Delhi University Former Professor JN Sai Baba
-
ప్రొఫెసర్ సాయిబాబా విడుదల సబబే: సుప్రీం
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను జైలు నుంచి విడుదల చేయడంపై స్టే ఇవ్వాలని కోరుతూ మహారాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సరైన ఆరోపణలను చూపలేకపోయినందున సాయిబాబాను విడుదల చేయాలంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును ప్రాథమికంగా సరైందిగానే భావిస్తున్నట్లు అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఈ అంశంపై జోక్యం చేసుకోలేమని తెలిపింది. అయితే, పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తున్నట్లు సోమవారం జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ దీపక్ మెహతా ధర్మాసనం తెలిపింది. -
ప్రాణాలతో బయటపడడం అద్భుతమే
నాగపూర్: జైలు నుంచి ప్రాణాలతో బయటపడతానని ఏనాడూ అనుకోలేదని ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబా(54) చెప్పారు. సజీవంగా బయటకు రావడం నిజంగా అద్భుతమేనంటూ భావోద్వేగానికి గురయ్యారు. జైలులో శారీరకంగా, మానసికంగా ఎన్నో బాధలు అనుభవించానని చెప్పారు. అక్కడ జీవితం అత్యంత దుర్భరమని పేర్కొన్నారు. మావోలతో సంబంధాల కేసులో బాంబే హైకోర్టు సాయిబాబాను నిర్దోషిగా గుర్తిస్తూ మంగళవారం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఆయన గురువారం నాగపూర్ సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి చక్రాల కురీ్చలో బయటకు వచ్చారు. ఈశాన్య భారతదేశంలో గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్నందుకే తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. తప్పుడు కేసులో ఇరికించి అరెస్టు చేశారని సాయిబాబా అన్నారు. జైలులోనే ప్రాణాలు పోతాయనుకున్నా.. ‘‘నా ఆరోగ్యం క్షీణించింది. ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నాను. మొదట చికిత్స తీసుకోవాలి. ఆ తర్వాతే మాట్లాడగలను. త్వరలో డాక్టర్లను కలిసి చికిత్స తీసుకుంటా. విలేకరు లు, లాయర్లు కోరడం వల్లే ఇప్పుడు స్పందిస్తున్నా. జైలులో నాకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. అత్యంత కఠినమైన, దుర్భర జీవితం అనువించా. చక్రాల కుర్చీ నుంచి పైకి లేవలేకపోయా. ఇతరుల సాయం లేకుండా సొంతంగా టాయిలెట్‌కు కూడా వెళ్లలేని పరిస్థితి. ఇతరుల సాయం లేనిదే స్నానం కూడా చేయలేపోయా. జైలులోనే నా ప్రాణాలు పోతాయని అనుకున్నా. ఈరోజు నేను ఇలా ప్రాణాలతో జైలు నుంచి బయటకు రావడం అద్భుతమే చెప్పాలి. నాపై నమోదైన కేసులో సాక్ష్యాధారాలు లేవని ఉన్నత న్యాయస్థానం తేలి్చచెప్పింది. చట్టప్రకారం ఈ కేసు చెల్లదని స్పష్టం చేసింది. నాకు న్యాయం చేకూర్చడానికి ఇంతకాలం ఎందుకు పట్టింది? నాతోపాటు నా సహచర నిందితులు పదేళ్ల విలువైన జీవితాన్ని కోల్పోయారు. ఈ జీవితాన్ని ఎవరు తిరిగి తీసుకొచ్చి ఇస్తారు? జైలుకు వెళ్లినప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాను. అప్పుడు పోలియో మినహా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. కానీ, ఇప్పుడు గుండె, కండరాలు, కాలేయ సంబంధిత వ్యాధుల బారినపడ్డాను. నా గుండె ప్రస్తుతం కేవలం 55 శాతం సామర్థ్యంతో పనిచేస్తోంది. డాక్టర్లే ఈ విషయం చెప్పారు. నాకు పలు ఆపరేషన్లు, సర్జరీలు చేయాలని అన్నారు. కానీ, ఒక్కటి కూడా జరగలేదు. జైలులో సరైన వైద్యం అందించలేదు. పదేళ్లపాటు నాకు అన్యా యం జరిగింది. ఆశ ఒక్కటే నన్ను బతికించింది. ఇకపై బోధనా వృత్తిని కొనసాగిస్తా. బోధించకుండా నేను ఉండలేను’’ అని ప్రొఫెసర్ సాయిబాబా స్పష్టం చేశారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తారా? అని మీడియా ప్రశ్నించగా, భారత రాజ్యాంగాన్ని 50 శాతం అమలు చేసినా సరే సమాజంలో అనుకున్న మార్పు వస్తుందని బదులిచ్చారు. సాయిబాబా సొంత ఊరు ఆంధ్రప్రదేశ్‌లోని బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం పట్టణం సమీపంలోని జనుపల్లె. ఆయన పాఠశాల, కళాశాల విద్య ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే కొనసాగింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నత విద్య అభ్యసించిన ఆయన అక్కడే ప్రొఫెసర్ అయ్యారు. -
సాయిబాబాకు చుక్కెదురు
సాక్షి, న్యూఢిల్లీ: మావోయిస్టు సంబంధాల కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబాను నిర్దోషిగా విడుదల చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది.‘‘ సాయిబాబాపై మోపిన నేరాలు చాలా తీవ్రమైనవి. సమాజ ప్రయోజనాలకు, దేశ సమగ్రతకు, సార్వభౌమాధికారానికి విఘాతం కలిగించేవి. నేర తీవ్రత తదితరాలను పరిగణనలోకి తీసుకోకుండా సాంకేతికాంశాల ఆధారంగా బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది’’ అంటూ తప్పుబట్టింది. అంగవైకల్యం, అనారోగ్య కారణాల రీత్యా తనను కనీసం గృహ నిర్భంధంలో ఉంచాలన్న సాయిబాబా విజ్ఞప్తినీ తిరస్కరించింది. బెయిల్ కోసం తాజాగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశమిచ్చింది. దాంతో సాయిబాబా తదితరులు నాగపూర్ సెంట్రల్ జైల్లోనే ఉండనున్నారు. ఆయనను 2014 ఫిబ్రవరిలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పును దురదృష్టకరంగా వామపక్ష కార్యకర్తలు, సానుభూతిపరులు అభివర్ణించారు. తీర్పును నిరసిస్తూ సాయిబాబా విడుదల కోసం ఢిల్లీ యూనివర్సిటీలో ధర్నా చేసిన 40 మంది విద్యార్థులు, అధ్యాపకులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందని వామపక్ష విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. మహారాష్ట్ర తీవ్ర అభ్యంతరాలు సాయిబాబాతో సహా మరో ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు ఈ నెల 14న తీర్పు ఇవ్వడం తెలిసిందే. దాన్ని సవాలు చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. శనివారం సెలవు దినమైనా న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ప్రత్యేక ధర్మాసనం దీనిపై అత్యవసరంగా విచారణ జరిపింది. మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హైకోర్టు తీర్పుపై తీవ్ర అభ్యంతరాలు తెలిపారు. ‘‘చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) ప్రకారం సాయిబాబాను విచారించడానికి ముందుగా అనుమతి పొందలేదనే కారణంతో నిర్దోషిగా ప్రకటించడం సరికాదు. కేసులోని యథార్థాలను పరిశీలించకుండా కేవలం సాంకేతిక అంశాల ఆధారంగా హైకోర్టు తీర్పు చెప్పింది. యూఏపీఏ చట్టం ప్రకారం అనుమతి పొందకపోవడాన్ని ట్రయల్ కోర్టులో గానీ, ఇతర కోర్టుల్లో గానీ సాయిబాబా సవాల్ చేయలేదు. కస్టడీలోకి తీసుకున్నాక ఆయన బెయిలు కోసం దరఖాస్తు చేస్తే కోర్టు తిరస్కరించింది. ఈ కేసుకు యూఏపీఏ సెక్షన్ 43(సీ)ని వర్తింపజేసిన దృష్ట్యా సెక్షన్ 465 ప్రకారం సాయిబాబాను నిర్దోషిగా విడుదల చేయడం సరికాదు’’ అన్నారు. సాయిబాబా తరఫు న్యాయవాది ఆర్.బసంత్ దీనిపై అభ్యంతరం తెలిపారు. ‘‘సాయిబాబాకు 52 ఏళ్లు. 90 శాతం శారీరక వైకల్యముంది. పెళ్లి కాని 23 ఏళ్ల కూతురుంది. అనారోగ్యంతో చక్రాల కుర్చీకి పరిమితమయ్యారు. ఆయనకు నేర చరిత్ర లేదు. ఏడేళ్లకు పైగా జైళ్లో ఉన్నారు. రోజువారీ పనులూ చేసుకోలేకపోతున్నారు. షరతులతోనైనా ఇంటి వద్దే ఉండేందుకు అనుమతివ్వాలి’’ అని కోరారు. మెదడు చాలా డేంజరస్: ధర్మాసనం ఈ వాదనలపై సొలిసిటర్ జనరల్ అభ్యంతరం తెలిపారు. ‘‘ఇటీవల అర్బన్ నక్సల్స్ ఎక్కువగా గృహ నిర్భంధాలు కోరుతున్నారు. వారు ఇంట్లో ఉండే మెదడు సాయంతో ప్రతిదీ చేస్తారు. ఫోన్లు కూడా వాడుకుంటారు. కాబట్టి గృహ నిర్బంధానికి అవకాశం ఇవ్వొద్దు’’ అని కోరారు. ‘‘జమ్మూ కశ్మీర్లో వేర్పాటువాద ఉద్యమంతోనూ సాయిబాబాకు సంబంధముంది. మావోయిస్టు కమాండర్ల భేటీలను ఏర్పాటు చేయడం వంటి పనులతో దేశ ప్రజాస్వామిక వ్యవస్థపై యుద్ధానికి తోడ్పాటునందించారు. మావోయిస్టులకు ఆయన మేధో శక్తిగా ఉంటూ వారి భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ వచ్చారు’’ అని ఆరోపించారు. మెదడు చాలా ప్రమాదకరమైనదని జస్టిస్ షా అన్నారు. ఉగ్రవాద లేక మావోయిస్టు కార్యకలాపాలకు సంబంధించినంతవరకు మెదడే సర్వస్వమని అభిప్రాయపడ్డారు. గృహ నిర్బంధం విజ్ఞప్తిని తిరస్కరించారు. సాక్ష్యాలను సమగ్రంగా పరిశీలించిన తరువాతే నిందితులను దోషులుగా నిర్ధారించారన్నారు. ‘‘హైకోర్టు కూడా సాయిబాబా తదితరులపై కేసులను కొట్టేయలేదు. కింది కోర్టు నిర్ధారించిన అంశాలను తోసిపుచ్చలేదు. కేవలం వారి విడుదలకు మాత్రమే ఆదేశించింది’’ అని ధర్మాసనం గుర్తు చేసింది. విచారణను డిసెంబర్ 8కి వాయిదా వేసింది. -
సీసీటీవీ కెమెరాలు తీసేయకుంటే జైల్లో నిరాహార దీక్ష: సాయిబాబా
నాగపూర్: జైలులో తాను కాలకృత్యాలు తీర్చుకొనేచోట, స్నానం చేసే చోట అధికారులు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశారని, వాటిని వెంటనే తొలగించాలని ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబా డిమాండ్ చేశారు. లేదంటే జైలులో నిరవధిక నిరాహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. మావోయిస్టులతో సంబంధాల కేసులో ఆయన ప్రస్తుతం మహారాష్ట్రలోని నాగపూర్ జైలులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నారు. అతని కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. అధికారులు అతనికి వాటర్ బాటిల్ ఇవ్వడానికి నిరాకరించారని ఆరోపించారు. జైలు అధికారులు ఉద్దేశపూర్వకంగా సాయిబాబా మంచం పక్కన స్టీల్ బాటిల్‌ను ఉంచారని, అతని ఆరోగ్య పరిస్థితి కారణంగా బాటల్‌ను ఎత్తలేడని, దీని ఫలితంగా తీవ్రమైన వేడిలో తరచుగా నీరు త్రాగడానికి అతని వద్ద బాటిల్ లేదని వారు పేర్కొన్నారు. -
'నా భర్త జైలుకెళితే ప్రాణాలకు ముప్పు'
ఢిల్లీ: తన భర్తకు తీవ్ర అనారోగ్యంగా ఉందనీ, జైలుకెళితే ప్రాణాలకు ముప్పుంటూ ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబా భార్య వసంత కోర్టుకు విన్నవించింది. 90 శాతం అనారోగ్యం, అంగవైకల్యంతో తన భర్త బాధపడుతున్నారంటూ ఆమె వాపోయింది. బెయిల్ ఇవ్వండి, అవసరమైతే గృహ నిర్బంధంలో ఉంచండి'' అంటూ వసంత కోరింది. నిషిద్ధ మావోయిస్టు పార్టీతో సంబంధాలున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో గత ఏడాది ఢిల్లీలో సాయిబాబాను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అప్పటినుంచి నాగాపూర్ జైల్లో ఉన్న సాయిబాబాకు గతంలో బాంబే హైకోర్టు అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మానవతా దృక్పథంతో తాత్కాలిక బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు నేపథ్యంలో ఢిల్లీ యూనివర్సిటీ ఆయనను అప్పుడే విధుల నుంచి సస్పెండ్ చేసింది. కాగా, ఈ కేసును పరిశీలించిన నాగాపూర్ హైకోర్టు బెంచ్ నిన్న మధ్యంతర బెయిల్ రద్దు చేసినట్టు వెల్లడించింది. -
సాయిబాబాకు బెయిలిస్తాం
30లోగా మహారాష్ట్ర వైఖరి చెప్పాలి: బాంబే హైకోర్టు ముంబై: ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మానవతా దృక్పథంతో ఆయనకు బెయిలు మంజూరు చేయాలని భావిస్తున్నట్లు బాంబే హైకోర్టు పేర్కొంది. మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై అరెస్టయిన సాయిబాబా ప్రస్తుతం నాగ్‌పూర్ సెంట్రల్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. వికలాంగుడైన సాయిబాబా ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని పూర్ణిమా ఉపాధ్యాయ్ అనే సామాజిక కార్యకర్త రాసిన లేఖను సూమోటోగా విచారణకు స్వీకరించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మోహిత్ షా, జస్టిస్ ఏకే మీనన్‌లతో కూడిన డివిజన్‌బెంచ్ శుక్రవారం ఈ మేరకు తన అభిప్రాయాన్ని వెల్లడించింది. సాయిబాబా ఏడాదినుంచి నాగ్‌పూర్ సెంట్రల్ జైల్లో మగ్గుతున్నారు. సాయిబాబాకు గతంలో సెషన్స్కోర్టుతోపాటు హైకోర్టు కూడా సాధారణ బెయిలును తిరస్కరించినట్టు పూర్ణిమా ఉపాధ్యాయ్ తన లేఖలో వివరించారు. దీనిని పరిశీలించిన డివిజన్ బెంచ్, గతంలో బెయిలు పిటిషన్ తిరస్కరణకు గురైనప్పటికీ ఈ సారి ఆయన అనారోగ్యం దృష్ట్యా బెయిలు ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఈ విషయంలో మహారా ష్ర్ట ప్రభుత్వం ఈనెల 30 లోగా తన వైఖరిని చెప్పాలని ఆదేశించింది. ఆ రోజు దీనిపై మళ్లీ విచారణ చేపడతామని కోర్టు పేర్కొంది. 90 శాతం అంగవైకల్యం ఉన్న ప్రొఫెసర్ సాయిబాబా వీల్‌చైర్ సాయంతో మాత్రమే కదలగలుగుతారు. నరాల సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్న సాయిబాబాను హైకోర్టు, ఇటీవల నాగ్‌పూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి పరీక్షలకోసం పంపించింది. అలాగే సాయిబాబా కోరుకున్న ఏదైనా ప్రైవేటు ఆస్పత్రిలో ఆయనకు చికిత్స చేయించాలని హైకోర్టు జైలు అధికారులను ఆదేశించింది.