సమావేశంలో మాట్లాడుతున్న ఇగ్నో వీసీ కె.నాగేశ్వర్‌రావు
కేయూ క్యాంపస్: దూరవిద్యలో విద్యార్థి కేంద్రిత విధానాన్ని ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉందని ఢిల్లీలోని ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ (వీసీ) ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ రావు అభిప్రాయపడ్డారు. కాకతీయ యూనివర్సిటీ దూర విద్య కేంద్రం, ఇండియన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ (ఐడియా) సంయుక్త ఆధ్వర్యంలో ‘ఇంప్రూవ్డ్ యాక్సెస్ టు డిస్టెన్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫోకస్ ఆన్ అండర్‌సర్వ్‌డ్ కమ్యూనిటీస్ అండ్ అన్ కవర్డ్ రీజియన్స్’అంశంపై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు శనివారం హన్మకొండలోని కేయూ క్యాంపస్‌లో శనివారం ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నాగేశ్వర్ మాట్లాడుతూ, విద్యార్థి కేంద్రిత విధానాన్ని కొనసాగించాల్సి ఉన్నప్పటికీ..దాన్ని ఆచరణలో పెట్టడం లేదన్నారు.
దూరవిద్య సంస్థలకు న్యాక్ గుర్తింపు కోసం విధివిధానాలు రూపొందించేందుకు దేశవ్యాప్తంగా 7 సార్లు కార్యశాలలు నిర్వహించినట్లు తెలిపారు. ఇగ్నో ఆధ్వర్యంలో ఉత్తరాఖండ్‌లో మారుమూల ప్రాంతాల వారికి కంప్యూటర్ ఎడ్యుకేషన్ కోర్సును ఫ్రీ ఆఫ్ కాస్ట్‌తో అవకాశం కల్పిస్తే ఒక సంవత్సరం 9 వేలమంది అడ్మిషన్లు రాగా.. మరో ఏడాది 18 వేల మంది అడ్మిషన్లు పొంది చదువుకున్నారన్నారు. ఇలా తెలుగు లాంగ్వేజ్‌లో కూడా అడ్మిషన్లు చేపట్టవచ్చని సూచించారు. దూరవిద్య కోర్సుల సిలబస్, స్టడీమెటీరియల్‌ను ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ.. అలా జరగట్లేదన్నారు.
ఆధునిక టెక్నాలజీ తో వెబ్‌సైట్‌ల ద్వారా కూడా సిలబస్, స్టడీమెటీరియల్‌ను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. డా. బీఆర్ అంబేడ్కర్ ఓపెన్‌వర్సిటీ వీసీ ప్రొఫెసర్ సీతారామారావు మాట్లాడుతూ, వర్సిటీలు చట్టబద్ధంగా ఏర్పడిన సంస్థలే.. అయితే వివిధ కోర్సుల నిర్వహణకు మళ్లీ రెగ్యులేటరీ బాడీస్ ద్వారా అనుమతులు తీసుకోవాలనేది సరికాదన్నారు. సమావేశంలో ఇండియన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రొఫెసర్ మురళీమనో హర్, కేయూ వీసీ ప్రొఫెసర్ సాయన్న, దూరవిద్యాకేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ దినేష్‌కుమార్, కన్వీనర్ ప్రొఫెసర్ శ్రీనివాస్‌రావు, దూరవిద్య కేంద్రం జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ పద్మలత పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment