Nagpur Central Jail
-
ఒళ్లు గగుర్పొడిచే.. ‘అండా సెల్’
సాక్షి, సెంట్రల్ డెస్క్: దేశ స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో అండమాన్‌లోని ‘కాలాపానీ’, బర్మా (ప్రస్తుతం మయన్మార్)లో ‘మాండలే’ జైళ్లు చరిత్ర ప్రసిద్ధికెక్కాయి. లోకమాన్య బాలగంగాధర్ తిలక్‌కు నాటి బ్రిటిష్ ప్రభుత్వం ఆరేళ్ల కఠిన కారాగార శిక్ష విధించి బర్మాలోని మాండలే జైలుకు పంపింది. ఒక్కసారి ‘కాలాపానీ’, ‘మాండలే’ జైలులో ప్రవేశిస్తే ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. అత్యంత దారుణ మైన చావుని మూటగట్టుకోవాల్సిందే. ఎందుకంటే అక్కడ ఖైదీలకు విధించే శిక్షలు దారుణంగా ఉంటాయి. కాలాపానీ, మాండలే జైళ్ల తరహాలోనే ఇప్పుడు అండా సెల్స్ కూడా చాలా పాపులర్. మానవ హక్కుల కార్యకర్త, ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా అక్టోబర్ 13న కన్నుమూసిన సంగతి తెలిసిందే.ఆయన నాగపూర్ సెంట్రల్ జైలులో తొమ్మిదేళ్లపాటు జైలుశిక్ష అనుభవించారు. అందులోనూ ‘అండా సెల్’లో అత్యంత కఠినమైన కారాగార శిక్షను ఎదుర్కొన్నారు. ఈయనకు ముందు నకిలీ స్టాంప్ పేపర్ల కుంభకోణంలో అబ్దుల్ కరీం తెల్గీ, 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి నిషేధిత ఆయుధాలను అక్రమంగా కలిగి ఉన్నందుకు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌ను అండా సెల్లో ఉంచారు. రోజులో ఉన్న 24 గంటల్లో 22.5 గంటలు అత్యంత కఠిన ఏకాంత నిర్బంధం తప్పదని తెలుసుకుంటే ఒళ్లు గగుర్పొడచక మానదు. ఈ నేపథ్యంలో ఈ అండా సెల్ ఏంటి? ఇది ఎక్కడ ఉంది? ఎలాంటి వారిని ఇందులో ఉంచుతారు? ఇప్పటివరకు ఇందులో ఎవరెవరు శిక్షను అనుభవించారు? అనే అంశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. గుడ్డు ఆకారంలో..⇒ అండా సెల్ అంటే గుడ్డు ఆకారంలో ఉండే నిర్మాణం. ఇందులో రెండు విభాగాలు ఉంటాయి. 1,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 50్ఠ50 అడుగుల కంపార్ట్మెంట్లుగా విభజితమై ఉంటుంది.⇒ మహారాష్ట్రలోని ఎరవాడ (పుణే), నవీ ముంబైలోని తలోజా, నాగపూర్ సెంట్రల్ జైళ్లలో ఈ అండా సెల్స్ ఉన్నాయి. ఇక్కడే కాకుండా మనదేశంలోని పలు సెంట్రల్ జైళ్లలోనూ ఈ అండా సెల్స్ ఉన్నాయని తెలుస్తోంది. వీటిని ఆయా రాష్ట్రాల ప్రజా పనుల విభాగాలు నిర్మించాయి.⇒ 1990లో పుణేలోని ఎరవాడలో అండా సెల్‌ను నిర్మించారు.⇒అత్యంత కరడు గట్టిన నేరస్తులను, మోస్ట్ వాండెట్ ఉగ్రవాదులను, తీవ్రవాదులను, గ్యాంగ్స్టర్లను. వ్యవస్థీకృత నేరాలు చేసినవారిని ఈ అండా సెల్స్‌లో ఉంచుతారు.⇒ అమృత్‌సర్‌లో గోల్డెన్ టెంపుల్ వద్ద ఆపరేషన్ బ్లూస్టార్‌కు నాయకత్వం వహించిన ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ అరుణ్‌కుమార్ వైద్యను హత్య చేసిన ఉగ్రవాదులు హర్జీందర్ సింగ్ జిందా, సుఖ్‌దేవ్ సుఖాలను ఉరితీసే ముందు 1992లో పుణేలోని ఎరవాడలో ఉన్న అండా సెల్లో తొలిసారిగా ఉంచారు.అండా సెల్స్ ఎందుకు?అత్యంత కరడు గట్టిన నేరస్తులను సులువుగా పర్యవేక్షించడానికి, అధిక ప్రమాదం ఉన్న ఖైదీలను సురక్షితంగా ఉంచడానికి ప్రత్యేకంగా ఈ అండా సెల్స్‌ను నిర్మించారు. గుడ్డు ఆకారంలో రెండు భాగాలుగా ఉండే అండా సెల్స్ జైలు అధికారుల పెట్రోలింగ్‌కు అనుకూలంగా ఉంటాయి. వీటిలో అత్యంత పటిష్టమైన భద్రత ఉంటుంది.ఇనుప కడ్డీలే స్నేహితులు.. ఊచలే తోబుట్టువులుఅండా సెల్స్‌లో రెండు.. బాహ్య, అంతర్గత భద్రతా వలయాలు ఉంటాయి. మిగతా బ్యారక్‌లతో పోలిస్తే అండా సెల్స్‌ను పర్యవేక్షించడానికి ఎక్కువ మంది జైలు అధికారులు ఉంటారు. అండా సెల్లో జైలుశిక్ష అత్యంత దారుణంగా ఉంటుంది. ఇందులో ఖైదీకి ఏకాంత నిర్బంధం ఉంటుంది. రోజులో 22.5 గంటల పాటు ఒంటరిగా ఉండాల్సి ఉంటుంది. ఇనుప కడ్డీలు, జైలు ఊచలు తప్ప మరో మనిషి జాడ కనిపించదు. సెంట్రల్ జైలులో అత్యంత ఒంటరిగా ఉండే సెల్.. అండా సెల్. అందులో ఉండే ఖైదీ అన్ని వైపులా ఇనుప కడ్డీలతో కప్పబడి ఉంటాడు.ఎత్తయిన గోడలే తప్ప కిటికీలు ఉండవు. పచ్చదనం ఏమాత్రం కనిపించదు. ఒక్క మాటలో చెప్పాలంటే గాలి కూడా చొరబడలేని కాంక్రీట్‌తో నిర్మితమై ఉంటుందంటే అతిశయోక్తి కాదు. గదిలో ఉన్న ఖైదీ చుట్టూ కాంక్రీట్‌ను తప్ప మరేమీ చూడలేడు. స్వచ్ఛమైన ఆక్సిజన్ కూడా అందదు. ఖైదీలు ఇతర ఖైదీలను చూడలేరు.. మాట్లాడలేరు. లైబ్రరీ, క్యాంటీన్‌కు వెళ్లే అవకాశం ఉండదు. బాత్రూమ్, టాయిలెట్ కూడా అండా సెల్లోనే అటాచ్డ్గా ఉంటాయి. అండా సెల్ నుంచి తప్పించుకోవడం అసాధ్యం. కుటుంబ సభ్యులతో ములాఖత్ కావడానికి అంతగా అవకాశాలు ఉండవు. ఏ ఖైదీని అండా సెల్‌కు పంపాలనేది ఆ జైలు సూపరింటెండెంట్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. -
ప్రాణాలతో బయటపడడం అద్భుతమే
నాగపూర్: జైలు నుంచి ప్రాణాలతో బయటపడతానని ఏనాడూ అనుకోలేదని ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబా(54) చెప్పారు. సజీవంగా బయటకు రావడం నిజంగా అద్భుతమేనంటూ భావోద్వేగానికి గురయ్యారు. జైలులో శారీరకంగా, మానసికంగా ఎన్నో బాధలు అనుభవించానని చెప్పారు. అక్కడ జీవితం అత్యంత దుర్భరమని పేర్కొన్నారు. మావోలతో సంబంధాల కేసులో బాంబే హైకోర్టు సాయిబాబాను నిర్దోషిగా గుర్తిస్తూ మంగళవారం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఆయన గురువారం నాగపూర్ సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి చక్రాల కురీ్చలో బయటకు వచ్చారు. ఈశాన్య భారతదేశంలో గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్నందుకే తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. తప్పుడు కేసులో ఇరికించి అరెస్టు చేశారని సాయిబాబా అన్నారు. జైలులోనే ప్రాణాలు పోతాయనుకున్నా.. ‘‘నా ఆరోగ్యం క్షీణించింది. ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నాను. మొదట చికిత్స తీసుకోవాలి. ఆ తర్వాతే మాట్లాడగలను. త్వరలో డాక్టర్లను కలిసి చికిత్స తీసుకుంటా. విలేకరు లు, లాయర్లు కోరడం వల్లే ఇప్పుడు స్పందిస్తున్నా. జైలులో నాకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. అత్యంత కఠినమైన, దుర్భర జీవితం అనువించా. చక్రాల కుర్చీ నుంచి పైకి లేవలేకపోయా. ఇతరుల సాయం లేకుండా సొంతంగా టాయిలెట్‌కు కూడా వెళ్లలేని పరిస్థితి. ఇతరుల సాయం లేనిదే స్నానం కూడా చేయలేపోయా. జైలులోనే నా ప్రాణాలు పోతాయని అనుకున్నా. ఈరోజు నేను ఇలా ప్రాణాలతో జైలు నుంచి బయటకు రావడం అద్భుతమే చెప్పాలి. నాపై నమోదైన కేసులో సాక్ష్యాధారాలు లేవని ఉన్నత న్యాయస్థానం తేలి్చచెప్పింది. చట్టప్రకారం ఈ కేసు చెల్లదని స్పష్టం చేసింది. నాకు న్యాయం చేకూర్చడానికి ఇంతకాలం ఎందుకు పట్టింది? నాతోపాటు నా సహచర నిందితులు పదేళ్ల విలువైన జీవితాన్ని కోల్పోయారు. ఈ జీవితాన్ని ఎవరు తిరిగి తీసుకొచ్చి ఇస్తారు? జైలుకు వెళ్లినప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాను. అప్పుడు పోలియో మినహా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. కానీ, ఇప్పుడు గుండె, కండరాలు, కాలేయ సంబంధిత వ్యాధుల బారినపడ్డాను. నా గుండె ప్రస్తుతం కేవలం 55 శాతం సామర్థ్యంతో పనిచేస్తోంది. డాక్టర్లే ఈ విషయం చెప్పారు. నాకు పలు ఆపరేషన్లు, సర్జరీలు చేయాలని అన్నారు. కానీ, ఒక్కటి కూడా జరగలేదు. జైలులో సరైన వైద్యం అందించలేదు. పదేళ్లపాటు నాకు అన్యా యం జరిగింది. ఆశ ఒక్కటే నన్ను బతికించింది. ఇకపై బోధనా వృత్తిని కొనసాగిస్తా. బోధించకుండా నేను ఉండలేను’’ అని ప్రొఫెసర్ సాయిబాబా స్పష్టం చేశారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తారా? అని మీడియా ప్రశ్నించగా, భారత రాజ్యాంగాన్ని 50 శాతం అమలు చేసినా సరే సమాజంలో అనుకున్న మార్పు వస్తుందని బదులిచ్చారు. సాయిబాబా సొంత ఊరు ఆంధ్రప్రదేశ్‌లోని బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం పట్టణం సమీపంలోని జనుపల్లె. ఆయన పాఠశాల, కళాశాల విద్య ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే కొనసాగింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నత విద్య అభ్యసించిన ఆయన అక్కడే ప్రొఫెసర్ అయ్యారు. -
సెంట్రల్ జైలులో కరోనా కలకలం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో మొదలైన వ్యాక్సినేషన్ ప్రక్రియతో కరోనా మహమ్మారినుంచి దేశం కోలుకుంటున్న తరుణంలో నాగపూర్ సెంట్రల్ జైలులో మరోసారి కరోనా కలకలం రేగింది. మానవ హక్కుల కార్యకర్త, ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా సహా మరో ముగ్గురు కరోనా బారిన పడ్డారు. సాయిబాబాకు శుక్రవారం కరోనా పాజిటివ్ నిర్థారణ అయిందనీ, సిటీ స్కాన్ ఇతర పరీక్షల కోసం తీసుకువెళ్ల నున్నామని సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ అనుప్ కుమార్ కుమ్రే తెలిపారు. అలాగే చికిత్స కోసం ఆయనను ప్రభుత్వ వైద్య కళాశాల లేదా ఆసుపత్రికి తరలించాలా అనేది వైద్యులు నిర్ణయిస్తారని చెప్పారు. దీంతో 90 శాతం అంగవైకల్యం, ఇప్పటికే జైలులో అనారోగ్యంతో బాధపడుతున్న సాయిబాబా ఆరోగ్యంపై తీవ్ర అందోళన వ్యక్తమవుతోంది. ఇదే జైల్లో ఉంటున్న గ్యాంగ్‌స్టర్ అరుణ్ గావ్లీతోపాటు మరో అయిదుగురికి ఇటీవల కోవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయింది. కాగా నిషేధిత మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై యుఏపీఏ చట్టం కింద ప్రొఫెసర్ సాయిబాబాకు నాగపూర్ హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఆయనతోపాటు మరో నలుగురికి కూడా శిక్షపడింది. దీంతో 2017 మార్చి నుంచి సాయిబాబా నాగపూర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. అయితే వికలాంగుడైన సాయిబాబాను మానవతా దృక్ఫథంతో విడిచిపెట్టాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. -
జైలుకు రావాల్సిందే: కోవిడ్ పేషెంట్‌కు కోర్టు ఆదేశం
ముంబై: దేశవ్యాప్తంగా ఉన్న జైళ్లలో కరోనా వైరస్ ప్రబలకుండా ఉండేందుకు ఇరుకు లేకుండా చూసుకోవాలని మార్చి నెలలో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఖైదీలను సాధ్యమైనంత వరకూ ఒకరికి ఒకరి మధ్య దూరం పాటించేలా చూడాలని సూచించింది. కానీ మహారాష్ట్రలో పరిస్థితి మరోలా ఉంది. కరోనాకు చికిత్స తీసుకుంటున్న ఓ ఖైదీని వెంటనే కస్టడీలోకి తీసుకోవాలని నాగపూర్‌లోని ముంబై హైకోర్టు బెంచ్ ఆదేశించింది. ఖైదీ సరండర్ కాకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. (కరోనా: రక్తపు గడ్డలపై కీలక పరిశోధన) ముంబైకి చెందిన ఖైదీ(39)కి నగరానికి చెందిన బిల్డర్‌ను హత్య చేసిన కేసులో జీవిత ఖైదు శిక్షగా పడింది. నాగపూర్ సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. పోయిన మార్చి1న కోర్టు నుంచి పర్మిషన్ తీసుకుని జైలు నుంచి బయటకు వచ్చాడు. మార్చి 22 నాడు తిరిగి జైలుకి వెళ్లాల్సివుండగా, మహారాష్ట్ర లాక్డౌన్లోకి వెళ్లింది. ముంబై నుంచి నాగపూర్‌కి చేరుకోవాలంటే 850 కిలోమీటర్లకు పైగా ప్రయాణించాలి. లాక్డౌన్ సమయంలో ఇంత దూరం ప్రయాణించాలంటే అతను స్థానిక అధికారులను అనుమతి తీసుకోవాల్సివచ్చింది.(సీఎం ఆఫీసుకు మరోసారి కరోనా సెగ) తాను జైలుకు తిరిగి వెళ్లేందుకు అన్ని ప్రయత్నాలు చేశానని ప్రస్తుతం ఠాణేలోని తన ఇంట్లో క్వారంటైన్లో ఉన్న ఖైదీ చెబుతున్నాడు. ‘నేను ఈ–పాస్‌కు దరఖాస్తు చేశాను. కానీ అధికారులు దాన్ని తిరస్కరించారు. ఆ తర్వాత స్థానికంగా ఉన్న తలోజా కేంద్ర కారాగారం, ఠాణే కేంద్ర కారాగారాలకు వెళ్లి నన్ను అదుపులోకి తీసుకోమని కోరాను. వాళ్లు కొత్త ఖైదీలను తీసుకోవడం లేదని, నాగపూర్‌కే వెళ్లాలని చెప్పారు. దాంతో నేను జైలు అధికారులకు ఈ–మెయిల్స్, ఉత్తరాలు రాశాను’ అని అతను వెల్లడించాడు. జైలు అధికారుల నుంచి ఎలాంటి స్పందనా రాకపోవడంతో అతనికి ఇచ్చిన సెలవులను హైకోర్టు పలుమార్లు పొడిగించింది. అయితే, జూన్ 16న ముంబై హైకోర్టు నాగపూర్ బెంచ్ జైలులో లొంగిపోవాలని తన క్లయింట్‌ను ఆదేశించిందని ఖైదీ తరఫు న్యాయవాది ఆకాశ్ వెల్లడించారు. అప్పటికే తనకు కరోనా సోకిందని తెలియని ఖైదీ అందుకు ఒప్పుకున్నాడని చెప్పారు. మరుసటి రోజే అతనికి కోవిడ్–19 పాజిటివ్ అని తేలిందని వివరించారు. దీంతో మళ్లీ దరఖాస్తు పెట్టుకోగా, కోర్టు గడువు మరోమారు పొడిగించిందని చెప్పారు. జూన్ 28న చేసిన రెండో టెస్టులో కూడా ఖైదీకి పాజిటివ్ వచ్చిందని ఆకాశ్ తెలిపారు. కానీ జులై 7న న్యాయమూర్తులు జెడ్.ఏ.హక్, ఎన్.బి.సూర్యవంశిలతో కూడిన బెంచ్ ఖైదీ ఆరోగ్యంతో నిమిత్తం లేకుండా, జైలులో జులై 18లోగా లొంగిపోవాలని ఆదేశించిందని పేర్కొన్నారు. లేకపోతే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించిందని వివరించారు. కోర్టు ఆదేశాల వల్ల నాగపూర్ జైల్లోని ఇతర ఖైదీలకు, ఆఫీసర్లకు వైరస్ సోకే ప్రమాదం ఉంటుందని తెలిపారు. నాగపూర్ కేంద్ర కారాగారంలో 1810 మంది ఖైదీలను ఉంచొచ్చు. కానీ జూన్ 30 నాటికి ఆ జైల్లో 2092 మంది ఖైదీలు ఉన్నారు. వీరిలో దాదాపు 140 మందికి కరోనా సోకిందని ఇప్పటికే రిపోర్టులు వచ్చాయి. సుప్రీంకోర్టు ఆదేశాలతో తర్వాత మహారాష్ట్ర హోం శాఖ జైళ్లను 60 శాతం సామర్ధ్యానికి మించి నింపకూడదని నిర్ణయించింది. ఈ నిర్ణయం తీసుకుని మూడు నెలలు గడుస్తున్నా పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పులు రాలేదు. ఖైదీల సంఖ్యను తగ్గించుకునేందుకు జైళ్ల శాఖ చాలా కష్టపడుతోంది. జూన్ 30 నాటికి మహారాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 60 జైళ్లు, 35 తాత్కాలిక క్వారంటైన్ సెంటర్లలో 28,463 మంది ఖైదీలు ఉన్నారు. -
మృత్యుశయ్యపై ఉంటున్నా....
మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయంటూ నాపై మోపిన నేరాలకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాధారాలూ లేకున్నప్పటికీ దుర్బేధ్యమైన నాగ్‌పూర్ జైలులో పేరుమోసిన అండా సెల్లో 2017 మార్చి 7 నుంచి నన్ను నిర్బంధించారు. అండాసెల్ అనేది నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో అత్యంత అమానుషమైన గరిష్టభద్రతావలయంలోని బ్యారక్. అప్పటికే 90 శాతం అంగవైకల్యంతో కూడిన నా శారీరక ఆరోగ్యం గత 21 నెలలు నిర్బంధకాలంలో మరింతగా క్షీణించిపోయింది. తీవ్ర స్వభావంతో కూడిన 19 వ్యాధులు నన్ను కబళిస్తుండగా జైలులో ఎలాంటి వైద్య చికిత్సను అధికారులు నాకు కల్పించడం లేదు. వైద్య కారణాలతో నేను పెట్టుకున్న బెయిల్ అప్లికేషన్ 2018 మార్చి 8 నుంచి బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ ముందు పెండింగులో ఉంది. తీవ్రమైన నొప్పితో నేను బాధపడుతున్నప్పటికీ నా శారీరక పరిస్థితి పట్ల అధికారులు అమానుషంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో గత 8 నెలలుగా నా బెయిల్ పిటిషన్‌పై వరుసగా వాయిదాలు వేస్తూ వస్తున్నారు. అక్టోబర్ 6న నా బెయిల్ పిటిషన్‌పై విచారణ మరో ఆరు వారాలకు వాయిదా పడింది. ఈ సందర్భంగా నా ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వైద్య రికార్డులన్నింటినీ తనకు సమర్పించవలసిందిగా నాగ్‌పూర్ సెంట్రల్ జైల్ ప్రధాన వైద్యాధికారిని న్యాయస్థానం ఆదేశించింది. నా దిగజారిపోయిన ఆరోగ్య పరిస్థితిని నిగ్గుతేల్చడానికి కోర్టు ఆదేశం ఉపయోగపడవచ్చు. నా ఆరోగ్యానికి సంబంధించి జైలు అధికారులు ప్రదర్శిస్తున్న తీవ్ర నిర్లక్ష్య ధోరణి, ఎలాంటి పరీక్షలూ జరపకపోవడం, సరైన చికిత్స అందించకపోవడం వంటి అంశాలపై నిజాలు బయటకి రావచ్చు. నా సీనియర్ న్యాయవాదులు, ఫ్యామిలీ డాక్టర్లు, ఇతర వైద్య నిపుణులు నా మెడికల్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక రూపొందించి దాన్ని వీలైనంత త్వరగా హైకోర్టు ముందుంచాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఉంటున్న జైలు గది నిర్మాణం నన్ను పూర్తిగా నిస్సహాయ స్థితిలోకి నెట్టేస్తోంది. ఏ రకంగాకూడా బయటిప్రపంచంతో నాకు సంబంధం లేదు. ముడుతలుపడ్డ చర్మం, క్షీణించిన ఎముకలతో నా పరిస్థితి పడకేసిన ముదుసలి స్థాయికి దిగజారిపోయింది. అండాసెల్ లోపల వీల్ చెయిర్‌తో నేను టాయిలెట్‌కి కూడా పోలేను. మూత్రవిసర్జన చేయాలన్నా, స్నానం చేయాలన్నా సరే ఇద్దరు మనుషులు నన్ను ఎత్తుకెళ్లాల్సి వస్తోంది. 90 శాతం అంగవైకల్యంతో బాధపడుతున్న వ్యక్తితో ఎలా వ్యవహరిం చాలో కూడా జైలు అధికారులకు తెలియకపోవడమే కాకుండా, వారు సరైన చికిత్స విషయంలోనూ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. కదలడానికి కూడా వీలులేని అండా సెల్లో మగ్గిపోతున్నాను. సెప్టెంబర్ 21, 2018న నాకు సీటీ బ్రెయిన్, సీటీ ఆంజియోగ్రఫీ టెస్టులను తులనాత్మక అధ్యయనం కోసం నిర్వహించారు. హైకోర్టు ఆదేశం ప్రకారం తొలిసారిగా నా సహచరి వసంతను ఆసుపత్రిలో నా పక్కన ఉండేందుకు అనుమతించారు. అక్కడ రేడియాలజీ విభాగం వైద్యులు హై రిస్క్ కన్ సెంట్ పేరిట ఒక పత్రంపై సంతకం చేయమని అడిగారు. అంటే మెదడుకు, గుండె వ్యాధికి నేను తీసుకుంటున్న మందులు తీవ్ర పరిస్థితికి దారి తీయనున్నాయని, చివరకు నాకు ప్రాణాపాయం కలిగే ప్రమాదం కూడా ఉందని దాని సారాంశం. చికిత్స ద్వారా తలెత్తే ఎలాంటి పరిణామాలకైనా నేను సిద్ధంగా ఉండాలని దీనర్థం. దాని రియాక్షన్ గంటలు, రోజుల వ్యవధిలో కూడా ప్రభావం చూపవచ్చు. నా ప్రస్తుత పరిస్థితికి దీర్ఘకాలిక చికిత్స అవసరం కాబట్టి నేను జైలుజీవితం గడిపినంత కాలం నా సహచరి నా పక్కన ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విషయంలో జైలు అధికారులు, హైకోర్టు కూడా తగు న్యాయం చేయాలని అర్థిస్తున్నాను. అత్యంత తీవ్రమైన అనారోగ్య పరిస్థితి ప్రాతిపదికన నాకు బెయిల్ మంజూరు చేయవలసిందిగా న్యాయస్థానాన్ని అభ్యర్థిస్తున్నాను. (మావోయిస్టులతో సంబంధాలున్న ఆరోపణలతో నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో యావజ్జీవ శిక్ష గడువుతున్న ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబ తన సహచరి వసంతకు ఇటీవల రాసిన లేఖ సంక్షిప్త పాఠం) వ్యాసకర్త ఢిల్లీ యూనివర్సిటీలో ఇంగ్లిష్ ప్రొఫెసర్, జైలు ఖైదీ జీఎన్ సాయిబాబ -
ఇవి నాకు చివరి ఘడియలు
-
ఇవి నాకు చివరి ఘడియలు
సాక్షి, హైదరాబాద్: మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న కారణంగా ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబాతో సహా పాత్రికేయుడు ప్రశాంత్ రాహి, జేఎన్‌యూ పరిశోధక విద్యార్థి హేమ్ మిశ్రా, పాండు నరోత్, మహేశ్ టిర్కిలకు మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా సెషన్స్ కోర్టు జీవితఖైదు విధించింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయనీ, రెవల్యూషనరీ డెమోక్రటిక్ ఫోరం సభ్యులంటూ రాజద్రోహ నేరం మోపి, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద ప్రొఫెసర్ సాయిబాబాను నాగ్‌పూర్ సెంట్రల్ జైలులోని అండాసెల్‌లో ఉంచారు. ఆయన 90 శాతం అంగవైకల్యంతో బాధపడుతున్నారు. అంతకుముందు హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రిలో ఆయన కొంత కాలం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. నాగ్‌పూర్ సెంట్రల్ జైలులో కనీసం అత్యవసర మందులు సైతం అందించకపోవడంతో సాయిబాబా ఆరోగ్యం మరింత ప్రమాదంలో పడిందని సాయిబాబా సహచరి వసంత ‘సాక్షి’కి తెలిపారు. ఆయనకు శిక్ష విధించే కొద్దిరోజుల ముందు పిత్తాశయం, క్లోమగ్రంధికి సంబంధించిన ఆపరేషన్ని మూడునెలలలోగా చేయాలని డాక్టర్లు సిఫారసు చేసినప్పటికీ జైలు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు వసంత తెలిపారు. ఇటీవల మందులు సైతం ఇవ్వకపోవడంతో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందని ఛాతీనొప్పి తీవ్రమైందని ఆమె ‘సాక్షి’కి ఫోన్లో వివరించారు. గత జూన్ 1వ తేదీన సాయిబాబా అనారోగ్యాన్ని పరిగణనలోనికి తీసుకొని సాయిబాబాకు అత్యవసరంగా వైద్య సాయం అందించాలని జాతీయ మానవహక్కుల కమిషన్‌కి ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. నేలమీద పాకుతూ ఓ జంతువులా బతుకుతున్నా... తాజాగా తన ప్రాణాలు అత్యంత ప్రమాదంలో ఉన్నాయని, తనను గురించి పట్టించుకోవాలని, అండాసెల్‌లో ఈ చలిని తట్టుకొని బతకడం అసాధ్యమని తన సహచరి వసంతకు సాయిబాబా రాసిన లేఖ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 90 శాతం వైకల్యంతో ఎవరి సాయం లేకుండా అంగుళం కూడా కదల్లేని పరిస్థితుల్లో నేలమీద పాకుతూ ఓ జంతువులా తాను బతుకుతున్నానని, తనకు స్వెట్టర్ కానీ, కనీసం కప్పుకునేందుకు దుప్పటికానీ ఇవ్వలేదని, నవంబర్‌లో గడ్డకట్టుకుపోయే చలిని తట్టుకొని తాను బతకడం అసాధ్యమైన విషయమని, తాను ఉన్న అత్యంత దయనీయమైన పరిస్థితుల గురించి వసంతకు రాసిన లేఖలో దుఃఖభరితంగా వివరించారు. నేలమీద పాకుతూ 90 శాతం అంగవైకల్యంతో ఉన్న మనిషి జైల్లో ఉన్నాడన్న విషయం ఎవరికీ పట్టకపోవడం పట్ల ఆయన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ త్వరితగతిన సీనియర్ లాయర్‌తో మాట్లాడి తన ప్రాణాలను కాపాడాలని ఆయన లేఖలో కోరారు. తానొక భిక్షగాడిలా తన గురించి పట్టించుకోవాలంటూ పదే పదే ప్రాధేయపడాల్సి రావడం కుంగదీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నవంబర్ మొదటి వారంలో బెయిలు పిటిషన్ దాఖలు చేయాలని లేఖలో కోరారు. అలా జరగకపోతే తన పరిస్థితి చేయిదాటిపోతుందని పేర్కొన్నారు. ఇదే చివరి ఉత్తరం అని, ఇక మీదట తానీ విషయాన్ని రాయబోనని కూడా లేఖలో తేల్చిచెప్పారు. తనను పట్టించుకోకపోవడాన్ని నేరపూరిత నిర్లక్ష్యంగా సాయిబాబా వ్యాఖ్యానించారు. ప్రొఫెసర్ సాయిబాబాను తక్షణమే హైదరాబాద్‌కి తరలించాలి... విరసం నేత వరవరరావు మాట్లాడుతూ ఆయన బెయిలుకోసం ప్రయత్నాలు జరుగు తున్నాయని, ప్రభుత్వం సాయిబాబా పట్ల కక్షపూరితంగా వ్యవహరించడం మాను కోవాలని, తక్షణమే ఆయనకు అత్యవసర మందులు అందించాలని, తన కనీస అవసరాలు తీర్చాలని కోరారు, సాయిబాబా అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తనను హైదరాబాద్ జైలుకు తక్షణమే తరలించి సరైన వైద్య సదుపాయం అందించాలని వరవరరావు డిమాండ్ చేశారు. తన గురించి పట్టించుకోని ప్రభుత్వం, పాల కులు, సమాజం బాధ్యతను లేఖ గుర్తు చేస్తోం దని పౌర హక్కుల సంఘం నాయకులు నారా యణరావు, ప్రొ.లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. –వరవరరావు, నారాయణరావు, ప్రొఫెసర్ లక్ష్మణ్ -
7 గంటలకు.. ఉరిశిక్ష అమలు
నాగపూర్ సెంట్రల్ జైల్లో మెమన్‌కు ఉరి బిగింపు * కూతుర్ని చూడాలని చివరి కోరిక * సాధ్యం కాకపోవడంతో.. ఫోన్లో మాట్లాడించిన అధికారులు * ముందు రోజు రాత్రి అన్నను చూడగానే ఉద్వేగభరితం * ముంబై పేలుళ్ల కేసులో ఇది తొలి మరణ శిక్ష * సోదరుడికి మృతదేహం అప్పగింత * ముంబైలో అంత్యక్రియలు; ముంబై, నాగపూర్లలో భారీ భద్రత నాగపూర్/న్యూఢిల్లీ: 1993 ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ మెమన్‌కు గురువారం ఉదయం నాగపూర్ సెంట్రల్ జైల్లో మరణశిక్ష అమలు చేశారు. ఆయన ప్రాణాలు కాపాడేందుకు చివరి నిమిషం వరకు మెమన్ తరఫు లాయర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. టాడా కోర్టు జారీ చేసిన డెత్ వారంట్లో పేర్కొన్న విధంగా జూలై 30 ఉదయం సరిగ్గా ఏడుగంటలకు యాకూబ్ మెమన్(53)ను ఉరి తీశారు. అనంతరం పోస్ట్‌మార్టం నిర్వహించి మృతదేహాన్ని యాకూబ్ సోదరుడు సులేమాన్, దగ్గరి బంధువు ఉస్మాన్‌లకు అప్పగించారు. వారు ఆ మృతదేహాన్ని ముంబై తీసుకువచ్చారు. బంధుమిత్రుల సమక్షంలో ముంబై మెరైన్ లైన్స్‌లోని శ్మశాన వాటికలో గురువారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. 257 మంది ప్రాణాలు కోల్పోయిన ముంబై వరుస పేలుళ్ల కేసుకు సంబంధించి మరణశిక్ష అమలైన మొదటి దోషి యాకూబ్ మెమనే. ఉరిశిక్ష అమలైన జూలై 30వ తేదీ యాకూబ్ మెమన్ జన్మదినం కూడా. ‘ఉదయం సరిగ్గా 7 గంటలకు మెమన్ను ఉరితీశారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు’ అని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ మీడియా ప్రతినిధులకు సందేశం పంపించారు. మృతదేహాన్ని తమకు అప్పగించాల్సిందిగా యాకూబ్ సోదరుడు సులేమాన్ నాగపూర్ జైలు అధికారులను బుధవారం రాత్రి లిఖిత పూర్వకంగా అభ్యర్థించారు. మెమన్ ఉరిపై స్టే విధిచేందుకు బుధవారం సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం తిరస్కరించిన అనంతరం.. రాష్ట్రపతి, మహారాష్ట్ర గవర్నర్ ఇద్దరూ క్షమాభిక్షకు నిరాకరించిన తరువాత.. చివరి ప్రయత్నంగా మెమన్ లాయర్లు బుధవారం అర్ధరాత్రి మరోసారి సుప్రీంకోర్టు తలుపుతట్టారు. సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారి, తెల్లవారుజామున 3.20 నుంచి 4.50 వరకు సాగిన విచారణ అనంతరం ఉరివైపే అత్యున్నత న్యాయస్థానం మొగ్గు చూపింది. ఉరిశిక్ష అమలును నిలిపేయడం న్యాయ అధిక్షేపణే అవుతుందంటూ మెమన్ పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో అప్పటికే నాగపూర్ సెంట్రల్‌జైలులో పూర్తి సన్నద్ధంగా ఉన్న అధికారులు మెమన్‌కు ఉరిశిక్షను అమలు చేశారు. పుణేలోని ఎరవాడ జైళ్లో పాక్ ఉగ్రవాది అజ్మల్ కసబ్‌ను ఉరి తీసిన జైలు కానిస్టేబులే మెమన్ను కూడా ఉరితీశాడు. నాగపూర్ జైల్లో ఉరి ప్రక్రియను పర్యవేక్షించేందుకు వారం క్రితం ఎరవాడ జైలు నుంచి వచ్చిన 20 మంది బృందంలో ఆయన కూడా ఉన్నారు. భద్రత కారణాల దృష్ట్యా అధికారులు ఆయన వివరాలను వెల్లడించలేదు. కసబ్ ఉరి సమయంలో ఎరవాడ జైలు సూపరింటెండెంట్‌గా ఉన్న యోగేశ్ దేశాయిని ప్రత్యేకంగా మెమన్‌కు ఉరిశిక్ష అమలు చేసేందుకే నాగపూర్ సెంట్రల్ జైలుకు బదిలీ చేశారని సమాచారం. మహారాష్ట్రలో ఎరవాడ, నాగపూర్ జైళ్లలోనే ఉరిశిక్ష అమలు చేసే సదుపాయం ఉంది. టాడా కోర్టు విధించిన మరణశిక్షను సమర్థిస్తూ 2013లో సుప్రీంకోర్టు .. ‘ముంబై పేలుళ్ల వెనుక చోదకశక్తి’గా మెమన్ను అభివర్ణించిన విషయం గమనార్హం. ఇదే కేసులో దోషిగా తేలిన మెమన్ సోదరుడు ఎస్సా, వదిన రుబీనా ప్రస్తుతం యావజ్జీవ శిక్ష అనుభవిస్తుండగా.. కీలక సూత్రధారులైన టైగర్ మెమన్, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లో తలదాచుకున్నట్లు సమాచారం. ఉరికంబంపై..: 2012 నవంబర్ 21న మహారాష్ట్రలోని ఎరవాడ జైళ్లో కసబ్‌ను ఉరికంబం ఎక్కించారు. కొన్ని నెలల తరువాత 2013, ఫిబ్రవరి 9న ఢిల్లీలోని తీహార్ జైళ్లో పార్లమెంటుపై దాడి కేసు దోషి అఫ్జల్ గురుకు ఉరిశిక్ష అమలు చేశారు. స్వతంత్ర భారతదేశంలో మొదటగా మహాత్మాగాంధీ హత్యకు సంబంధించి నాథూరాం గాడ్సే, నారాయణఆప్టేలను ఉరితీశారు. వారిని 1949, నవంబర్ 15న పంజాబ్‌లోని అంబాల జైళ్లో ఉరితీశారు. మాజీ ప్రధాని ఇంది రాగాంధీ హత్య కేసులో దోషులు సత్వంత్ సింగ్, కేహార్ సింగ్‌లకు 1989, జనవరి 6న మరణశిక్ష విధించారు. భారత్‌లో మరణశిక్షను రద్దు చేయాలంటూ దశాబ్దాలుగా వాదోపవాదాలు జరుగుతున్నాయి. 2007లో ప్రపంచవ్యాప్తంగా మరణశిక్షను నిషేధించాలన్న ఐరాస ప్రతిపాదనకు వ్యతిరేకంగా భారత్ ఓటేసింది. 2012లోనూ ఐరాస ముందు అదే వైఖరిని స్పష్టంచేసింది. కాగా మెమన్ ఉరిని కశ్మీర్ వేర్పాటువాద హురియత్ సంస్థ నేతలు ఖండించారు. వారికీ ఇదే గతి పట్టాలి.. సాక్షి, ముంబై: మెమన్ను ఉరితీయడంపై 1993 ముంబై పేలుళ్ల బాధిత కుటుంబాలు హర్షం వ్యక్తం చేశాయి. ఇది చట్టం సాధించిన విజయమన్నారు. పేలుళ్ల సూత్రధారులు దావూద్ ఇబ్రహీం, టైగర్ మెమన్‌లకు కూడా ఇదే గతి పట్టాలని ఆకాంక్షించారు. ఇప్పటివరకు 24.. 1864లో ఆంగ్లేయుల పాలనలో స్థాపించిన నాగపూర్ సెంట్రల్ జైల్లో ఉరిశిక్ష అమలైన వారి సంఖ్య నేటికి 24కు చేరింది. ఇక్కడ 1984 నవంబర్ అయిదవ తేదీ చివరిసారిగా ఉరిశిక్ష అమలైంది. ఓ హత్య కేసులో మహారాష్ట్రలోని అమరావతికి చెందిన వాంఖడే సోదరులకు ఇదే జైల్లో ఉరిశిక్ష వేశారు. యాకూబ్ మెమన్ ఉరితో మహారాష్ట్రలో ఇప్పటి వరకు మొత్తం 58 మందికి మరణశిక్ష అమలు చేశారు. చివరి 3 గంటలు..! ఒకవైపు, మెమన్ ఉరిని ఆపేందుకు దేశ రాజధానిలోని అత్యున్నత న్యాయస్థానంలో ఆఖరి ప్రయత్నాలు సాగుతుండగానే.. అక్కడికి 1050 కి.మీ.ల దూరంలో ఉన్న నాగపూర్(మహారాష్ట్ర) సెంట్రల్ జైల్లో ఉరిశిక్ష అమలుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఆ టైమ్‌లైన్.. తెల్లవారుజామున 4 గంటలు: ఒంటరిగా జైలుగదిలో ఉన్న యాకూబ్ మెమన్ వద్దకు జైలు అధికారులు వచ్చారు. 4.15: మెమన్ స్నానానికి వెళ్లారు. 4.30: ఆయనకు కొత్త దుస్తులు అందించారు. 4.45: అల్పాహారం అందించారు. 5.00: డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. 5.30: ప్రార్థన చేశారు. ఖురాన్ పఠించారు. 6.00: పక్కనున్న మరో సెల్‌లోకి మార్చారు. 6.15: ఉరికంబాన్ని, అక్కడి పీఠాన్ని, ఉరి బిగించడానికి ఉపయోగించే తాడు సామర్ధ్యాన్ని జైలు సూపరింటెండెంట్ యోగేశ్ దేశాయి, అదనపు డీజీపీ(జైళ్లు) మీరా బోర్వాంకర్ పరీక్షించారు. 6.30: నల్లని మందపాటి వస్త్రాన్ని ముఖానికి కప్పి, ఉరికంబం వద్దకు తీసుకెళ్లారు. 6.45: టాడా కోర్టు తీర్పులోని అమలు భాగాన్ని నాగపూర్ చీఫ్ జ్యూడీషియల్ మెజిస్ట్రేట్(సీజేఎం) చదివి వినిపించారు. 6.50: ఉరితీయడానికి ఉద్దేశించిన పీఠంపై నిల్చోబెట్టారు. మెడ చుట్టూ ఉరితాడు బిగించారు. 6.55: ఉరికంబంపై అన్నీ సరిగ్గా ఉన్నాయా? లేదా? అని తలారి, జైలుఅధికారులు పరీక్షించారు. 7.00: ఉరి తీయాలంటూ సీజేఎం సంజ్ఞ చేశారు. వెంటనే తలారి తన చేతిలోని లివర్‌ను లాగారు. 7.30: నిబంధనల ప్రకారం అరగంట పాటు ఉరి కంబానికి వేలాడదీశాక మృతదేహాన్ని కిందకు దింపారు. అనంతరం వైద్యులు పరీక్షించి మరణించినట్లుగా నిర్ధారించారు. పోస్ట్‌మార్టం అనంతరం మృతదేహాన్ని శవపేటికలో ఉంచి, యాకూబ్ సోదరుడు సులేమాన్‌కు అప్పగించారు. ‘అన్ని అవకాశాలు పొందాడు’ వివిధ వేదికలపై తన వాదనలను వినిపించుకునే అన్ని అవకాశాలను యాకూబ్ మెమన్ పొందారని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఉగ్రవాదంలాంటి అంశాల్లో అంతా ఐక్యంగా ఉండాలన్నారు. ‘ఉగ్రవాదాన్ని ఒక సవాలుగా స్వీకరించాలి. ఐక్యగళం వినిపించాలి. అప్పుడే దాన్ని అంతం చేయగలం’ అని గురువారం విలేకరులతో వ్యాఖ్యానించారు. ‘ఒక క్షమాభిక్ష పిటిషన్‌ను సుప్రీంకోర్టు తెల్లవారుజామున విచారించడం ప్రపంచంలోనే తొలిసారి కావచ్చు. మరే వ్యవస్థలోనూ ఇంత పారదర్శకత ఉండదు.’ అని ఆయన అన్నారు. అంత తొందరేంటి?: ప్రశాంత్ భూషణ్ యాకూబ్ మెమన్ను ఉరితీసేందుకు అంత అసాధారణ తొందరపాటు ఎందుకని సీనియర్ న్యాయవాది ప్రశాంత్‌భూషణ్ ప్రశ్నించారు. ఇది రాజ్యం చేసిన ప్రతిహింస అని అధిక్షేపించారు. తన క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించడాన్ని సవాలు చేసే అవకాశం మెమన్‌కు ఇవ్వలేదని ఆక్షేపించారు. మెమన్‌కు మద్దతుగా బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత సుప్రీంకోర్టులో వాదించిన లాయర్లలో భూషణ్ ఒకరు. ‘దర్యాప్తు అధికారులతో మెమన్ సహకరించాడు. సుప్రీంకోర్టు మెమన్‌కు విధించిన శిక్షను తగ్గిస్తే బావుండేది’ అని అభిప్రాయపడ్డారు. ఆ ముగ్గురికి భద్రత పెంపు న్యూఢిల్లీ: మెమన్ ఉరిపై స్టే ఇవ్వాలని అభ్యర్థిస్తూ దాఖలైన పిటిషన్‌ను తిరస్కరించిన త్రిసభ్య ధర్మాసనం సభ్యులు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ప్రఫుల్ల చంద్ర పంత్, అమితవ రాయ్‌లకు భద్రతను పెంచారు. వీరి నివాసాల వద్ద బందోబస్తులో ఉండే పోలీసుల సంఖ్య పెంచడమే కాకుండా జడ్జిల నివాసప్రాంతంలో గస్తీని ముమ్మరం చేసినట్లు హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. అలాగే సమస్యాత్మక ప్రాంతాల్లో బలగాలను మొహరించాల్సిందిగా రాష్ట్రాలకు సూచించింది. -
మెమన్ మృతదేహం ఆసుపత్రికి తరలింపు
నాగపూర్: నాగపూర్ కేంద్ర కారాగారంలో యాకుబ్ మెమన్‌కు ఉరి తీసిన అనంతరం అతడి మృతదేహన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి జైలు అధికారులు తరలించారు. అక్కడ యాకుబ్ మృతదేహనికి శవపరీక్ష నిర్వహిస్తారు. దీనిపై వైద్యులు పోలీసు ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తారు. ఆ తర్వాత యాకుబ్ మృతదేహన్ని అతడి బంధువులకు ఇవ్వవచ్చు... లేదా జైలు ప్రాంగణంలోనే అతడికి అంత్యక్రియలు నిర్వహించవచ్చు. ఆ అధికారం జైలు ఉన్నతాధికారులకు కలదు. అయితే యాకుబ్ మృతదేహన్ని అతడి కుటుంబ సభ్యులకు అప్పగించకుండా... జైలు ప్రాంగణంలోనే ఖననం చేసేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టినట్లు సమాచారం. 1993లో ముంబై మహానగరంలో వరుస బాంబు పేలుళ్ల కేసులో యాకుబ్ మెమన్ నిందితడి తేలడంతో కోర్టు అతడికి ఉరిశిక్ష విధించింది. సదరు శిక్షను గురువారం ఉదయం 7.00 గంటలకు మహారాష్ట్రలోని నాగపూర్ జైలులో ఉరి తీసిన సంగతి తెలిసిందే. -
యాకూన్ ను ఉరితీసిన అధికారులు
-
యాకూబ్ కు ఉరిశిక్ష అమలు
-
యాకూబ్ కు ఉరిశిక్ష అమలు
ముంబై పేలుళ్ల కేసులో దోషి యాకూబ్ మెమన్ ను నాగ్ పూర్ సెంట్రల్ జైల్లో గురువారం ఉదయం 6:40 గంటలకు ఉరి తీశారు. చిట్టచివరి నిమిషంలో దాఖలైన పిటిషన్ ను దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనట్లుగా అర్ధరాత్రి 3 గంటల నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు విచారించిన సుప్రీంకోర్టు, ఆ పిటిషన్ ను కూడా కొట్టేయడంతో ఇక మెమన్ కు అన్ని దారులూ మూసుకుపోయాయి. ముందు నుంచి సిద్ధంగా ఉన్న నాగ్ పూర్ సెంట్రల్ జైలు అధికారులు.. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఉరిశిక్షను అమలు చేశారు. అంతకుముందు బుధవారం రాత్రి తన అన్న సులేమాన్ మెమన్, సమీప బంధువు ఉస్మాన్ లను యాకూబ్ మెమన్ కలుసుకున్నారు. గత వారం మెమన్ తన భార్య రహిన్, కూతురు జుబేదా తదితరులను కూడా కలుసుకున్నారు. పుణె ఎర్రవాడ జైలు నుంచి నాగ్ పూర్ కు మెమన్ ను 2007 ఆగస్టులో తరలించారు. ఆ తర్వాత సరిగ్గా 7 సంవత్సరాల 11 నెలల 17 రోజులకు అతడిని ఉరి తీశారు. మెమన్ను ఉరితీయాలంటూ ఈ ఏడాది ఏప్రిల్ 30న ముంబైలోని టాడా కోర్టు జారీ చేసిన డెత్ వారంట్లో ఎలాంటి చట్టపరమైన లోపాలు లేవని బుధవారం ఉదయం సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఆ ఉత్తర్వులను తప్పుబట్టలేమంటూ మెమన్ పిటిషన్‌ను కొట్టేసింది. మరోవైపు, రాజ్యాంగ అధికరణ 161 కింద మెమన్ క్షమాభిక్ష పిటిషన్‌ను మహారాష్ట్ర గవర్నర్ తిరస్కరించారు. ఉరిపై స్టే విధించాలన్న మెమన్ అభ్యర్థనను సుప్రీంకోర్టు కొట్టేసిన కాసేపటికే గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఆ నిర్ణయం తీసుకున్నారు. చివరి ప్రయత్నంగా, క్షమాభిక్ష కోరుతూ బుధవారం మెమన్ మళ్లీ రాష్ట్రపతిని ఆశ్రయించారు. ఈ రెండో పిటి షన్నూ రాష్ట్రపతి బుధవారం రాత్రి పొద్దుపోయాక తిరస్కరించారు. మెమన్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ఇప్పటికే ఒకసారి తిరస్కరించారు. 1993 మార్చి 12న, 13 వేర్వేరు చోట్ల జరిగిన వరుస పేలుళ్లతో ముంబై (నాటి బొంబాయి) వణికిపోయింది. ఆ భీకర పేలుళ్లలో 257 మంది చనిపోగా, సుమారు 700 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. రాత్రి 10.45 ప్రాంతంలో రాష్ట్రపతి నిర్ణయం మెమన్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి ప్రణబ్ తిరస్కరించారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంశాఖ కార్యదర్శి ఎల్సీ గోయల్, సొలిసిటర్ జనరల్ రంజిత్‌కుమార్‌లతో బుధవారం రెండు గంటల సుదీర్ఘ చర్చల అనంతరం రాత్రి 10.45 గంటల సమయంలో ప్రణబ్ ముఖర్జీ ఈ నిర్ణయం వెలువరించారు. రాష్ట్రపతితో భేటీకి ముందు, ప్రధాని నివాసంలో రాజ్‌నాథ్, గోయల్ ఇతర ఉన్నతాధికారులు ప్రధాని మోదీతో సమావేశమై, మెమన్ క్షమాభిక్ష పిటిషన్‌పై రాష్ట్రపతికి ప్రభుత్వం తరఫున ఏ సూచన ఇవ్వాలనే విషయంపై చర్చించారు. సాధారణంగా ఈ విషయాల్లో కేంద్ర మంత్రిమండలి సలహా ప్రకారం రాష్ట్రపతి నడుచుకుంటారు. ఉరిని ఆపేందుకు విశ్వప్రయత్నాలు చేసిన మెమన్ లాయర్లు బుధవారం రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించాక అర్ధరాత్రి మళ్లీ సుప్రీంకోర్టు తలుపులు తట్టారు. క్షమాభిక్ష పిటిషన్ నిరాకరణ తర్వాత ఉరి అమలుకు 14 రోజుల గడువు ఇవ్వాలని సుప్రీం మార్గదర్శకాలు సూచిస్తున్నాయని, అందువల్ల మెమన్‌కు 14 రోజుల సమయం ఇవ్వాలని కోరారు. సుప్రీంలో.. ఏం జరిగింది ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలన్న మెమన్ పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టు త్రిసభ ధర్మాసనం విచారణ జరిపింది. సుప్రీంకోర్టు జడ్జీలు జస్టిస్ జోసెఫ్ కురియన్, జస్టిస్ దవేల ద్విసభ్య బెంచ్ మంగళవారం ఉరిని నిలిపేసే అంశంపై విరుద్ధ అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో.. ఆ అంశపై తుది నిర్ణయం తీసుకునేందుకు జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలో జస్టిస్ ప్రఫుల్ల సీ పంత్, జస్టిస్ అమితవ రాయ్ సభ్యులుగా త్రిసభ్య బెంచ్‌ను చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ దత్తు ఏర్పాటుచేయడం తెలిసిందే. విచారణ తర్వాత టాడా కోర్టు జారీ చేసిన డెత్ వారంట్ సక్రమమేనని ఆ త్రిసభ్య బెంచ్ తేల్చింది. అలాగే, మెమన్ దాఖలు చేసుకున్న క్యూరేటివ్ పిటిషన్‌ను గతంలో సుప్రీంకోర్టు కొట్టేయడం సరైన చర్యేనంది. తన వాదనలు వినకుండానే ఉరిశిక్ష ఉత్తర్వులను టాడా కోర్టు జారీ చేసిందని, తన క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి తిరస్కరించిన తరువాత ఉరిశిక్ష అమలు తేదీని తనకు తెలియజేసే విషయంలో పాటించాల్సిన 14 రోజుల గడవు నిబంధనను ఆ కోర్టు పాటించలేదని మెమన్ చేసిన వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. క్షమాభిక్ష పొందే విషయంలో తనకింకా న్యాయపరమైన అవకాశాలున్నాయన్న వాదననూ కొట్టేసింది. తాను దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు 2015, జూలై 21న కొట్టేసిన తరువాతే.. క్షమాభిక్ష కోరుతూ మెమన్ మహారాష్ట్ర గవర్నర్‌ను ఆశ్రయించారని గుర్తు చేసింది. మెమన్ పిటిషన్‌ను ఏప్రిల్ 11, 2014న రాష్ట్రపతి తిరస్కరించారని, ఆ విషయాన్ని మే 26, 2014న మెమన్‌కు తెలియజేశారని పేర్కొంది. మొదటి క్షమాభిక్ష పిటిషన్‌ను తిరస్కరించడాన్ని సవాలు చేసేందుకు మెమన్ ప్రయత్నించలేదని, అందువల్ల తాజాగా రాష్ట్రపతికి ఆయన పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్.. ఉరిశిక్ష అమలులో అడ్డుకాబోదని స్పష్టం చేసింది. తనకు అనుకూలంగా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ (రా) మాజీ అధికారి రాసిన ఒక వ్యాసాన్ని, అలాగే స్కీజోఫ్రీనియాతో బాధపడుతున్నాననే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ మెమన్ రాష్ట్రపతికి పెట్టుకున్న రెండో క్షమాభిక్ష పిటిషన్ గురించి తాము ప్రస్తావించడం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. మెమన్ దాఖలు చేసుకున్న క్యూరేటివ్ పిటిషన్‌ను కొట్టేసిన సమయంలో ఆ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టులోని అత్యంత సీనియర్ జడ్జీలు ముగ్గురు( చీఫ్ జస్టిస్ సహా) నిబంధనల ప్రకారం నడుచుకోలేదన్న జస్టిస్ జోసెఫ్ కురియన్ అభిప్రాయంతో బెంచ్ ఏకీభవించలేదు. మెమన్ క్యూరేటివ్ పిటిషన్‌ను మళ్లీ విచారించాలని జస్టిస్ కురియన్ మంగళవారం అభిప్రాయపడిన విషయం తెలిసిందే. మెమన్ ద్రోహి.. ఏజీ విచారణ ముగింపు దశలో అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ చేసిన వ్యాఖ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. మెమన్ను ద్రోహి అని రోహత్గీ పేర్కొనడంపై సీనియర్ న్యాయవాది టీఆర్ అంధ్యార్జున తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసులో జోక్యం చేసుకునే హక్కు మీకు లేదంటూ మెమన్‌కు మద్దతుగా వాదించబోతున్న అంధ్యార్జునను రోహత్గీ అడ్డుకున్నారు. ‘క్షమాభిక్ష పిటిషన్ అనేది గౌరవానికి సంబంధించిన అంశం కాదు. అది దోషుల రాజ్యాంగ హక్కు. న్యాయపరమైన అన్ని అవకాశాలు పూర్తికాకుండా మెమన్ను ఉరితీయడం అన్యాయం’ అని అంధ్యార్జున అన్నారు. దానికి ‘పేలుళ్లలో చనిపోయిన 250 మంది హక్కుల మాటేమిటి? ద్రోహిని సర్థిస్తూ మీరు మాట్లాడుతున్నారు’ అని రోహత్గీ అన్నారు. ‘మరణం అంచున ఉండి, జీవితం కోసం పోరాడుతున్న వ్యక్తిని పరిహసించకూడద’ని అంధ్యార్జున పేర్కొనడంతో.. మెమన్ను ద్రోహి అని సుప్రీంకోర్టే పేర్కొందని రోహత్గీ గుర్తుచేశారు. కలాంకు నివాళిగా.. ఉరిని నిలిపేయండి! మాజీ రాష్ట్రపతి కలాం సిద్ధాంతాలను గౌరవిస్తూ.. మెమన్‌కు విధించిన ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా తగ్గించాలని పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్, మహాత్మాగాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. మరణశిక్షను కలాం వ్యతిరేకించేవారని, అందువల్ల మెమన్‌కు విధించిన ఉరిశిక్షను తగ్గించడం కలాంకు సరైన నివాళి ఇవ్వడం అవుతుందన్నారు. ఉరి తీయాల్సిందే మెమన్‌కు ఉరిశిక్షను అమలు చేయాల్సిందేనని ముంబై పేలుళ్ల బాధితులు పలువురు స్పష్టం చేశారు. వారంతా కలసి బుధవారం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌కు వినతి పత్రం సమర్పించారు. దానిపై 1,600 మంది సంతకాలు చేశారు. ‘ఆత్మీయులను కోల్పోయి మా కుటుంబాలు ఎంతో వేదనను అనుభవించాయి. మెమన్‌కు ఉరిశిక్ష విధించాల్సిందే’ అని పేలుళ్లలో తన తల్లిని కోల్పోయిన తుషార్ దేశ్‌ముఖ్ డిమాండ్ చేశారు. పార్టీల స్పందన ఉరిశిక్ష అమలుపై స్టే విధించాలన్న మెమన్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేయడాన్ని బీజేపీ, కాంగ్రెస్ స్వాగతించాయి. ‘సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. ముంబై పేలుళ్ల బాధితులకు న్యాయం జరిగింది. ఈ దేశ ప్రజలకు న్యాయవ్యవస్థ పట్ల నమ్మకం మరింత పెరిగింది’ అని బీజేపీ జాతీయ కార్యదర్శి శ్రీకాంత్ శర్మ వ్యాఖ్యానించారు. ముంబై పేలుళ్ల బాధితులకు పాక్షిక న్యాయమే అందింది. పేలుళ్ల కీలక సూత్రధారి టైగర్ మెమన్ను పాక్ నుంచి తీసుకువచ్చి శిక్ష విధించిననాడే వారికి పూర్తి న్యాయం జరిగినట్లు అవుతుంది’ అని కాంగ్రెస్ ముఖ్య అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జెవాలా పేర్కొన్నారు. మెమన్‌కు క్షమాభిక్ష ప్రసాదించకూడదనేది దేశప్రజలందరి ఆకాంక్ష అని శివసేన పేర్కొంది. న్యాయవర్గాల్లో మాత్రం ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నిరుత్సాహపరచింది.. ఒవైసీ కోర్టు తీర్పు నిరుత్సాహపరచిందని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. రాజకీయ మద్దతు లేకపోవడం వల్లనే మెమన్‌కు ఉరిశిక్ష విధించారన్నారు. పేలుళ్లలో మెమన్ పాత్ర ఉందని, అయితే, అందుకు ఉరిశిక్ష విధించడం మాత్రం సరికాదన్నారు. బాబ్రీమసీదు కూల్చివేతదారులకు కూడా ఉరిశిక్ష విధించాలని ఒవైసీ డిమాండ్ చేశారు. పదేళ్లలో నాలుగోది న్యూఢిల్లీ: యాకుబ్ మెమన్ ఉరితీతతో కలిపి భారత్‌లో గత పదేళ్లలో నాలుగు ఉరిశిక్షలు మాత్రమే అమలయ్యాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2004-2013 మధ్య దేశంలోని కోర్టులు ఏకంగా 1,303 మందికి మరణశిక్షలు విధించాయి. వీరిలో ముగ్గురే ఉరికంబమెక్కారు. ఓ టీనేజీ అమ్మాయిని రేప్ చేసి చంపిన వాచ్‌మన్ ధనంజయ్ ఛటర్జీని 2004 ఆగస్టు14న బెంగాల్‌లోని అలిపోర్ జైలులో ఉరితీశారు. 2008 ముంబై దాడుల్లో సజీవంగా పట్టుబడ్డ కసాయి కసబ్ ను 2012 నవంబరు 12న పుణే యెరవాడ జైల్లో ఉరితీశారు. 2013 ఫిబ్రవరి 9న అఫ్జల్ గురు (పార్లమెంటుపై దాడి కేసులో మరణశిక్ష పడింది)ను తీహార్ జైలులో ఉరి తీశారు. గత పదేళ్లలో ఉరికంబమెక్కిన వారిలో యాకుబ్ నాలుగోవాడు కానున్నాడు. ఈ పదేళ్ల కాలంలో 3,751 ఉరిశిక్షలను వివిధ కోర్టులు జీవితఖైదుగా మార్చాయి. మరికొన్ని అంశాలు.. ► స్టే పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు ►క్షమాభిక్షకు నిరాకరించిన రాష్ట్రపతి, మహారాష్ట్ర గవర్నర్ ►సుప్రీం తీర్పును స్వాగతించిన బీజేపీ, కాంగ్రెస్.. ►ముంబై, నాగపూర్లలో భద్రత కట్టుదిట్టం ► అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలను హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం ►1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో యాకూబ్ మెమన్‌కు ఉరిశిక్ష -
ఇక ఖైదీలపై ‘అంతర్గత’ నిఘా!
- ఖైదీలకు మైక్రోచిప్‌లను అమర్చాలని నిర్ణయం - త్వరలో కార్యరూపం దాల్చే అవకాశం - ఖైదీల పరారీ, మొబైల్ ఫోన్ వినియోగం నియంత్రణ కోసమే సాక్షి, ముంబై: ఖైదీలపై ‘అంతర్గత’ నిఘా ఉంచాలని రాష్ట్ర జైళ్ల శాఖ యోచిస్తోంది. ఇందుకోసం ఖైదీలకు మైక్రోచిప్ ఇంప్లాట్స్ ( వీటిని శరీరంలో ఏర్పాటు చేస్తారు)ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇటీవల నాగ్‌పూర్ సెంట్రల్ జైలు నుంచి ఐదుగురు నేరస్తులు తప్పించుకుని పారిపోయారు. ఈ నేపథ్యంలో జైళ్లలో అధునాతన పద్ధతిలో జాగ్రత్తపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర హోంశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. జైళ్లలో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్‌లను (ఆర్ఎఫ్ఐడీ) అమర్చేందుకు ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వీటితోపాటు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్)లను కూడా అమర్చనున్నట్లు సమాచారం. మంత్రాలయలోని ఓ సీనియర్ అధికారి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉన్నతాధికారులు, నిపుణులు జైళ్లలో తగిన పద్దతులను అవలంబించడానికి సంబంధించిన నివేదికను ఈ వారం చివరిలో హోంశాఖకు అందిస్తారని తెలిపారు. ‘ఖైదీలకు అమర్చే మైక్రోచిప్‌లను ‘స్పై చిప్’ అని కూడా అంటారు. ఈ చిప్‌ను వ్యక్తి చర్మం లోపల అమర్చుతారు.’ అని ఆయన తెలిపారు. రాష్ట్ర జైళ్లు పూర్వ పరాలు.. రాష్ర్టంలో తొమ్మిది సెంట్రల్ జైళ్లు ఉన్నాయి. 27 జిల్లా, 10 ఓపెన్, ఒక ఓపెన్ కాలనీ, 172 సబ్‌జైళ్లు ఉన్నాయి. ఒక సబ్జైల్లో మహిళలు, పురుషులు మొత్తం కలిపి 28 వేల మంది ఉంటారు. పుణే, ముంబైలో మహిళల కోసం రెండు ప్రత్యేక జైళ్లు ఉన్నాయి. ఆథర్ జైల్లో సామర్థ్యం 800 మంది కాగా, 3 రెట్ల మంది ఉన్నారు. దీంతో మాన్ఖుర్డ్లో కొత్త జైలు నిర్మించాలని అధికారులు కోరుతున్నారు. -
చావు అంచున ఉన్నా చదువుతున్నాడు
పరీక్షలు రాస్తున్న యాకుబ్ మెమన్ నాగపూర్: మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు, 1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో ఉరిశిక్షపడ్డ యాకుబ్ అబ్దుల్ రజాక్ మెమన్ నాగపూర్ సెంట్రల్ జైలులో ఎం.ఎ.(రాజనీతిశాస్త్రం) పరీక్షలు రాస్తున్నాడు. అయితే మెమన్‌కు మరణదండన విధించడంపై సుప్రీంకోర్టు ఇటీవలే స్టే విధించడం తెలిసిందే. గతంలో చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేసిన ఇతడు, ప్రస్తుతం ఎం.ఎ. రెండో ఏడాది పరీక్షలు రాస్తున్నాడు. మొదటి పేపరును ఈ నెల మూడున, మరో పేపరును సోమవారం ఫాసీయార్డులో రాశాడు. ఉరిశిక్ష పడ్డ ఖైదీలను నిర్బంధించే బ్యారక్‌ను ఫాసీయార్డుగా పిలుస్తారు. ఇక్కడ పటిష్ట భద్రత ఉంటుంది. ఉరిశిక్ష పడ్డ ఖైదీ అయినందున మెమన్ను బయటి ప్రపంచంలోకి అనుమతించబోరని ఇందిరాగాంధీ జాతీయసార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) ప్రాంతీయ సంచాలకుడు పి.శివస్వరూప్ తెలిపారు. ఇతని పరీక్షలు జూన్ 28న ముగుస్తాయన్నారు. మెమన్తోపాటు ఉరిశిక్షపడ్డ ఐదుగురు ఖైదీలూ పరీక్షలు రాస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం 300 మంది ఖైదీలు ఇగ్నో అందిస్తున్న వివిధ కోర్సులు చదువుతున్నారని శివస్వరూప్ వివరించారు. మెమన్ ఇది వరకే ఎం.ఎ. (ఇంగ్లిష్) రెండోశ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. గత ఏడాది ఏప్రిల్ 12న నిర్వహించిన స్నాతకోత్సవంలో ఇతనికి పట్టా ప్రదానం చేయాల్సి ఉంది. శిక్షపడ్డ ఖైదీలను యూనివర్సిటీకి పంపించేందుకు అధికారులు తిరస్కరించారు. దీంతో జైలు ఆవరణలోనే మెమన్‌కు పట్టా అందజేశారు. పేలుళ్ల కేసులో ఇతనికి మరణశిక్ష విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై స్పందించిన సుప్రీంకోర్టు ఈ నెల రెండున స్టే జారీ చేసింది. ఉరిశిక్ష విధింపును సమీక్షించాలన్న మెమన్ పిటిషన్‌పై స్పందించాలని మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర న్యాయశాఖను ఆదేశించింది. అప్పటి వరకు శిక్ష అమలును నిలిపి వేయాలని ఆదేశించింది. అయితే ఇతనికి ఉరిశిక్ష విధించడాన్ని సుపరీంకోర్టు గత మార్చిలో సమర్థించింది. ముంబై పేలుళ్లలో 257 మంది మరణించగా, 700 మంది గాయపడ్డారు. -
పొలిటికల్ సైన్స్ చదువుతున్న మెమన్
నాగపూర్: 1993 నాటి ముంబై వరుస పేలుళ్ల కేసులో మరణశిక్ష పడిన యాకూబ్ అబ్దుల్ రజాక్ మెమన్ పీజీ కోర్సు చేస్తున్నాడు. నాగపూర్ సెంట్రల్ జైల్లో ఉన్న మెమన్ ఇందిరా గాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం(ఇగ్నో) ద్వారా ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుతున్నాడు. చార్టెడ్ ఎకౌంటెంట్ అయిన మెమన్ ఇప్పుడు ఎంఏ రెండో సంవత్సరంలో ఉన్నాడు. ఈ నెల 3న మొదటి పరీక్ష హాజరైన అతడు సోమవారం రెండో పేపర్ రాశాడు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే జైలు గదిలో అతడు పరీక్ష రాశాడు. కరడుగట్టిన నేరస్తుడు కావడంతో జైలు బయట పరీక్ష రాసేందుకు పోలీసులు అనుమతించలేదని ఇగ్నో ప్రాంతీయ డైరెక్టర్ పి శివస్వరూప్ తెలిపారు. ఈనెల 28తో పరీక్షలు ముగుస్తాయని చెప్పారు. మెమన్ తో పాటు మరణశిక్ష పడిన మరో ఐదుగురు ఖైదీలు పరీక్షలు రాసినట్టు వెల్లడించారు. 300 మందిపైగా ఖైదీల వివిధ కోర్సుల పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. మెమన్ కు విధించిన ఉరిశిక్షపై సుప్రీంకోర్టు గతవారం స్టే విధించింది. -
జైళ్లలో ‘పే ఫోన్’ సౌకర్యం
సాక్షి, ముంబై : జైలులో గడిపే ఖైదీలకు వారి కుటుంబీకులతో మాట్లాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ‘ఫే ఫోన్’ అనే పథకాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ఠాణే, తలోజా సెంట్రల్ జైళ్లలో ప్రవేశపెట్టిన ఈ పథకం సఫలీకృతమైతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జైళ్లలో అమలుచేయనున్నారు. ఈ విషయంపై ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ముంబై హైకోర్టుకు అన్ని వివరాలు తెలిపింది. హై కోర్టుకు అందించిన వివరాల మేరకు పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లో జైళ్లలోని ఖైదీలకు తమ కుటుంబీకులతో మాట్లాడేందుకు ఫోన్ సౌకర్యం అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని ఖైదీలకు కూడా ఇలాంటి సదుపాయం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగా ముందుగా ప్రయోగాత్మకంగా ఠాణే, తలోజా జైళ్లలో మూడు నెలల కోసం ఈ పే ఫోన్ పథకాన్ని అమలుచేస్తోంది. అదేవిధంగా తొందర్లోనే నాగపూర్ సెంట్రల్ జైల్లో కూడా ఈ పథకాన్ని అందుబాటులోకి తేనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఇలాంటి పథకాన్ని ప్రారంభించాలని ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలు, నాసిక్ జైలులోని అఫ్తాబ్ సయ్యద్ శేఖ్, జావేద్ అహ్మద్ మాజిద్ అనే ఇద్దరు ఖైదీలు ప్రజావ్యాజ్యం వేశారు. ఈ విషయం న్యాయమూర్తి అనుజా ప్రభుదేశాయ్ బెంచ్ ముందు విచారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ప్రారంభించిన పే ఫోన్ పథకం గురించి హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని వివరాలు అందించింది. అయితే ఈ పే ఫోన్ సౌకర్యాన్ని ప్రస్తుతం కొందరు ఖైదీలు మాత్రమే వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు. స్వల్ప నేరారోపణలున్న ఖైదీలకు మాత్రమే ఈ పే ఫోన్ వినియోగించుకునేందుకు అనుమతించారు. కరడుగట్టిన నేరస్తులు, ఉగ్రవాదులు, తీవ్ర నేరారోపణలు ఉన్న ఖైదీలను ఈ పథకానికి దూరంగా ఉంచారు. కాగా, ఈ సౌకర్యం వినియోగించుకోవాలంటే సదరు ఖైదీ ముందు తాను ఎవరెవరికి ఫోన్ చేస్తాననేది జైలు అధికారులకు సమాచారమివ్వాల్సి ఉంటుంది. అలాగే రోజూ నిర్ణీత సమయంలోనే ఖైదీలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకునేందుకు వీలుంటుంది. ఈ పే ఫోన్ విషయంపై మళ్లీ ఆగస్టులో విచారణ జరగనుంది. దీంతో అంతవరకు ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం సఫలీకృతమయ్యిందా లేదా అనేది కూడా తెలియనుంది.