భారత సామాజిక, ఆర్థిక సర్వే ప్రకారం 2011-12 నాటికి ఉన్నత విద్యకు సంబంధించి విద్యార్థుల స్థూల నమోదు శాతం (జీఈఆర్) 20.4 శాతంగా ఉంది. దీన్ని 2017 నాటికి 25.2 శాతానికి, 2020 నాటికి 30 శాతం మైలురాయికి చేర్చేందుకు యూజీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో రెగ్యులర్, డిస్టెన్స్ విధానాల ద్వారా విద్యార్థులను యూజీ, పీజీ, రీసెర్చ్ కోర్సులకు దగ్గర చేసేందుకు 12వ పంచవర్ష ప్రణాళిక కింద వివిధ కార్యక్రమాల అమలుకు కసరత్తు చేస్తోంది.
మరోవైపు సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణల నేపథ్యంలో దేశంలో పారిశ్రామిక, సేవల రంగాలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. దీంతో నిపుణులైన మానవ వనరులకు డిమాండ్ పెరగడంతో దూరవిద్యా కోర్సులు విస్తరిస్తున్నాయి. వేలకు వేలు ఫీజుల భారాన్ని మోయలేని వారికి, అప్పటికే చేస్తున్న ఉద్యోగాలను వదులుకొని ఉన్నత విద్యకు సమయాన్ని వెచ్చించలేని వారికి దూరవిద్యా విధానంలో కోర్సులు అండగా నిలుస్తున్నాయి.
దూరవిద్య లక్ష్యాలు:
వివిధ కారణాల వల్ల సంప్రదాయ విద్యలో ప్రవేశం పొందలేని వారికి ఉన్నత విద్యావకాశాలను కల్పించడం.చదువును మధ్యలో ఆపేసిన వారికి‘లిబరల్ ఎడ్యుకేషన్’ ద్వారా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు, వృత్తి నైపుణ్యాలను అభివృద్ధిపరిచే కోర్సుల్లో ప్రవేశాలు కల్పించడం.విద్యార్థులకు అందుబాటులో ఉండే సమయానికి అనుగుణంగా కోర్సులను, అధ్యయన పద్ధతులను అందించడం. విద్యార్థులకు, విద్యా సంస్థలకు మధ్య దూరాన్ని తగ్గించి మంచి విద్యా వాతావరణాన్ని పెంపొందించడం. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు అవసరమయ్యే కోర్సులకు రూపకల్పన చేసి, విద్యార్థులకు అందుబాటులో ఉంచడం.
కోర్సు కోర్సుకూ ప్రత్యేకత:
గతంలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటే బీఏ, బీకాం, బీఎస్సీ వంటి సాధారణ డిగ్రీ కోర్సులే అందుబాటులో ఉంటాయన్న భావన విద్యార్థుల్లో ఉండేది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ప్రస్తుత మార్కెట్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని విశ్వవిద్యాలయాలు కొత్త కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నాయి. సంప్రదాయ కాంబినేషన్లతో పాటు విభిన్న కాంబినేషన్లతో కోర్సులు అందిస్తున్నాయి. ఉదాహరణకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ- సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బీఎస్సీ(కాస్ట్యూమ్ డిజైన్ అండ్ ఫ్యాషన్ టెక్నాలజీ), బీఎస్సీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), బీహెచ్‌ఎం (బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్), ఎంఎస్సీ (ఫుడ్ అండ్ న్యూట్రిషన్), ఎంఎస్సీ (బయో ఇన్ఫర్మాటిక్స్) వంటి కోర్సులను ఆఫర్ చేస్తోంది.
ప్రొఫెసర్ జి.రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్- ఉస్మానియా యూనివర్సిటీ బీఎస్సీ (ఏవియేషన్), పీజీ డిప్లొమా ఇన్ బయో ఇన్ఫర్మాటిక్స్, పీజీ డిప్లొమా ఇన్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ వంటి వినూత్న కోర్సులను డిస్టెన్స్ విధానంలో ఆఫర్ చేస్తోంది.
ఎంసీఏ, ఎంబీఏలకు డిమాండ్:
డిస్టెన్‌స విధానంలో ఎంసీఏ, ఎంబీఏ కోర్సులు ఆదరణ పొందుతున్నాయి. ఐటీ రంగంలో ఉద్యోగావకాశాలు బాగుండటంతో ఎంసీఏను పూర్తిచేసి, వివిధ అనుబంధ కోర్సులు చేసి యువత ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకుంటోంది. అప్పటికే ఏదో ఒక ఉద్యోగంలో చేరిన వారు కెరీర్‌లో ఉన్నత అవకాశాలు పొందేందుకు మేనేజ్‌మెంట్ కోర్సులైవైపు మొగ్గు చూపుతున్నారు. నైపుణ్యాలు పెంచుకొని పదోన్నతులు పొందడానికి ఈ కోర్సులు ఉపయోగపడుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని చాలా యూనివర్సిటీలు మేనేజ్‌మెంట్‌లో యూజీ, పీజీ, పీజీ డిప్లొమా కోర్సులను అందిస్తున్నాయి. ఈ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు నిర్ణీత సమయాల్లో కాంటాక్ట్ కోర్సులు నిర్వహిస్తారు. అవసరమైన స్టడీ మెటీరియల్ అందిస్తారు.
ఉస్మానియా యూనివర్సిటీ మూడేళ్ల కాల వ్యవధితో ఎంసీఏ, రెండేళ్ల కాల వ్యవధితో ఎంబీఏ కోర్సులతో పాటు ఏడాది కాలవ్యవధితో బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో పీజీ డిప్లొమాను ఆఫర్ చేస్తోంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎంసీఏతో పాటు ఎంబీఏ (ఫార్మాస్యూటికల్ మేనేజ్‌మెంట్), ఎంబీఏ (హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, ఎంబీఏ (టెక్నాలజీ మేనేజ్‌మెంట్), పీజీ డిప్లొమా ఇన్ ఫైనాన్సియల్ మేనేజ్‌మెంట్, పీజీ డిప్లొమా ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్ వంటి కోర్సులను అందిస్తోంది.
వివిధ రంగాల్లోనూ అందుబాటులో:
న్యాయశాస్త్రం, వైద్య విద్య వంటి ప్రాక్టికల్ ఓరియెంటెడ్ కోర్సుల్లోనూ డిస్టెన్స్ కోర్సులు లభిస్తున్నాయి. హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా కూడా వివిధ కోర్సులను ఆఫర్ చేస్తోంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎల్‌ఎల్‌ఎం (లేబర్ లాస్), కార్పొరేట్ అండ్ సెక్యూరిటీస్ లా, కాన్‌స్టిట్యూషనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ లా వంటి కోర్సులను ఆఫర్ చేస్తోంది.
సిక్కిం మణిపాల్ యూనివర్సిటీ.. డిప్లొమా ఇన్ మెడికల్ లేబొరేటరీ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ, పీజీ డిప్లొమా ఇన్ క్లినికల్ రీసెర్చ్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్ వంటి కోర్సులను అందుబాటులో ఉంచింది. సింబయాసిస్ సెంటర్ ఆఫ్ హెల్త్‌కేర్ వంటి సంస్థలు కూడా ఏడాది కాల వ్యవధితో పలు కోర్సులను అందిస్తున్నాయి. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, ఆలిండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వంటి నియంత్రణ సంస్థల నిబంధనల నేపథ్యంలో పూర్తిస్థాయి కోర్సులు కాకుండా ఆయా విభాగాలకు సంబంధించిన అనుబంధ కోర్సులను విద్యార్థులకు అందుబాటులో ఉంచుతున్నాయి.
అధునాతన సాంకేతిక పరిజ్ఞానం:
ఇప్పుడు అన్ని రంగాల్లోనూ సాంకేతికత రాజ్యమేలుతోంది. అంతా ఆన్‌లైన్‌లోనే అన్నట్లున్న ప్రస్తుత పరిస్థితుల్లో దూరవిద్యా కోర్సుల బోధన విధానంలోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. అధికశాతం యూనివర్సిటీలు డిస్టెన్స్ విద్యార్థులకు‘ఈ-లెర్నింగ్’సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. కోర్సు రిజిస్ట్రేషన్ నంబరు, లేదా అడ్మిషన్ నంబరు ఆధారంగా సదరు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో యూజర్-ఐడీ, పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకుంటే ‘ఈ-లెర్నింగ్’ మెటీరియల్ లభిస్తుంది.
దూరవిద్యకు పెద్ద దిక్కు:
ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) దేశంలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విభాగంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇది ప్రస్తుతం సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ, డాక్టోరల్ ప్రోగ్రామ్స్ తదితర విభాగాల్లో కోర్సులను ఆఫర్ చేస్తోంది. దేశ, విదేశాల్లోని నెట్‌వర్‌క ద్వారా దాదాపు 30 లక్షల మంది వివిధ కోర్సులను అభ్యసిస్తున్నారు. నిరంతరం మార్కెట్ అవసరాలకు తగినట్లుగా పరిశ్రమ వర్గాలతో చర్చించి సరికొత్త కోర్సులకు రూపకల్పన చేస్తోంది. ఈ క్రమంలో ఏటా కొత్త కొత్త కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. విద్యా విధానంలో ఆడియో విజువల్ మెటీరియల్, టెలీకాన్ఫరెన్స్‌లు, ప్రాక్టికల్స్ అండ్ ప్రాజెక్ట్ వర్క్స్ ఇలా విభిన్న అంశాలతో విద్యార్థులకు చేరువవుతోంది.
బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ టూరిజం స్టడీస్, డిప్లొమా ఇన్ ఆక్వాకల్చర్, పీజీ సర్టిఫికెట్ ఇన్ సైబర్ లా, సర్టిఫికెట్ ఇన్ బిజినెస్ స్కిల్స్, సర్టిఫికెట్ ఇన్ డయాబెటిస్ కేర్ ఫర్ కమ్యూనిటీ వర్కర్, సర్టిఫికెట్ ఇన్ ఆయుష్ నర్సింగ్, పీజీ డిప్లొమా ఇన్ హాస్పిటల్ అండ్ హెల్త్ మేనేజ్‌మెంట్, డిప్లొమా ఇన్ క్రిటికల్ కేర్ నర్సింగ్ వంటి ఎన్నో కోర్సులు అందిస్తోంది.
రాష్ట్రంలో అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ:
రాష్ట్రంలోని యూనివర్సిటీలు పలు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్సులను అందిస్తున్నాయి. వీటిలో సర్టిఫికెట్ స్థాయి మొదలు డిప్లొమా, పీజీ డిప్లొమా, యూజీ, పీజీ కోర్సులు ఉన్నాయి. మన రాష్ట్రంలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ‘ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్’ నినాదంతో విద్యా సేవలు అందిస్తోంది. మల్టీమీడియా టీచింగ్-లెర్నింగ్ విధానంతో విద్యార్థులకు చేరువవుతోంది. బీఈడీ, ఎంఈడీ, ఎంబీఏ, పీజీ డిప్లొమా ఇన్ మార్కెటింగ్ మేనేజ్‌మెంట్, డిప్లొమా ఇన్ హెర్బల్ ప్రొడక్ట్స్ వంటి కోర్సులను ఆఫర్ చేస్తోంది.
మక్కువ అందుకే!
విద్యార్థులను ఉన్నత విద్యకు దగ్గరచేసే ఉత్తమ మార్గం దూరవిద్య. ప్రవేశాలు, అర్హతలు, పరీక్షలు, ప్రాంతం, ఖర్చు తదితర అంశాల్లో సరళత కారణంగా విద్యార్థులు దూరవిద్య కోర్సులపై మక్కువ చూపుతున్నారు. ఉదాహరణకు ఇగ్నోకు సంబంధించి హైదరాబాద్‌లో కోర్సులో ప్రవేశించి, ముంబైలో పరీక్షలు రాయొచ్చు. అవసరమైతే ప్రవేశాన్ని ముంబైకి మార్చుకోవచ్చు. విద్యార్థి కేంద్రంగా, అవసరాలకు అనుగుణంగా దూరవిద్యా విధానంలో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సెల్ఫ్ ఇన్‌స్ట్రక్షనల్ మెటీరియల్, ఆడియో-వీడియో ప్రోగ్రామ్స్, ఇంటరాక్టివ్ రేడియో కౌన్సెలింగ్, వెబ్ కాన్ఫెరెన్సెస్ వంటి సేవలు అందుకునేందుకు అవకాశముంది. నిపుణులు రూపొందించిన మెటీరియల్ కోర్సులకు ప్రత్యేక ఆకర్షణ.
ఇగ్నో కోర్సులు
21 స్కూల్స్ ఆఫ్ స్టడీస్, 67 ప్రాంతీయ కేంద్రాలు, దాదాపు 2,667 లెర్నర్ సపోర్ట్ కేంద్రాలు, 29 విదేశీ భాగస్వామ్య కేంద్రాలతో విస్తరించిన ఇగ్నో దాదాపు 30 లక్షల మంది విద్యార్థులకు సేవలు అందిస్తోంది. 228కు పైగా సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ, డాక్టోరల్ ప్రోగ్రామ్స్‌ను ఆఫర్ చేస్తోంది. ప్రముఖ కోర్సులు: ఎంసీఏ, ఎంఏ ఇన్ రూరల్ డెవలప్‌మెంట్, టూరిజం అండ్ మేనేజ్‌మెంట్, ఇంగ్లిష్, హిందీ, పిలాసఫీ, గాంధీ అండ్ పీస్ స్టడీస్, ఎక్స్‌టెన్షన్ అండ్ డెవలప్‌మెంట్ స్టడీస్, ఎడ్యుకేషన్, ఆంత్రోపాలజీ, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, జెండర్ అండ్ డెవలప్‌మెంట్ స్టడీస్, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, అడల్ట్ ఎడ్యుకేషన్, మాస్టర్ ఆఫ్ కామర్స్, మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, ఎంఎస్సీ డైటీటిక్స్ అండ్ ఫుడ్ సర్వీసెస్ మేనేజ్‌మెంట్, ఎంఎస్సీ కౌన్సెలింగ్ అండ్ ఫ్యామలీ థెరఫీ.
జాబ్ మార్కెట్‌కు తగినట్లు
దేశంలో మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త కోర్సులను ఇగ్నో ప్రవేశపెడుతోంది. విద్యార్థులకు ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తోంది. ఉదాహరణకు అర్బన్ ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్, జియో ఇన్ఫర్మాటిక్స్, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ (కౌన్సెలింగ్) కోర్సులను చెప్పుకోవచ్చు. ఇప్పుడు జాబ్ మార్కెట్లో విద్యార్థి కోర్సు ఎక్కడ చేశారు? ఎన్ని మార్కులు వచ్చాయి? వంటి వాటి కంటే అసలు విద్యార్థి పరిజ్ఞానం, నైపుణ్యాల ఆధారంగానే అవకాశాలు లభిస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచే దిశగా ఇగ్నో కోర్సులకు రూపకల్పన చేస్తోంది. విద్యా సేవలు అందించడంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటోంది. దీనికి ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ (ైఉఖ), మాసివ్ ఓపెన్ ఆన్‌లైన్ కోర్సుల (కైైఇట)ను ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
- డా. పి.వి.కె.శశిధర్, అసోసియేట్ ప్రొఫెసర్, స్కూల్ ఆఫ్ ఎక్స్‌టెన్షన్ అండ్ డెవలప్‌మెంట్ స్టడీస్, ఇగ్నో, న్యూఢిల్లీ.
విద్యార్జనకు దగ్గర చేసే దూరవిద్య!
Published Thu, Aug 21 2014 2:41 AM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM
Advertisement
Advertisement