ఇంటర్నేషనల్ మాఫియా డాన్‌ను ఢీకొట్టిన ముంబై మహిళ
భర్త హత్యకు ప్రతీకారంగా గ్యాంగ్‌స్టర్ అవతారం
‘మాఫియా క్వీన్ ఆఫ్ ముంబై’గా ఎదిగిన వితంతువు
ప్రతీకారం తీరకుండానే ప్రత్యర్థుల చేతుల్లో హత్య
క్రికెట్ స్టేడియంలో వేలాది మంది ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షిస్తుండగా ఒక మనిషిని చంపాలనుకోవడం సాధ్యమా? అదికూడా అంతర్జాతీయ స్థాయిలో పేరుమోసిన మాఫియా డాన్‌ను మట్టుబెట్టాలంటే మామూలు విషయమా? కానీ అలాంటి సాహసం చేసిందో మహిళ. ఆమె ఎవరు?, ఆమె చంపాలనుకున్న మాఫియా డాన్ ఎవరు?, అందుకు అతడిని చంపాలకుందనే వివరాలు తెలియాలంటే జర్నలిస్ట్ హుస్సేన్ జైదీ రాసిన ‘మాఫియా క్వీన్ ఆఫ్ ముంబై’ పుస్తకం చదవాల్సిందే.
ఇంతకీ ఈ పుసక్తంలో ఏముంది?
అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం (Dawood Ibrahim) పేరు అందరూ వినేవుంటారు. భారతదేశ వ్యవస్థీకృత నేర చరిత్రలో అత్యంత క్రూరుడిగా అతడు గుర్తింపు పొందాడు. 1993 బాంబే వరుస పేలుళ్లకు (Mumbai Serial Blasts) ప్రధాన సూత్రధారిగా దావూద్‌పై ఆరోపణలు ఉన్నాయి. అంతర్జాతీయ ఉగ్రవాద ముఠాలతో చేతులు కలిపి భారత వాణిజ్య రాజధాని ముంబై మహానగరంలో అతడు సాగించిన మారణహోమం ఎంతో మంది అమాయకులను బలిగొంది. అండర్‌వరల్డ్ కార్యకలాపాలు, మత్తుపదార్థాల రవాణా వంటి అరాచకాలతో చెలరేగిన అతడికి ఎంతో మంది శత్రువులయ్యారు. దావూద్ శత్రువుల్లో సప్నా దీదీ కూడా ఒకరు. అయితే ఈమె గురించి బయట ప్రపంచానికి పెద్దగా తెలియదు. ‘మాఫియా క్వీన్ ఆఫ్ ముంబై’ (Mafia Queens of Mumbai) పుస్తకంలో సప్నా దీదీ గురించి రాశారు.
ఎవరీ స్వప్నా దీదీ?
ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చిన వచ్చిన దేవతగా సప్నా దీదీని జర్నలిస్ట్ హుస్సేన్ జైదీ వర్ణించాడు. దావూద్ ఇబ్రహీం శత్రువైన ముంబై గ్యాంగ్‌స్టర్ హుస్సేన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా సప్నా దీదీ గురించి రాశాడతను. ప్రతీకారం తీర్చుకోవడానికి నేరుగా ముంబై అండర్‌వరల్డ్ చీకటి ప్రపంచంలోకి మెరుపులా దూసుకొచ్చిన వీర వనితగా పేర్కొన్నాడు.
సప్నా దీదీ (Sapna Didi) ముంబైలోని సాంప్రదాయ ముస్లిం కుటుంబంలో జన్మించింది. ఆమె అసలు పేరు అష్రాఫ్. చాలా చిన్న వయస్సులోనే గ్యాంగ్‌స్టర్ మెహమూద్ ఖాన్‌తో ఆమెకు పెళ్లి జరిగింది. తన భర్తకు అండర్ వరల్డ్‌తో ఉన్న లింకులు ఆమెకు తెలియవు. దుబాయ్ పర్యటన నుంచి తిరిగి వచ్చిన భర్తను ముంబై విమానాశ్రయంలో తన కళ్ల ముందే కాల్చి చంపడంతో ఆమె ప్రపంచం తలక్రిందులైంది. తన జీవితంలో ఎదురైన అతిపెద్ద షాక్ నుంచి బయటపడేందుకు సమాధానాల కోసం వెతుకుతుండగా ఆమెకు నిజం తెలిసింది. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ఆదేశాల మేరకే అతడి గ్యాంగ్ తన భర్తను పొట్టనపెట్టుకుందని తెలుసుకుంది. దావూద్ మాట విననందుకు ఈ దారుణానికి ఒడిగట్టారని తెలుసుకుని ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది.
డీ-కంపెనీ ఆగడాలకు చెక్
ముంబైలో దావూద్ ఇబ్రహీంకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న హుస్సేన్ జైదీని అష్రాఫ్ కలిసింది. దావూద్‌ను అంతమొందిచాలన్న తన లక్ష్యం గురించి చెప్పి, సహాయం చేయాలని అతడిని అర్థించింది. కొద్దిరోజుల్లోనే తుపాకీ కాల్చడం నేర్చుకుని రంగంలోకి దిగింది. దావూద్ పతనమే ధ్యేయంగా కొన్ని నెలల పాటు హుస్సేన్ జైదీతో కలిసి పనిచేసింది. నేపాల్ ద్వారా భారత్‌లోకి డీ-కంపెనీ పంపుతున్న అక్రమ ఆయుధాలను అడ్డుకున్నారు. పలు రకాలుగా డీ-కంపెనీ ఆగడాలకు చెక్ పెట్టారు. గ్యాంగ్‌స్టర్‌గా మారిన తర్వాత తన పేరును స్వప్నా దీదీగా మార్చుకుంది. బురఖా తొలగించి జీన్స్, షర్ట్ ధరించింది. బైక్ నడపడం, సులువుగా గన్ హ్యాండిల్ చేయడం వంటివి సులువుగా చేసేది. ముంబై దావూద్ వ్యాపారాలకు దెబ్బకొడుతున్న వ్యక్తిగా స్వప్నా దీదీ మెల్లమెల్లగా గుర్తింపు పొందింది. దీంతో దావూద్ అనుచరుల్లో భయం మొదలైంది.
దావూద్ హత్యకు ప్లాన్
మరోవైపు హుస్సేన్ జైదీతో ఆమె సంబంధాలు క్షీణించినప్పటికీ దావూద్‌ను చంపాలన్న నిర్ణయాన్ని మాత్రం ఆమె మార్చుకోలేదు. 1990 ప్రారంభంలో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య షార్జాలో జరిగిన వన్డే మ్యాచ్‌లో దావూద్‌ను హతమార్చేందుకు ప్లాన్ వేసింది. దావూద్ తరచుగా వీఐపీ ఎన్‌క్లోజర్ నుంచి క్రికెట్ మ్యాచ్‌లను చూసేవాడు. అతడు బహిరంగంగా కనిపించిన కొన్ని సందర్భాలలో ఇదీ ఒకటి. స్టేడియంలో ప్రేక్షకుల మధ్య దావూద్ హత్యకు ప్లాన్ చేసింది స్వప్న. తన అనుచరులను స్టేడియంలోకి పంపించి గొడుగులు, సీసాలు పగులగొట్టి దావూద్‌ను మట్టుబెట్టాలని అనుకుంది. ముందుగా దావూద్ అనుచరులపై దాడి చేసి గొడవ సృష్టించాలని, సందట్లో సడేమియాలా డాన్‌ను చంపాలని పథక రచన చేసింది.
చదవండి: పదే పది నిమిషాలు.. "ఇదెక్కడి టార్చర్ భయ్యా..!"
22 సార్లు కత్తితో పొడిచి హత్య
దురదృష్టవశాత్తు ఆమె ప్లాన్ గురించి ముందే దావూద్ ఇబ్రహీంకు తెలిసిపోయింది. దీంతో దావూద్ తన అనుచరులతో ఆమెను దారుణంగా హత్య చేయించాడు. 1994లో ముంబైలోని తన నివాసంలో సప్నా దీదీని 22 సార్లు కత్తితో పొడిచి మర్డర్ చేశారు. దావూద్ ఇబ్రహీంకు భయపడి ఇరుగుపొరుగు వారెవరూ ఆమెను కాపాడటానికి ముందుకు రాలేదు. ఆస్పత్రికి తరలించే లోగా ఆమె ప్రాణాలు విడిచింది. ప్రస్తుతం ఆమె పేరు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. పెద్ద మాఫియాడాన్‌కు వ్యతిరేకంగా తెగువ చూపిన సప్నా దీదీ ఫొటో ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment