ఆంధ్ర విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రం ద్వారా బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల సంఖ్యను పెంచినట్లు వీసీ ఆచార్య జి.ఎస్.ఎన్ రాజు తెలిపారు.
విశాఖపట్నం (ఏయూ క్యాంపస్) : ఆంధ్ర విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రం ద్వారా బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల సంఖ్యను పెంచినట్లు వీసీ ఆచార్య జి.ఎస్.ఎన్ రాజు తెలిపారు. సోమవారం ఉదయం అకడమిక్ సెనేట్ మందిరంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్(ఎన్‌సిటిఈ) దూరవిద్యలో అత్యధికంగా 500 ప్రవేశాలు జరిపే విధంగా అనుమతిని ఇచ్చిందన్నారు. దీని ద్వారా నాణ్యమైన బీఈడీ విద్యను అందించడం జరుగుతుందని తెలిపారు. రెండేళ్ల అధ్యాపక వృత్తి అనుభవం కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు.
త్వరలో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని తెలిపారు. ప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుందన్నారు. ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో పనిచేస్తున్నవారు దీనికి అర్హులన్నారు. రెండేళ్ల బీఈడి కోర్సుకు అవసరమైన సిలబస్ సిద్దం చేయడం జరిగిందని చెప్పారు. నిపుణులైన అధ్యాపకులతో దూరవిద్య కేంద్రం అధ్యయన కేంద్రాల ద్వారా సైతం శిక్షణ అందించడం జరుగుతుందని వివరించారు. ఏడాదికి రెండు పర్యాయాలుగా 45 రోజుల పాటు ప్రత్యేక బోధన, శిక్షణ తరగతులు చేపడతామని వెల్లడించారు. ఈ కోర్సును నిర్వహించడం ద్వారా వర్సిటీకి ఆధారం, ప్రతిభావంతులకు ఉపాధిని కల్పించడం సాధ్యపడుతుందన్నారు.పూర్తిస్థాయిలో నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ కోర్సును నిర్వహిస్తామన్నారు. కేవలం 265 మంది విద్యార్థులతో ప్రారంభమైన దూరవిద్యా కేంద్రం నేడు 52 కోర్సులతో 80 వేల మందికి విద్యను చేరువ చేస్తోందని వీసీ తెలిపారు.