స్కూళ్లలో నిపుణులతో బోధన!
- 6 నుంచి 10 తరగతులకు చేపట్టేందుకు చర్యలు
- వివిధ రంగాల్లో నిపుణులతో విద్యా బోధన
- ఇంటర్మీడియెట్‌లోనూ ఐఐటీ పాఠాలు
- ఇంజనీరింగ్‌లో పారిశ్రామికవేత్తలతో పాఠాలు
- వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు
సాక్షి, హైదరాబాద్: వివిధ రంగాల్లో నిపుణులతో ఇక ప్రత్యక్ష విద్యా బోధన చేపట్టేందుకు తెలంగాణ విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఆరో తరగతి నుంచి 10వ తరగతి వరకు క్లాస్‌రూంలో వివిధ అంశాలకు సంబంధించిన ఆయా రంగాల్లోని నిపుణులను పిలిపించి విద్యార్థులకు బోధన చేపట్టనుంది. 2017–18 విద్యా సంవత్సరంలో దీనిని అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఒక తరగతిలో రాకెట్, అంతరిక్ష ప్రయోగం వంటి పాఠాలు ఉంటే ఆ పాఠాన్ని టీచర్‌తో చెప్పించడమే కాకుండా ఆయా రంగాలకు చెందిన నిపుణులను పిలిపించి బోధన నిర్వహించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా కసరత్తు ప్రారంభించింది.
6 నుంచి 10వ తరగతి వరకు తరగతి వారీగా ఉన్న పాఠ్యాంశాలు, వివిధ రంగాలకు చెందిన పాఠాలను గుర్తించి ఆయా రంగాలకు సంబంధించి ఎవరెవరిని పిలిపించాలన్న అంశంపై రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలిలో కసరత్తు చేస్తోంది. ఆరోగ్యం వంటి పాఠాలు ఉన్న తరగతులకు ఓ డాక్టర్‌ను, భౌతిక శాస్త్రానికి సంబంధించి ఒక సైంటిస్ట్‌ను పిలిపించి పాఠాలు చెప్పించడం ద్వారా విద్యార్థుల్లో ఆయా అంశాలకు సంబంధించి అవగాహన ఏర్పడుతుందని భావిస్తోంది.
ఇంటర్మీడియెట్‌లోనూ ఐఐటీ నిపుణులతో పాఠాలు చెప్పించేందుకు ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. మరోవైపు ఐఐటీల కౌన్సిల్ కూడా ఇంటర్ విద్యార్థుల కోసం ఐఐటీ నిపుణులతో ఆన్‌లైన్ పాఠాలు అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇంజనీరింగ్‌లోనూ పారిశ్రామిక వర్గాలకు చెందిన ప్రముఖులతో పాఠాలు బోధించడం ద్వారా ఆయా రంగాలపై విద్యార్థులకు అవగాహన కలుగ డంతోపాటు పారిశ్రామిక రంగాలకు ఏ విధమైన అవసరాలు ఉంటాయో తెలుసుకునేందుకు వీలు ఏర్పడనుంది. బీటెక్ కోర్సులోనూ ఇండస్ట్రీ శిక్షణ కాలాన్ని పెంచేందుకు కసరత్తు చేస్తోంది.