Indira Gandhi National Open University
-
IGNOU: అత్యున్నత ఓపెన్ వర్సిటీ
ప్రపంచంలోని అతిపెద్ద సార్వత్రిక విశ్వవిద్యాలయంగా పేరు గాంచిన ‘ఇందిరా గాంధి నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ’ (ఇగ్నో) సమాజంలోని వెనుకబడిన వర్గాలకు దూర విద్య ద్వారా ఉన్నత విద్యా అవకాశాలను అందిస్తోంది. భారతదేశంలో సార్వత్రిక దూర విద్యను ప్రోత్సహించటం, సమ న్వయం చేయడం, మంచి ప్రమాణాలను నెల కొల్పడం, ఉన్నత దూర విద్య ద్వారా భారత దేశ మానవ వనరులను బలోపేతం చేయడం, బోధన – పరిశోధనలతో పాటు... విస్తరణ, శిక్షణ ప్రధాన లక్ష్యాలుగా ఇగ్నో పని చేస్తోంది. భారత మొదటి మహిళా ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ పేరు మీద ఆమె జన్మదినం నవంబర్ 19న 1985లో నెలకొల్పిన ఈ యూనివర్సిటీ... ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులకు సేవలు అంది స్తోంది. భారతదేశంలో ఉన్నత విద్యలో చేరిన మొత్తం విద్యార్థులలో సుమారు ఇరవై శాతం మంది ఇగ్నోలో ప్రవేశాలు పొందినవారే. 226కు పైగా అకాడెమిక్ ప్రోగ్రాంలు, మరికొన్ని ఆన్ లైన్ ప్రోగ్రాములే కాకుండా ‘స్వయం’ మూక్స్ ద్వారా కూడా విద్యను అందిస్తోంది ఇగ్నో. భారత దేశ దూర విద్యా పితామహుడు ప్రొఫెసర్ జి. రామ్ రెడ్డి ఇగ్నో మొదటి ఉపకులపతిగా సేవలు అందిచటం మన తెలుగువారికి గర్వకారణం. మన దేశంలో ఏ సార్వత్రిక విశ్వవిద్యాలయానికీ లేని ప్రత్యేకతలు ఇగ్నోకు మాత్రమే ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు వివిధ సర్టిఫికెట్, డిప్లొమా, పీజీ డిప్లొమా, డిగ్రీలకు (ఎంపిక చేసిన) సంబంధిచిన ట్యూషన్ ఫీజులు పూర్తిగా మినహాయింపు ఇస్తూ... మామూలు రెగ్యులర్ విద్యా లయాల్లో చేరి చదువుకోలేని లక్షలాదిమంది బడుగు, బలహీన, పేద విద్యార్థులకు ఇగ్నో ఉదారంగా విద్యనందిస్తోంది. స్కిల్ డెవలప్మెంట్, ఉపాధిని కలిపించే వివిధ సాంకేతిక, ప్రొఫెషనల్ ప్రోగ్రాములను అభ్యసించిన ఇగ్నో విద్యార్థులు దేశ, విదేశాల్లో ఉద్యోగాలు పొందు తున్నారు. ఢిల్లీలోని మెయిన్ క్యాంపస్‌లోనే కాక... వివిధ రాష్ట్రాల్లో ఉన్న రీజినల్ క్యాంపస్సుల్లో కూడా ఇంటర్వ్యూలు నిర్వహించి, అనేక కంపెనీలు ఇగ్నో విద్యార్థులను రిక్రూట్ చేసుకుంటున్నాయి. ఈ విధంగా రెగ్యులర్ యూనివర్సిటీలకు ఏమాత్రం తీసిపోకుండా... కొన్నిసార్లు వాటికన్నా మిన్నగా విద్యా, ఉపాధి అవకాశాలను అందిస్తోంది ఇగ్నో. మార్చి 2022 లో వెబ్మెట్రిక్ ప్రమాణాల ర్యాంకింగ్‌లో ఇగ్నో 247వ స్థానంలో నిలిచి తన సత్తా చాటడం ముదావహం. (క్లిక్ చేయండి: ‘కోటా’ను కాపాడుకోవడం ఎలా?) - డాక్టర్ శ్రవణ్ కుమార్ కందగట్ల అకడమిక్ కౌన్సిలర్, ఇగ్నో (నవంబర్ 19న ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఆవిర్భావ దినం) -
దూరవిద్యలో విద్యార్థి కేంద్రిత విధానం తీసుకురావాలి
కేయూ క్యాంపస్: దూరవిద్యలో విద్యార్థి కేంద్రిత విధానాన్ని ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉందని ఢిల్లీలోని ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ (వీసీ) ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ రావు అభిప్రాయపడ్డారు. కాకతీయ యూనివర్సిటీ దూర విద్య కేంద్రం, ఇండియన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ (ఐడియా) సంయుక్త ఆధ్వర్యంలో ‘ఇంప్రూవ్డ్ యాక్సెస్ టు డిస్టెన్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫోకస్ ఆన్ అండర్సర్వ్డ్ కమ్యూనిటీస్ అండ్ అన్ కవర్డ్ రీజియన్స్’అంశంపై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు శనివారం హన్మకొండలోని కేయూ క్యాంపస్‌లో శనివారం ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నాగేశ్వర్ మాట్లాడుతూ, విద్యార్థి కేంద్రిత విధానాన్ని కొనసాగించాల్సి ఉన్నప్పటికీ..దాన్ని ఆచరణలో పెట్టడం లేదన్నారు. దూరవిద్య సంస్థలకు న్యాక్ గుర్తింపు కోసం విధివిధానాలు రూపొందించేందుకు దేశవ్యాప్తంగా 7 సార్లు కార్యశాలలు నిర్వహించినట్లు తెలిపారు. ఇగ్నో ఆధ్వర్యంలో ఉత్తరాఖండ్‌లో మారుమూల ప్రాంతాల వారికి కంప్యూటర్ ఎడ్యుకేషన్ కోర్సును ఫ్రీ ఆఫ్ కాస్ట్‌తో అవకాశం కల్పిస్తే ఒక సంవత్సరం 9 వేలమంది అడ్మిషన్లు రాగా.. మరో ఏడాది 18 వేల మంది అడ్మిషన్లు పొంది చదువుకున్నారన్నారు. ఇలా తెలుగు లాంగ్వేజ్‌లో కూడా అడ్మిషన్లు చేపట్టవచ్చని సూచించారు. దూరవిద్య కోర్సుల సిలబస్, స్టడీమెటీరియల్‌ను ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ.. అలా జరగట్లేదన్నారు. ఆధునిక టెక్నాలజీ తో వెబ్సైట్ల ద్వారా కూడా సిలబస్, స్టడీమెటీరియల్‌ను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. డా. బీఆర్ అంబేడ్కర్ ఓపెన్‌వర్సిటీ వీసీ ప్రొఫెసర్ సీతారామారావు మాట్లాడుతూ, వర్సిటీలు చట్టబద్ధంగా ఏర్పడిన సంస్థలే.. అయితే వివిధ కోర్సుల నిర్వహణకు మళ్లీ రెగ్యులేటరీ బాడీస్ ద్వారా అనుమతులు తీసుకోవాలనేది సరికాదన్నారు. సమావేశంలో ఇండియన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రొఫెసర్ మురళీమనో హర్, కేయూ వీసీ ప్రొఫెసర్ సాయన్న, దూరవిద్యాకేంద్రం డైరెక్టర్ ప్రొఫెసర్ దినేష్‌కుమార్, కన్వీనర్ ప్రొఫెసర్ శ్రీనివాస్‌రావు, దూరవిద్య కేంద్రం జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ పద్మలత పాల్గొన్నారు. -
సార్వత్రిక విద్యలో ఇగ్నో కీలకపాత్ర
40 దేశాల్లో అధ్యయన కేంద్రాలు దేశంలో 67 ప్రాంతీయ కేంద్రాలు 8న 28వ ఇగ్నో స్నాతకోత్సవం విజయవాడ (వన్‌టౌన్) : భారతదేశంలో సార్వత్రిక విద్యను అందించే విద్యా సంస్థల్లో ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) మేటిగా ఉంది. ఉన్నత విద్యావ్యాప్తి కోసం 1985 నవంబర్ 19న ఇగ్నోను ఢిల్లీ కేంద్రంగా ఏర్పాటు చేశారు. పార్లమెంట్లో ప్రత్యేక చట్టం ద్వారా దీని ఏర్పాటుకు ప్రభుత్వం పునాదులు వేసింది. రోజువారి (రెగ్యులర్) విద్యా విధానంలో ఉన్నత చదువులు చదవాలనే కాంక్ష బలంగా ఉండి, ఆ అవకాశం లేని లక్షలాదిమంది ఇగ్నో ద్వారా తమ కలలను సాకారం చేసుకుంటున్నారు. విద్యావ్యాప్తితో పాటుగా ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే క్రమంలో ఇగ్నో విధానాలు యువతకు బాసటగా నిలుస్తున్నాయి. ఈనెల 8న ఇగ్నో స్నాతకోత్సవం జరుగనుంది. ప్రమాణాల్లో రాజీ లేదు ప్రతి విద్యార్థి ఆయా కోర్సుకు సంబంధించిన ఎసైన్‌మెంట్లను పూర్తి చేసి సమర్పించాలి. ఎసైన్‌మెంట్లకు ప్రత్యేకంగా విశ్వవిద్యాలయం 30 శాతం మార్కులను కేటాయిస్తుంది. అలాగే రాత పరీక్షలకు 70 శాతం మార్కులు ఉంటాయి. రెండింటిలోనూ విద్యార్థులు సరైన ప్రతిభ కనబరిచినప్పుడే ఆ కోర్సు ఉత్తీర్ణులయ్యేం దుకు అవకాశముంటుంది. దీనిలో ఇగ్నో రాజీ పడకుండా ముందుకు సాగుతోంది. ఉతీర్ణతా సర్టిఫికెట్లలో క్రెడిట్స్‌తో పాటుగా మార్కుల శాతాన్ని కూడా ముద్రిస్తారు. ఉపాధే లక్ష్యంగా కోర్సులు యూజీ, పీజీ కోర్సులతో పాటు ఉపాధి అవకాశాలను ప్రభావితం చేసే పలు కోర్సులను కూడా ఇగ్నో అందిస్తోంది. కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఉన్న పాడి పరిశ్రమను గమనంలో ఉంచుకొని డిప్లమో ఇన్ డెయిరీ టెక్నాలజీ కోర్సును ప్రత్యేకంగా ఇంగ్లిష్, తెలుగు మీడియాల్లో నూతనంగా ప్రవేశ పెట్టారు. ఎంఏ (సైకాలజీ), ఎంఎస్సీ (కౌన్సిలింగ్ అండ్ ఫ్యామిలీథెరఫీ), ఎంఎస్డబ్ల్యు (కౌన్సిలింగ్ ) కోర్సులు, అలాగే పూర్వ ప్రాథమిక విద్యకు సంబంధించి పీజీ డిప్లమో ఇన్ ప్రీ ్రైపైమరీ ఎడ్యుకేషన్, విద్యా కళాశాలల్లో బోధకులుగా వెళ్లేవారికి ఎంఏ (ఎడ్యుకేషన్) తదితర కోర్సులు ఉన్నాయి. 29 అధ్యయన కేంద్రాలు రాష్ట్రం విడిపోయిన తరువాత విజయవాడ రీజినల్ సెంటర్ కీలకంగా మారింది. విజయవాడ రీజినల్ కేంద్రం ద్వారా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపూర్, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాల్లో స్టడీ సెంటర్లు కొనసాగుతున్నాయి. 2013లో రాయలసీమ జిల్లాలకు సంబంధించి తిరుపతిలో సబ్ రీజినల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. విజయవాడ రీజినల్ కేంద్రం పరిధిలో మొత్తం 29 అధ్యయన కేంద్రాల ద్వారా వేలాది మంది విద్యార్థులు పలు డిగ్రీలను పూర్తి చేసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు ఇగ్నోకు ప్రపంచ వ్యాప్తంగా విద్యార్థులు ఉన్నారు. ప్రధానంగా గడిచిన మూడు దశాబ్ధాల్లో 40 దేశాలకు ఇగ్నో సేవలు విస్తరించాయి. దేశ వ్యాపితంగా 67 ప్రాంతీయ కార్యాలయాలు, వాటి కింద 2,600కు పైగా స్టడీ సెంటర్లు పనిచేస్తున్నాయి. ఇగ్నో మొత్తం 142 కోర్సులను అందిస్తుండగా విజయవాడ ప్రాంతీయ కార్యాలయం పరిధిలో వంద వరకు కోర్సులు అందుబాటులో ఉన్నాయని ఇగ్నో కార్యాలయ ప్రతినిధులు చెబుతున్నారు. బీకాం (ఏ అండ్ ఎఫ్)కు భలే డిమాండ్ సీఏ కోర్సును అభ్యసిస్తున్న విద్యార్థులకు ఒకే ఏడాదిలో బీకాం (ఏ అండ్ ఎఫ్) డిగ్రీ పూర్తి చేసుకునే అవకాశాన్ని ఇగ్నో కల్పిస్తోంది. ఈ కోర్సును ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అక్కౌంటెన్సీ, ఇగ్నో సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. నగరంలో సీఏ విద్యా సంస్థలు అధికంగా ఉండటంతో ఈ కోర్సుకు మంచి డిమాండ్ ఉంది. -
చావు అంచున ఉన్నా చదువుతున్నాడు
పరీక్షలు రాస్తున్న యాకుబ్ మెమన్ నాగపూర్: మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు, 1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో ఉరిశిక్షపడ్డ యాకుబ్ అబ్దుల్ రజాక్ మెమన్ నాగపూర్ సెంట్రల్ జైలులో ఎం.ఎ.(రాజనీతిశాస్త్రం) పరీక్షలు రాస్తున్నాడు. అయితే మెమన్‌కు మరణదండన విధించడంపై సుప్రీంకోర్టు ఇటీవలే స్టే విధించడం తెలిసిందే. గతంలో చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేసిన ఇతడు, ప్రస్తుతం ఎం.ఎ. రెండో ఏడాది పరీక్షలు రాస్తున్నాడు. మొదటి పేపరును ఈ నెల మూడున, మరో పేపరును సోమవారం ఫాసీయార్డులో రాశాడు. ఉరిశిక్ష పడ్డ ఖైదీలను నిర్బంధించే బ్యారక్‌ను ఫాసీయార్డుగా పిలుస్తారు. ఇక్కడ పటిష్ట భద్రత ఉంటుంది. ఉరిశిక్ష పడ్డ ఖైదీ అయినందున మెమన్ను బయటి ప్రపంచంలోకి అనుమతించబోరని ఇందిరాగాంధీ జాతీయసార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) ప్రాంతీయ సంచాలకుడు పి.శివస్వరూప్ తెలిపారు. ఇతని పరీక్షలు జూన్ 28న ముగుస్తాయన్నారు. మెమన్తోపాటు ఉరిశిక్షపడ్డ ఐదుగురు ఖైదీలూ పరీక్షలు రాస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం 300 మంది ఖైదీలు ఇగ్నో అందిస్తున్న వివిధ కోర్సులు చదువుతున్నారని శివస్వరూప్ వివరించారు. మెమన్ ఇది వరకే ఎం.ఎ. (ఇంగ్లిష్) రెండోశ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. గత ఏడాది ఏప్రిల్ 12న నిర్వహించిన స్నాతకోత్సవంలో ఇతనికి పట్టా ప్రదానం చేయాల్సి ఉంది. శిక్షపడ్డ ఖైదీలను యూనివర్సిటీకి పంపించేందుకు అధికారులు తిరస్కరించారు. దీంతో జైలు ఆవరణలోనే మెమన్‌కు పట్టా అందజేశారు. పేలుళ్ల కేసులో ఇతనికి మరణశిక్ష విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై స్పందించిన సుప్రీంకోర్టు ఈ నెల రెండున స్టే జారీ చేసింది. ఉరిశిక్ష విధింపును సమీక్షించాలన్న మెమన్ పిటిషన్‌పై స్పందించాలని మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర న్యాయశాఖను ఆదేశించింది. అప్పటి వరకు శిక్ష అమలును నిలిపి వేయాలని ఆదేశించింది. అయితే ఇతనికి ఉరిశిక్ష విధించడాన్ని సుపరీంకోర్టు గత మార్చిలో సమర్థించింది. ముంబై పేలుళ్లలో 257 మంది మరణించగా, 700 మంది గాయపడ్డారు. -
పొలిటికల్ సైన్స్ చదువుతున్న మెమన్
నాగపూర్: 1993 నాటి ముంబై వరుస పేలుళ్ల కేసులో మరణశిక్ష పడిన యాకూబ్ అబ్దుల్ రజాక్ మెమన్ పీజీ కోర్సు చేస్తున్నాడు. నాగపూర్ సెంట్రల్ జైల్లో ఉన్న మెమన్ ఇందిరా గాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం(ఇగ్నో) ద్వారా ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుతున్నాడు. చార్టెడ్ ఎకౌంటెంట్ అయిన మెమన్ ఇప్పుడు ఎంఏ రెండో సంవత్సరంలో ఉన్నాడు. ఈ నెల 3న మొదటి పరీక్ష హాజరైన అతడు సోమవారం రెండో పేపర్ రాశాడు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే జైలు గదిలో అతడు పరీక్ష రాశాడు. కరడుగట్టిన నేరస్తుడు కావడంతో జైలు బయట పరీక్ష రాసేందుకు పోలీసులు అనుమతించలేదని ఇగ్నో ప్రాంతీయ డైరెక్టర్ పి శివస్వరూప్ తెలిపారు. ఈనెల 28తో పరీక్షలు ముగుస్తాయని చెప్పారు. మెమన్ తో పాటు మరణశిక్ష పడిన మరో ఐదుగురు ఖైదీలు పరీక్షలు రాసినట్టు వెల్లడించారు. 300 మందిపైగా ఖైదీల వివిధ కోర్సుల పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. మెమన్ కు విధించిన ఉరిశిక్షపై సుప్రీంకోర్టు గతవారం స్టే విధించింది.