ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్ : గురుకులాల్లో ఖాళీల భర్తీకి సంబంధించి ఏర్పాట్లు వడివడిగా సాగుతున్నాయి. టీఎస్‌పీఎస్సీ ద్వారా నియామకాలు ఆలస్యమవుతున్నాయని భావించిన ప్రభుత్వం.. ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసింది. దీని ద్వారా ప్రశ్న పత్రాల తయారీ, పరీక్ష నిర్వహణ, ఫలితాలు, నియామకాలకు సంబంధించి ఇప్పటికే ఉన్నతాధికారులు చర్చించి ఓ నిర్ణయానికొచ్చారు. మరోవైపు అభ్యర్థుల అర్హతలు, మార్కులు తదితర అంశాలను మాత్రం పాత పద్ధతికే పరిమితం చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. గతేడాది నిర్వహించిన పరీక్షల్లో 50 శాతం మార్కులున్న అభ్యర్థులకు అవకాశం కల్పించారు.
అదేవిధంగా వయోపరిమితిలోనూ గతేడాది తీసుకున్న నిర్ణయాన్నే అమలు చేస్తే సరిపోతుందని మెజార్టీ అధికారులు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో నియామకాలకు సంబంధించి బోర్డు మాత్రమే కొత్తదని, మిగతా ప్రక్రియ పాత పద్ధతిలోనే జరుగుతుందని, దీనిపై వారం రోజుల్లో స్పష్టత వస్తుందని ఓ అధికారి ‘సాక్షి’తో అన్నారు. అన్ని గురుకులాల్లో దాదాపు 6 వేల పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. ఈ మేరకు ఖాళీలను పేర్కొంటూ ఆయా శాఖలు ప్రభుత్వానికి నివేదికలు సైతం సమర్పించాయి. తాజాగా ప్రత్యేక బోర్డు ఏర్పాటు కావడంతో భర్తీ బాధ్యతలు దాని ద్వారా చేపట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment