చిత్తూరు(ఎడ్యుకేషన్): జిల్లాలో ఎంఈవోలుగా పనిచేస్తున్న ఐదుగురిని ఖాళీగా ఉన్న డివిజన్లలో డీవైఈవోలుగా నియమిస్తూ కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. ఇటీవల జిల్లాలో పనిచేస్తున్న పలువురు ఎంఈవోలకు అర్హత పరీక్షలు నిర్వహించిన విషయం విదితమే. ఆ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన వారి పేర్లను డీఈవో నాగేశ్వరరావు కలెక్టర్‌కు నివేదిక రూపంలో అందజేశారు. నివేదికను పరిశీలించిన కలెక్టర్ చిత్తూరు డీవైఈవోగా సుధాకర్ (తిరుపతి అర్బన్, ఎంఈవో), మదనపల్లి డీవైఈవోగా వాసుదేవనాయుడు(అకడమిక్ డీవైఈవో), పుత్తూరు డీవైఈవోగా ప్రసాద్ (తిరుపతి రూరల్ ఎంఈవో), రాష్టీయ మాధ్యమిక సేవా అభియాన్ శాఖ(ఆర్‌ఎంస్‌ఏ) డీవైఈవోగా దయానంద (పీలేరు ఎంఈవో), జిల్లా పరిషత్ yీ వైఈవోగా ( పంకజాక్షి, పుత్తూరు ఎంఈవో) ను నియమిస్తూ ఉత్తర్వులను జారీచేశారు. నియమితులైన డీవైఈవోలందరూ తమ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను పర్యవేక్షిస్తూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తోడ్పడాలని కలెక్టర్ ఆ ఉత్తర్వుల రూపంలో ఆదేశించారు. వారు రెండు రోజుల్లో తమ భాధ్యతలను స్వీకరించనున్నట్లు విద్యాశాఖ ద్వారా తెలిసింది.