bhikkanuru
-
ఉర్దూ టీచర్.. ఈ తెలుగమ్మాయి!
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి: పుట్టింది హిందూ తెలుగు కుటుంబంలో.. అయితేనేం.. ఉర్దూ మీడియంలో చదువుకుంది. ఉర్దూ ఉపాధ్యాయిని ఉద్యోగం సాధించింది. ఆమె కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం కేంరాజ్ కల్లాలి గ్రామానికి చెందిన పొనగంటి జయశ్రీ. ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు బిచ్కుంద మండల కేంద్రంలో ఉర్దూ మీడియం పాఠశాలలో చదువుకున్న జయశ్రీ.. ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు బాన్సువాడలోని ఎస్సీ హాస్టల్లో ఉంటూ అక్కడి జెడ్పీహైస్కూల్లో చదువుకుంది.ఇంటర్ బాన్సువాడలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో చదువుకుని డిగ్రీ బోధన్‌లోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో అభ్యసించింది. డిగ్రీ అయ్యాక బోధన్‌లోని ఆజాన్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో బీఈడీ పూర్తి చేసింది. గతేడాది టెట్ రాసి ఎంపికైంది. 2024–డీఎస్సీ పరీక్ష రాసి స్కూల్ అసిస్టెంట్ (ఉర్దూ) ఉద్యోగం సాధించి బుధవారం నియామక పత్రం అందుకుంది. తొలి ప్రయత్నంలోనే టెట్, డీఎస్సీలో మంచి ప్రతిభ కనబరచడం విశేషం. మాస్టారైన గొర్రెల కాపరి.. భిక్కనూరు: కష్టాలు ఎదురైతే..ఆగిపోకుండా సాగితే విజయాలు సాధ్యమని నిరూపించాడీ యువకుడు.. చదువు మానేసి గొర్రెలు కాయడానికి వెళ్లాడు.. చదువుపై ఇష్టం, స్నేహితుల ప్రోత్సాహంతో మళ్లీ చదువుకొని ప్రస్తుతం డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్‌గా ఎంపికయ్యాడు. ఆ విజేత భిక్కనూరుకు చెందిన కోరే కుమార్. గ్రామానికి చెందిన కోరే కమల–బీరయ్య దంపతులకు ఒక కొడుకు కుమార్, కుమార్తె ఉన్నారు.పేద కుటుంబం కావడంతో నాలుగో తరగతిలోనే తల్లిదండ్రులు కుమార్ చదువు మాన్పించారు. దీంతో ఆయన గొర్రెలు కాయడానికి వెళ్లేవాడు. ఈ క్రమంలో చదువుపై మక్కువతో 2014లో ఓపెన్‌లో పదో తరగతి పరీక్షలు రాసిన కుమార్ పాసయ్యాడు. భిక్కనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్లో సీఈసీ, కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాడు. నిజా మాబాద్‌లోని సారంగపూర్ కళాశాలలో బీఈడీ పూర్తి చేశాడు. డీఎస్సీలో ఉత్తమ ర్యాంకు సాధించి సోషల్ విభాగంలో స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించాడు.చదవండి: మీరే మా వారధులు: డీఎస్సీ నియామక పత్రాల పంపిణీ సభలో సీఎం రేవంత్ పట్టుపట్టి.. కొలువు కొట్టి రేగోడ్(మెదక్): ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ తన లక్ష్యాన్ని చేరుకున్నాడు ఓ గిరిజన బిడ్డ. మండలంలోని కాకంచ తండాకు చెందిన రవికుమార్ స్కూల్ అసిస్టెంట్‌గా జిల్లా మొదటి ర్యాంకు సాధించి బుధవారం నియామకపత్రం అందుకున్నాడు. ఈసందర్భంగా ఆయన ఆయన మాట్లాడుతూ.. తన పన్నెండేళ్ల కల నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశాడు. ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలని ఎన్నో కలలు కన్నానని చెప్పాడు. తన ఇంట్లో పలువురు ఉన్నత ఉద్యోగాల్లో ఉండగా.. మరికొందరు ఉన్నత చదువులు చదువుతున్నారని తెలిపారు. నాన్నకు ప్రేమతో.. రేగోడ్(మెదక్): నాన్న ప్రోత్సాహంతో చిన్నప్పటి నుంచి ఉపాధ్యాయుడుగా కావాలన్న కల నెరవేరిందని స్కూల్ అసిస్టెంట్‌గా నియామకపత్రం అందుకున్న జిల్లా మొదటి ర్యాంకు ఉపాధ్యాయుడు రేగోడ్ గ్రామానికి చెందిన మహేశ్ తెలిపారు. 2018లో ఉద్యోగం రాలేదని, పట్టు వదలకుండా చదివి ప్రస్తుతం సాధించానని ఆనందం వ్యక్తం చేశాడు. -
ఇంట్లో గుట్టలు గుట్టలుగా పాములు
సాక్షి, కామారెడ్డి : ఒకటి, రెండు కాదు.. ఏకంగా 63 పాములు ఓ ఇంట్లో కనిపించడంతో కలకలం రేగింది. భిక్కనూరు మండలం ఇసన్నపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి భూమయ్య శుక్రవారం రాత్రి ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి టీవీ చూస్తున్నాడు. అయితే, గోడకున్న రంధ్రం నుంచి ఓ పాము బయటకు రాగా, కుటుంబ సభ్యులు గమనించారు. దీంతో భూమయ్య చుట్టుపక్కల వారిని పిలిచి గోడను తవ్వగా, గుట్టలుగా పాములు కనిపించాయి. మొత్తం 63 పెద్ద పాములను చంపడంతో పాటు వందకు పైగా గుడ్లు కనిపించడంతో వాటిని ధ్వంసం చేశారు. -
‘ఆడాలని, పాడాలని ఇబ్బంది పెడుతున్నారు’
సాక్షి, కామారెడ్డి : తెలంగాణ యూనివర్సిటీకి చెందిన భిక్కనూర్ సౌత్ క్యాంపస్‌లో జూనియర్లపై సీనియర్లు ర్యాంగింగ్ నిర్వహిస్తున్నారు. ఇంట్రడక్షన్ క్లాసుల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తూ... అర్ధరాత్రి ఒంటిగంట వరకు రూమ్‌కు పిలిపించి పరిచయం పేరుతో ఆగడాలకు పాల్పడుతున్నారు. సీనియర్లు వేధింపులు భరించలేని జూనియర్లు ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లారు. గానా బజానా అంటూ ఆడాలని. పాడాలని, చేతులు కట్టుకోవాలని, తల దించి నిలబడాలని ఇబ్బంది పెడుతున్నారని ప్రిన్సిపల్ ఎదుట విద్యార్థులు వాపోయారు. అనంతరం పోలీసులకు సమాచారం అందివ్వగా పోలీసుల ఎదుట సీనియర్ల ఆగడాల గురించి వివరించారు. ఇక డీఎస్పీ శశాంక్ రెడ్డి ఆదేశాలతో భిక్కనూరు సీఐ యాలాద్రి హాస్టల్‌కు వచ్చి విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. జూనియర్లతో అమర్యాదగా ప్రవర్తించినా.. ర్యాగింగ్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని సీనియర్లను హెచ్చరించారు. -
బైక్ కొనివ్వలేదని బలవన్మరణం
సాక్షి, భిక్కనూరు: ఎన్నిసార్లు అడిగినా తండ్రి బైక్ కొనివ్వడం లేదని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. భిక్కనూరు మండలం జంగంపల్లిలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్సై నవీన్‌కుమార్ తెలిపిన కథనం ప్రకారం.. జంగంపల్లి గ్రామానికి చెందిన లింగం, నర్సవ్వ దంపతులు కుమారుడు అనిల్ (23). తనకు పల్సర్ బైక్ కొనివ్వమని అనిల్ కొన్ని నెలలుగా తన తండ్రిని కోరుతున్నాడు. అయితే, ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి బాగా లేదని చెబుతూ తండ్రి వాయిదా వేస్తు వచ్చాడు. ఈ విషయమై సోమవారం అనిల్ తన తండ్రితో వాగ్వాదానికి దిగాడు. అనంతరం సోమవారం రాత్రి వ్యవసాయ బావి వద్దకు వెళ్తున్నానని చెప్పిన అనిల్ అక్కడికి వెళ్లి పశువుల కొట్టంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం చుట్టు పక్కల రైతులు గమనించి కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
కవల పిల్లల అపహరణపై విచారణ
భిక్కనూరు: మండల కేంద్రంలో సంచలనం కలిగించిన కవల పిల్లల అపహరణకు విఫలయత్నం పోలీసుల చొరవతో కథ సుఖాంతమైంది. వివరాలిలా ఉన్నాయి. భిక్కనూరు ఎస్ఐ రాజుగౌడ్ తెల్పిన మాట్లాడుతూ మండల కేంద్రంలో రాజస్థాన్‌కు చెందిన రంజిత్ అనే వ్యక్తి భిక్కనూరులో స్వీటు బండిని తోలుతూ మిఠాయిలను విక్రయిస్తాడు. అదే రాష్ట్రానికి చెందిన దినేష్ స్వీటు దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు రంజిత్ పిల్లలు శ్రీసాయి పబ్లిక్ స్కూల్లో చదువుతారు. దినేష్ పిల్లలు చైతన్య విద్యానికేతన్‌లో చదువుతున్నారు. రంజిత్ నాలుగు రోజుల క్రితం వేరే గ్రామానికి వెళ్లడంతో రంజిత్ భార్య రేష్మ తమ వద్ద పనిచేస్తున్న సుజాత కూతురు వెన్నెలను పిల్లలను స్కూల్ నుంచి తీసుకురమ్మని పంపించింది. వెన్నెల సాయి పబ్లిక్ స్కూల్‌కు వెళ్లాల్సి ఉంది. కాగా చైతన్య విద్యానికేతన్ స్కూల్‌కు వెళ్లి రాజస్థాన్ స్వీటు హోం పిల్లలను పంపించమని అక్కడి సిబ్బంది కోరింది. సిబ్బంది ఈ విషయాన్ని హెచ్ఎం అశోక్‌కు తెలిపారు. దీంతో హెచ్ఎం దినేష్‌కు ఫోన్ చేసి మీ పిల్లలను పంపించుమన్నారా అని అడిగారు. అదేమి లేదని దినేష్ చెప్పాడు. దీంతో అశోక్ వెన్నెలను దబాయించడంతో వెన్నెల పరిగెత్తింది. ఆదివారం ఈ విషయమై దినేష్ భిక్కనూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఎస్ఐ రాజుగౌడ్ సీసీ కెమెరాలను పరిశీలించి వెన్నెలను గుర్తించి పోలీస్‌స్టేషన్‌కు ఆదివారం పిలిపించాడు. విచారించి ఎస్ఐ నిజానిజాలు తెలుసుకున్నాడు. వెన్నెల ఒక పాఠశాలకు వెళ్లే బదులు వేరే పాఠశాలకు వెళ్లడంతో ఈ సమస్య తలెత్తిందని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. -
2019లో మాదే అధికారం
భిక్కనూరు: ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ సీఎం కేసీఆర్ నెరవేర్చడం లేదని, మాట మార్చడం ఆయన నైజమని బీజేపీ నేతలు విమర్శించారు. సోమవారం భిక్కనూర్ మండల కేంద్రంలో కేంద్రంలో నిర్వహించిన తిరంగా యాత్రలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విక్రమ్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఉప్పునూతల మురళీధర్‌గౌడ్ ప్రసంగించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ప్రగల్బాలు పలికిన కేసీఆర్.. తాను అధికారంలోకి రాగానే ఎంఐఎంకు భయపడి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదన్నారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని, లేకుంటే ప్రజా ఉద్యమం లేవదీస్తామని హెచ్చరించారు. కర్ణాటక, మహారాష్ట్రలలో అక్కడి ప్రభుత్వాలు స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల మాదిరిగా నిర్వహిస్తున్నాయని, తెలంగాణలో నిర్వహించక పోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో 2019లో బీజేపీదే అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రైతు ఏడ్చిన రాజ్యంలో పాలకులు బాగు పడరని పదేపదే చెప్పిన కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం చేసిందేమీ లేదన్నారు. బీజేవైఎం జిల్లా కార్యదర్శి రవీందర్‌రెడ్డి, మండలాధ్యక్షుడు సింగం శ్రీనివాస్, నేతలు డప్పు రవి, శ్రీనివాస్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, మహేందర్, రాంరెడ్డి, ఆనంద్‌రెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
తెయూపై శీతకన్ను
భిక్కనూరు : టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ యూనివర్సిటీపై సవతితల్లి ప్రేమ చూపిస్తోందని సౌత్‌క్యాంపస్ విద్యార్థి జేఏసీ కన్వీనర్ సత్యం ఆరోపించారు. శుక్రవారం సౌత్‌క్యాం పస్‌లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ యూనివర్సిటీకి ప్రభుత్వం కేవలం రూ. 24 కోట్లు మాత్రమే మంజూరు చేయడం శోచనీయమన్నారు. జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో, రెండు పార్లమెంట్ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను ప్రజలు గెలిపించారని, అయితే ఆ విషయాన్ని కేసీఆర్ విస్మరించారని అన్నారు. వెంటనే తెలంగాణ యూనివర్సిటీకి రూ.100 కోట్లు విడుదల చేయని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హె చ్చరించారు. నిరసన కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షులు గోవర్ధన్, నాయకులు రఘురాం, రమేశ్, ఫర్మియానాయక్, సంధ్యకుమార్, యోగి, నర్సింలు, శివకుమార్, రఘురామ్‌లు పాల్గొన్నారు. -
మత్తులో చిత్తవుతున్నారు
భిక్కనూరు : యువత మత్తులో జోగుతోంది. తమతోపాటు ఇతరులనూ ఆ గ‘మ్మత్తు’ లోకాలకు తీసుకెళుతోంది. రోడ్డు ప్రమాదాలకు కారణమవుతూ ఇతరుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. ఎక్కడినుంచో మత్తు పదార్థాలను దిగుమతి చేసుకొని హైదరాబాద్‌తోపాటు మెదక్ జిల్లాలోని సిద్దిపేటలకు రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో మండల కేంద్రంలో డ్రగ్స్ వ్యాపారం సాగుతోంది. నాలుగేళ్లుగా ఈ వ్యాపారం పెరిగిందని పలువురు పేర్కొంటున్నారు. ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు యువకులు.. ఇంటర్మీడియట్, డిగ్రీల ను మధ్యలోనే నిలిపివేసి మత్తుపదార్థాల రవా ణా వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం. మండ ల కేంద్రానికి చెందిన వీరంతా 25 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం. వీరు పల్సర్ వంటి భారీ వా హనాలను ఉపయోగిస్తున్నారని, డ్రగ్స్ రవాణాతోపాటు బెట్టింగ్లనూ జోరుగా నిర్వహిస్తున్నారని సమాచారం. గంజాయితో పాటు బ్రౌన్ షు గర్, సాక్రిన్ అనే మత్తు మందులను భిక్కనూ రు నుంచి ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. ఈ యువకులు కొందరు హైదరాబాద్‌లో చదువుతున్న తమ స్నేహితుల కళాశాలలకు వెళ్లి కూడా మత్తు మందులను విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. భిక్కనూరులో విచ్చలవిడిగా మత్తు మందుల వాడకం జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేద న్న విమర్శలున్నాయి. రోజూ రాత్రి.. డ్రగ్స్ విక్రయిస్తున్న యువకులు రోజూ రాత్రి 9 గంటలకు భిక్కనూరు నుంచి బైక్‌లపై బయలుదేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరు మత్తు మందు సేవిస్తారని, సిద్దిపేట, హైదరాబాద్‌లలో డ్రగ్స్ విక్రయిస్తారని సమాచారం. మత్తులో ప్రమాదాలకూ కారణమవుతున్నార ని, తిరిగి మరుసటి రోజు ఉదయం 11 గంట లకు ఇంటికి చేరుకుంటున్నారని తెలుస్తోంది. ఈజీగా మనీ సంపాదిస్తున్న వీరి ప్యాకెట్లలో రూ. 50 వేలకు తక్కువ కాకుండా డబ్బులు ఉంటాయని సమాచారం. ఈ యువకులు మండలంలోని పలు గ్రామాలకు చెందిన యువకుల కు సైతం మత్తు మందులను అలవాటు చేసి, త మ ట్రాప్‌లో పడవేసేందుకు యత్నిస్తున్నట్లు తె లుస్తోంది. విషయం తెలుసుకున్న మండల ప్ర జలు.. తమ పిల్లలు ఎక్కడ ఈ దురలవాటుకు బానిసలవుతారో అని ఆందోళన చెందుతున్నా రు. వీరికి ఎక్కడి నుంచి మత్తు మందులు సరఫరా అవుతున్నాయి, వీరు ఎవరకి సరఫరా చే స్తున్నారు అన్న విషయమై పోలీసులు నిఘా పెట్టాలని కోరుతున్నారు. -
కేసీఆర్ ఉద్యమ ఫలితమే తెలంగాణ
భిక్కనూరు, న్యూస్‌లైన్ : సీమాంధ్ర పాలకుల చెర నుంచి విముక్తి పొందేందుకు 60 ఏళ్లుగా తెలంగాణ ప్రజలు చేస్తున్న ఉద్యమానికి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా కలిసి ఉద్యమాన్ని ముందుకు నడపడంతోనే కేంద్రప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు చేసిందని ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. ఆయన గురువారం భిక్కనూరు మండలంలోని బస్వాపూర్, తిప్పాపూర్ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో ఏయే పార్టీలు నేతలు ఏ విధంగా మాట్లాడారో, వారు చేసిన ఉద్యమద్రోహ పనులను ప్రజ లు గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ అభివృద్ధికి అందరూ కలిసి వచ్చి సహకరిం చాలన్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 14 ఏళ్లుగా చేపట్టిన ఉద్యమం దేశ స్వాతంత్య్ర పోరాటాన్ని తలపించిందన్నారు. రైతు బాగుంటేనే అన్ని రంగాలు బాగుంటాయని, దీన్ని రానున్న తెలంగాణ ప్రభుత్వం గుర్తించి ఆ దిశగా చర్యలు చేపడుతుందన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ముజీబొద్దీన్, తిప్పాపూర్ విండో చైర్మన్ వంగేటి చిన్న నర్సారెడ్డి, సర్పంచులు తు డుం పద్మ, తాటిపల్లి జమున, వీడీసీ అధ్యక్షులు ఆకుల రాములు, సాలకేంద్రం మండలాధ్యక్షుడు మామిడి భూ పాల్‌రెడ్డి, తిప్పాపూర్ అధ్యక్షుడు కుంట లక్ష్యరెడ్డి, టీఆర్ఎస్ నేతలు వంగేటి దుర్గారెడ్డి, ఎన్గు వెంకట్‌రెడ్డి, బాల్‌రెడ్డి, కమలాకర్, జూకంటి మోహన్‌రెడ్డి, బుర్రిగోపాల్, కర్నాల మల్లేశం, చిన్న సిద్ధరాములు, బల్వంత్‌రావు, భూమ్‌రావు, విఠల్‌రెడ్డి పాల్గొన్నారు.