tribal rights
-
ప్రాణాలతో బయటపడడం అద్భుతమే
నాగపూర్: జైలు నుంచి ప్రాణాలతో బయటపడతానని ఏనాడూ అనుకోలేదని ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబా(54) చెప్పారు. సజీవంగా బయటకు రావడం నిజంగా అద్భుతమేనంటూ భావోద్వేగానికి గురయ్యారు. జైలులో శారీరకంగా, మానసికంగా ఎన్నో బాధలు అనుభవించానని చెప్పారు. అక్కడ జీవితం అత్యంత దుర్భరమని పేర్కొన్నారు. మావోలతో సంబంధాల కేసులో బాంబే హైకోర్టు సాయిబాబాను నిర్దోషిగా గుర్తిస్తూ మంగళవారం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఆయన గురువారం నాగపూర్ సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి చక్రాల కురీ్చలో బయటకు వచ్చారు. ఈశాన్య భారతదేశంలో గిరిజనుల హక్కుల కోసం పోరాడుతున్నందుకే తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు. తప్పుడు కేసులో ఇరికించి అరెస్టు చేశారని సాయిబాబా అన్నారు. జైలులోనే ప్రాణాలు పోతాయనుకున్నా.. ‘‘నా ఆరోగ్యం క్షీణించింది. ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నాను. మొదట చికిత్స తీసుకోవాలి. ఆ తర్వాతే మాట్లాడగలను. త్వరలో డాక్టర్లను కలిసి చికిత్స తీసుకుంటా. విలేకరు లు, లాయర్లు కోరడం వల్లే ఇప్పుడు స్పందిస్తున్నా. జైలులో నాకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. అత్యంత కఠినమైన, దుర్భర జీవితం అనువించా. చక్రాల కుర్చీ నుంచి పైకి లేవలేకపోయా. ఇతరుల సాయం లేకుండా సొంతంగా టాయిలెట్‌కు కూడా వెళ్లలేని పరిస్థితి. ఇతరుల సాయం లేనిదే స్నానం కూడా చేయలేపోయా. జైలులోనే నా ప్రాణాలు పోతాయని అనుకున్నా. ఈరోజు నేను ఇలా ప్రాణాలతో జైలు నుంచి బయటకు రావడం అద్భుతమే చెప్పాలి. నాపై నమోదైన కేసులో సాక్ష్యాధారాలు లేవని ఉన్నత న్యాయస్థానం తేలి్చచెప్పింది. చట్టప్రకారం ఈ కేసు చెల్లదని స్పష్టం చేసింది. నాకు న్యాయం చేకూర్చడానికి ఇంతకాలం ఎందుకు పట్టింది? నాతోపాటు నా సహచర నిందితులు పదేళ్ల విలువైన జీవితాన్ని కోల్పోయారు. ఈ జీవితాన్ని ఎవరు తిరిగి తీసుకొచ్చి ఇస్తారు? జైలుకు వెళ్లినప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాను. అప్పుడు పోలియో మినహా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. కానీ, ఇప్పుడు గుండె, కండరాలు, కాలేయ సంబంధిత వ్యాధుల బారినపడ్డాను. నా గుండె ప్రస్తుతం కేవలం 55 శాతం సామర్థ్యంతో పనిచేస్తోంది. డాక్టర్లే ఈ విషయం చెప్పారు. నాకు పలు ఆపరేషన్లు, సర్జరీలు చేయాలని అన్నారు. కానీ, ఒక్కటి కూడా జరగలేదు. జైలులో సరైన వైద్యం అందించలేదు. పదేళ్లపాటు నాకు అన్యా యం జరిగింది. ఆశ ఒక్కటే నన్ను బతికించింది. ఇకపై బోధనా వృత్తిని కొనసాగిస్తా. బోధించకుండా నేను ఉండలేను’’ అని ప్రొఫెసర్ సాయిబాబా స్పష్టం చేశారు. మానవ హక్కుల పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తారా? అని మీడియా ప్రశ్నించగా, భారత రాజ్యాంగాన్ని 50 శాతం అమలు చేసినా సరే సమాజంలో అనుకున్న మార్పు వస్తుందని బదులిచ్చారు. సాయిబాబా సొంత ఊరు ఆంధ్రప్రదేశ్‌లోని బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురం పట్టణం సమీపంలోని జనుపల్లె. ఆయన పాఠశాల, కళాశాల విద్య ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే కొనసాగింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నత విద్య అభ్యసించిన ఆయన అక్కడే ప్రొఫెసర్ అయ్యారు. -
మణిపూర్ ఘటనలు ‘ప్రభుత్వ ప్రాయోజిత హింస’
సాక్షి, హైదరాబాద్: మణిపూర్‌లో చోటుచేసుకున్న ఘటనలు ‘ప్రభుత్వ ప్రాయోజిత హింస’గా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. బీజేపీ విభజించు.. పాలించు సిద్ధాంతాన్ని అవలంబిస్తూ ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. శనివారం శాసనమండలిలో ‘రాష్ట్రంలో గిరిజన సంక్షేమం– పోడుపట్టాల పంపిణీ’పై లఘుచర్చలో కవిత మాట్లాడుతూ మణిపూర్‌లో రెండు గిరిజన తెగల మధ్య గొడవ పెట్టి ప్రభుత్వ యంత్రాంగం చోద్యం చూస్తోందని ఆరోపించారు. అన్ని జాతులు బాగుపడాలని తెలంగాణ కోరుకుంటుంటే.... విభజించి ఓట్లు దండుకోవాలన్న ప్రయత్నం కేంద్రంలో కనిపిస్తోందని మండిపడ్డారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ పూర్తిగా గిరిజన హక్కులను హరిస్తోందని విమర్శించారు. తెలంగాణలో అమలు చేసిన వాటిని కేంద్రం అనుకరిస్తోందని కవిత వ్యాఖ్యానించారు. గిరిజనులకు కేటాయించిన నిధులను వంద శాతం వినియోగించేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవస్థను రూపొందిస్తోందని తెలిపారు. -
ఆదివాసీ హక్కులకోసం జాతీయ స్థాయి ఉద్యమం
సుందరయ్యవిజ్ఞానకేంద్రం: ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం రైతు ఉద్యమం తరహాలో జాతీయస్థాయి ఉద్యమం చేయనున్నట్లు పర్యావరణ వేత్త మేధా పాట్కర్ తెలిపారు. ఆదివాసీ, రైతు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞానకేంద్రంలో శనివారం సమా వేశం జరిగింది. ఈ సందర్భంగా మేధాపాట్కర్ మాట్లాడుతూ... అటవీ భూములను కార్పొరేట్లకు కట్టబెట్టే విధంగా నూతన చట్టాన్ని తెచ్చారని, దీనివల్ల పోడు భూములపై గిరిజనులకు హక్కులేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పీపీఐఎంఎల్ న్యూడెమొక్రసీ రాష్ట్ర నాయకులు వేములపల్లి వెంకట్రామయ్య మాట్లాడుతూ.... అడవుల నుంచి గిరిజనులను నెట్టేసేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని విమర్శించారు. ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ నాయకులు, మాజీ ఎంపీ మిరియం బాబూరావు మాట్లాడుతూ... గిరిజనులకు తీవ్ర నష్టం చేసే అటవీ హక్కుల నూతన చట్టాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. -
భీమా కోరేగావ్ కేసు: స్టాన్ స్వామి కన్నుమూత
ముంబై: ఎల్గార్ పరిషత్ కేసులో నిందితుడిగా ఉన్న గిరిజన హక్కుల కార్యకర్త స్టాన్ స్వామి సోమవారం మృతి చెందారు. అనారోగ్య కారణాలతో బెయిల్ మంజూరు చేయాలన్న ఆయన విజ్ఞప్తిపై బొంబాయి హైకోర్టులో విచారణ కొనసాగుతుండగానే 84 ఏళ్ల స్వామి ముంబైలోని హోలీ ఫ్యామిలీ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆదివారం నుంచి ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. కోవిడ్‌కు చికిత్స పొందుతూ స్టాన్ స్వామి సోమవారం గుండెపోటుతో మృతి చెందారని ఆయన బెయిల్ కేసును విచారిస్తున్న ధర్మాసనానికి స్వామి తరఫు న్యాయవాది మిహిర్ దేశాయి తెలిపారు. దీనిపై జస్టిస్ ఎస్ఎస్ షిండే, జస్టిస్ ఎన్జే జమాదార్ల ధర్మాసనం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ వార్తపై స్పందించేందుకు తమకు మాటలు రావడం లేదని, స్టాన్ స్వామి ఆత్మకు శాంతి చేకూరాలని వ్యాఖ్యానించింది. రోమన్ కేథలిక్ ప్రీస్ట్‌గా ఉన్న స్టాన్ స్వామి మృతిపై జెస్యూట్ ప్రొవిన్షియల్ ఆఫ్ ఇండియా సంతాపం వ్యక్తం చేసింది. ‘ఆదివాసీలు, దళితులు, అణగారిన వర్గాల కోసం ఆయన జీవితాంతం పోరాడారు. పేదలకు గౌరవప్రదమైన జీవితం లభించాలని పోరాటం చేశారు’ అని ఒక ప్రకటనలో పేర్కొంది. స్టాన్ స్వామి మృతి విషయంలో చికిత్స అందించిన ఆసుపత్రిపై కానీ, బెయిల్ కేసు విచారణ జరుపుతున్న కోర్టుపై కానీ తమకెలాంటి ఫిర్యాదులు లేవని చెప్పగలమని.. అయితే, ఎల్గార్ పరిషత్ కేసును విచారిస్తున్న ఎన్ఐఏపై, జైలు అధికారులపై మాత్రం అలా చెప్పలేమని న్యాయవాది మిహిర్ దేశాయి ధర్మాసనంతో వ్యాఖ్యానించారు. స్వామికి సరైన సమయంలో వైద్య సదుపాయం కల్పించే విషయంలో ఎన్ఐఏ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. విచారణ ఖైదీ అయిన తన క్లయింట్ స్వామి మృతికి దారితీసిన కారణాలపై హైకోర్టు న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. హోలీ ఫ్యామిలీ ఆసుపత్రికి తీసుకెళ్లడానికి 10 రోజుల ముందు స్వామిని జేజే ఆసుపత్రికి తీసుకువెళ్లారని, కానీ, ఆయనకు అక్కడ కోవిడ్ నిర్ధారణ పరీక్ష జరపలేదని కోర్టుకు వివరించారు. ఆ తరువాత హోలీ ఫ్యామిలీ ఆసుపత్రిలో పరీక్షించగా, కోవిడ్ నిర్ధారణ అయిందన్నారు. స్టాన్ స్వామికి బెయిల్ మంజూరు చేయడాన్ని ప్రతీసారి ఎన్ఐఏ వ్యతిరేకించిందని, కానీ, ఒక్కరోజు కూడా ఆయనను విచారించడానికి కస్టడీకి తీసుకోలేదని ఆరోపించారు. విచారణ ఖైదీగా ఉన్న సమయంలోనే స్టాన్ స్వామి మరణించినందువల్ల, ఐక్యరాజ్య సమితి మానవహక్కుల కమిషన్ నిబంధనల ప్రకారం అధికారులు ఆయనకు పోస్ట్‌మార్టం నిర్వహించాలని డిమాండ్ చేశారు. కాగా, న్యాయ విచారణకు హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. కోవిడ్ ప్రొటోకాల్ ప్రకారం స్టాన్ స్వామి అంత్యక్రియలు ముంబైలో జరుగుతాయని కోర్టు తెలిపింది. ఎల్గార్ పరిషత్– మావోయిస్ట్ సంబంధాలకు సంబంధించిన కేసులో, కఠినమైన చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(యూఏపీఏ) కింద 2020 అక్టోబర్ నుంచి స్వామిని విచారణ ఖైదీగా మొదట తలోజా జైళ్లో నిర్బంధించారు. మొదట అక్కడి ఆసుపత్రిలోనే చికిత్స అందించారు. అనంతరం, హైకోర్టు ఆదేశాల మేరకు ఈ సంవత్సరం మే నెలలో హోలీ ఫ్యామిలీ ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు, జేజే ఆసుపత్రిలో తనను చేర్చడాన్ని స్వామి తీవ్రంగా వ్యతిరేకించారు. ఫాదర్ స్టాన్ స్వామి మృతికి నా హృదయపూర్వక నివాళులు’ అని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ‘హక్కుల కార్యకర్త ఫాదర్ స్టాన్ స్వామి కస్టడీ హత్యను మోదీ, షా విజయవంతంగా ముగించారు. ఆయనకు బెయిల్ నిరాకరించిన జడ్జీలు ఇక రాత్రులు నిద్ర పోలేరనుకుంటా. వారికీ ఈ హత్యలో భాగం ఉంది’ అని సీపీఐఎంల్ పొలిట్‌బ్యూరో మెంబర్ కవిత కృష్ణన్ ట్వీట్ చేశారు. స్టాన్ స్వామి విషయంలో ఎన్ఐఏ వ్యవహరించిన తీరుపై గతంలోనూ విమర్శలు వచ్చాయి. పార్కిన్సన్ వ్యాధితో బాధపడ్తున్న తనకు జైలులో ఆహారం తీసుకోవడానికి వీలుగా ఒక సిప్పర్‌ను, స్ట్రాను ఇవ్వాలని ఎన్ఐఏను ఆదేశించాలని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టుకు స్వామి మూడు సార్లు దరఖాస్తు చేసుకున్నారు. స్వామి చేసిన ఆ చిన్న అభ్యర్థనపై స్పందించడానికి ఎన్ఐఏ 4 వారాల గడువు కోరింది. అయితే, ఆ తరువాత స్వామికి సిప్పర్, స్ట్రాతో పాటు, వీల్ చెయిర్‌ను, చేతికర్రను, వాకర్‌ను, ఇద్దరు సహాయకులను సమకూర్చామని ఎన్ఐఏ కోర్టుకు తెలిపింది. ఆదివాసీల కోసం 30 ఏళ్ల పోరాటం ఫాదర్ స్టాన్ స్వామి పూర్తి పేరు స్టానిస్లాస్ లూర్దుసామి. జార్ఖండ్‌లో ఆదివాసీలు, అణగారిన వర్గాల హక్కుల కోసం జీవిత పర్యంతం ఆయన కృషి చేశారు. నక్సలైట్లను ముద్రవేసి అక్రమంగా జైళ్లో మగ్గుతున్న ఆదివాసీల దుస్థితిపై ఆయన ఒక పరిశోధన గ్రంథం రాశారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయని తమపై తప్పుడు ఆరోపణలతో జైల్లో పెట్టారని దాదాపు 97 శాతం విచారణ ఖైదీలు తనతో చెప్పినట్లు స్వామి అందులో పేర్కొన్నారు. ఆదివాసీల హక్కుల కోసం ఆయన 3దశాబ్దాల పాటు కృషి చేశారు. తమిళనాడులోని తిరుచిరాపల్లిలో 1937లో ఆయన జన్మించారు. ‘జంషెడ్పూర్ ప్రావిన్స్ ఆఫ్ ద సొసైటీ ఆఫ్ జీసస్’లో చేరి, ప్రీస్ట్‌గా మారారు. 1970లలోనే యూనివర్సిటీ ఆఫ్ మనీలాలో సోషియాలజీలో పీజీ చేశారు. బ్రసెల్స్‌లో చదువుకుంటున్న సమయంలో బ్రెజిల్‌లోని పేదల కోసం కృషి చేస్తున్న ఆర్చ్ బిషప్ హోల్డర్ కామరా సేవలు ఆయనను అమితంగా ఆకర్షించాయి. 1975 నుంచి 1986 వరకు బెంగళూరులోని ఇండియన్ సోషల్ ఇన్స్టిట్యూట్కు డైరెక్టర్‌గా పనిచేశారు. 30 ఏళ్లుగా జార్ఖండ్ గిరిజనుల కోసం పనిచేస్తున్నారు. వారి భూములను అభివృద్ధి పేరుతో డ్యాములు, గనులు, టౌన్‌షిప్‌ల కోసం తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ పోరాటం చేశారు. నక్సలైట్లతో సంబంధాలున్నాయన్న తప్పుడు ఆరోపణలతో జైళ్లలో మగ్గుతున్న గిరిజన యువత విడుదలకి కృషి చేశారు. కేన్సర్‌తో, పార్కిన్సన్ వ్యాధితో బాధపడ్తున్న స్టాన్ స్వామిని, మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై గత అక్టోబర్ 8న రాంచిలో అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. -
అడవి బిడ్డలను ఆదుకోవడానికి కొత్త చట్టం
సాక్షి, అమరావతి/బుట్టాయగూడెం: గిరిజనులకు ఉద్యోగాల్లో వంద శాతం రిజర్వేషన్లు కల్పించే జీవో నంబర్ 3ని సుప్రీంకోర్టు కొట్టేసిన నేపథ్యంలో గిరిజనుల హక్కులను కాపాడేందుకు న్యాయపరమైన చర్యలు తీసుకొని అవసరమైతే కొత్త చట్టాన్ని తీసుకురావాలని రాష్ట్ర గిరిజన సలహా మండలి (టీఏసీ) ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ విషయంలో సీఎం వైఎస్ జగన్ తీసుకుంటున్న చర్యలను అభినందిస్తూ మరో తీర్మానాన్ని కూడా ఆమోదించింది. ఐటీడీఏలలో గిరిజనుల కోసం ప్రత్యేకంగా మెడికల్ కళాశాల, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం, కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కళాశాలకు 153 కోట్లను కేటాయించినందుకు సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపింది. జీవో నంబర్ 3 విషయంపై రాష్ట్ర గిరిజన సలహా మండలి (టీఏసీ) ప్రత్యేక సమావేశం గురువారం సచివాలయంలో జరిగింది. దీనికి డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణితో పాటుగా గిరిజన ఎమ్మెల్యేలు తెల్లం బాలరాజు, పీడిక రాజన్న దొర, కళావతి, చెట్టి ఫల్గుణ, భాగ్యలక్ష్మి, ధనలక్ష్మి, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే, డైరెక్టర్ రంజిత్ బాషా హాజరయ్యారు. డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ► జీవో నంబర్ 3పై సుప్రీం తీర్పు నేపథ్యంలో ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలపై సుదీర్ఘంగా చర్చించాం. ► ఏజెన్సీ ప్రాంతాల్లోని పరిస్థితులు, భాషలు, సంప్రదాయాల నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో స్థానికులైన గిరిజనులు ఉపాధ్యాయులుగా ఉంటే ప్రయోజనం. ► గిరిజన పిల్లలు చదువుకోవడానికి, డ్రాప్ అవుట్స్ తగ్గడానికి అవకాశం ఉంటుందని జీవో నంబర్ 3ని తీసుకొచ్చాం. ► సుప్రీం తీర్పు తర్వాత సీఎం జగన్ ఆదేశాలతో అధికారులు ఇప్పటికే 3 సార్లు సమావేశాలను నిర్వహించారు. ► తెలంగాణకి చెందిన న్యాయశాఖ అధికారులు, అడ్వొకేట్ జనరల్‌తోనూ సమన్వయ సమావేశాలను నిర్వహించాం. ► సుప్రీం తీర్పుపై రివ్యూ పిటీషన్ దాఖలు చేయడానికి ఎలాంటి గడువు లేదు. కొంతమంది రాజకీయ దురుద్దేశాలతో జీవోపై రాద్ధాంతం చేయాలని చూస్తున్నారు. ► కాగా, సుప్రీం కోర్టులో రివ్యూ పిటీషన్ వేయడంతో పాటుగా ఏజెన్సీ గిరిజనులకు ఉద్యోగాల్లో 100 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ఒక కొత్త చట్టాన్ని తీసుకురావాలని పలువురు గిరిజన ఎమ్మెల్యేలు ఈ సమావేశంలో కోరారు. -
గిరిజన హక్కుల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వానిదే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గిరిజన హక్కుల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వానిదేనని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. గిరిజనుల కోసం తీసుకొచ్చిన జీవో–3ను సుప్రీంకోర్టు కొట్టివేసినందున రివ్యూ పిటిషన్ వేసేందుకు ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టిందన్నారు. మాసాబ్‌ట్యాంక్‌లోని డీఎస్ఎస్ భవన్లో గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతాల్లో టీచర్ ఉద్యోగాలను నూరు శాతం గిరిజనులకే ఇవ్వాలనే ఉద్దేశ్యంతో జీవో–3ను తీసుకొచ్చామని, అయితే దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో లాక్డౌన్ సమయంలో జీవో నం.3ను ధర్మాసనం కొట్టివేసిందని చెప్పారు. దీనిపై న్యాయవాదులు, న్యాయ నిపుణులతో చర్చించామని, సీఎం కేసీఆర్ ఆదేశాలతో త్వరలో సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిని పెట్టి రివ్యూ పిటిషన్ వేస్తామన్నారు. 2000 సంవత్సరంలో వచ్చిన జీవో 3 వల్ల గత రెండు దశాబ్దాలుగా షెడ్యూల్డు ప్రాంతాల్లోని గిరిజనులు విద్య, ఉద్యోగ రంగాల్లో కొంత అభివృద్ధి అయ్యారని, ఈ సమయంలో జీవో–3ను కొట్టివేయడం దురదృష్టకరమన్నారు. ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్, కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తు, అదనపు సంచాలకులు సర్వేశ్వర్ రెడ్డి తదితరులున్నారు. -
రుణమాఫీ కోసం కదంతొక్కిన రైతన్న
ముంబై: రైతు రుణమాఫీ, అటవీభూములపై గిరిజనులకు హక్కులు, కరువు సాయం కోరుతూ వేలాదిమంది మహారాష్ట్ర రైతులు, గిరిజనులు నిరసనబాట పట్టారు. మెగసెసె అవార్డు గ్రహీత, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన డాక్టర్ రాజేంద్రసింగ్ సైతం వీరి వెంట నడిచారు. ప్రధానంగా మరాఠ్వాడా, థానె, భుసావాల్ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు, గిరిజనులతో మంగళవారం మధ్యాహ్నం థానెలో ర్యాలీ ప్రారంభమైంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ముంబైలోని విధాన్ భవన్‌కు గురువారం చేరుకుని అక్కడ భారీస్థాయిలో నిరసన ప్రదర్శన చేపట్టనున్నారు. రైతులందరికీ అందుబాటులో తగినంత భూమి, నీరు, సహజవనరులన్నీ దక్కాలని సూచించిన స్వామినాథన్ కమిటీ నివేదికను అమలుచేయాలని రైతులు డిమాండ్చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో ఉద్యమంబాట పట్టామని ర్యాలీకి నేతృత్వం వహిస్తున్న లోక్ సంఘర్‡్ష మోర్చా నేత ప్రతిభాషిండే చెప్పారు. -
ఎస్టీ కమిషన్ చైర్మన్ గా నంద్‌కుమార్
న్యూఢిల్లీ: జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (ఎన్ సీఎస్టీ) చైర్మన్ గా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సీనియర్ గిరిజన నాయకుడు, మాజీ ఎంపీ నంద్‌కుమార్‌సాయి(71) మంగళవారం బాధ్యతలు చేపట్టారు. కేబినెట్ హోదా కలిగిన ఈ పదవిలో ఈయన మూడేళ్లపాటు కొనసాగుతారు. మారుమూల ప్రాంతాల్లోని గిరిజనుల హక్కుల పరిరక్షణకు పాటుపడతానని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. గిరిజనుల హక్కుల సాధనకు, వారి ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి ఎన్నో ఉద్యమాలను ముందుండి నడిపించిన ఘనత నంద్‌కుమార్‌ది. నంద్‌కుమార్ 1977, 85, 98ల్లో మధ్యప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. -
ఈ ఘర్షణ సమసిపోవాలంటే..
కొత్త కోణం 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఆదివాసులు అనారోగ్యంతో, ఆకలితో అవమానాలతో కాలం వెళ్లబుచ్చుతున్నారు. వారికి ఆసరాగా నిలబడుతున్నది నక్సలైట్లే. అందుకే ఆదివాసులు మావోయిస్టులతో మమేకమవుతున్నారు. తుపాకులు పట్టిన మావోయిస్టులలో అత్యధికులు వారే. ప్రభుత్వాలు నక్సలైట్లను ఏరివేసి, ఆదివాసీ ప్రాంతాలను కార్పొరేట్లకు అప్పగించాలని విశ్వప్రయత్నం చేస్తున్నాయి. ఈ పరిస్థితి మారాలంటే ఆదివాసీ ప్రాంతాల్లో కచ్చితమైన రాజ్యాంగ స్ఫూర్తితో చట్టాలు అమలు జరగాలి. వామపక్ష తీవ్రవాదం(నక్సలిజం) జాతీయ భద్రతా సమస్యగా ఉన్నందున సైనిక చర్యలు మాత్రమే పరిష్కారమనే భావన ఉంది. కానీ ఈ విధానం ఆదివాసులను మరింత దూరం చేయగలదు. ప్రభుత్వానికి, ఆదివాసులకు మధ్య అగాధం పెంచగలదు. అందువల్ల ఇది ఎటువంటి పరిస్థితుల్లో ఆచర ణీయం కాకూడదు. 2004లో ఆదివాసీ సమస్యలపై నియమించిన ఉన్నత స్థాయి సంఘం ఇచ్చిన నివేదికలోని వాక్యాలివి. తరతరాలుగా నిర్లక్ష్యానికి గురవుతున్న ఆదివాసీ ప్రాంతాలను అభివృద్ధి చేయడం కూడా అవసరమని సామాజిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ వర్జినియస్ కాకా నేతృత్వంలోని ఆ కమిటీ భావించింది. ఆదివాసీ ప్రాంతాల్లోని వనరులను కొల్లగొట్టడానికి ప్రభు త్వాలు, కార్పొరేట్ సంస్థలు కలిసి చట్టాలను ఉల్లంఘించి, అక్రమాలకు పాల్పడటాన్ని అరికట్టాలని అది చాలా స్పష్టంగా పేర్కొన్నది. ఆదివాసుల ప్రయోజనాలకు, అభీష్టానికి వ్యతిరేకంగా వారి ఆవాస ప్రాంతాల నేలలో నిక్షిప్తమై ఉన్న సహజ వనరులను గిరిజనేతరులకు ధారాదత్తం చేయకూ డదని, వాటి ద్వారా వచ్చే లాభాల్లో ఆదివాసులకు సైతం వాటా ఉండాలని, దానిని వారి అభివృద్ధికి ఉపయోగించాలని కమిటీ సూచించింది. కానీ భారత ప్రభుత్వాలు ఏనాడూ అడవి బిడ్డలైన ఆదివాసులను ఈ సమాజంలో భాగంగా చూడలేదు. వారికి తమదైన సొంత సంస్కృతి, ప్రత్యేక ఆచార, సాంప్రదాయాలు ఉన్నాయని కూడా పరిగణనలోనికి తీసుకోలేదు. నక్సలైట్ పార్టీలు అటవీ ప్రాంతాల్లో ఉద్యమాలు నిర్మించడానికి ముందు ప్రభుత్వ యంత్రాంగం అక్కడ అడుగుపెట్టిన జాడే లేదు. ఆదివాసీలను, వారి వన రులను దోపిడీ చేసేందుకే అటవీ ప్రాంతాల్లోనికి అడుగుపెట్టిన షావు కార్లు, కాంట్రాక్టర్లు, వారిని నిత్యం హింసించే ఫారెస్ట్ అధికారులు మాత్రమే అప్పు డప్పుడు వెళ్లేవారు. 1993లో కొంత మంది జర్నలిస్టులం ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతానికి వెళ్లాం. మమ్మల్ని చూసిన ఆడవాళ్లు, పిల్లలు గుడిసెల్లో దూరి పోయారు. మాతో ఒక షావుకారు ఉండటం వల్ల కొంతమంది మగవాళ్లు మాత్రం నిలబడ్డారు. కార్పొరేట్ల ధన దాహం వల్లనే... అంటే, ఆ ప్రజలకు అప్పటికి షావుకార్లు, ఫారెస్టు ఆఫీసర్లు తప్ప బాహ్య ప్రపంచం తెలియదు. ప్రభుత్వాధికారుల జాడే ఉండేది కాదు. పైగా, మేం వెళ్లినది వాహనాలు వెళ్ళగలిగే ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతం. వారం రోజుల క్రితం నేటి ఏపీ పోలీసులు ఒడిశాలో నక్సలైట్లపై దాడి చేసిన ప్రాంతానికి అతి దగ్గరగా ఉన్న ప్రాంతం. దాదాపు 27 మంది నక్సలైట్లని, లేదా ఆదివాసులను ఒకేసారి కాల్చి చంపిన మొదటి ఘటన అది. ఇవి ఎదురు కాల్పులని పోలీసులు ప్రకటించినా, సాధారణ పౌరులెవ్వరూ ఇది నిజంగానే ఎన్కౌంటర్ అని విశ్వసించే స్థితిలో లే రు. మావోయిస్టు పార్టీ సీనియర్ నాయకులు, పొలిట్ బ్యూరో సభ్యులు అక్కిరాజు హరగోపాల్ అలి యాస్ ఆర్కే ఘటనాస్థలిలో ఉన్నట్టు పోలీసులు ధ్రువీకరించారే కానీ, ఇంకా ఆయన ఆచూకీని బయటపెట్టలేదు. ఆర్కే భార్య పద్మక్క ఈ సోమవారం హైకోర్టులో దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి, జస్టిస్ ఎమ్మెస్కే జైస్వాల్... మావోయిస్టయినా, సాధారణ పౌరుడైనా వారి ప్రాణ రక్షణ బాధ్యత ప్రభుత్వాలదేనని తేల్చి చెప్పడం ప్రభుత్వాల తీరుతెన్నులకు మందలింపుగా భావించవచ్చు. ప్రభు త్వాలు పౌరుల రక్షణకు బాధ్యత వహించాలని కోర్టులు పదే పదే చెప్పినా అది వాటి చెవికి ఎక్కక పోవడం యాదృచ్ఛికం కాదేమో. నిజమైన ఎదురు కాల్పులు జరిగినప్పుడు రెండు వైపులా భావోద్వేగాలు ఉంటాయన్నది వాస్తవం. కానీ ప్రభుత్వాలు మరింత బాధ్యతతో పౌరుల ప్రాణాలకు హానీ కలిగించకుండా జాగ్రత్త వహించాలి. కానీ అందుకు భిన్నమైనదే ఆచరణలో జరుగుతోంది. మొత్తంగా ఈ వ్యవహారాన్ని నక్సలైట్లకూ పోలీసులకూ మధ్య యుద్ధంగా మార్చి ప్రభువులు పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. ప్రభు త్వాల పెద్దలు తమ రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు సాధారణ పోలీసులను పావులుగా వాడుకుంటున్నారు. నిజానికి ఇది పోలీసులకు, నక్సలైట్లకు మధ్య యుద్ధం కాదు. ఇది కార్పొరేట్ల ధన దాహం, ప్రభుత్వాల దళారీతనాలకూ, ఆదివాసీల అస్తిత్వ, ఆత్మ గౌరవాలకూ మధ్య సంఘర్షణ. ఈ ప్రాథమిక అంశాన్ని మరుగుపరచడానికి పోలీసులను, ఆ తర్వాత సైన్యాన్ని ముందు పెట్టి కార్పొరేట్ కంపెనీలు ఖనిజ వనరుల దోపిడీకి పాల్పడుతున్నాయి. నక్సలిజం, మావోయిజాలకు మూలం నక్సలైట్లు, మావోయిస్టుల పుట్టుకకు, మనుగడకు రాజకీయ, సిద్ధాంత కార ణాలకన్నా స్థానికమైన సామాజిక, ఆర్థిక విషయాలే ప్రధాన కారణమని ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి. పైగా ప్రభుత్వాలన్ని ఉద్దేశపూర్వకంగానే రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కాయి. ‘‘ఆదివాసులకు ప్రత్యేక పాలనా ధికారాలు, స్వయంపాలనా వ్యవస్థలు ఉంటాయి. వారి ఆర్థిక, సామాజిక పునాదులపై ఆధారపడి మాత్రమే వారి అభివృద్ధి సాగాలి. వారి ప్రాంతానికి సంబంధించి ఏ నిర్ణయాలు తీసుకున్నా వాళ్ల ప్రత్యేక మండలుల అంగీకారం తప్పనిసరిగా ఉండాలి’’ అని రాజ్యాంగ సభ అధ్యక్షుడు బాబూ రాజేంద్ర ప్రసాద్ 1949లోనే అన్నారు. మన రాజ్యాంగకర్తలు ఎంతో సామాజిక చైత న్యంతో, బాధ్యతతో చట్టాలను రూపొందిస్తే మన పాలకులు వాటిని బుట్ట దాఖలు చేశారు. నక్సలైట్ ఉద్యమ ప్రస్థానమే దానికి నిదర్శనం. నక్సలైట్ ఉద్యమం పశ్చిమ బెంగాల్‌లోని నక్సల్బరిలో ఆరంభమైంది. ఆదివాసీలు తరతరాలుగా తమ అధీనంలో ఉన్న భూములను బయటి ఆదివాసేతరులైన భూస్వాములు ఆక్రమించు కోవడాన్ని ఎదిరించి, తమ భూములు తాము దున్నుకోవడం ప్రారంభించగా ఘర్షణ ప్రారంభమైంది. ఇది ప్రారంభం. నక్స ల్బరీలో రక్తపుటేరులు ప్రవహించాయి. దానికి సమాంతరంగా, సరిగ్గా అదే సమయంలో శ్రీకాకుళం ఏజెన్సీ ఆదివాసీలు తమ హక్కుల కోసం, షావు కార్లు, భూస్వాముల దోపిడీ, పీడనలకు వ్యతిరేకంగా ఉద్యమించారు. భూస్వాముల గూండాలు దాడి చేసి కోరన్న, మంగన్న అనే తొట్టతొలి మార్క్సిస్టు, లెనినిస్టు కార్యకర్తలను హతమార్చారు. వారి మరణంతో ఆ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న వాళ్ళు ఆయుధాలు తీసుకున్నారు. ఈ రెండు ఘటనలు దేశవ్యాప్తంగా ఆదివాసీ తిరుగుబాట్లకు మార్గం వేశాయి, నక్సలైట్ సాయుధ పోరాటానికి కారణమయ్యాయి. ప్రభుత్వాలు ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టి వందలాది మంది నక్సలైట్ నాయకులను, కార్యకర్త లను, సామాన్య ప్రజలను చంపివేశాయి. ‘ఎన్కౌంటర్’లు ప్రారంభమైంది కూడా శ్రీకాకుళంలోనే. ఆదివాసీ ఉద్యమా లపై తీవ్ర నిర్బంధాన్ని అమలు చేస్తూనే, ఆదివాసీ రక్షణ పేరుతో కొన్ని చట్టాలను, సంస్కరణలను ప్రభు త్వాలు ముందుకు తెచ్చాయి. ఆ విధంగానే మన రాష్ట్రంలో 70 (1) చట్టం ఉనికిలోనికి వచ్చింది. దేశవ్యాప్తంగా ప్రవేశ పెట్టిన ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ(ఐటీడీఏ) వ్యవస్థలు. ఆదివాసుల అభివృద్ధికి ప్రత్యేక నిధుల కోసం, 1974లోనే ట్రైబల్ సబ్‌ప్లాన్ (టీఎస్పీ)లు అందులో భాగమే. అయితే కాలక్రమేణా 70 (1) చట్టం నీరుగారి పోయింది. ఆదివాసుల నుంచి ఆదివాసీయేతరులు భూములు కొనకూడదనే రక్షణను కల్పించడంలో ఈ చట్టం ఆచరణలో విఫలమైంది. ఐటీడీఏల ద్వారా ఆదివాసీలకు అరకొరగానే అయినా కొంత మెరుగైన సౌకర్యాలు కలిగాయి. ట్రైబల్ సబ్‌ప్లాన్ అమలు కూడా సరైన విధంగా ఫలితాలను ఇవ్వలేదు. ఆదివాసీ హక్కుల నిరాకరణే అసలు సమస్య అందువల్లనే నక్సలైట్ ఉద్యమం అటు జార్ఖండ్‌కు, ఇటు గోదావరి లోయ ప్రాంతంలోనికి, ఆదిలాబాద్ అడవికి విస్తరించింది. 1980 తర్వాత ఛత్తీస్ గఢ్‌లోకి ప్రవేశించినప్పటికీ, 1990 తర్వాతనే అక్కడ ఉద్యమం బల పడింది. 1990 అనంతరం ఆర్థిక సంస్కరణల ద్వారా వచ్చిన ప్రపంచీకరణలో భాగంగా ముందుకు వచ్చిన సరళీకరణ విధానాలు ప్రైవేట్ కంపెనీల జోరుకు ఊపునిచ్చాయి. దానితో కార్పొరేట్ కంపెనీల దృష్టి ఆదివాసీ ప్రాంతాల మీదకు వెళ్ళింది. మన దేశంలో లభించే బొగ్గు, ఇతర ఖనిజాల్లో నూటికి 70 శాతం ఆదివాసీ ప్రాంతాల్లోనే ఉన్నాయి. 1995లో చంద్రబాబు అధికారం లోని వచ్చిన తర్వాత ఒడిశా–ఏపీ సరిహద్దుల్లో బాక్సైట్ గనులపై సర్వహ క్కులు« ప్రైవేట్ కంపెనీలకు ధారాదత్తం చేశారు. ఈ ఒప్పందంపైనే సమత అనే స్వచ్ఛంద సంస్థ కోర్టుని ఆశ్రయించింది. ఆదివాసులు ఈ బాక్సైట్ తవ్వ కాలపట్ల తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శించారు. చివరకు సుప్రీంకోర్టు, ఆదివాసీ ప్రాంతాల్లోని భూమితో సహా ఎటువంటి వనరులనూ గిరిజనేతరులు ఉప యోగించుకోవడానికి వీలులేదని, ప్రభుత్వాలు కూడా గిరిజనేతరు లేనని, వారికి కూడా ఈ నియమం వర్తిస్తుందని చారిత్రాత్మకమైన తీర్పును వెలు వరించింది. అయినా ప్రభుత్వాలు తమ ప్రయత్నాలను మానుకోకపోవడం వల్ల దాదాపు రెండు కోట్ల మందికి పైగా ఆదివాసులు నిరాశ్రయులైనట్టు ప్రభుత్వ లెక్కలే చెపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మళ్లీ నక్సలైట్లు, మావోయి స్టులు ఆదివాసులకు అండగా నిలిచారు. 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఆదివాసులు అనారోగ్యంతో, ఆకలితో అవమానాలతో కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వారికి ఆసరాగా నిలబడుతున్నది, వారి అభివృద్ధికి తోడ్పడుతున్నది నక్సలైట్లు మాత్రమే. అందుకే ఆదివాసులు మావోయిస్టులతో మమేకమవుతున్నారు. ప్రభుత్వాలు నక్సలైట్లను ఏరివేసి, ఆదివాసీ ప్రాంతాలను కార్పొరేట్లకు అప్ప గించాలని విశ్వప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగమే ఆపరేషన్ గ్రీన్ హంట్. ఇది ఆదివాసులలో మరింత తీవ్ర అశాంతిని రగులుస్తోంది. తుపా కులు పట్టిన మావోయిస్టులలో అత్యధికులు ఆదివాసులేనంటే ఆశ్చర్యపోవా ల్సిన పనిలేదు. ఈ పరిస్థితి మారాలంటే ఆదివాసీ ప్రాంతాల్లో కచ్చితమైన రాజ్యాంగ స్ఫూర్తితో చట్టాలు అమలు జరగాలి. తామూ ఈ దేశంలో భాగమే ననే విశ్వాసం ఆదివాసులకు కలగాలి. అది జరగకుంటే అక్కడ అలజడి ఆగదు. సంఘర్షణ సమసిపోదు. నక్సలైట్ ఉద్యమాన్ని ఈ చారిత్రక క్రమం నుంచి అర్థం చేసుకోకుంటే ప్రభుత్వాలు భవిష్యత్‌లో మరిన్ని ఉద్యమాలను ఎదుర్కోక తప్పదు. (వ్యాసకర్త : మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు మొబైల్ : 97055 66213) -
ఆదివాసీల హక్కులను కాలరాయొద్దు
- బహుళజాతి సంస్థలకు ఖనిజ సంపద దోచిపెట్టేందుకే గ్రీన్‌హంట్ - ప్రజాస్వామ్య పరిరక్షణకు ఉద్యమించాలి : ప్రొఫెసర్ హరగోపాల్ - హైకోర్టు షరతులు, పోలీసు నిర్బంధం మధ్య ప్రజాస్వామిక వేదిక సదస్సు న్యూ శాయంపేట(వరంగల్): ఆదివాసీల హక్కులను కాలరాసి, వారిని మట్టుబెట్టి.. మల్టీ నేషనల్ కంపెనీలకు ఖనిజ సంపదను దోచిపెట్టేందుకు గ్రీన్‌హంట్ పేరిట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీలపై నిర్బంధాన్ని అమలు చేస్తున్నాయని మానవ హక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్ విమర్శించారు. హన్మకొండలోని విష్ణుప్రియ గార్డెన్లో మంగళవారం తెలంగాణ ప్రజాస్వామిక వేదిక (టీడీఎఫ్) ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. ప్రకృతితో సహజీవనం చేసే ఆదివాసీలను పోలీస్ బలగాలు అడవుల నుంచి బయటకు గెంటివేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని చెప్పుకునే భారత్‌లో ఇలాంటి చర్యలు తగవన్నారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణకు నష్టం జరుగుతోందని, ఆంధ్రా వాళ్లు తమ సంపదను కొల్లగొడుతున్నారనే ఉద్దేశంతోనే పోరాడి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామన్నారు. అధికారంలోకి రాకముందు తమది నక్సల్స్ ఎజెండా అని చెప్పిన కేసీఆర్.. నేడు ప్రజల పక్షాన పోరాడుతున్న వారిపై నిర్బంధాలు అమలు చేస్తున్నారని హరగోపాల్ ఆరోపించారు. ఆదివాసీల సమస్యల కోసం సభ పెట్టుకుంటే చివరికి న్యాయవ్యవస్థ జోక్యం తీసుకుని అనుమతి ఇచ్చాక కూడా, పోలీసు నిర్బంధాల మధ్య సభ నిర్వహించాల్సి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలను చైతన్యవంతులను చేస్తూ మానవీయ సమాజ నిర్మాణం కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నా రు. టీడీఎఫ్ నాయకులు రవీంధ్రనాథ్ మాట్లాడుతూ ఆదివాసీల హక్కుల కోసం పోరాటానికి ఇంత నిర ్బంధం ఉంటే రాబోయే రోజుల్లో తెలంగాణలో పరిస్థితులు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రముఖ స్వాతం త్య్ర సమరయోధులు జైని మల్లయ్య గుప్తా మాట్లాడుతూ భారతదేశంలో హిందూ ముస్లింల మధ్య సమైక్యత ఉందని, దాన్ని చెడగొట్టేందుకు కొందరు మతోన్మాదులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సభలో విరసం నేత వరవరరావు, ఆచార్య జీఎన్ సాయిబాబా, టీడీఎఫ్ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య, నాయకులు నారాయణరావు, చిక్కుడు ప్రభాకర్, ప్రొఫెసర్ ఖాసీం, కోట శ్రీనివాసరావు, రవీందర్రావు, నలమాస కృష్ణ, జనగాం కుమారస్వామి, బాసిత్, రమాదేవి, నల్లెల రాజయ్య పాల్గొన్నారు. నిర్బంధం మధ్య బహిరంగ సభ.. హన్మకొండలో అనేక నిర్బంధాల మధ్య టీడీఎఫ్ బహిరంగ సభ జరిగింది. హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇవ్వడంతో మంగళవారం సాయంత్రం 4.30 నుంచి 6.30 వరకు మాత్రమే సభ నిర్వహించారు. సభకు హాజరయ్యే కార్యకర్తలు ఒంటరిగా రావాలని, ర్యాలీలు, నినాదాలు చేయవద్దని పోలీసులు కట్డడి చేశారు. సభ జరిగిన తీరును, హంటర్‌రోడ్ నుంచి సభకు వచ్చేవారిని వీడియో తీశారు. ప్రధాన వక్త అరుున విరసం నేత వరవరరావు స్టేజీపై కాకుండా ప్రజల మధ్యనే ఉండాల్సి వచ్చింది. ఇంత నిర్బంధంలోనూ బహిరంగసభకు పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలిరావడం గమనార్హం. -
దళిత, గిరిజన హక్కులకోసం సమిష్టిపోరు
- రాష్ట్ర లంబాడి హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు బెల్లయ్య నాయక్ మెదక్ (సిద్దిపేట): దళిత గిరిజనుల హక్కుల సాధనకు భవిష్యత్తులో సమిష్టి ఉద్యమాలకు శ్రీకారం చుడుతామని తెలంగాణ రాష్ట్ర లంబాడి హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బెల్లయ్య నాయక్ స్పష్టం చేశారు. శుక్రవారం సాయంత్రం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో రాష్ట్ర గిరిజన విద్యార్థి సంఘాల అధ్యక్షుడు గణేష్‌నాయక్, దళిత బహుజన ఫ్రంట్ రాష్ట్ర కార్యదర్శి శంకర్‌లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యం చెందిందన్నారు. ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్‌ను అమలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం నేడు ఆరు శాతంతోనే నోటిఫికేషన్ల జారీకి సిద్ధం కావడం విచారకరమన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జనాభా ప్రాతిపదికన ఆరు శాతాన్ని అమలు చేస్తున్నారని తెలంగాణలో 12 శాతం అమలు చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ప్రభుత్వం భర్తి చేయనున్న రెండు లక్షల ఉద్యోగాల్లో ఎస్టీల శాతం వాటాను ప్రకటించాలన్నారు. ప్రభుత్వం హామీ మేరకు 12 శాతం అమలుతోనే గిరిజనులకు లబ్ధి చేకూరే విధంగా ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం అమలు కావడం లేదన్నారు. షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖకు మంత్రిని వెంటనే నియమించి పథకాల అమలులో ప్రత్యేక చొరవ చూపాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం అమలుకు సెర్ఫ్ రూపొందించిన నిబంధనలను వెంటనే ఆమోదించాలన్నారు. చట్టంలోని లోపాలను సవరించి దళిత గిరిజన సమగ్ర అభివృద్ధిపై అసెంబ్లీలో చర్చించి స్వేత పత్రాన్ని విడుదల చేయాలన్నారు. సబ్ ప్లాన్ నిధులను నేరుగా ఎస్సీ, ఎస్టీ నోడల్ ఏజన్సీలకు అప్పగించాలన్నారు. నిధుల కేటాయింపు, పర్యవేక్షణ తదితర అధికారాలన్నింటిని నోడల్ ఏజన్సీకి కల్పించాలన్నారు. సబ్‌ప్లాన్ నిధుల కేటాయింపులో 50 శాతం ఎస్సీ, ఎస్టీ మహిళ సంక్షేమ అభివృద్ధి పథకాలకు కేటాయించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలు కోసం మార్చి 10న చలో అసెంబ్లీ పేరిట హైదరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉదయం 10 గంటలకు ఇందిరాపార్క్ నుంచి చలో అసెంబ్లీకి ర్యాలీ ప్రారంభం కానుందన్నారు. -
గిరిజన హక్కుల సాధనకు ఉద్యమించాలి
గంగవరం :గిరిజనులకు రాజ్యాధికారం, హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలని ఆదివాసీ సంఘ నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక సినిమాహాల్ ఆవరణలో శనివారం జరిగిన ఆదివాసీ జిల్లా సదస్సుకు సంఘ నాయకుడు డాక్టర్ కుంజం సత్యనారాయణదొర అధ్యక్షత వహించారు. ఆదివాసీ సాంస్కృతిక ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కంగల శ్రీనివాసుదొర మాట్లాడుతూ నకిలీ కులధ్రువ పత్రాలతో విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో అసలైన ఆదివాసీలకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. దాన్ని ఎదుర్కొనేందుకు అందరూ కలసి పోరాడాలన్నారు. ఆదివాసీ సమస్యలను పరిష్కరించుకొనేందుకు హక్కుల సాధనకు యువతరం ఉప్పెనలా ముందుకు రావాలని సభాధ్యక్షుడు డాక్టర్ సత్యనారాయణదొర అన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరిసిక ప్రకాష్, రిటైర్డు ఏపీపీ బంగార్రాజు, ఆదివాసీ సాంసృతిక ఉద్యోగ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కడబాల రాంబాబు తదితరులు ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను వివరించారు. అధికారులు చట్టాలను సక్రమంగా అమలు చేసి గిరిజనుల హక్కులను కాపాడాలన్నారు. గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ సభలో చర్చించారు. అనంతరం గంగవరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సదస్సులో ఎంపీపీ తీగల ప్రభ, మాజీ ఎంపీపీలు ఎం.బాపిరాజు, మడకం ఝాన్సీలక్ష్మి, ఎంపీటీసీ సభ్యురాలు కోసు బుల్లియమ్మ, సర్పంచ్ కలుముల అక్కమ్మ, ఉపసర్పంచ్ పరదా రాంబాబు, గిరిజన దీపిక డెరైక్టర్ కుంజం వెంకటేశ్వర్లుదొర, గిరిజన వర్ధిక సంస్థ డెరైక్టర్ కుంజం చిన్నారావు, జిల్లా ఎరుకుల సంఘం నాయకుడు దసరి గంగరాజు, ఏజెన్సీ ఏడు మండలాలకు చెందిన ఆదివాసీ ఉద్యోగులు, యువకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
కొమురం భీమ్....ఆ పేరే ఒక పోరాటం
-
ఆదివాసీ అభివృద్ధితో భీంకు నివాళి
నేడు కొమురం భీం 74వ వర్ధంతి కొమురం భీం మరణించి ఏడు దశాబ్దాలు దాటినా ఆదివాసీ జీవితం నేటికీ ఏ కొత్త చిగురులూ వేయలేదు, ఏ కొత్త పూవులూ పూయలేదు. ఈ నేపథ్యంలో నాలుగు తరాలుగా నెరవేరని ఆదిలాబాద్ భూమిపుత్రుల చిరకాల కోర్కెలను తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు పరిష్కరించాలి. ఆదివాసీ హక్కుల కోసం జరిగిన వీరోచిత పోరా టంలో 1941 అక్టోబర్ 8న కొమురం భీం అసువులు బాశాడు. ఆదిలాబాద్ మారుమూల ప్రాంతం నుం చి హైదరాబాద్‌కు కాలినడకన వెళ్లి నిజాం ప్రభు వుకు గిరిజనుల జీవన్మరణ బాధను భీం వినిపిం చాడు. భూములకు పట్టాలివ్వాలని, కప్పం కట్టాలని అధికార్లు, రజాకార్లు చేస్తున్న వేధింపులను ఆపాలని వేడుకున్నాడు. నిజాం సర్కారు కరుణించకపోగా రజాకార్లను ఉసిగొల్పడంతో అజ్ఞాతంలోకి వెళ్లిన కొమురం భీం 1941 ఆశ్వయుజ మాసం కార్తీక పౌర్ణమినాడు 12 గ్రామాలకు చెందిన గిరిజన తెగ లను కూడగట్టి సామూహిక తిరుగుబాటుకు సిద్ధమ య్యాడు. రాజీ మార్గం విఫలమై నిజాం రజాకార్లు చేసిన దాడిలో భీం వీర మరణం పొందాడు. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం భీం నేల కొరిగిన జోడెన్ ఘాట్‌ను తెలంగాణ సీఎం కె. చంద్రశేఖరరావు సందర్శించనున్నారు. కేసీఆర్ రాకకు రెండు రోజుల ముందు, ఆ పరిసర ప్రాం తాల్లో ఆంత్రం జంగు (18) డిగ్రీ విద్యార్థి, తొడసం రావు పటేల్ (55), జక్కావాడ్ (4), వేముల సోని (20) అనే నలుగురు గిరిజనులు తీవ్ర జ్వరాలతో మరణించారు. 74 ఏళ్ల క్రితం భీం ప్రాణాలొడ్డి చాటి న సమస్యలు నేటికీ అపరిష్కృతంగా ఉండటం నిజంగా సిగ్గుచేటు. గిరిజనుల ప్రాథమిక హక్కు జల్ జంగల్ జమీన్‌పై ఏ ప్రభుత్వాలూ పట్టించుకో లేదు. వారు సాగుచేస్తున్న అటవీ పోడు భూము లకు, బంజర్లకు నేటికీ సంపూర్ణ హక్కుపత్రాలు రాలేదు. భీం ప్రాణత్యాగం తర్వాత హక్కు పత్రాలి చ్చిన భూములకు చట్టబద్ధమైన సౌకర్యాలు, రుణ సదుపాయాలను నేటికీ కొమురం భీం వారసులు పొందకపోవడం ఘోరం. ఆదివాసీలకు నేటికీ రక్షిత నీరు లేదు. ప్రాణా లకు ప్రమాదకరమైన చెలిమల్లో, వాగుల్లో నీళ్లే వాళ్లకు ప్రధాన దిక్కు. ఈ అరక్షితమైన తాగునీళ్లే ప్రతి ఏటా వందలాది మంది గిరిజనుల ప్రాణా లను తీస్తున్నాయి. జిల్లాలోని ఆదివాసీల్లో నూటికి 70 మంది తీవ్ర రక్తహీనతతో బాధపడుతున్నవారే. వీరి అనారోగ్య మరణాలను నివారించడంలో వైద్య ఆరోగ్యశాఖ విఫలమైంది. కేసీఆర్ పర్యటన సంద ర్భంగానైనా జిల్లాలో అనారోగ్యం బారిన పడి మర ణిస్తున్న ప్రతి ఒక్క చావుకు శాశ్వత ముగింపు పలికేలా గట్టి చర్యలు తీసుకోవాలి. తెలంగాణలో ఒక ఊరితో మరో ఊరికి రహ దారి సంబంధం లేని వాగులపై వంతెనలు లేని జిల్లాల్లో ఆదిలాబాద్‌దే అగ్రస్థానం. ఇక్కడ నేటికీ ఎడ్లబండ్లే అంబులెన్సులు. వర్షం వస్తే చాలు మంచా లు, కర్రకు కట్టిన జోలెలే రోగులకు ఆంబులెన్సులు అవుతున్నాయి. చస్తే అవే పాడెలవుతున్నాయి. జిల్లా లోని 32 అంబులెన్సులకుగాను 16 పైగా మూత పడ్డాయి. ప్రైవేట్ వాహనాలను అద్దెకు తీసుకునే శక్తి లేక నిస్సహాయ పరిస్థితుల్లో వందల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. శవాలను ద్విచక్ర వాహ నాలపై తీసుకెళుతున్నారు. ఈ పరిస్థితుల్లో వాగ్దానం చేసినట్లుగా హెలికాప్టర్ అంబులెన్స్ (రోగులను హెలికాప్టర్ ద్వారా తరలించడం) సౌకర్యం కల్పిస్తే కేసీఆర్ గారికి ఆదివాసులు రుణపడి ఉంటారు. అపారమైన నీరున్న ఆదిలాబాద్ జిల్లా నుంచే ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న వాటర్ గ్రిడ్‌ను ప్రారంభించాలి. వ్యవసాయానికి ఒక్క పంటకు కూడా సాగునీరు సౌకర్యం లేకపోవ డమే జిల్లాలో అన్నదాతల ఆత్మహత్యలకు కారణం. 1,050 కిలోమీటర్ల దూరం ప్రవహింపచేసి చేవెళ్లకు తరలించే మా ప్రాణహిత నీళ్లను ముందుగా అతి సమీపంలో ఉన్న మూలవాసుల ప్రాణాలకు, భూములకు కూడా హితం చేకూర్చే ప్రణాళిక కావా లిప్పుడు. ఇక్కడికి సమీపంలోని ఉట్నూరు ఆదివాసీ ప్రాంతంలోని భూములకు రెండు పంటలకు సాగు నీరు అందించాలి. మెరుగైన పారిశుధ్య వసతులను కల్పించాలి. ఆదివాసుల్లో రక్తహీనతను తొలగించి, రోగనిరోధక శక్తిని పెంచే అతి చౌకైన పౌష్టికాహా రాన్ని (జొన్నలు, కొర్రలు, రాగులు, సామలు, పప్పుదినుసులు) చౌకధరలతో ప్రత్యేక నిత్యావసర పథకం కింద అందించాలి. అన్ని రకాల పోషకాహార పంటలకు మద్దతు ధర పెంచి ప్రోత్సహించాలి. జిల్లాలోని ప్రతి ఆదివాసీ ప్రాణాన్నీ కాపాడే ప్రణా ళికలను సీఎం కేసీఆర్ ప్రకటించాలి. అదే కొమురం భీం ప్రాణార్పణకు అచ్చమైన నివాళి. - మర్సుకోల తిరుపతి (ఏజెన్సీ ఆరోగ్య పరిరక్షణ కమిటీ కన్వీనర్) నైనాల గోవర్ధన్ (తెలంగాణ జలసాధన సమితి అధ్యక్షులు) -
అక్రమార్కుల కనుసన్నల్లో లేట‘రైట్ రైట్’
యథేచ్ఛగా తవ్వకాలు అధికారుల వత్తాసు? పాడేరు : ఏజెన్సీలోని అపారమైన ఖనిజ నిల్వలను దోచుకునేందుకు బడాబాబులు భారీ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. గిరిజనుల అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకొని బినామీ పేర్లతో రూ.కోట్లు విలువైన లేటరైట్, రంగురాళ్ళను తవ్వుకునేందుకు భారీ వ్యూహరచన చేస్తున్నారు. గిరిజన హక్కులు, చట్టాలను తుంగలోకి తొక్కి దొడ్డిదారిన అనుమతులు పొందేందుకు కూడా మైదాన ప్రాంతంలోని కొంతమంది గిరిజనేతరులు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే చింతపల్లి మండలంలోని రాజుపాకలు సమీపంలో విలువైన లేటరైట్‌ను బినామీ పేర్లతో గిరిజనేతరులు అక్రమంగా తవ్వకాలు జరుపుతున్నారు. 2002లో ఒక గిరిజనుడికి లేటరైట్ తవ్వకాలపై అనుమతులు ఇచ్చినప్పటికి తర్వాత రోజుల్లో ఏజెన్సీలోని ఖనిజ సంపద పరిరక్షణకు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. 2012లో అప్పటి ఆర్డీవో ఎం.గణపతిరావు లేటరైట్‌తోపాటు ఏ ఖనిజం తవ్వకాలకు అనుమతులు లేవంటూ నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా కలెక్టర్‌తోపాటు రాష్ట్ర ఉన్నతాధికారులకు కూడా ఈ నివేదిక వెళ్లింది. డుంబ్రిగుడ మండలంలోని లేటరైట్ తవ్వకాల కోసం స్థానిక గిరిజనులే దరఖాస్తులు చేసుకున్నా జిల్లా కలెక్టర్ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. కానీ పాత అనుమతులతో రాజుపాకలు సమీపంలో లేటరైట్ తవ్వకాలు ప్రస్తుతం దర్జాగా సాగిపోతున్నాయి. దీనిని గిరిజనులంతా వ్యతిరేకిస్తున్నా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు. గనుల శాఖ అధికారులైతే తవ్వకందారులనే ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం లేటరైట్ ఖనిజం డుంబ్రిగుడ, జీకేవీధి, నాతవరం తదితర ప్రాంతాల్లో భారీగా ఉంది. దాని తవ్వకాలకు బడా వ్యాపారులంతా దొడ్డిదారిన అనుమతులు సంపాదించే పనిలో నిమగ్నమయ్యారు. అలాగే ఏజెన్సీలోని పలు చోట్ల విలువైన రంగురాళ్ల నిక్షేపాలు కూడా ఉన్నాయి. వీటి తవ్వకాలపై కూడా నిషేధం ఉంది. అయినప్పటికి అధికారులను మచ్చిక చేసుకొని రంగురాళ్ల తవ్వకాలకు కూడా పేరొందిన రంగురాళ్ల వ్యాపారులు సిద్ధమవుతున్నారు. ఎక్కడికక్కడ లేటరైట్, రంగురాళ్ల క్వారీల అన్వేషణలో బడాబాబులు ఉన్నారు. స్థానిక గిరిజనులను మచ్చిక చేసుకొని విలువైన ఖనిజ సంపదను దోచుకునేందుకు బడావ్యాపారులంతా మన్యంలో మకాం వేశారు. ప్రస్తుతం లేటరైట్, రంగురాళ్ల తవ్వకాలను గిరిజనులు ప్రోత్సహిస్తే మున్ముందు బడా వ్యాపారులంతా బాక్సైట్‌ను కూడా తవ్వుకుపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా గిరిజన మేధావులు, యువత, స్వచ్ఛంద సంస్థలంతా గిరిజన ఖనిజ సంపదను పరిరక్షించేందుకు ఉద్యమించాల్సి ఉంది. -
అడవిలో అన్ని హక్కులూ ఆదివాసీలవే: బృందాకారత్
అరకులోయ, న్యూస్‌లైన్: గిరిజన హక్కులు, చట్టాలను కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాసిందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ ఆరోపిం చారు. ఏజెన్సీ ప్రాంత సమస్యలపై విశాఖపట్నం జిల్లా అరకులోయలో గురువారం నిర్వహించిన ‘గిరిజనగర్జన’ సభలో ఆమె ప్రసంగించారు. ఎవరో పెట్టిన భిక్షతో గిరిజనచట్టాలు, హక్కులు రాలేదని, ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు అని పేర్కొన్నారు. గిరిజనులకు రక్షణ కవచంగా ఉన్న 1/70 చట్టాన్ని మన్యంలో అడుగడుగునా ఉల్లంఘిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. గిరిజనులను అడవి నుంచి వెళ్లగొట్టేందుకే ప్రభుత్వం అటవీశాఖాధికారులకు తుపాకులు ఇస్తోందన్నారు. మన్యంలో బాక్సైట్ తవ్వకాలను అడ్డుకున్నది ఒక్క సీపీఎం మాత్రమేనని అన్నారు. ఈసారి అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో సీపీఎం పోటీచేస్తుందని, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలకు బుద్ధి చెప్పాలని కోరారు. మాజీ ఎంపీ పి.మధు మాట్లాడుతూ, ఏజెన్సీలో వి.ఎస్.ఎస్‌ల పేరుతో గిరిజనులకు చంద్రబాబు తీవ్ర అన్యాయం చేశారన్నారు. భద్రాచలం మాజీఎంపీ మిడియం బాబూరావు మాట్లాడుతూ గిరిజన ఉప ప్రణాళిక నిధులను వేరే పథకాలకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. -
ఆదివాసీ హక్కుల కోసం.. త్యాగాలకు వెనుకాడం
ఇల్లెందు అర్బన్, న్యూస్‌లైన్: ఆదివాసీల హక్కుల సాధనకు ఎలాంటి త్యాగాలకైనా వెనుకాడేది లేదని పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య అన్నారు. గిరిజనుల హక్కులను కాపాడేది విప్లవ పార్టీలేనని చెప్పారు. శుక్రవారం రాత్రి ఇల్లెందు కొత్తబస్టాండ్ ఆవరణంలో జరిగిన ఎన్డీ బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. అడవులను పరిరక్షించుకునేందుకు ఆదివాసీలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వారికి ఏ కష్టమొచ్చినా అండగా ఉంటామన్నారు. ఆదివాసీల చట్టాలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. గిరిజన పోరాటాల ఫలితంగా వారి రక్షణ కోసం 1920 నుంచే చట్టాలు చేశారని, అయితే పాలకుల నిర్లక్ష్యంతో అవి అమలు కావడం లేదని ఆరోపించారు. 1/70 చట్టం వచ్చినా భూ బదలాయింపును అడ్డుకోలేకపోతోందన్నారు. ప్రజల ఒత్తిడి ఫలితంగా 2006 డిసెంబర్ 29న అటవీ హక్కుల గుర్తింపు చట్టం వచ్చిందని గుర్తు చేశారు. ఈ చట్టం వల్ల 10 ఎకరాలు అనుభవించే హక్కు గిరిజనుడికి ఉందన్నారు. జిల్లాలో బీడీ ఆకు అధికంగా లభ్యమవుతున్నందున బీడీ పరిశ్రమలను నెలకొల్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సబ్‌ప్లాన్ నిధులను ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికే కేటాయించాలన్నారు. సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యుడు సాధినేని వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ.. సింగరేణి యాజమాన్యం ఓపెన్‌కాస్టుల పేరుతో పచ్చని పల్లెలను బొందలగడ్డగా మారుస్తోందని, అడవులు అంతరిస్తున్నాయని ఆరోపించారు. ఓపెన్‌కాస్టులు ఏర్పడిన ప్రాంతాల్లో జలవనరులు కూడా అడుగంటిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఓసీల కింద వేల ఎకరాల సాగుభూమి పోతోందన్నారు. సింగరేణి సంస్థ ఏజెన్సీ ప్రాంతాల్లో గనులను ప్రారంభిస్తున్నదే తప్ప ఆయా ప్రాంతాల గిరిజనులకు ఉపాధి కల్పించడం లేదని విమర్శించారు. అధిక ఉత్పత్తి, లాభాల కోసం గిరిజన ప్రాంతాలను ఓసీలతో విధ్వంసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఓసీలతో బొందల గడ్డగా మార్చొద్దని సింగరేణి యాజమాన్యానికి సూచించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 67 ఏళ్లయినా నేటికీ అందరికీ ఆహార భద్రత లేదని వాపోయారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు గోవర్ధన్ మాట్లాడుతూ.. సీల్డ్ కవర్లో సీఎం పదవి దక్కించున్న కిరణ్ కుమార్‌రెడ్డి తెలంగాణ విషయంలో రోజుకొక మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. అధిష్టానం మాట గౌరవిస్తానని నాడు చెప్పిన కిరణ్.. ఇప్పుడు దానికి వ్యతిరేకంగా తెలంగాణ బిల్లును తిప్పి పంపుతానని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు సైతం రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఇద్దరికీ మరో తోడు దొంగలా అశోక్‌బాబు తయారయ్యాడని ఎద్దేవా చేశారు. తెలంగాణ కోసం 1969లో 369 మంది మృతి చెందితే, నేడు వెయ్యి మందికి పైగా అమరులయ్యారని, ఈ విషయాన్ని సీమాంధ్రులు గుర్తుంచుకోవాలని అన్నారు. సభలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు, నాయకులు ముక్తార్‌పాషా, వెంకటేశ్వర్లు, వెంకన్న, గౌని ఐలయ్య, జడ సత్యనారయణ, విశ్వనాథం, సీతారామయ్య, యదళ్లపల్లి సత్యం, భూక్యా లక్ష్మణ్, కొండపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎరుపెక్కిన బొగ్గుట్ట బహిరంగ సభకు ముందు సుమారు ఆరువేల మంది ఎన్డీ కార్యకర్తలు అరుణ పతాకాలు చేబూని భారీ ప్రదర్శన నిర్వహించారు. జేకే కాలనీ నుంచి జగదాంబ సెంటర్, పాత బస్టాండ్ ,బుగ్గవాగు బ్రిడి మీదుగా కొత్త బస్టాండ్ సెంటర్ వరకు ప్రదర్శన సాగింది. అరుణ పతాకాల రెపరెపలతో బొగ్గుట్ట ఎరుపెక్కింది. ఈ సందర్భంగా పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, భూగర్భ గనులను ఏర్పాటు చేయాలని, దుమ్ముగూడెం ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం బహిరంగ సభ వేదికపై అరుణోదయ కళకారులు చేసిన నృత్యాలు, గేయాలు ఉర్రూతలూగించాయి.