గుంటూరు ఎడ్యుకేషన్: డీఎస్పీ– 1998 అభ్యర్థుల కల ఫలిచింది. పాదయాత్ర సమయంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అధికారం వచ్చిన వెంటనే క్వాలిఫైడ్ అభ్యర్థుల జీవితాల్లో వెలుగు నింపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ కొలువుల కోసం ఎప్పుడో 25 ఏళ్ల క్రితం ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా పరీక్షలు రాసి, అర్హత సాధించినప్పటికీ ఉద్యోగాలు రాకపోవడంతో, మంచి మనసున్న ఏ ముఖ్యమంత్రి తమ గోడు ఆలకించకపోతారా అని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసిన అభ్యర్థులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది.
1998 క్వాలిఫైడ్ అభ్యర్థులకు పోస్టింగ్స్ కల్పిస్తున్నట్లు గతంలో ప్రకటించిన ప్రభుత్వం విద్యాశాఖ ద్వారా జిల్లాల వారీగా క్వాలిఫైడ్ అభ్యర్థుల వివరాలు సేకరించింది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది అభ్యర్థులకు పోస్టింగ్స్ ఇచ్చేందుకు నిర్ణయించిన ప్రభుత్వం ఈనెలలోనే దానిని పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఈనెల 13లోపు పోస్టింగ్స్ కల్పించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్‌కుమార్ విడుదల చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా విద్యాశాఖాధికారులు చర్యలు ప్రారంభించారు. కాగా ఉద్యోగ నియామక పరీక్షలు రాసిన 25 ఏళ్ల తరువాత ఉద్యోగ నియామకాలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయడంపై అభ్యర్థులు ఆనందోత్సాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా విద్యాశాఖాధికారులు గతేడాది అక్టోబర్‌లో గుంటూరు నగరంలో క్వాలిఫైడ్ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేశారు.
డీఈఓ కార్యాలయంలో కౌన్సెలింగ్..
ఉమ్మడి గుంటూరు జిల్లాలో 229 మంది అభ్యర్థులకు పోస్టింగ్స్ కల్పించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి పి.శైలజ తెలిపారు. ఈనెల 12వ తేదీలోగా నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించిన దృష్ట్యా, అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. మినిమం టైం స్కేల్‌పై ఉపాధ్యాయులుగా నియమితులైన అభ్యర్థులను అవసరమైన పాఠశాలల్లో నియమిస్తామని చెప్పారు.
గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల నుంచి ఎంపికైన అభ్యర్థుల జాబితాను htts://doefnt.bofrpot.com సైట్‌లో ఉంచినట్లు చెప్పారు. అభ్యర్థులు ఈనెల 12న ఉదయం 10 గంటలకు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఆధార్‌కార్డు, ఐదు పాస్‌పోర్ట్ ఫోటోలు, డీఎస్సీ–1998 హాల్ టిక్కెట్‌ను తీసుకుని గుంటూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ఉన్న డీఈవో కార్యాలయంలో నిర్వహించే కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment