భివండీ, న్యూస్‌లైన్: గ్రే వస్త్రాలకు డిమాండ్ తగ్గిన నేపథ్యంలో ఉత్పత్తి తగ్గిద్దామని తెలుగువారికి చెందిన పవర్‌లూమ్ పరిశ్రమల యజమానులు నిర్ణయించారు. ఈ మేరకు శనివారం వారు పట్టణంలోని పద్మశాలి సమాజ్ యువక్ మండలి కార్యాలయంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు వ్యాపారులు మాట్లాడుతూ.. మూడు నెలలుగా గ్రే వస్త్రాల మార్కెట్ పడిపోవడంతో మీటర్‌కు రూ.8-12 వరకు నష్టం వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం వస్త్రాల డిమాండ్ తగ్గినందున యధావిధిగా ఉత్పత్తి కొనసాగిస్తే మరింత నష్టాల పాలవుతామని వ్యాపారులు అభిప్రాయపడ్డారు. త్వరలో మజూరీ వీవర్స్‌తో చర్చించి కనీసం వారానికి ఒక రోజైనా పరిశ్రమల బంద్ పాటిస్తే కాస్త నష్టాల నుంచి బయటపడే అవకాశముందని వారు ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు మజూరీ వీవర్స్‌తో చర్చించేందుకు యజమానుల తరఫు నుంచి యెల్ల సాగర్, వల్లాల్ శ్రీనివాస్, బొల్లు నవీన్, కొక్కు శ్రీనివాస్, గడ్డం మహేందర్‌ను ఎంపిక చేశారు. ఈ బృందం త్వరలో మజూరీ వీవర్స్ అసోసియేషన్‌తో చర్చించిన అనంతరం అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని పవర్‌లూమ్ యజమానుల సంఘం పేర్కొంది.
ఇదిలా ఉండగా, రాష్ట్రంలోనే అతి ఎక్కువ సంఖ్యలో పవర్‌లూమ్ పరిశ్రమలు భివండీలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాదిమంది ఇక్కడకు వలసవచ్చి పవర్‌లూమ్ పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. అలాగే చాలామంది తెలుగువాళ్లు సొంతంగా పరిశ్రమలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం భివండీలో ఉన్న సుమారు 50 వేల పవర్‌లూమ్ పరిశ్రమల్లో 7.5 లక్షల య్రంతాలు ఉన్నాయి. ఇందులో తెలుగువారి వాటా కూడా ఎక్కువగానే ఉంది. వీరు ఎక్కువగా కాటన్-సాటిన్ వస్త్రాలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నారు. అయితే మూడు నెలలుగా మార్కెట్‌లో గ్రే వస్త్రాలకు డిమాండ్ తగ్గింది. ఉత్పత్తికి సరిపడా డిమాండ్ లేకపోవడంతో యజమానులు నష్టాలను చవిచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో పరిస్థితి ఇలాగే కొనసాగితే తమ సంస్థలు పూర్తి నష్టాలబారిన పడిపోతాయనే ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. వస్త్రాలకు డిమాండ్ తగ్గడంతో పాటు, విద్యుత్, లేబర్ ఖర్చులు కూడా పెరిగిపోవడంతో మీటర్‌కు రూ.8 నుంచి 12 వరకు ఆ సంస్థలు నష్టపోతున్నట్లు అంచనా. దీన్ని బయటపడేందుకు త్వరలోనే తగిన కార్యాచరణ చేపట్టేందుకు పవర్‌లూమ్ సంస్థల యాజమాన్యాలు చర్యలు తీసుకుంటున్నాయి.
గ్రే వస్త్రాల ఉత్పత్తి తగ్గిద్దాం..
Published Sat, Nov 15 2014 10:47 PM | Last Updated on Sat, Sep 2 2017 4:31 PM
Advertisement
Advertisement