గిరిజన హక్కుల సాధనకు ఉద్యమించాలి
గంగవరం :గిరిజనులకు రాజ్యాధికారం, హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమించాలని ఆదివాసీ సంఘ నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక సినిమాహాల్ ఆవరణలో శనివారం జరిగిన ఆదివాసీ జిల్లా సదస్సుకు సంఘ నాయకుడు డాక్టర్ కుంజం సత్యనారాయణదొర అధ్యక్షత వహించారు. ఆదివాసీ సాంస్కృతిక ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కంగల శ్రీనివాసుదొర మాట్లాడుతూ నకిలీ కులధ్రువ పత్రాలతో విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాలలో అసలైన ఆదివాసీలకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. దాన్ని ఎదుర్కొనేందుకు అందరూ కలసి పోరాడాలన్నారు. ఆదివాసీ సమస్యలను పరిష్కరించుకొనేందుకు హక్కుల సాధనకు యువతరం ఉప్పెనలా ముందుకు రావాలని సభాధ్యక్షుడు డాక్టర్ సత్యనారాయణదొర అన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరిసిక ప్రకాష్, రిటైర్డు ఏపీపీ బంగార్రాజు, ఆదివాసీ సాంసృతిక ఉద్యోగ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కడబాల రాంబాబు తదితరులు ఆదివాసీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులను వివరించారు.
అధికారులు చట్టాలను సక్రమంగా అమలు చేసి గిరిజనుల హక్కులను కాపాడాలన్నారు. గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ సభలో చర్చించారు. అనంతరం గంగవరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సదస్సులో ఎంపీపీ తీగల ప్రభ, మాజీ ఎంపీపీలు ఎం.బాపిరాజు, మడకం ఝాన్సీలక్ష్మి, ఎంపీటీసీ సభ్యురాలు కోసు బుల్లియమ్మ, సర్పంచ్ కలుముల అక్కమ్మ, ఉపసర్పంచ్ పరదా రాంబాబు, గిరిజన దీపిక డెరైక్టర్ కుంజం వెంకటేశ్వర్లుదొర, గిరిజన వర్ధిక సంస్థ డెరైక్టర్ కుంజం చిన్నారావు, జిల్లా ఎరుకుల సంఘం నాయకుడు దసరి గంగరాజు, ఏజెన్సీ ఏడు మండలాలకు చెందిన ఆదివాసీ ఉద్యోగులు, యువకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.