జైలు నుంచి విడుదలయ్యాక భార్య వసంతతో మీడియా సమావేశంలో సాయిబాబా
జైలులో దుర్భర జీవితం అనుభవించా
తప్పుడు కేసులో ఇరికించి అరెస్టు చేశారు
ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబా ఆవేదన
నాగపూర్ సెంట్రల్ జైలు నుంచి విడుదల
నాగపూర్: జైలు నుంచి ప్రాణాలతో బయటపడతానని ఏనాడూ అనుకోలేదని ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబా(54) చెప్పారు. సజీవంగా బయటకు రావడం నిజంగా అద్భుతమేనంటూ భావోద్వేగానికి గురయ్యారు. జైలులో శారీరకంగా, మానసికంగా ఎన్నో బాధలు అనుభవించానని చెప్పారు. అక్కడ జీవితం అత్యంత దుర్భరమని పేర్కొన్నారు.
మావోలతో సంబంధాల కేసులో బాంబే హైకోర్టు సాయిబాబాను నిర్దోషిగా గుర్తిస్తూ మంగళవారం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఆయన గురువారం నాగపూర్ సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి చక్రాల కురీ్చలో బయటకు వచ్చారు. ఈశాన్య భారతదేశంలో గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్నందుకే తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. తప్పుడు కేసులో ఇరికించి అరెస్టు చేశారని సాయిబాబా అన్నారు.
జైలులోనే ప్రాణాలు పోతాయనుకున్నా..
‘‘నా ఆరోగ్యం క్షీణించింది. ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నాను. మొదట చికిత్స తీసుకోవాలి. ఆ తర్వాతే మాట్లాడగలను. త్వరలో డాక్టర్లను కలిసి చికిత్స తీసుకుంటా. విలేకరు లు, లాయర్లు కోరడం వల్లే ఇప్పుడు స్పందిస్తున్నా. జైలులో నాకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. అత్యంత కఠినమైన, దుర్భర జీవితం అనువించా. చక్రాల కుర్చీ నుంచి పైకి లేవలేకపోయా. ఇతరుల సాయం లేకుండా సొంతంగా టాయిలెట్‌కు కూడా వెళ్లలేని పరిస్థితి.
ఇతరుల సాయం లేనిదే స్నానం కూడా చేయలేపోయా. జైలులోనే నా ప్రాణాలు పోతాయని అనుకున్నా. ఈరోజు నేను ఇలా ప్రాణాలతో జైలు నుంచి బయటకు రావడం అద్భుతమే చెప్పాలి. నాపై నమోదైన కేసులో సాక్ష్యాధారాలు లేవని ఉన్నత న్యాయస్థానం తేలి్చచెప్పింది. చట్టప్రకారం ఈ కేసు చెల్లదని స్పష్టం చేసింది. నాకు న్యాయం చేకూర్చడానికి ఇంతకాలం ఎందుకు పట్టింది? నాతోపాటు నా సహచర నిందితులు పదేళ్ల విలువైన జీవితాన్ని కోల్పోయారు.
ఈ జీవితాన్ని ఎవరు తిరిగి తీసుకొచ్చి ఇస్తారు? జైలుకు వెళ్లినప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాను. అప్పుడు పోలియో మినహా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. కానీ, ఇప్పుడు గుండె, కండరాలు, కాలేయ సంబంధిత వ్యాధుల బారినపడ్డాను. నా గుండె ప్రస్తుతం కేవలం 55 శాతం సామర్థ్యంతో పనిచేస్తోంది. డాక్టర్లే ఈ విషయం చెప్పారు. నాకు పలు ఆపరేషన్లు, సర్జరీలు చేయాలని అన్నారు. కానీ, ఒక్కటి కూడా జరగలేదు. జైలులో సరైన వైద్యం అందించలేదు. పదేళ్లపాటు నాకు అన్యా యం జరిగింది.
ఆశ ఒక్కటే నన్ను బతికించింది. ఇకపై బోధనా వృత్తిని కొనసాగిస్తా. బోధించకుండా నేను ఉండలేను’’ అని ప్రొఫెసర్ సాయిబాబా స్పష్టం చేశారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తారా? అని మీడియా ప్రశ్నించగా, భారత రాజ్యాంగాన్ని 50 శాతం అమలు చేసినా సరే సమాజంలో అనుకున్న మార్పు వస్తుందని బదులిచ్చారు. సాయిబాబా సొంత ఊరు ఆంధ్రప్రదేశ్‌లోని బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం పట్టణం సమీపంలోని జనుపల్లె. ఆయన పాఠశాల, కళాశాల విద్య ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే కొనసాగింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నత విద్య అభ్యసించిన ఆయన అక్కడే ప్రొఫెసర్ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment