మొనాలిసా పెయింటింగ్‌పైకి సూప్‌ స్ప్రే | Mona Lisa Painting Splattered Tomato With Soup By Climate Activists In Paris Lourve Museum - Sakshi
Sakshi News home page

మొనాలిసా పెయింటింగ్‌పైకి సూప్‌ స్ప్రే

Published Mon, Jan 29 2024 4:41 AM | Last Updated on Mon, Jan 29 2024 9:56 AM

Mona Lisa painting splattered with soup by climate activists - Sakshi

మ్యూజియంలోని పెయింటింగ్‌పైకి సూప్‌ విసురుతున్న ఉద్యమకారిణులు

పారిస్‌: ప్రపంచ ప్రఖ్యాత మొనాలిసా పెయింటింగ్‌పైకి పర్యావరణ ఉద్యమకారులు సూప్‌ను స్ప్రే చేశారు. అయితే, పెయింటింగ్‌కు గ్లాస్‌ రక్షణ ఉండటంతో ఎటువంటి నష్ట వాటిల్లలేదు. 16వ శతాబ్దంలో ప్రఖ్యాత చిత్రకారుడు లియోనార్డో డా విన్సీ చేతుల్లో రూపుదిద్దుకున్న మొనాలిసా చిత్రం ప్రస్తుతం సెంట్రల్‌ పారిస్‌లోని లౌవ్రె ప్రదర్శనశాలలో ఉంది.

శుక్రవారం ఉదయం ‘రిపోస్టె అలిమెంటయిర్‌’అనే గ్రూపునకు చెందిన ఇద్దరు మహిళా ఉద్యమకారులు గుమ్మడి సూప్‌ను మొనాలిసా పెయింటింగ్‌పైకి స్ప్రే చేశారు. అనంతరం వారు ‘కళ, ఆరోగ్యకరమైన సుస్థిరమైన ఆహార హక్కుల్లో ఏది ముఖ్యమైంది? వ్యవసాయరంగం సమస్యల్లో ఉంది. రైతులు చనిపోతున్నారు. ప్రభుత్వం స్పందించాలి’అని డిమాండ్‌ చేశారు.

మ్యూజియం సిబ్బంది వెంటనే వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించారు. పెయింటింగ్‌ను తొలగించి, శుభ్రం చేశాక గంట తర్వాత తిరిగి ప్రదర్శనకు ఉంచారు.  మన వారసత్వం మాదిరిగానే ఈ పెయింటింగ్‌ భవిష్యత్‌ తరాలకు చెందాల్సిందని ప్రభుత్వం పేర్కొంది. ఉద్యమకారుల వాదనలో అర్థం లేదని కొట్టిపారేసింది.  ఇంధన ధరలు పెరిగాయని,  నియంత్రణలు ఎక్కువయ్యాయంటూ శుక్రవారం రైతులు పారిస్‌ను దిగ్బంధించారు.

గతంలోనూ దెబ్బతింది
ప్రదర్శనకు ఉంచిన మొనాలిసా చిత్రంపై 1950లో ఓ సందర్శకుడు యాసిడ్‌ పోశాడు. దీంతో, పెయింటింగ్‌ దెబ్బతింది. అప్పటి నుంచి పెయింటింగ్‌కు రక్షణగా గ్లాస్‌ను ఏర్పాటు చేశారు. 2019లో పారదర్శకమైన బుల్లెట్‌ప్రూఫ్‌ అద్దాన్ని రక్షణగా బిగించారు. 2022లో ఓ ఉద్యమకారుడు భూ గ్రహాన్ని కాపాడాలని కోరుతూ పెయింటింగ్‌పైకి కేక్‌ను విసిరేశాడు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement