భూమి భగ్గుమంటోంది.. నీటి కటకట.. కాలుష్యం కోరలు చాస్తోంది.. ఈ సమస్యలకు పరిష్కారం.. చెట్టు.. అవును ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా లక్ష కోట్ల వృక్షాలు కావాలంటున్నారు శాస్త్రవేత్తలు!
‘వృక్షో రక్షతి రక్షితః’మహానుభావులు ఎప్పుడో చెప్పారు.. వాతావరణ మార్పులను అడ్డుకోవాలంటే.. మొక్కలు పెంచడమే మేలైన పరిష్కారమని ఇప్పుడు చాలా మంది శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. ఇది అందరికీ తెలిసిందే.. అయితే ఎన్ని మొక్కలు నాటాలి? ఎక్కడ నాటాలి? వంటి చిక్కు ప్రశ్నలకు సమాధానం చెబుతున్నారు స్విట్జర్లాండ్ శాస్త్రవేత్తలు. కాలుష్యం కారణంగా పెరిగిపోతున్న భూమి సగటు ఉష్ణోగ్రతలను నియంత్రించేందుకు కనీసం లక్ష కోట్ల నుంచి లక్షన్నర కోట్ల మొక్కలు నాటాలని వీరు అధ్యయనపూర్వకంగా చెబుతున్నారు. వాతావరణంలో ఇప్పటికే చేరిపోయిన కార్బన్‌డయాక్సైడ్ మోతాదును 66 శాతం వరకూ తగ్గించేందుకు ఇన్ని మొక్కలు అవసరమన్నది వీరి అంచనా. ఇంకోలా చెప్పాలంటే అమెరికా భూభాగమంత విస్తీర్ణంలో కొత్తగా మొక్కలు నాటితే భూమి ఇంకొంత కాలం ‘పచ్చ’గా ఉంటుందన్నమాట!
వాతావరణ మార్పుల ప్రభావాన్ని అడ్డుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా బోలెడన్ని కొత్త టెక్నాలజీలను ఆవిష్కరిస్తున్నాం. సౌర, పవన విద్యుత్తు ఉత్పత్తితోపాటు అనేక ఇతర చర్యలు తీసుకుంటున్నాం. ప్రపంచదేశాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి భూమి సగటు ఉష్ణోగ్రతలను 1.5 డిగ్రీ సెల్సియస్‌కు పరిమితం చేయాలని ప్యారిస్ ఒప్పందం చేసుకున్న విషయమూ మనకు తెలిసిందే. ప్రపంచదేశాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి భూమి సగటు ఉష్ణోగ్రతలను 1.5 డిగ్రీ సెల్సియస్‌కు పరిమితం చేయాలని ప్యారిస్ ఒప్పందం చేసుకున్న విషయమూ మనకు తెలిసిందే. వీటి మాటెలా ఉన్నా కేవలం లక్ష కోట్ల మొక్కలు నాటడం ఈ సమస్యకు అతి చౌకైన పరిష్కారమన్నది స్విట్జర్లాండ్ ఫెడరల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జ్యూరిచ్ శాస్త్రవేత్త థామస్ క్రోథర్ అంచనా. భూమ్మీద పచ్చదనం ఎంతుందన్న అంశంపై వీరు వేల ఉపగ్రహ ఛాయాచిత్రాలను పరిశీలించారు. మరిన్ని మొక్కలు నాటేందుకు ఉన్న అవకాశాలనూ లెక్కకట్టారు. మానవ ఆవాసాలు, వ్యవసాయ భూమి వంటి వాటిని మినహాయించి చూసినప్పుడు దాదాపు 160 కోట్ల హెక్టార్ల విస్తీర్ణంలో మొక్కలు నాటేందుకు అవకాశాలున్నట్లు తెలిసింది. ఈ విస్తీర్ణంలో మొక్కలు నాటితే భూమ్మీద మొత్తం 440 కోట్ల హెక్టార్లలో పచ్చదనం ఏర్పడుతుంది. అదనంగా నాటే 1 – 1.5 లక్షల కోట్ల మొక్కలు పెరిగి పెద్దయితే.. వాతావరణంలో పేరుకు పోయిన దాదాపు 20,500 టన్నుల కార్బన్‌డయాక్సైడ్‌ను పీల్చుకోగలవు. పారిశ్రామిక విప్లవం సమయం నుంచి భూ వాతావరణంలోకి దాదాపు 30,000 టన్నుల కార్బన్‌డయాక్సైడ్ వాతావరణంలో కలిసిందని అంచనా.
ఎక్కడ?..: ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇంత పెద్ద స్థాయిలో కార్బన్‌డయాక్సైడ్‌ను పీల్చుకునేందుకు ఎక్కడపడితే అక్కడ మొక్కలు నాటితే సరిపోదు అంటున్నారు శాస్త్రవేత్తలు. రష్యా, అమెరికా, కెనెడా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, చైనా వంటి దేశాల్లో సుమారు 47 కోట్ల హెక్టార్ల అడవులు పెంచేందుకు అవకాశముంది. వాతావరణ మార్పుల కారణంగా సైబీరియా ప్రాంతంలోని ఉత్తర బోరియాల్ అడవుల విస్తీర్ణం భవిష్యత్తులో పెరిగే అవకాశముండగా.. దట్టమైన ఉష్ణమండల అడవులు అననుకూ లంగా మారతాయి. కాబట్టి ఉష్ణమండల ప్రాంతాల్లో అడవుల పెంపకం అంత మేలు చేకూర్చదని థామస్ అంటున్నారు. వీలైనంత తొందరగా ఈ బృహత్ వృక్షార్చనను మొదలుపెట్టాలని.. అవి ఎదిగేందుకు దశాబ్దాల సమయం పడుతుందన్నది మరచిపోకూడదని చెప్పారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment