సిద్దిపేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులతో మాట్లాడుతున్న విద్యాశాఖ పిన్సిపల్ సెక్రటరీ జనార్థన్‌రెడ్డి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): చదువులో వెనకబడిన విద్యార్థులకు త్వరలోనే ఫోన్ ద్వారా ప్రత్యేక బోధన అందించనున్నారు. ఇప్పటివరకు ప్రత్యేక శిక్షకుల ఆధ్వర్యంలో మాత్రమే ట్యూషన్లు చెప్పేవారు. కానీ త్వరలో రాష్ట్రవ్యాప్తంగా టెలీ టీచర్స్ ఆధ్వర్యంలో ఫోన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రత్యేక బోధన అందించనున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో పేద, మధ్య తరగతి, గ్రామీణ ప్రాంత విద్యార్థులు విద్యనభ్యసిస్తుంటారు. దీంతో వారు తరగతి గదుల్లో మాత్రమే విద్య నేర్చుకున్నారు. వసతి గృహాల్లో ట్యూటర్ ఉండటంతో అక్కడి విద్యార్థుల సందేహాలను వెంటనే నివృత్తి చేసుకోగలుగుతారు.
కానీ అనేక మంది విద్యార్థులు బిడియం, మొహమాటం కారణంగా తరగతి గదుల్లో తమ సందేహాలను ఉపాధ్యాయులు, ట్యూటర్‌లను అడగలేకపోతున్నారు. సందేహాలు అడిగితే ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు ఏమనుకుంటారోనన్న ఆలోచనతో అనేకమంది విద్యార్థులు తమ సందేహాలను అడగకుండా చదువులో వెనుకబడి పోతున్నారు. అయితే టెలీ టీచర్స్ ద్వారా తమకు వచ్చిన సందేహాలను ఫోన్ ద్వారా అడగొచ్చు కాబట్టి విద్యార్థులకు భయం ఉండదనే ఆలోచనతో రాష్ట్ర విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. రిటైర్డ్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యావేత్తలు, ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉపాధ్యాయులు ఖాళీ సమయాల్లో బోధించే ఆసక్తి ఉన్నవారి ద్వారా ఈ టెలీ ట్యూషన్లు నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తోంది. టెలీ టీచర్స్ పద్ధతి ప్రస్తుతం మహరాçష్ట్రలో అమల్లో ఉంది.
ప్రత్యేక సమయం..
ఈ టెలీ ట్యూషన్‌కు సాయంత్రం ప్రత్యేకంగా సమయం కేటాయించడం ద్వారా అటు ట్యూటర్ (టెలీటీచర్స్)కు, ఇటు విద్యార్థులకు లాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది. దీంతో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పాఠశాల విద్యార్థులకు సబ్జెక్ట్‌లకు సంబంధించిన టెలీ ట్యూటర్ ఫోన్ నంబర్‌ను ఇవ్వడం ద్వారా విద్యార్థులు వారికి కేటాయించిన సమయంలో ఫోన్ ద్వారా సందేహాలు నివృత్తి చేసుకునే వీలు కలుగుతుందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. టెలీటీచర్స్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు అధికంగా లబ్ధి చేకూరుతుంది.
ఉత్తమ ఫలితాలు సాధించేందుకు దోహదం
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు త్వరలోనే టెలీ ట్యూషన్ అందుబాటులోకి తెస్తాం. ఇందుకోసం కసరత్తు చేస్తున్నాం. భయపడే, మొహమాటపడే విద్యార్థులు పరోక్షంగా తమ పాఠ్యాంశంలోని సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. వెనుకబడిన విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించే అవకాశం ఉంది. – విద్యా శాఖ పిన్సిపల్ సెక్రటరీ జనార్దన్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment