చావు అంచున ఉన్నా చదువుతున్నాడు
పరీక్షలు రాస్తున్న యాకుబ్ మెమన్
నాగపూర్: మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు, 1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో ఉరిశిక్షపడ్డ యాకుబ్ అబ్దుల్ రజాక్ మెమన్ నాగపూర్ సెంట్రల్ జైలులో ఎం.ఎ.(రాజనీతిశాస్త్రం) పరీక్షలు రాస్తున్నాడు. అయితే మెమన్‌కు మరణదండన విధించడంపై సుప్రీంకోర్టు ఇటీవలే స్టే విధించడం తెలిసిందే. గతంలో చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేసిన ఇతడు, ప్రస్తుతం ఎం.ఎ. రెండో ఏడాది పరీక్షలు రాస్తున్నాడు.
మొదటి పేపరును ఈ నెల మూడున, మరో పేపరును సోమవారం ఫాసీయార్డులో రాశాడు. ఉరిశిక్ష పడ్డ ఖైదీలను నిర్బంధించే బ్యారక్‌ను ఫాసీయార్డుగా పిలుస్తారు. ఇక్కడ పటిష్ట భద్రత ఉంటుంది. ఉరిశిక్ష పడ్డ ఖైదీ అయినందున మెమన్‌ను బయటి ప్రపంచంలోకి అనుమతించబోరని ఇందిరాగాంధీ జాతీయసార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) ప్రాంతీయ సంచాలకుడు పి.శివస్వరూప్ తెలిపారు. ఇతని పరీక్షలు జూన్ 28న ముగుస్తాయన్నారు. మెమన్‌తోపాటు ఉరిశిక్షపడ్డ ఐదుగురు ఖైదీలూ పరీక్షలు రాస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం 300 మంది ఖైదీలు ఇగ్నో అందిస్తున్న వివిధ కోర్సులు చదువుతున్నారని శివస్వరూప్ వివరించారు.
మెమన్ ఇది వరకే ఎం.ఎ. (ఇంగ్లిష్) రెండోశ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. గత ఏడాది ఏప్రిల్ 12న నిర్వహించిన స్నాతకోత్సవంలో ఇతనికి పట్టా ప్రదానం చేయాల్సి ఉంది. శిక్షపడ్డ ఖైదీలను యూనివర్సిటీకి పంపించేందుకు అధికారులు తిరస్కరించారు. దీంతో జైలు ఆవరణలోనే మెమన్‌కు పట్టా అందజేశారు. పేలుళ్ల కేసులో ఇతనికి మరణశిక్ష విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై స్పందించిన సుప్రీంకోర్టు ఈ నెల రెండున స్టే జారీ చేసింది. ఉరిశిక్ష విధింపును సమీక్షించాలన్న మెమన్ పిటిషన్‌పై స్పందించాలని మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర న్యాయశాఖను ఆదేశించింది. అప్పటి వరకు శిక్ష అమలును నిలిపి వేయాలని ఆదేశించింది. అయితే ఇతనికి ఉరిశిక్ష విధించడాన్ని సుపరీంకోర్టు గత మార్చిలో సమర్థించింది. ముంబై పేలుళ్లలో 257 మంది మరణించగా, 700 మంది గాయపడ్డారు.