‘దున్నేవాడిదే భూమి’ అనే నినాదం.. ఓట్లేసే వాళ్లకే సీట్లు అనే నినాదంగా మారిందా? సోషలిస్టు ఎజెండాను వదిలి.. బహుజన సమాజం అధికంగా ఉండే తెలంగాణలో సామాజిక ఎజెండాను ఎందుకు ఎత్తుకున్నారు? గతంలో మాదిరిగా సంప్రదాయ పార్టీలతో పొత్తులను సీపీఎం ఎందుకు వద్దనుకుంది? తోకపార్టీ ముద్ర పోగొట్టుకునేందుకా? సామాజిక మార్పు కోసమేనా? అసలు సీపీఎం రాజకీయ భవిష్యత్తు ఏం కానుంది? ఈ ప్రశ్నలన్నింటికీ ఏకైక సమాధానం ‘బీఎల్‌ఎఫ్’ (బహుజన లెఫ్ట్ ఫ్రంట్). సామాజిక న్యాయం, రాజకీయాల్లో అన్ని వర్గాలకు సమాన అవకాశాలే ప్రధాన ఎజెండాగా, బీసీ ముఖ్యమంత్రి ప్రతిపాదనతో ఏర్పాటైన ఈ ఫ్రంట్ రానున్న ఎన్నికలలో ఎలాంటి పాత్ర పోషించబోతోందనేది ఆసక్తి కలిగిస్తోంది.
ఈసారి ఎన్నికలలో స్వతంత్ర రాజకీయ పంథాను ఎంచుకుని వెళ్లాలన్న సీపీఎం నిర్ణయం అంత సులువుగా తీసుకున్నదేమీ కాదు. పార్టీలో చర్చోపచర్చలు జరిపి, గతాన్ని సమీక్షించుకుని, భవిష్యత్తుపై పక్కా అంచనాకు వచ్చిన తర్వాతే బీఎల్‌ఎఫ్ పేరుతో పెద్ద కామ్రేడ్లు ఎన్నికల బరి గీశారు. ముఖ్యంగా సంప్రదాయ రాజకీయ పార్టీలకు భిన్నంగా ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలను తెరపైకి తెచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధి నమూనాను రూపొందించారు. తెలంగాణలో సామాజిక న్యాయం అమలు జరగాలని, అగ్రకులాల రాజకీయ ఆధిపత్యం పోవాలని, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో అందరికీ అవకాశాలు రావాలని, అన్ని వర్గాల ప్రాతినిధ్యం ఉండాలనే సిద్ధాంతపు పునాదులపైనే ఈ ఫ్రంట్ ఏర్పడింది. రాష్ట్రస్థాయిలో రాజ్యాంగబద్ధంగా ప్రధానమైన పదవి అయిన ముఖ్యమంత్రి పీఠాన్ని తెలంగాణలో అన్ని వర్గాల కంటే ఎక్కువగా ఉండే వెనుకబడిన వర్గాల(బీసీలు)కు ప్రతిపాదించింది. సీట్ల కేటాయింపులో ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగపరమైన రక్షణలు ఉండగా, అదే కోణంలో బీసీలకు జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించాలని నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీలకు కూడా అన్ని పార్టీల కంటే ఎక్కువ టికెట్లు ఇచ్చి తమది సామాజిక ఎజెండానేనని చెప్పకనే చెప్పింది.
సామాజిక కూర్పుతోనే..
ఈసారి ఎన్నికలలో సామాజిక ఎజెండాను ముందుపెట్టి సీపీఎం ప్రజల్లోకి వెళుతోంది. అందులో భాగంగానే బహుజన లెఫ్ట్ పార్టీ, ఎంసీపీఐ (యూ), తెలంగాణ లోక్‌సత్తా, తెలంగాణ బహుజన సమాజ్ పార్టీ, మహాజన సమాజం లాంటి పార్టీలతో కలిసి బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్‌ఎఫ్) పేరుతో జట్టు కట్టింది. ఇందులో ప్రధానంగా సామాజిక కోణాన్నే స్పృశిస్తోంది. అన్ని వర్గాలకు రాజకీయాల్లో సమాన ప్రాతినిధ్యం అనే నినాదం, బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రతిపాదన, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్న స్థానాల కన్నా ఎక్కువ సీట్లు కేటాయించడం, అగ్రవర్ణాలకు కేవలం ఏడు టికెట్లే ఇవ్వడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఒక్క ఆసిఫాబాద్ మినహా రాష్ట్రంలోని 118 నియోజకవర్గాల్లో బీఎల్‌ఎఫ్ అభ్యర్థులు పోటీచేస్తున్నారు. అందులో 26 చోట్ల సీపీఎం పోటీ చేస్తోంది. సామాజిక వర్గాల వారీగా పరిశీలిస్తే ఆ పార్టీ మొదటి నుంచీ చెబుతున్న విధంగా బీసీలకు 60 స్థానాలకు దగ్గరగా 58 స్థానాలను కేటాయించింది. ఎస్సీలకు 28, ఎస్టీలకు 15, ముస్లిం మైనార్టీలకు 10 స్థానాలు కేటాయించింది. ఓసీలకు కేవలం ఏడు చోట్లే అవకాశమిచ్చింది. బీసీల్లోనూ అత్యంత వెనుకబడిన, గుర్తింపు లేని కులాలు, సంచార జాతులకు టికెట్లు కేటాయించింది. జనాభా ప్రాతిపదికన బీసీ కులాలకు తగినన్ని సీట్లు వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంది. తెలంగాణలోని సామాజికవర్గాల జనాభా కు అనుగుణంగా, అందుకు సరిగ్గా తగినట్టుగానే బీఎల్‌ఎఫ్ సీట్లు కేటాయించింది.
చీలనున్న ప్రభుత్వ వ్యతిరేక ఓటు!
టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ తో కలిపి ఏర్పాటైన కూటమిలో చే రకుండా బీఎల్‌ఎఫ్ పక్షాన సీపీఎం పోటీచేస్తుండడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు కొన్ని స్థానాల్లో చీలిపోయే అవకాశాలున్నాయి. ముఖ్యంగా కూటమికి బలంగా ఉండే ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో సీపీఎం కూడా తోడయి ఉంటే మంచి ఫలితాలు వచ్చి ఉండేవనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. ఈ రెండు జిల్లాల్లోని ఐదారు స్థానాల్లో సీపీఎంకు గెలుపోటములను ప్రభావితం చేసే శక్తి ఉంది. ముఖ్యంగా మిర్యాలగూడ, కోదాడ, హుజూర్‌నగర్, భద్రాచలం, వైరా, మధిర స్థానాల్లో చెప్పుకోదగిన స్థాయిలోనే ఆ పార్టీకి ఓట్లున్నాయి. ఈ స్థానాలతో పాటు వరంగల్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని కొన్ని చోట్ల కూడా గౌరవప్రదంగానే ఓట్లు వస్తాయని అంచనా. ఈ మేరకు కూటమికి నష్టం కలుగుతుందని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయే అవకాశముందని తెలుస్తోంది. అయితే, తాము స్వతంత్రంగా పోటీచేయడం వల్ల కూటమితో పాటు టీఆర్‌ఎస్‌కు కూడా నష్టం జరుగుతుందని సీపీఎం నేతలు చెపుతున్నారు. 2014 ఎన్నికల్లో తాము పోటీచేసిన స్థానాలు మినహా అన్నిచోట్లా టీఆర్‌ఎస్ అభ్యర్థులకు బహిరంగంగానే మద్దతిచ్చామని, ఇప్పుడు తామే బరిలోకి దిగడం ద్వారా ఆ మేరకు టీఆర్‌ఎస్ ఓటుబ్యాంకుకు చిల్లు పడ్డట్టేనని వారంటున్నారు. అధికార, విపక్షాలకు ఎంత మేరకు నష్టం జరుగుతుందనేది ప్రధానం కాదని, రాజకీయంగా తమ భవిష్యత్తు ఏంటనేది ప్రధానమని సీపీఎంలోని ఒక ముఖ్య నేత వ్యాఖ్యానించారు.
భవిష్యత్తు ఏమయ్యేనో?
ఎవరికి నష్టం జరిగినా.. ఎవరికి లాభం చేకూరినా.. ఈసారి ఎన్నికలలో బీఎల్‌ఎఫ్ పేరుతో పోటీ చేయడం ద్వారా సీపీఎం ఏ మేరకు రాజకీయంగా నిలదొక్కుకుంటుందనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. కొన్ని దశాబ్దాలుగా తోకపార్టీగా మిగిలిపోయిన కామ్రేడ్లలోని ఒక పార్టీ ఇకపై ఆ ముద్ర పోగొట్టుకున్నట్టేననే అభిప్రాయం ఓవైపు వ్యక్తమవుతుండగా, నామమాత్రపు ఓట్లు, సీట్లతో రాజకీయ ప్రయోజనం ఏమిటనే చర్చ కూడా జరుగుతోంది. ‘సీపీఎం ఒకటో, రెండో స్థానాలు గెలిస్తే గెలవచ్చు. అదీ లేకపోవచ్చు. అలాంటప్పుడు ప్రజల జీవితాలను ప్రభావితం చేసే రాజకీయ శక్తిగా సీపీఎం ఏ దశలోనూ పనిచేయలేదు. ఆ పనిచేయకుండా సమకాలీన రాజకీయాల్లో పాతకాలపు సిద్ధాంతాలతో మనుగడ సాధించడం ఎలా సాధ్యమవుతుంది?. సీపీఎంకు ఈ అంచనా ఎందుకు రాలేదు? సీపీఎం ఆశించినట్టు జరగాలంటే మళ్లీ దశాబ్దాలు పడుతుంది. రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా మరికొంత విశాలంగా ఆలోచించి ఉంటే సీపీఎంకు లబ్ధి జరిగేదేమో?’ అని ఓ వామపక్ష శ్రేయోభిలాషి వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే, సీపీఎం పక్షాలు మాత్రం తమ పంథా సరైందేననే భావనలో ఉన్నాయి.
సీపీఎం గుర్తు వదిలి...
ఎన్నికల సందర్భంలో పొత్తులు కుదుర్చుకున్నప్పుడు ఇతర పార్టీల గుర్తులకు కట్టుతప్పకుండా సీపీఎం శ్రేణుల ఓట్లు పడేవి. అయితే, పొత్తులు వద్దనే భావనతోనే ఎన్నాళ్లకయినా తమకంటూ ప్రజాక్షేత్రంలో బలం వస్తుందనే అంచనాతో ఈసారి సంప్రదాయ పార్టీలకు సీపీఎం దూరంగా ఉంది. కానీ, కేవలం 26 స్థానాల్లో మాత్రమే ఆ పార్టీ గుర్తు ‘సుత్తి కొడవలి నక్షత్రం’పై పోటీచేస్తోంది. మిగిలిన అన్ని చోట్ల బీఎల్‌పీ పేరుతో రైతునాగలి గుర్తుకు ఓట్లేయాలని చెపుతోంది. సామాజిక ఎజెండాను పట్టుకుని గుర్తును వదిలి పోటీచేయాల్సి రావడం ఏ మేరకు పార్టీ భవిష్యత్తుకు ఉపకరిస్తుందనేది సీపీఎం శ్రేణులకే అర్థం కాని పరిస్థితి. పార్టీ సాంప్రదాయ ఓటు బ్యాంకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఉంటుందా.. చీలికలు, పీలికలు అవుతుందా..? విద్యాధికులు కాని పార్టీ శ్రేణులు ఏం చేస్తాయన్నది పార్టీలో చర్చనీయాంశమవుతోంది.
కూటమి అడిగినా... కాదన్నారు
వాస్తవానికి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతో మహాకూటమిలోకి సీపీఎంను కూడా ఆహ్వానించారు. కాంగ్రెస్ బడానేతలు కొందరు సీపీఎం ముఖ్య నేతలతో చర్చలు జరిపి కూటమిలో చేరాల్సిన ఆవశ్యకతను చెప్పినప్పటికీ తమ్మినేని ‘నో’ చెప్పేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తమకు కూడా సానుకూల అభిప్రాయం ఏమీ లేనప్పటికీ తమ ఎజెండాతోనే ముందుకెళతామని ఆయన కాంగ్రెస్ నేతలకు తేల్చిచెప్పారు. ప్రతిసారీ ఏదో పార్టీతో పొత్తులు పెట్టుకుని పార్టీ పరంగా నష్టపోయామని, రాజకీయంగా తమ ఉనికిని స్వతంత్రంగానే కాపాడుకుంటామని ఆయన కుండబద్దలు కొట్టారు. దీంతో సీపీఎం కూటమిలో చేరకుండా బీఎల్‌ఎఫ్‌లో భాగస్వామి అయింది.
కమ్యూనిస్టుల ఐక్యత ఎండమావేనా..?
కమ్యూనిస్టుల ఐక్యత గురించి ఎప్పుడూ ప్రధానంగా ప్రస్తావించే సీపీఎం ఈసారి ఎన్నికల్లో తోటి కామ్రేడ్లపైనే పోటీకి సిద్ధమైంది. కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పాటైన మహాకూటమిలో భాగస్వామిగా ఉన్న సీపీఐ పోటీచేస్తున్న మూడు స్థానాల్లోనూ బరిలో దిగింది. బెల్లంపల్లి, హుస్నాబాద్ లో బీఎల్‌ఎఫ్ అభ్యర్థులు పోటీచేస్తుండగా, వైరాలో ఏకంగా సీపీఎం పార్టీనే బరిలోకి దిగింది. అయితే, సీపీఐ మాత్రం తాము పోటీచేస్తున్న స్థానాల్లో మినహా అన్ని చోట్లా సీపీఎంకు మద్దతిస్తామని కూటమిలో చేరకముందు చెప్పినప్పటికీ అది సాధ్యమయ్యే పరిస్థితులు లేకపోవడంతో ఈసారి ఎన్నికలలో కమ్యూనిస్టుల ఐక్యత ఎండమావిగానే మిగిలిపోనుంది.
బీఎల్‌ఎఫ్ ‘ప్రభావం’ ఇక్కడే..
మిర్యాలగూడ, భద్రాచలం, మధిర, వైరా, కొత్తగూడెం, పాలేరు, నారాయణపేట, భూపాలపల్లి, చెన్నూరు, ఆలేరు, జూబ్లీహిల్స్, గోషామహల్, జడ్చర్ల, వేములవాడ, వికారాబాద్.. ఈ స్థానాల్లో బీఎల్‌ఎఫ్ ప్రభావం ఉండనుందని సీపీఎం అంచనా.
Comments
Please login to add a commentAdd a comment