
అడవిలో అన్ని హక్కులూ ఆదివాసీలవే: బృందాకారత్
అరకులోయ, న్యూస్‌లైన్: గిరిజన హక్కులు, చట్టాలను కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాసిందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ ఆరోపిం చారు. ఏజెన్సీ ప్రాంత సమస్యలపై విశాఖపట్నం జిల్లా అరకులోయలో గురువారం నిర్వహించిన ‘గిరిజనగర్జన’ సభలో ఆమె ప్రసంగించారు. ఎవరో పెట్టిన భిక్షతో గిరిజనచట్టాలు, హక్కులు రాలేదని, ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు అని పేర్కొన్నారు. గిరిజనులకు రక్షణ కవచంగా ఉన్న 1/70 చట్టాన్ని మన్యంలో అడుగడుగునా ఉల్లంఘిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
గిరిజనులను అడవి నుంచి వెళ్లగొట్టేందుకే ప్రభుత్వం అటవీశాఖాధికారులకు తుపాకులు ఇస్తోందన్నారు. మన్యంలో బాక్సైట్ తవ్వకాలను అడ్డుకున్నది ఒక్క సీపీఎం మాత్రమేనని అన్నారు. ఈసారి అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో సీపీఎం పోటీచేస్తుందని, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలకు బుద్ధి చెప్పాలని కోరారు. మాజీ ఎంపీ పి.మధు మాట్లాడుతూ, ఏజెన్సీలో వి.ఎస్.ఎస్‌ల పేరుతో గిరిజనులకు చంద్రబాబు తీవ్ర అన్యాయం చేశారన్నారు. భద్రాచలం మాజీఎంపీ మిడియం బాబూరావు మాట్లాడుతూ గిరిజన ఉప ప్రణాళిక నిధులను వేరే పథకాలకు మళ్లిస్తున్నారని ఆరోపించారు.