1993 నాటి ముంబై వరుస పేలుళ్ల కేసులో మరణశిక్ష పడిన యాకూబ్ అబ్దుల్ రజాక్ మెమన్ పీజీ కోర్సు చేస్తున్నాడు.
నాగపూర్: 1993 నాటి ముంబై వరుస పేలుళ్ల కేసులో మరణశిక్ష పడిన యాకూబ్ అబ్దుల్ రజాక్ మెమన్ పీజీ కోర్సు చేస్తున్నాడు. నాగపూర్ సెంట్రల్ జైల్లో ఉన్న మెమన్ ఇందిరా గాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం(ఇగ్నో) ద్వారా ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుతున్నాడు. చార్టెడ్ ఎకౌంటెంట్ అయిన మెమన్ ఇప్పుడు ఎంఏ రెండో సంవత్సరంలో ఉన్నాడు. ఈ నెల 3న మొదటి పరీక్ష హాజరైన అతడు సోమవారం రెండో పేపర్ రాశాడు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే జైలు గదిలో అతడు పరీక్ష రాశాడు.
కరడుగట్టిన నేరస్తుడు కావడంతో జైలు బయట పరీక్ష రాసేందుకు పోలీసులు అనుమతించలేదని ఇగ్నో ప్రాంతీయ డైరెక్టర్ పి శివస్వరూప్ తెలిపారు. ఈనెల 28తో పరీక్షలు ముగుస్తాయని చెప్పారు. మెమన్ తో పాటు మరణశిక్ష పడిన మరో ఐదుగురు ఖైదీలు పరీక్షలు రాసినట్టు వెల్లడించారు. 300 మందిపైగా ఖైదీల వివిధ కోర్సుల పరీక్షలకు హాజరయ్యారని తెలిపారు. మెమన్ కు విధించిన ఉరిశిక్షపై సుప్రీంకోర్టు గతవారం స్టే విధించింది.