గుంటూరు: ఇంటి నుంచే దృశ్య, శ్రవణ విధానంలో దూరవిద్యను అభ్యసించే సదుపాయం త్వరలోనే చేరువ కానుందని ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ డెరైక్టర్ పార్వతి తెలిపారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన వర్చువల్ ఓపెన్ స్కూలింగ్ సదస్సుకు హాజరై వచ్చిన ఆమె మంగళవారం సాక్షి ప్రతినిధితో విశేషాలు పంచుకున్నారు. వివిధ పనుల్లో ఉన్నవారు తరగతులకు హాజరుకాలేని పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని జాతీయ సార్వత్రిక విద్యా పీఠం (ఎన్‌ఐఓఎస్) ఆన్‌లైన్‌లో పాఠాలను ఉంచి నెట్ ద్వారా చదువుకునే వీలు కల్పించాలని నిర్ణయించినట్టు పార్వతి తెలిపారు.
ఇప్పటికే ఆన్‌లైన్‌లో పాఠాలు పెట్టినప్పటికీ అవి ఆంగ్లంలో ఉండడం వల్ల అభ్యర్థులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. దీన్ని గుర్తించిన ఎన్‌ఐఓఎస్ ప్రాంతీయ భాషల్లోనూ పాఠాలు రూపొందించాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. తెలుగులో పాఠాలు చదువుకునే విధంగా ప్రత్యేక సాఫ్ట్‌వేర్ రూపొందించే పనులు జరుగుతున్నాయని తెలిపారు.