగరం
- అంగరంగ వైభవంగా గోల్కొండలో ప్రారంభం
- తెలంగాణ రాష్ట్రంలో తొలి పండుగకు పోటెత్తిన భక్త జనం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రాష్ర్ట పండుగగా గుర్తించిన బోనాల ఉత్సవం ఆదివారం హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో అంగరంగవైభవంగా ప్రారంభమైంది. తెలంగాణ ప్రజల సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టే ఈ ఉత్సవాలు ఈసారి కొత్త శోభను సంతరించుకున్నాయి. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి లంగర్‌హౌస్ చౌరాస్తా నుంచి అమ్మవారి తొట్టెలను, ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ప్రథమ నజర్ బోనాలను ఊరేగింపుగా గోల్కొండ కోటకు తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించడంతో ఉత్సవాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి.
గోల్కొండ కోటలో కొలువుదీరిన శ్రీజగదాంబిక మహంకాళి అమ్మవార్ల బోనాల ఉత్సవాలకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. పోతరాజుల నృత్యాలు, ఒగ్గు కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మహిళలు నగినాబాగ్‌లోని నాగదేవత పుట్టకు పూజలు నిర్వహించి తలలపై బోనం పెట్టుకుని అమ్మవార్ల ఆలయానికి చేరుకున్నారు. 23 కుల వృత్తుల వారు అమ్మవారికి నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలంగాణ సంసృ్కతీ సంప్రదాయాలకు అద్దం పట్టే బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుని వాటి వైభవాన్ని ప్రపంచ దేశాలకు చాటుదామని ఉత్సవాలను ప్రారంభించిన హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు.
బోనాలు, రంజాన్ పండుగలకు భారీ భద్రత
బోనాలు, రంజాన్ పండుగలను పురస్కరించుకుని భారీ బందోబస్తు ఏర్పాటుచేయాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లతో పాటు, అన్ని జిల్లాల ఎస్పీలకు తెలంగాణ రాష్ర్ట డీజీపీ అనురాగ్ శర్మ ఆదివారం ఆదేశాలు జారీచేశారు.అసాంఘిక శక్తులపై కన్నేసి ఉంచాలని, గస్తీని ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఈ విషయంలో నిఘా విభాగం సైతం అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు.