గురువులా, వెట్టి కార్మికులా? | haryana teachers bunk compulsory priest training face disciplinary action | Sakshi
Sakshi News home page

Published Fri, Nov 3 2017 12:34 AM | Last Updated on Fri, Nov 3 2017 12:34 AM

haryana teachers bunk compulsory priest training face disciplinary action - Sakshi

గురువును దైవ సమానంగా భావించి, గౌరవించే సంప్రదాయం దేశంలో నానా టికీ క్షీణించిపోతున్నదని ఆందోళనపడేవారికి హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుతో తల తిరగడం ఖాయం. ఏటా జరిగే ‘కపాల మోచన్‌ మేళా’ కోసం వంద పాఠశాలల్లోని ఉపాధ్యాయులు ఆరురోజులపాటు ఆలయ పూజారు లుగా, స్నానఘట్టాల్లో పురోహితులుగా పనిచేయాలని... అలాగే హుండీల్లోని ఆదా యానికి పద్దులు రాయడం, భక్తులిచ్చే కానుకల్ని సర్కారీ గోడౌన్లకు చేర్చడంలాంటి పనులు చేయాలని ఆ ఉత్తర్వుల సారాంశం. ఇందుకోసం వారికి మూడురోజుల శిక్షణ కార్యక్రమాలు నిర్వహించింది. కొందరు ఆ శిక్షణ ఎగ్గొడితే అది క్రమశిక్షణ ఉల్లంఘన కిందికే వస్తుందని బెదిరిస్తూ నోటీసులు జారీ చేసింది. ఉపాధ్యా యులను వెట్టి కార్మికులకన్నా హీనంగా చూడటంలో ఖట్టర్‌ ప్రభుత్వం ఇప్పటికే తెచ్చుకున్న అప్రదిష్ట అంతా ఇంతా కాదు.

కోతలయ్యాక పొలాల్లో మిగిలే గడ్డిని తగలబెట్టే రైతులను గుర్తించడం, వారిని ఆపడం వంటి పనులు చేయడానికి ఇటీ వలే సిర్సా జిల్లాలో ఉపాధ్యాయులను పంటపొలాల వద్ద తెల్లవార్లూ కాపలా పెట్టింది. ఆ వివాదం సద్దుమణగకముందే ఇప్పుడు ఈ ఉత్తర్వులిచ్చింది. గుళ్లూ గోపురాల్లో, స్నానఘట్టాల్లో ఈ ఉపాధ్యాయులు రోజురోజంతా పనిచేసేలా షిఫ్టులు నిర్ణయించింది. హర్యానాలోని యమునానగర్‌ జిల్లాలో భారీయెత్తున ఈ కపాల మోచన్‌ మేళా ఏటా జరుగుతుంది. ఇందులో పాల్గొనడానికి హర్యానా నలుమూల లనుంచి మాత్రమే కాదు... పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీలనుంచి లక్షలాదిమంది భక్తులు వస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా చూడాలని ప్రభుత్వం ఆత్రపడటాన్ని అర్ధం చేసుకోవచ్చు. అందుకోసం ఉపాధ్యాయులందరినీ తరలించాలనుకోవడం, పిల్లల చదువులు ఏమైపోయినా పర్వాలేదనుకోవడం క్షమార్హం కాదు. ప్రభుత్వం తల్చుకుంటే ఆ జాతరకు అవసరమైన కార్యకర్తలను సమకూర్చుకోవడం కష్టమేమీ కాదు. అడిగితే అలాంటి సేవలందించడానికి వేలా దిమంది స్వచ్ఛందంగా ముందుకొస్తారు. ఆ మార్గాన్ని విడిచిపెట్టి ఉపాధ్యాయులే ఆ పనులన్నీ చేయాలనడం, అందుకు నిరాకరించినవారిపై చర్యలు తీసుకుంటా మని బెదిరించడం భావ్యమేనా?

ప్రపంచ దేశాల్లో వేర్వేరు సంస్కృతులు, సంప్రదాయాలూ ఉండొచ్చు. భిన్న రాజకీయ వ్యవస్థలుండొచ్చు. కానీ గురువుల పట్ల గౌరవభావం ఎక్కడికెళ్లినా ఒకలాగే ఉంటుంది. పసి మనసుల్ని సానబట్టి రేపటి సమాజానికి అవసరమయ్యే పటుతర శక్తిగా వారిని మలచడంలో ఉపాధ్యాయులు నిర్వర్తించే పాత్ర గురించిన అవగాహనే ఇందుకు కారణం. కానీ మన దగ్గర రాను రాను ఉపాధ్యాయులను హీనంగా చూసే ధోరణి పెరుగుతోంది. బడి మానేసే పిల్లల్ని గుర్తించి వారి తల్లిదండ్రులకు నచ్చజెప్పి తీసుకు రావడంతో మొదలుపెట్టి పాఠశాలల్లో ఉపా ధ్యాయులు చేయాల్సిన బోధనేతర పనులు అన్నీ ఇన్నీ కావు. పిల్లలు ఉపయోగించే మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండేలా చూడటం, ఆ పిల్లలు మంచి దుస్తులు వేసు కునేలా చూడటం, వారికి పెట్టే మధ్యాహ్న భోజనంపై ఓ కన్నేసి ఉంచడం, అన్ని పదార్థాలూ అందుతున్నాయో లేదో పర్యవేక్షించడం, తిండి తినే పిల్లల దగ్గర ఆధార్‌ కార్డుందో లేదో తనిఖీ చేయడం...ఇలా సవాలక్ష పనులు అప్పగించడంతో ఆ టీచర్లు బోధనపై దృష్టి కేంద్రీకరించడం సాధ్యం కావడంలేదు. ఇవిగాక జనాభా లెక్కలూ వారే రాయాలి. ఓటర్ల జాబితాల కోసం ఇంటింటికీ తిరిగి పేర్లు సేక రించడమూ వారి బాధ్యతే. మధ్య మధ్యన ఏవో సర్వేలు జరపాలంటే అందుకూ సిద్ధపడాలి. ఈమధ్యకాలంలో యోగ డే, స్వచ్ఛ భారత్, బేటీ బచావో వంటివి కూడా వచ్చిచేరాయి.

విద్యాబోధన ఏదో యాంత్రికంగా చేసే పని కాదు. తరగతి గదిలో ఉండే పిల్ల లంతా ఒకే స్థాయిలో ఉండరు. చెప్పింది వెనువెంటనే అర్ధం చేసుకునే పిల్లలతో బాటే ఎన్నివిధాల చెప్పినా అవగాహన చేసుకోలేనివారు కూడా ఉంటారు. వారం దరికీ సమానంగా అర్ధం చేయించడం ఎంతో నైపుణ్యం అవసరమైన పని. అలాంటి నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి ఉపాధ్యాయులు నిరంతరం శ్రమించవలసి ఉంటుంది. వినూత్న పద్ధతుల్లో బోధించడానికి అవలంబించాల్సిన మార్గాలను అన్వేషించాల్సి ఉంటుంది. ఇలాంటి కసరత్తులు చేయడానికి టీచర్లకు కాస్తయినా వ్యవధి ఉండాలా? వ్యక్తులుగా కొంతమంది ఉపాధ్యాయులు సృజనాత్మకంగా ఆలో చించి రూపొందించుకునే విధానాలను పదుగురితో పంచుకోవడానికి, వాటికి మరింత సమగ్ర రూపం తీసుకొచ్చి అన్నిచోట్లా అమలు చేయించడానికి అవసర మైన పునశ్చరణ తరగతులను నిర్వహిస్తే మన బడులు మరింత సుసంపన్న మవుతాయి. కానీ  బోధనపై దృష్టి పెట్టేందుకు టీచర్లకు కాస్తయినా అవకాశం ఇవ్వ డంలేదు. ఎంతసేపూ ప్రభుత్వాలు చెప్పే పనుల్లో కూరుకుపోయి, అధికారులు తిర గమన్నచోటికల్లా తిరుగుతూ గొడ్డు చాకిరీ చేయడమే వారి బాధ్యతన్నట్టు ప్రభు త్వాలు ప్రవర్తిస్తున్నాయి. అచ్చయిన పుస్తకాలను చూసి, అందులో ఉన్నవి చెప్పడం తప్ప టీచర్లు బడుల్లో చేసేది ఏముంటుందన్న చిన్నచూపు పాలకుల్లో ఉన్నట్టుంది. ఇది ఎంత త్వరగా వదుల్చుకుంటే అంత మంచిది.

హర్యానా సర్కారు ఉత్తర్వు చూస్తే వారికి అటు దేవాలయాల్లో జరిగే పూజా దికాలపైగానీ, ఇటు బోధనపైగానీ అవగాహన లేదని అర్ధమవుతుంది. కేవలం సంస్కృతం బోధించే టీచర్లనే పూజార్లుగా ఎంపిక చేశామని ఒక అధికారంటే, ఏ పాఠ్యాంశం బోధించే ఉపాధ్యాయులైనా ఆ పని చేయాల్సిందేనని మరో అధికారి చెబుతున్నాడు. అసలు సంస్కృతం చదివి ఉపాధ్యాయులుగా వచ్చిన ప్రతివారికీ మంత్రాలు వచ్చి ఉంటాయని... ఒకవేళ రాకున్నా మూడురోజుల శిక్షణతో అది ఒంటబడుతుందని ఈ మరుగుజ్జులకు చెప్పిందెవరో?! పాలకుల తీరు ఇలా ఉండ బట్టే విద్యారంగ ప్రమాణాలు కొడిగడుతున్నాయి. పిల్లల భవిష్యత్తు గాలిలో దీపమ వుతున్నది. కనీసం కేంద్రమైనా జోక్యం చేసుకుని ఖట్టర్‌కు నచ్చజెప్పాలి. లేకుంటే వేరే రాష్ట్రాల్లో కూడా ఇలాంటి మతిమాలిన పోకడలు పుట్టుకొస్తాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement