సమస్యల్లో ఆదర్శం | Staff Shortage Of Model Schools Anantapur | Sakshi
Sakshi News home page

సమస్యల్లో ఆదర్శం

Published Sun, Feb 10 2019 8:54 AM | Last Updated on Sun, Feb 10 2019 8:54 AM

Staff Shortage Of Model Schools Anantapur - Sakshi

అనంతపురం ఎడ్యుకేషన్‌: జిల్లాలోని ఆదర్శ(మోడల్‌) పాఠశాలలు సమస్యల్లో చిక్కుకున్నాయి. ఓ వైపు ఉపాధ్యాయుల కొరత వెక్కిరిస్తుంటే, మరోవైపు ఉన్న సిబ్బంది మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. ఈ ప్రభావం విద్యార్థుల చదువుపై పడుతోంది. ప్రతిభ ఉండి ఆర్థిక సమస్యలతో చదువుకు దూరమవుతున్న గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 2012–13లో ‘మోడల్‌’ స్కూళ్లకు శ్రీకారం చుట్టింది. వసతితో పాటు ఇంగ్లిష్‌ మీడియంలో చదువుకునే అవకాశం రావడంతో గ్రామీణ విద్యార్థులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వీటి ఏర్పాటు వెనుక ప్రభుత్వ ఆశయం బాగుంది కానీ, అమలులో మూడు అడుగులు ముందుకు.. ఆరు అడుగులు వెనక్కు అనే చందంగా తయారైంది. చాలా స్కూళ్లలో అధికార పార్టీ నాయకుల రాజకీయ జోక్యం అధికమవుతోంది. దీంతో పర్యవేక్షించాల్సిన అధికారులు కఠినత్వం ప్రదర్శించలేకపోతున్నారు. ఫలితంగా ఉద్యోగులు ఆడిందే ఆడ పాడిందే పాట చందంగా వ్యవహరిస్తున్నారు.

ఉన్న వారిలో ఆధిపత్యపోరు
ఉన్న ఉపాధ్యాయులైనా విద్యార్థుల బోధనపై దృష్టి సారిస్తున్నారంటే అదీలేదు. చాలా స్కూళ్లలో ఆధిపత్యపోరుతో విద్యార్ధుల చదువును గాలికొదిలేశారు. కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి, విడపనకల్లు, యాడికి, పుట్లూరు తదితర స్కూళ్లలో రాజకీయాలు మరీ ఎక్కువయ్యాయని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఎంతసేపు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ ఫిర్యాదులు చేసుకోవడం తప్ప చదువు గురించి పట్టించుకోవడం లేదంటున్నారు. ప్రిన్సిపాళ్లు, పీజీటీలు, టీజీటీలు ‘ఎవరికివారు యమునా తీరే’ చందంగా వ్యవహరిస్తున్నారు. కొందరు రాజకీయ నాయకుల అండతో అధికారులను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు. ఔట్‌ సోర్సింగ్‌ కింద నియామకమైన వార్డెన్లు కూడా రాజకీయాలు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం రాత్రి పూట ఉండి విద్యార్థులతో చదివించాల్సి ఉంది. చాలాచోట్ల వార్డెన్లు రాత్రిపూట ఉండడం లేదు. ప్రిన్సిపాళ్లు, పీజీటీ, టీజీటీలు కూడా స్కూల్‌కు 8 కిలోమీటర్ల పరిధిలో నివాసం ఉండాల్సి ఉన్నా.. చాలామంది జిల్లా కేంద్రం, ఇతర పట్టణాల నుంచి రోజూ వెళ్లి వస్తున్నారు.

తగ్గుతున్న విద్యార్థుల సంఖ్య
మోడల్‌ స్కూళ్లలో హాస్టల్‌ వసతి ఉంటుందని ప్రారంభంలో ప్రకటించడంతో  విద్యార్థులు పోటీ పడి దరఖాస్తు చేసుకున్నారు. విపరీతమైన డిమాండ్‌ నెలకొనడంతో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం సిఫార్సు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తర్వాత విద్యార్థినులకు మాత్రమే వసతి కల్పిస్తామని ప్రకటించారు. ప్రస్తుతం 9 నుంచి ఇంటర్‌ వరకు విద్యార్థినులకు మాత్రమే వసతి కల్పిస్తున్నారు. వసతి లేమి, ఉపాధ్యాయుల కొరత, ఉన్న ఉపాధ్యాయుల్లో సమన్వయం లేకపోవడంతో చదువుకునేందుకు విద్యార్థులు, చేర్పించేందుకు తల్లిదండ్రులు అయిష్టత చూపుతున్నారు. ఒక్కో పాఠశాలలో 6 నుంచి ఇంటర్‌ దాకా 560 మంది చొప్పున 25 స్కూళ్లలో 14వేల మంది ఉండాల్సి ఉండగా.. కేవలం 10468 మంది మాత్రమే ఉన్నారు. ఇంకా 3,532 సీట్లు ఖాళీగా ఉండటం గమనార్హం. 

మా దృష్టికి వచ్చాయి 
కొన్ని స్కూళ్లలో సిబ్బంది మధ్య చిన్నచిన్న మనస్పర్థలున్నట్లు మా దృష్టికీ వచ్చింది. ఈ ప్రభావం విద్యార్థులపై పడకూడదని హెచ్చరించాం. ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టుల్లో గెస్ట్‌ ఫ్యాకల్టీని నియమించాం. డీఎస్పీ పోస్టులు భర్తీకాగానే రెగ్యులర్‌ టీచర్లు వస్తారు. విద్యార్థులకు బోధన విషయంలో రాజీపడం. రాజకీయాలు చేస్తూ విద్యార్థుల చదువును నిర్లక్ష్యం చేసే సిబ్బంది పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. – పుష్పరాజు, మోడల్‌ స్కూళ్ల ఏడీ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement